సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంసెట్ ఫలితాలు బుధవారం విడుదల కానుండటంతో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల సంఖ్య పెరగడం, ఇంటర్ మార్కుల వెయిటేజీ లేకపోవడంతో.. ర్యాంకులు ఏ విధంగా ఉంటాయోనన్న ఆసక్తి కనిపిస్తోంది. అయితే కరోనా నేపథ్యంలో.. ఇంజనీరింగ్ ప్రవేశాల విషయంలో ప్రభుత్వం కాస్త ఉదార నిర్ణయం తీసుకుంది. ఇంటర్‌లో జనరల్ కేటగిరీకి 45 శాతం, రిజర్వుడ్‌కు 40 శాతం మార్కులు వస్తేనే ఎంసెట్‌కు అర్హతగా పేర్కొనే నిబంధనను సడలించింది. కోవిడ్ పరిస్థితులు, ఇంటర్ పరీక్షలు నిర్వహించలేని పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. దీంతో ఎంసెట్ పాసైనవారు సులువుగా ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లు పొందొచ్చు.
ఫలితాల వెల్లడికి ఏర్పాట్లు
బుధవారం ఎంసెట్ ఫలితాల వెల్లడి కోసం అన్ని ఏర్పాట్లు చేశామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. దీనిపై ఇప్పటికే ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించామని వివరించారు. రాష్ట్రంలో ఈ నెల 4 నుంచి 6వ తేదీ వరకూ ఇంజనీరింగ్ ఎంసెట్ నిర్వహించారు. మొత్తం 1,64,964 మంది దరఖాస్తు చేసుకోగా.. 1,47,986 మంది పరీక్ష రాశారు. ప్రస్తుతం రాష్ట్రం లో మొత్తం లక్షకుపైగా ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 30వేల వరకు మేనేజ్‌మెంట్ కోటాలో ఉన్నాయి. ఈసారి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఎంసెట్‌కు హాజరైన నేపథ్యంలో.. సీట్ల కోసం డిమాండ్ ఉండొచ్చని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment