ఏపీఈఏపీ సెట్‌లో 89వేల మంది ఆప్షన్ల నమోదు  | 89 thousand options registered in AP EAPCET Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీఈఏపీ సెట్‌లో 89వేల మంది ఆప్షన్ల నమోదు 

Published Sat, Nov 6 2021 2:55 AM | Last Updated on Sat, Nov 6 2021 3:40 AM

89 thousand options registered in AP EAPCET Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీల్లో ప్రవేశాలకు తొలివిడత కౌన్సెలింగ్‌లో ఆప్షన్ల నమోదు శుక్రవారం రాత్రితో ముగిసింది. శనివారం ఆప్షన్లను సవరించుకోవచ్చు. ఈ ఏడాది ఈఏపీసెట్‌లో 1,34,205 మంది విద్యార్థులు అర్హత సాధించగా, కౌన్సెలింగ్‌కు 90,606 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం 89,232 మంది వెబ్‌ ఆప్షన్లలో పాల్గొన్నారు. గత ఏడాదికన్నా ఎక్కువ సంఖ్యలో ఈ ఏడాది ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. గత ఏడాది తొలి విడత కౌన్సెలింగ్‌లో 83,014 మంది ఆప్షన్లు నమోదు చేసుకోగా, ఈసారి అంతకంటే ఎక్కువే పాల్గొన్నారు. ఈసారి ఏపీ ఈఏపీ సెట్‌ ఫలితాల విడుదల, కౌన్సెలింగ్‌ ప్రారంభం ఆలస్యం కావడంపై కొన్ని పత్రికల్లో వ్యతిరేక కథనాలు వచ్చాయి. ఈ ఆలస్యం వల్ల రాష్ట్రంలోని విద్యార్థులు నష్టపోతున్నారని, ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల్లోని కాలేజీలకు వెళ్లిపోతున్నారంటూ ప్రచురించాయి. ఈ కథనాలు తప్పని నిరూపిస్తూ గత ఏడాదికంటే ఈసారి వెబ్‌ ఆప్షన్లలో ఎక్కువమంది పాల్గొనడం విశేషం. 

సీట్లు ఖాళీ కాకుండా మెరిట్‌ విద్యార్థులకు అవకాశం 
ఐఐటీ, ఎన్‌ఐటీ, తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్, అడ్వాన్స్‌డ్‌లలో ర్యాంకులు పొందిన రాష్ట్ర విద్యార్థుల సంఖ్య 3 వేలకు పైగా ఉంటుందని అంచనా. వీరు ఏపీ ఈఏపీసెట్‌లోనూ మెరిట్‌లో ఉన్నారు. వీరంతా జాతీయ సంస్థల్లో చేరేందుకే ప్రాధాన్యమిస్తారు. జేఈఈ ప్రవేశాలకన్నా ముందే రాష్ట్ర కాలేజీల్లో ప్రవేశాలు నిర్వహించడం వల్ల ఈ విద్యార్థులు రాష్ట్ర కాలేజీల్లో సీట్లు పొందేవారు. తరువాత వారు జోసా (జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అ«థారిటీ) కౌన్సెలింగ్‌లో జాతీయ సంస్థల్లో సీట్లు పొందితే రాష్ట్ర కాలేజీల్లోని సీట్లను వదులుకోవడం ద్వారా అవి ఖాళీ అయ్యేవి. దీనివల్ల ఈఏపీసెట్‌లో వారి తరువాత మెరిట్‌లో ఉండే విద్యార్థులకు మొదటి కౌన్సెలింగ్‌లో నష్టం వాటిల్లేది. ఇçప్పుడు జోసా కౌన్సెలింగ్‌ అనంతరం ఈఏపీ సెట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించడం వల్ల వారికి తొలి కౌన్సెలింగ్‌లో మేలు జరుగుతుంది. జేఈఈలో ర్యాంకులు పొందిన వారు జాతీయ విద్యా సంస్థలకు వెళ్లిపోవడంతో వారి తర్వాత మెరిట్‌లో ఉన్న వారికి అవకాశం 
కలుగుతోంది. 

ప్రైవేటు వర్సిటీల్లోనూ కన్వీనర్‌ కోటా 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న ప్రత్యేక చర్యల కారణంగా ఈ ఏడాది నుంచి ప్రైవేటు యూనివర్సిటీల్లోని కోర్సుల్లో  35 శాతం సీట్లు పేద మెరిట్‌ విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ వర్సిటీలతో సంప్రదింపులు జరిపి, కన్వీనర్‌ కోటా సీట్లకు ఒప్పించడంతో పాటు అది తక్షణమే కార్యాచరణలోకి వచ్చేలా ప్రత్యేక ఉత్తర్వులు జారీచేయించారు. వెల్లూరు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ – అమరావతిలో 1,264 సీట్లు, ఎస్‌ఆర్‌ఎం– విజయవాడలో 413 సీట్లు, బెస్ట్‌ యూనివర్సిటీ– అనంతపురంలో 168 సీట్లు, సెంచూరియన్‌ యూనివర్సిటీ – టెక్కలిలో 273 సీట్లు మొత్తం  2,118 సీట్లను కన్వీనర్‌ కోటా ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ విద్యార్థులకు అయ్యే ఫీజు మొత్తాన్ని ప్రభుత్వమే భరించనుంది. ఇప్పటివరకు ఈ వర్సిటీల్లో కోర్సులకు వారు నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో మెరిట్‌ సాధించడంతోపాటు లక్షల్లో ఫీజులు చెల్లించాల్సి వచ్చేది. కంప్యూటర్‌ సైన్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సు, డేటా సైన్సు వంటి కోర్సులకు భారీ మొత్తంలో ఫీజులు చెల్లించాలి. వీటిలో చదివిన వారిలో అధికశాతం విద్యార్థులకు అత్యుత్తమ ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ చొరవ కారణంగా పేద మెరిట్‌ విద్యార్థులు తొలిసారిగా ప్రైవేటు వర్సిటీల్లో అడుగిడబోతున్నారు.  

రాష్ట్రంలో చేరడానికి ఎక్కువ మంది ఆసక్తి 
రాష్ట్రంలోని కాలేజీల్లో చేరడానికి ఇప్పుడు ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్యలో చేపట్టిన సంస్కరణలతో ఉన్నత విద్యాసంస్థల్లో అత్యుత్తమ బోధన అందుతోంది. ప్రభుత్వం పూర్తి ఫీజు రీయంబర్స్‌మెంటు, వసతి, భోజనాల ఖర్చు కోసం జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలను అమలు చేస్తుండడంతో ప్రవేశాలకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. 
– ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement