Engineering counseling
-
24 నుంచి ఇంజనీరింగ్ చివరి దశ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ చివరి దశ కౌన్సెలింగ్ నిర్వహణకు ప్రవేశాల కమిటీ షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ నెల 24 నుంచి చివరి దశ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రవేశాల కమిటీ కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. ఇప్పటివరకు ఫీజు చెల్లించనివారు ఈ నెల 24 నుంచి 25 లోగా ఫీజు చెల్లించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు ఈ నెల 26న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాలని పేర్కొన్నారు. కొత్త వారితోపాటు మొదటి దశలో సీట్లు రాని వారు, సీట్లు వచ్చినా మరింత మెరుగైన కాలేజీల్లో సీట్ల కోసం ఈ నెల 24 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని వెల్లడించారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకు ఈ నెల 29న సీట్లు కేటాయిస్తామని ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 29 నుంచి 31 వరకు ఆన్లైన్లో ట్యూషన్ ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని తెలిపారు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన విద్యార్థులంతా 30, 31 తేదీల్లో ఆయా కాలేజీల్లో చేరాలని సూచించారు. కాలేజీల్లో చేరిన వారు 40 వేల లోపే.. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇంజనీరింగ్‌లో 65,444 సీట్లు అందుబాటులో ఉండగా, మొదటి దశ కౌన్సెలింగ్‌లో 49,012 మంది విద్యార్థులకు సీట్లు లభించాయి. 16 వేలకు పైగా సీట్లు మిగిలిపోయాయి. ఇక సీట్లు పొందిన వారిలో 40 వేల లోపు మంది మాత్రమే కాలేజీల్లో చేరారు. ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్‌కు ఇచ్చిన గడువు బుధవారంతో ముగిసింది. దీంతో మొదటి దశ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన వారిలోనూ 9 వేల మందికిపైగా విద్యార్థులు కాలేజీల్లో చేరలేదు. దీంతో చివరి దశ కౌన్సెలింగ్‌లో 26 వేలకు పైగా ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులోకి రానున్నట్లు ప్రవేశాల క్యాంపు అధికారులు లెక్కలు వేశారు. -
24న ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను ఈనెల 24న విడుదల చేసేందుకు ఉన్నత విద్యా మండలి, ప్రవేశాల కమిటీ కసరత్తు చేస్తోంది. గత నెల 3, 4, 6, 8, 9 తేదీల్లో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను ఈనెల 9న విడుదల చేసింది. ఎంసెట్‌కు మొత్తంగా 2,17,199 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఇంజనీరింగ్ ఎంసెట్ రాసేందుకు 1,42,210 మంది దరఖాస్తు చేసుకోగా, 1,31,209 మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 1,08,213 మంది (82.47 శాతం) అర్హత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ ఎంసెట్ రాసేందుకు 74,989 మంది దరఖాస్తు చేసుకోగా, 68,550 మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 63,758 మంది (93.01 శాతం) అర్హత సాధించారు. ప్రస్తుతం వాటిల్లో అర్హత సాధించిన విద్యార్థులంతా ప్రవేశాల కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేశాయి. ఈ సారి 90 వేల వరకు ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఇంజనీరింగ్ ఫీజుల వ్యవహారం ఇంకా తేలకపోవడం, యాజమాన్యాలు కోర్టులో కేసు వేయడంతో ప్రవేశాల కమిటీ కౌన్సెలింగ్ షెడ్యూలు విషయంలో ఇప్పటివరకు తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇంకా ఆలస్యం అయితే ఇబ్బందులు తలెత్తుతాయన్న ఉద్దేశంతో ఈనెల 24న ప్రవేశాల నోటిఫికేషన్ జారీ చేసి, కౌన్సెలింగ్ నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. ఆ తర్వాత వారం రోజుల సమయంలో వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ప్రారంభించి, సీట్లు కేటాయింపు చేపట్టాలని ఆలోచిస్తోంది. మరోవైపు బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాల కోసం (లేటరల్ ఎంట్రీ) డిప్లొమా పూర్తయిన విద్యార్థులకు నిర్వహించిన ఈసెట్ ప్రవేశాలకు కూడా ఈనెల 22న నోటిఫికేషన్ జారీ చేయాలని ఉన్నత విద్యా మండలి ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగానే ఈనెల 20న ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి, ఆ రెండింటి ప్రవేశాలకు సంబంధించిన పూర్తి స్థాయి షెడ్యూలు జారీ చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. -
నేటి నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు ఈ నెల 25 నుంచి కౌన్సెలింగ్ నిర్వహణకు ప్రవేశాల కమిటీ ఏర్పా ట్లు చేసింది. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 2 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించింది. ప్రవేశాల కౌన్సెలింగ్‌కు సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను గురువారం https//tseamcet.nic.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. విద్యార్థులు ఈ నెల 28 నుంచి వచ్చే నెల 3 వరకు హెల్ప్‌లైన్ కేంద్రాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించింది. హెల్ప్‌లైన్ కేంద్రాల వివరాలను వెబ్సైట్ లో పొందొచ్చని తెలిపింది. వెరిఫికేషన్ పూర్తయిన వారు 28 నుంచి వచ్చే నెల 5 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని పేర్కొంది. వెబ్ఆప్షన్ల ప్రారంభం నాటికి కాలేజీల వారీగా సీట్లు అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది. ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకు వచ్చే నెల 8న మొదటి దశ సీట్ల కేటాయింపును ప్రకటించనున్నట్లు వెల్లడించింది. సీట్లు పొందిన వారు వచ్చే నెల 8 నుంచి 12 వరకు ట్యూషన్ ఫీజు చెల్లించడంతో పాటు వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయా లని పేర్కొంది. రెండో దశ కౌన్సెలింగ్‌ను జూలై మొదటి వారంలో నిర్వహిస్తామని పేర్కొంది. మూడో దశ కౌన్సెలింగ్‌ను ఐఐటీ, ట్రిపుల్ఐటీ, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాలు (జోసా ఆధ్వర్యంలో) పూర్తయ్యాక నిర్వహించాలని భావిస్తోంది. ఇంటర్నల్ స్లైడింగ్‌ను ప్రవే శాల కమిటీ ఆధ్వర్యంలోనే నిర్వహించనుంది. రోజూ నాలుగు విడతలు.. ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈ నెల 28 నుంచి వచ్చే నెల 3 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరగనుంది. ఏయే తేదీల్లో ఏయే ర్యాంకుల వారు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాలన్న వివరాలను ప్రకటించింది. రోజూ నాలుగు విడతలుగా (ఉదయం 9, ఉదయం 11.30, మధ్యా హ్నం 2, మధ్యాహ్నం 3.30కి బ్యాచ్‌ల వారీగా) వెరిఫికేషన్ నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక కేటగిరీల వారికి మాసబ్ ట్యాంకులోని సాంకేతిక విద్యా భవన్లో వెరిఫికేషన్ ఉంటుందని, తేదీల వారీ వివరాలను వెబ్సైట్లో పొందవచ్చని పేర్కొంది. తేదీల వారీగా షెడ్యూలు.. 28న: 1వ ర్యాంకు నుంచి 10 వేల ర్యాంకు వరకు 29న: 10,001 నుంచి 25 వేల ర్యాంకు వరకు 30న: 25,001 నుంచి 40 వేల ర్యాంకు వరకు 31న: 40,001 నుంచి 54 వేల ర్యాంకు వరకు జూన్ 1న: 54,001 నుంచి 68వేల ర్యాంకు వరకు 2న: 68,001 నుంచి 82 వేల ర్యాంకు వరకు 3న: 82,001 నుంచి చివరి ర్యాంకు వరకు. ఫీజు ఎలా చెల్లించాలంటే.. విద్యార్థులు https.//tseamcet.nic.in వెబ్సైట్లోకి వెళ్లి పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజు ఆప్షన్‌ను నొక్కాలి. ♦ ఆ తర్వాత విద్యార్థికి ఎంసెట్ హాల్‌టికెట్‌లో ఇచ్చిన రిజిస్ట్రేషన్ నంబర్, టెన్త్ మెమోలో పేర్కొన్న పుట్టిన తేదీ, ఇంటర్ హాల్‌టికెట్ నంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత విద్యార్థికి సంబంధించిన ప్రాథమిక సమాచారం మొబైల్ నంబర్, ఈ–మెయిల్, మీసేవా సెంటర్ జారీ చేసిన కులం, ఆదాయం సర్టిఫికెట్ల అప్లికేషన్ నంబర్లను (వర్తించే వారు) ఎంటర్ చేయాలి. ♦ ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీలు రూ.600, ఇతరులు రూ.1,200 క్రెడిట్‌కార్డు/డెబిట్ కార్డు/నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజుగా చెల్లించాలి. హెల్ప్‌లైన్ సెంటర్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాలి. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించని వారిని సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు అనుమతించరు. ♦ వెబ్సైట్నుంచి జిల్లా కాలేజీల జాబితాలను డౌన్లోడ్ చేసుకోవాలి. వెబ్సైట్ నుంచి మాన్యువల్ ఆప్షన్ల ఫారం డౌన్లోడ్ చేసుకోవాలి. తల్లిదండ్రులతో చర్చించుకొని అందులో రాసుకోవాలి. తాము కోరుకునే కాలేజీలు, బ్రాంచీల్లో వెబ్ ఆప్షన్లను ఇచ్చుకోవాలి. వెంట తీసుకెళ్లాల్సినవి.. అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్ల జిరాక్స్ సెట్ ఎంసెట్ ర్యాంకు కార్డు, ఎంసెట్ హాల్‌టికెట్, ఆధార్ కార్డు, టెన్త్ మార్కుల మెమో, ఇంటర్మీడియట్ తత్సమాన మార్క్ కమ్ పాస్ సర్టిఫికెట్, ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, 2018 జనవరి 1, ఆ తర్వాత జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం (వర్తించేవారు), కుల ధ్రువీకరణ పత్రం (వర్తించేవారు), రెగ్యులర్‌గా కాలేజీకి వెళ్లి చదువుకోని వారైతే వరుసగా ఇంటర్ నుంచి కింది తరగతి వరకు ఏడేళ్ల నివాస ధ్రువీకరణ పత్రం. ఏపీ విద్యార్థులు కూడా పైన పేర్కొన్న సర్టిఫికెట్లను వెంట తెచ్చుకోవాలి. ఇతర రాష్ట్రాల్లో చదువుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు గతంలో తెలంగాణలో 10 ఏళ్ల పాటు నివసించి ఉన్నట్లుగా నివాస ధ్రువీకరణ పత్రం సబ్మిట్ చేయా లి. ఇక్కడ చదువుకోని వారి ఉద్యోగుల పిల్లలైతే ఎంప్లాయర్ సర్టిఫికెట్ అందజేయాలి. వెబ్ ఆప్షన్లు ఎలా ఇచ్చుకోవాలంటే... ♦ విద్యార్థులు సూచనలు పూర్తిగా చదవాక వెబ్సైట్లోకి వెళ్లి ఆప్షన్లు ఇచ్చుకోవాలి. ♦ వెబ్‌సైట్‌లోని క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లింకు క్లిక్ చేసి పాస్ వర్డ్ జెనరేట్ చేసుకోవాలి. ♦ జెనరేట్ చేసుకున్న పాస్‌వర్డ్‌తో క్యాండిడేట్ లాగిన్‌లో వివరాలు నమోదు చేయాలి. విద్యార్థి మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఉపయోగించి లాగిన్ కావాలి. ♦ విద్యార్థులు జాగ్రత్తగా ఆర్డర్ ప్రకారం వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లను ఇచ్చుకోవాలి. నిర్ణీత తేదీల్లో విద్యార్థి ఎన్నిసార్లయినా ఆప్షన్లు మార్చుకోవచ్చు. ♦ ఆప్షన్లు ఇచ్చుకున్నాక సేవ్ చేయాలి. ఫైనల్ ప్రింటవుట్ తీసుకుని, లాగ్ అవుట్ చేయాలి. ♦ ఇళ్లు, ఇంటర్నెట్ కేంద్రం, హెల్ప్‌లైన్ కేంద్రాల నుంచి ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ♦ ఇంటర్నెట్ సెంటర్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకుంటే అవి సేవ్ చేసుకున్నాక కచ్చితంగా లాగ్అవుట్ చేయాలి. ♦ సీట్ల కేటాయింపు వివరాలను జూన్ 8న వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. -
ఆ విద్యార్థులకు మరో కౌన్సెలింగ్?
ఇంజనీరింగ్‌లో ఆప్షన్లు సరిగా ఇవ్వకుండా నష్టపోయిన విద్యార్థులపై సర్కారు తర్జనభర్జన సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్లు సరిగ్గా ఇచ్చుకోకుండా నష్టపోయిన విద్యార్థులకు మరో అవకాశం కల్పించే అంశంపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. సోమవారం డిప్యూటీ సీఎం, ఉన్నత విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి దీనిపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. అయితే భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్‌లో సీటు వచ్చినా ఫీజు చెల్లించకుండా చివరి విడత ప్రవేశాల కోసం వేచి చూసి.. ఆప్షన్లు సరిగ్గా ఇవ్వని కారణంగా కొందరు విద్యార్థులు ఉన్న సీటును కోల్పోయారు. ఆప్షన్ల ప్రాధాన్య క్రమాన్ని సరిగ్గా ఇవ్వలేక, మొదటి, తుది విడత కౌన్సెలింగ్‌లలో ఎందులోనూ సీటు దక్కనివారూ ఉన్నారు. ఇలా నష్టపోయిన విద్యార్థులు దాదాపు 3,430 దాకా ఉన్నట్లు తేల్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ వస్తేనే ఇంజనీరింగ్ చదవగలమని, నిరుపేద కుటుంబాలకు చెందిన తమకు న్యాయం చేయాలని అనేక మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరో కౌన్సెలింగ్ నిర్వహించకుండా.. స్పాట్లో యాజమాన్యాలే మిగిలిన సీట్లను భర్తీ చేస్తే ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దూరమవుతామని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. వీరికి ఎలా న్యాయం చేయాలన్న అంశంపై మంత్రి కడియం శ్రీహరి.. ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తదితరులు సమావేశమై చర్చించారు. న్యాయ నిపుణులతో చర్చించాకే..! స్పాట్ ద్వారా యాజమాన్యాలే ఆ విద్యార్థులను భర్తీ చేస్తే రీయింబర్స్మెంట్ ఇవ్వాలా..? ఒకవేళ అలా చేస్తే యాజమాన్యాలు తప్పిదాలకు పాల్పడే అవకాశం ఉంటుందా అన్న అంశాలపై భేటీలో చర్చించారు. ఇలా కాకుండా మరో కౌన్సెలింగ్‌ను నిర్వహించాలన్న ఆలోచన కూడా చేశారు. అయితే అందుకు సుప్రీంకోర్టు ఆదేశాలు అడ్డంకిగా మారొచ్చని అభిప్రాయపడ్డారు. నిర్ణీత గడువులోనే మొదటి దశ ప్రవేశాలను పూర్తి చేసి, తరగతులు ప్రారంభించినందున.. ఆ సమస్య ఉండకపోవచ్చన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది. ఏదేమైనా మరోసారి అడ్వొకేట్ జనరల్ అభిప్రాయం తీసుకొని ముందుకు సాగాలని నిర్ణయించారు. భేటీ అనంతరం ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, ఇతర అధికారులు అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డిని కలిసి చర్చించినట్లు తెలిసింది. అయితే ఆయన కూడా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. సుప్రీంకోర్టు అడ్వొకేట్, అక్కడి న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుందామన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
12 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్
ఈ నెల 20 వరకు సర్టిఫికెట్ల పరిశీలన జిల్లాలో నాలుగు హెల్ప్‌లైన్ కేంద్రాల ఏర్పాటు అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలి {పాసెసింగ్ ఫీజును పెంచిన ప్రభుత్వం గుంటూరు ఎడ్యుకేషన్ : ఎంసెట్ ఆధారిత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ఈనెల 12న ప్రారంభం కానుంది. ఎంసెట్‌లో ర్యాంకులు పొంది రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్‌లో ప్రవేశానికి ఎదురుచూస్తున్న విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధం చేసు కోవాలి. గుంటూరు నగరం గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల, నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఈనెల 20వ తేదీ వరకు ర్యాంకుల వారీగా విద్యార్థుల సర్టిఫికెట్లు పరిశీలిస్తారు. పరిశీలన పూర్తయిన విద్యార్థులకు కళాశాలల ఎంపిక కోసం ఈనెల 14 నుంచి 21వ తేదీ వరకు ఆప్షన్లు ఇచ్చుకునేందుకు వెబ్ కౌన్సెలింగ్ జరగనుంది. సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో చెల్లించాల్సిన ప్రాసెసింగ్ ఫీజును ప్రభుత్వం పెంపుదల చేసింది. గతంలో ఓసీ, బీసీ విద్యార్థుల నుంచి వసూలు చేసిన రూ. 600 మొత్తాన్ని రూ. 900కు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 300 నుంచి రూ. 450కు పెంచింది. ఎస్టీ విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు గుజ్జనగుండ్లలోని పాలిటెక్నిక్ కళాశాలలో హాజరుకావాలి. ఇతర వివరాలకు జ్ట్టిఞట://్చఞ్ఛ్చఝఛ్ఛ్టి.జీఛి.జీ సందర్శించాలి. సర్టిఫికెట్ల పరిశీలనకు వెంట తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాలు.. ఎంసెట్ ర్యాంకు కార్డు, హాల్ టికెట్, 10వ తరగతి, ఇంటర్మీడియెట్ మార్కుల జాబితా, 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, నివాస, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాల్సి ఉంది. ఆయా ధ్రువపత్రాల ఒరిజినల్స్‌తో పాటు రెండు జిరాాక్స్ కాపీ సెట్లను తీసు కెళ్లాలి. పరిశీలన అనంతరం జిరాక్స్ సర్టిఫికెట్లను సమర్పించాలి. అంగ వైకల్యం, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, గేమ్స్, ఆంగ్లో ఇండియన్ విభాగాలకు చెందిన విద్యార్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఈనెల 12 నుంచి 16వ తేదీ వరకు విజయ వాడ బెంజి సర్కిల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో హాజరవ్వాలి. ర్యాంకులవారీగా సర్టిఫికెట్ల పరిశీలన జరిగే తేదీలు .... - గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో... ఈనెల 12న ఒకటో ర్యాంకు నుంచి 3,700 ర్యాంకు వరకు,13న 15,001 ర్యాంకు నుంచి 18,800 వరకు,14న 30,001 నుంచి 33,700 వరకు, 15న 45,001 ర్యాంకు నుంచి 48,800 వరకు,16న 60,001 ర్యాంకు నుంచి 63,700 వరకు,17న 75,001 ర్యాంకు నుంచి 78,800 వరకు,18న 90,001 ర్యాంకు నుంచి 93,700 వరకు, 19న 1,05,001 నుంచి 1,08,800 వరకు, 20న 1,20,001 ర్యాంకు నుంచి 1,22,500 వరకు హాజరుకావాలి. నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో... ఈనెల 12న 3,701 ర్యాంకు నుంచి 7,500 ర్యాంకు వరకు,13న 18,801 ర్యాంకు నుంచి 22,500 వరకు,14న 33,701 నుంచి 37,500 వరకు, 15న 48,801 ర్యాంకు నుంచి 52,500 వరకు, 16న 63,701 ర్యాంకు నుంచి 67,500 వరకు, 17న 78,801 ర్యాంకు నుంచి 82,500 వరకు, 18న 93,701 ర్యాంకు నుంచి 97,500 వరకు,19న 1,08,801 నుంచి 1,12,500 వరకు, 20న 1,22,501 ర్యాంకు నుంచి 1,25,000 వరకు హాజరుకావాలి. సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో... ఈనెల 12న 7,501 ర్యాంకు నుంచి 11,200 ర్యాంకు వరకు,13న 22,501 ర్యాంకు నుంచి 26,300 వరకు,14న 37,501 నుంచి 41,200 వరకు,15న 52,501 ర్యాంకు నుంచి 56,300 వరకు,16న 67,501 ర్యాంకు నుంచి 71,200 వరకు,17న 82,501 ర్యాంకు నుంచి 86,300 వరకు,18న 97,501 ర్యాంకు నుంచి 1,01,200 వరకు,19న 1,12,501 నుంచి 1,16,300 వరకు, 20న 1,25,001 ర్యాంకు నుంచి 1,27,500 వరకు హాజరుకావాలి. ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో... ఈనెల 12న 11,201 ర్యాంకు నుంచి 15,000 ర్యాంకు వరకు,13న 26,301 ర్యాంకు నుంచి 30,000 వరకు,14న 41,201 నుంచి 45,000 వరకు,15న 56,301 ర్యాంకు నుంచి 60,000 వరకు,16న 71,201 ర్యాంకు నుంచి 75,000 వరకు,17న 86,301 ర్యాంకు నుంచి 90,000 వరకు,18న 1,01,201 ర్యాంకు నుంచి 1,05,000 వరకు,19న 1,16,301 నుంచి 1,20,000 వరకు, 20న 1,27,501 నుంచి ఆపై చివరి ర్యాంకు వరకు హాజరుకావాలి. -
‘భర్తీ’మే సవాల్
సాక్షి, కాకినాడ :ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో కళాశాలలను ఎంచుకునే కీలకమైన ‘వెబ్’ ఆప్షన్ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. ఈనెల 25 వరకు జరిగే ఈ ప్రక్రియలో విద్యార్థులను రాబట్టి, సీట్లు భర్తీ చేసుకునేందుకు కళాశాలల యాజమాన్యాలు నానాతంటాలు పడుతున్నాయి. కొన్ని కళాశాలలు ఓపక్క విద్యార్థులకు, మరో పక్క ఇంటర్నెట్ సెంటర్లకు గాలం వేస్తున్నాయి. జిల్లాలోని 32 ఇంజనీరింగ్ కళాశాలల్లో అన్ని బ్రాంచ్‌లకు కలిపి 14 వేల వరకు సీట్లు ఉన్నాయి. ఎంసెట్ ఉత్తీర్ణుల్లో కనీసం 30 శాతం ఇప్పటికే పొరుగు రాష్ట్రాలకు క్యూకట్టినట్టు చెబుతున్నారు. 11 రోజుల క్రితం మొదలైన సర్టిఫికెట్ల పరిశీలనలో ఆదివారం నాటికి లక్షా 20 వేల వరకు ర్యాంకర్ల సర్టిఫికెట్ల పరిశీలన జరిపితే కేవలం 3,405 మంది మాత్రమే హాజరయ్యారు. లక్షా 20 వేల నుంచి 2 లక్షల మధ్య ర్యాంకర్ల సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 23తో ముగియనుంది. గతేడాదితో పోలిస్తే సర్టిఫికెట్ల పరిశీలనకు ఆశించిన స్పందన రాకపోవడం కళాశాలలను కలవరపెడుతోంది. గతేడాది 9 వేల సీట్లు భర్తీ కాగా ఈసారి ఆరేడువేలైనా భర్తీ కాని పరిస్థితి ఎదురు కావచ్చంటున్నారు. జేఎన్టీయూకే పరిధిలో ఏడుకళాశాలలు ప్రవేశాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. జేఎన్టీయూకే పరిధిలో 230 కళాశాలల్లో గతేడాది 55 వేల సీట్లుండగా ఈ ఏడాది ఆ సంఖ్య 60 వేలకు చేరింది. గతేడాది 10 వేల వరకు సీట్లు మిగిలిపోగా ఈసారి 20 వేలకుపైగా మిగిలిపోవచ్చని అధికారులే అంగీకరిస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు సర్టిఫికెట్ల పరిశీలనకు వచ్చిన వారిని ఏదోలా ఆకర్షించేందుకు కళాశాలలు ఆరాటపడుతున్నాయి. కళాశాలల స్వాధీనంలో సర్టిఫికెట్లు..! ఎలాట్మెంట్ ఆర్డర్ వచ్చే వరకు సర్టిఫికెట్లు తీసుకునే అధికారం కళాశాలలకు లేకున్నా దళారీల సాయంతో పలు కళాశాలలు విద్యార్థుల తల్లిదండ్రులకు గాలం వేసి సర్టిఫికెట్లను చేజిక్కించుకుంటున్నాయి. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం పాస్వర్డ్ వచ్చే సెల్ నెంబర్ కూడా తమదే ఇచ్చి ఆ వచ్చిన పాస్‌వర్డ్‌తో తమ కళాశాలనే ఎంపిక చేయిస్తున్నారు. కొన్ని కళాశాలలు ఇంటర్నెట్ సెంటర్ల వారిని మచ్చిక చేసుకొని వారి ద్వారా విద్యార్థుల పాస్‌వర్డ్‌ను తస్కరిస్తూ తమ కళాశాలను ఆప్షన్‌గా పెట్టిస్తున్నారు. గతేడాది భీమవరం, ఏలూరు తదితర ప్రాంతాల్లో ఇలాంటి అవతవకలు బయటపడ్డాయి. ఈసారి యాజమాన్యాలు మరింత పకడ్బందీగా దీన్ని అమలు చేస్తున్నాయి. వెబ్ ఆప్షన్ల కోసం ఒక్కో విద్యార్థికి రూ.10 వేల చొప్పున ఇంటర్నెట్ సెంటర్లకు ఎరవేస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించే విద్యార్థులకైతే టాబ్లెట్ పీసీ, ల్యాప్‌ట్యాప్ వంటి బహుమతులతో పాటు రూ.30 వేల వరకు నగదు ఎదురిచ్చి తమ వైపు తిప్పుకొంటున్నారు. రీయింబర్స్మెంట్ వర్తించని విద్యార్థులకు తమ కళాశాలలో చేరితే యూనిఫారమ్, బస్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజులతో పాటు మధ్యాహ్న భోజనం ఉచితం, తొలి ఏడాది ఫీజులు చెల్లించనవసరం లేదంటూ ఆకర్షిస్తున్నారు. అధ్యాపకులు, ఇతర సిబ్బందిని రంగంలోకి దింపి విద్యార్థులను బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వన్‌టైం పాస్వర్డ్ విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యాల వలలో పడకుండా తమ పిల్లలు కోరుకున్న కళాశాలల్లో కోరుకున్న బ్రాంచ్‌లు ఎంచుకునేలా సహకరించాలి. లేకుంటే వారి భవిష్యత్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. వన్‌టైం పాస్వర్డ్ ఉన్నా.. గతంలో కౌన్సెలింగ్‌లో పెద్దఎత్తున అవకతవకలు జరిగినట్టు గుర్తించిన ఉన్నత విద్యా మండలి ఈ ఏడాది స్క్రాచ్ కార్డును రద్దు చేసి వన్‌టైం పాస్‌వర్డ్‌ను ప్రవేశపెట్టింది. వెబ్ ఆప్షన్ కోసం ఇంటర్నెట్లో లాగిన్ అయితే ఒక వన్‌టైం పాస్వర్డ్ విద్యార్థి సెల్ నెంబర్‌కు వస్తుంది. ఆ పాస్వర్డ్ ఒకసారే లాగిన్ అవడానికి ఉపయోగ పడుతుంది. కళాశాల, బ్రాంచ్‌లను ఎంపిక చేసుకున్నాక లాగౌట్ అవ్వాలి. ఒకసారి లాగౌట్ అయ్యాక మళ్లీ లాగిన్ కు అవకాశం ఉండదు. అయితే పాస్వర్డ్ ఎవరికైనా ఇస్తే మాత్రం దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. ఇప్పుడు అదే జరుగుతోంది. ఈ విధానంలో డేటాను హ్యాకింగ్ చేసే అవకాశం ఉండదంటున్నా విద్యార్థులను తమవైపు తిప్పుకోవడం ద్వారా పాస్‌వర్డ్‌ను చేజిక్కించుకున్న యాజమాన్యాలు తమ కళాశాలలనే ఆప్షన్‌గా ఎంపిక చేస్తున్నాయి. -
ఎంసెట్ కౌన్సెలింగ్‌కు స్పందన కరువు
యూనివర్సిటీ క్యాంపస్ : మూడు రోజులుగా జరుగుతున్న ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌కు విద్యార్థుల నుంచి స్పందన కరువవుతోంది. విద్యార్థులు రాకపోవడంతో హెల్ప్‌లైన్ సెంటర్లు వెలవెలబోతున్నాయి. చిత్తూరులోని పీవీకేఎన్ డిగ్రీ కళాశాల, తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలల్లో హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ నెల 7 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలైంది. తొలిరోజు 5 వేల లోపు ర్యాం కులు పొందిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇందులో 27 మంది మాత్రమే పాల్గొన్నారు. రెండో రోజైన శుక్రవారం 84 మంది, మూడో రోజైన శనివారం వందమంది హాజరయ్యా రు. శనివారం 10 వేల నుంచి 15 వేల ర్యాంకుల వరకు కౌన్సెలింగ్ నిర్వహించగా ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో 41 మంది, ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలలో 30 మంది, చిత్తూరులోని పీవీకేఎన్‌లో 29 మంది హాజరయ్యారు. 11 గంటలకే ఖాళీ ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రతి రోజూ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఎక్కువ మంది హాజ రుకాకపోవడంతో ఉదయం 11 గంటలకే హెల్ప్‌లైన్ సెంటర్లు ఖాళీ అయిపోతున్నాయి. కారణాలేంటి? ఎంసెట్ కౌన్సెలింగ్‌కు విద్యార్థుల నుంచి స్పందన లేకపోవడానికి కారణాలు అన్వేషిస్తే ప్రస్తుతం కళాశాలల సంఖ్య బాగా పెరిగింది. వేలాది మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు. వీరికి ఉపాధి లభించడం లేదు. దీనివల్ల విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సుల వైపు వెళ్లకూడదని సంప్రదాయ డిగ్రీ, పీజీ కోర్సుల వైపు ఆకర్షితులవుతున్నారు. అందువల్ల ఇంజనీరింగ్ కోర్సులకు ఆదరణ తగ్గింది. ఈ ఏడాది కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యం కావడం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వాలు రోజుకో మాట చెబుతుండడంతో విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరడానికి ఆసక్తి కనబరచడం లేదు. గతంలో చిత్తూరు జిల్లాలో కేవలం ఐదు ఇంజనీరింగ్ కళాశాలలు మాత్రమే ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 37కు చేరింది. దీనికితోడు కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యం కావడంతో చాలా మంది విద్యార్థులు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు తరలి వెళ్లారు. మరికొంతమంది విద్యార్థులు ఐఐటీ, నిట్, విట్‌లాంటి సంస్థల్లో చేరారు. -
ఎం‘సెట్’ అయ్యింది..!
ఎచ్చెర్ల క్యాంపస్: ఎన్నో అంతరాయాలు..వివాదాల నడుమ ఎట్టకేలకు ఎంసెట్-2014 ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌కు మార్గం సుగమమైంది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఎట్టకేలకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు స్పందించాయి. వెబ్ కౌన్సెలింగ్‌లో భాగంగా ధ్రువీకరణ పత్రాల పరిశీలన షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి పాలిటెక్నిక్ పురుషుల కళాశాలలో కౌన్సెలింగ్ హెల్ప్‌లైన్ సెంటర్(సహాయ కేంద్రాన్ని) ప్రకటించారు. గురువారం నుంచి ధ్రువీకరణ పత్రాలను పరిశీలన ప్రారంభం కానుంది. తొలి రోజున 1 నుంచి 5 వేల ర్యాంకు వరకు విద్యార్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన జరగనుంది. విద్యార్థులకు ఊరట ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాల ఉన్నతాధికారులతో చర్చలు జరిపిన ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాల్‌రెడ్డి గతంలో ప్రకటించిన షెడ్యూల్ మేరకే కౌన్సెలింగ్ జరుగుతుందని ప్రకటించడంతో..విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఉమ్మడి రాష్ట్రం యూనిట్‌గానే ప్రవేశాలు ఉంటాయని ఉన్నత విద్యాశాఖ ప్రకటించింది. ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఈనెల 23 నాటికి పూర్తి చేసి, సెప్టెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభించే చర్యలపై ఉన్నత విద్యా మండలి కసరత్తు ప్రారంభించింది. అంతా సజావుగా సాగితే..ఒకటి నుంచి తరగతులు సైతం ప్రారంభం కానున్నాయి. ఇక్కడ మరో సమస్య కూడా తోడవుతోంది. పాలీసెట్, ఈసెట్-2014 ర్యాంకర్ల ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తయి..నెలలు గడుస్తున్నా..ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్థానికతపై స్పష్టత లేకపోవడంతో..అలాట్ మెంట్లు ప్రకటించలేదు. ఈ కోర్సుకు సంబంధించి.. ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారం భం కావాల్సి ఉన్నా..ఇంకా పరిష్కారం కావడం లేదు. -
నేటి నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్
నూనెపల్లె/కర్నూలు రూరల్: ఎంసెట్ కౌన్సెలింగ్‌కు ఎట్టకేలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇంజనీరింగ్‌లో చేరికకు నేటి నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ప్రక్రియ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, కౌన్సెలింగ్ కన్వీనర్ ఎం.రామసుబ్బారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని రాయలసీమ యూనివర్సిటీ, బి.తాండ్రపాడులోని పుల్లారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో కౌన్సెలింగ్ చేపడతామన్నారు. ఆర్యూ ప్రొఫెసర్ సంజీవరావు కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తారని.. గురువారం ప్రారంభం కానున్న కౌన్సెలింగ్ 23వ తేదీతో ముగుస్తుందన్నారు. ఆగస్టు 15న సెలవు దినంగా ప్రకటించినట్లు చెప్పారు. నంద్యాలలో ఎస్సీ, ఓసీ, బీసీ అభ్యర్థులకు, కర్నూలులో ఎస్టీలతో పాటు ఇతర కేటగిరీల అభ్యర్థులకు కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. ఎస్సీ,ఎస్టీలు రూ.300, ఓసీ, బీసీలు రూ.600 చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. వికలాంగులు, సీఏపీ, ఎన్సీసీ, ఆర్మీ, గేమ్స్(సెంట్రలైజ్డ్ విభాగం) కేటగిరీల అభ్యర్థులకు 7 నుండి 18వ తేదీ వరకు హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంకు సమీపంలో ఉన్న సాంకేతిక విద్యా భవనంలో సర్టిఫికెట్ల పరిశీలన, రిజిస్ట్రేషన్ చేపడతారన్నారు. ఇదిలాఉండగా ఆప్షన్లపై ఇప్పటి వరకు షెడ్యూల్ విడుదల కాకపోవడం కొంత ఆందోళనకు కారణమవుతోంది. -
కౌన్సెలింగ్ సమాప్తం
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ సోమవారంతో సమాప్తం అయింది. విద్యార్థుల్లో ఆదరణ కరువు కావడంతో ఈ ఏడాది కళాశాలల్లో లక్ష సీట్లు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. ప్రైవేటు కళాశాల్లో అత్యధిక సీట్లు ఖాళీగా ఉండటం ఆ యాజమాన్యాలను డైలమాలో పడేసింది.రాష్ట్రంలో రానురాను ఇంజినీరింగ్ విద్యపై మక్కు వ తగ్గుతోంది. రెండేళ్లుగా ఈ పరిస్థితి ఎదురవుతోంది. రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా ఇంజినీరింగ్ కళాశాలలు పుట్టుకు రావడం ఓ వైపు, సీట్ల సంఖ్య ఏడాదికాఏడా ది పెరగడం మరో వైపు వెరసి ఇంజినీరింగ్ విద్యకు విద్యార్థులు కరువయ్యేలా చేసింది. పస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పరంగా 571 ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో 2,88,486 సీట్లు ఉన్నా యి. వీటిలో ప్రభుత్వ కోటా సీట్లు 2,11,889గా ఉన్నా యి. ఈ సీట్లను అన్నా వర్సిటీ నేతృత్వంలో కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ ఏడాది దరఖాస్తుల సమయంలోనే ఇంజినీరింగ్‌కు ఆదరణ తగ్గిందన్న విష యం స్పష్టం అయింది. జనరల్ కోటా సీట్లకు లక్షా 70 వేల మంది వరకు దరఖాస్తులు చేసుకున్నా, కనీసం లక్షా నలైభై వేల వరకు సీట్లు భర్తీ అవుతాయన్న ఆశాభావం నెలకొంది. అయితే, విద్యార్థులు ముఖం చాటేయడంతో ఇంజినీరింగ్ ఖాళీల సంఖ్య గత ఏడాది కంటే అధికమయ్యాయి. సమాప్తం ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌కు గత నెల ఏడో తేదీన అన్నావర్సిటీ శ్రీకారం చుట్టింది. ప్రతి రోజూ ఉదయం ఏడు నుంచి రాత్రి ఏడు గంటల వరకు కౌన్సెలింగ్ నిర్వహించింది. 28 రోజుల పాటు జరిగిన కౌన్సెలింగ్ సోమవారంతో సమాప్తం అయింది. చివరి రోజు ఉద యం వరకు లక్షా ఏడు వేల మంది విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలల్లో సీట్లను ఎంపిక చేసుకుని అడ్మిషన్లు పొందారు. చివరి రోజు సాయంత్రం వరకు అదనంగా మరో రెండు వేల సీట్ల వరకు భర్తీ అయ్యాయి. దీంతో మిగిలిన సీట్లన్నీ ఖాళీగా దర్శనం ఇవ్వక తప్పడం లేదు. లక్ష సీట్లు ఖాళీగా మిగిలాయి. గత ఏడాది 70 వేల వరకు సీట్లు ఖాళీగా మిగలగా, ఈ ఏడాది అదనంగా మరో 30 వేల సీట్లు ఆ జాబితాలోకి చేరాయి. సీట్ల ఖాళీల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా, మున్ముందు ఎక్కడ రాష్ట్రానికి ఏఐసీటీఈ కోటాను తగ్గిస్తుందోనన్న బెంగ ఓ వైపు నెలకొంటే, మరో వైపు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల గగ్గోలు పెట్టాల్సిన పరిస్థితి. విద్యార్థులు కరువు గ్రామీణ విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చే విధంగా సబర్బన్ ప్రాంతాల్లో విద్యా సంస్థలు పెద్ద ఎత్తున నెలకొల్పారు. ఇందులో కొన్ని ఇటీవలే పుట్టుకొచ్చినవి. ఈ కళాశాలల్లో ప్రస్తుతం ఇంజినీరింగ్‌లోని అనేక కోర్సులకు విద్యార్థులు కరువయ్యారు. దీంతో ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి. అన్నావర్సిటీ పరిధిలోని ప్రధాన కళాశాలల్లో కౌన్సెలింగ్ ద్వారా సీట్లన్నీ భర్తీ అయ్యాయి. అలాగే, కొన్ని ప్రధాన ప్రైవేటు కళాశాలల్లో సీట్లు పూర్తిగా భర్తీ అయ్యాయి. అయితే, కొత్తగా పుట్టుకొచ్చిన కళాశాలలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కళాశాలలకు విద్యార్థులు లేకపోవడం గమనార్హం. సీట్ల సంఖ్యపై కౌన్సెలింగ్ అధికారి రైమండ్ ఉత్తిర రాజ్ మీడియాతో మాట్లాడుతూ, ఈ ఏడాది లక్ష సీట్లు ఖాళీ గా ఉన్నాయని స్పష్టం చేశారు. విద్యార్థులు ఇతర కోర్సుల మీద దృష్టి పెడుతున్నట్టుందని పేర్కొన్నారు. జనరల్ కౌన్సెలింగ్ సమాప్తం అయిందని, మంగళవారం అనుబంధ కౌన్సెలింగ్ నిర్వహించనున్నామని తెలిపారు. ఎస్సీ, అరుంధతీయ కోటాలో ఖాళీగా ఉన్న సీట్లు ఈ కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తామన్నారు. అలాగే, సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు అవకాశం కల్పించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. మంగళవారం ఆ విద్యార్థులు దరఖాస్తులు చేసుకుంటే, బుధవారం కౌన్సెలింగ్ ద్వారా సీట్లను కేటాయిస్తామని తెలిపారు. -
మేమే నిర్వహించుకుంటాం
తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌పై మంత్రి జగదీశ్‌రెడి ఎంసెట్ ప్రవేశాల నోటిఫికేషన్‌తో మాకు సంబంధం లేదు సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌ను మేమే నిర్వహించుకుంటాం.. ఈ విషయంలో ఉన్నత విద్యామండలి ప్రకటించిన షెడ్యూల్‌తో మాకు సంబంధం లేదు. ఆ కౌన్సెలింగ్‌లో తెలంగాణ విద్యార్థులు పాల్గొనాల్సిన అవసరం లేదు.. తెలంగాణ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు, విద్యామండలి చైర్మన్ కలిసి ఆడుతున్న నాటకమిది..’’ అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అసలు కాలేజీలకు అనుమతులు ఇవ్వకముందే కౌన్సెలింగ్ ప్రక్రియ ఏమిటని ప్రశ్నించింది. తెలంగాణలోని కళాశాలలను తనిఖీ చేసి, అఫిలియేషన్ ఇచ్చిన అనంతరం ప్రవేశాల ప్రక్రియను చేపడతామని తెలిపింది. ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం ధ్రువపత్రాల పరిశీలనకు ఎంసెట్ కన్వీనర్ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో... ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మంత్రి జగదీశ్ రెడ్డి సమావేశమయ్యారు. గత నాలుగేళ్లలో ఎప్పుడూ ప్రవేశాలు ఆగస్టు కంటే ముందు జరగలేదని ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి సీఎంకు తెలియజేశారు. ఉన్నత విద్యా మండలికి, ప్రభుత్వానికి మధ్య వివాదం వచ్చినపుడు... ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయం అవుతుందని ‘ఉన్నత విద్యామండలి చట్టం-1988’ సెక్షన్ 18 (2)లోనే ఉందని వివరించారు. ఏపీ ప్రభుత్వం ఒత్తిడి మేరకు ఉన్నత విద్యా మండలి తీసుకుంటున్న నిర్ణయాలపై సీఎంతో దాదాపు మూడు గంటలపాటు చర్చించారు. అనంతరం జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రా, ఇతర రాష్ట్ర విద్యార్థులకంటే తెలంగాణ విద్యార్థులకు మెరుగైన, నాణ్యమైన విద్య అందిస్తామని... ఇందుకు సీఎం కేసీఆర్ కృత నిశ్చయంతో ఉన్నారని వివరించారు. కౌన్సెలింగ్ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ ఉన్నత విద్యా మండలి గందరగోళం సృష్టిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణలో సీట్లు కేటాయించే అధికారం ఏపీకి, ఏపీ ఉన్నత విద్యా మండలికి లేదని.. ఆంధ్రా ప్రభుత ్వం నిర్వహించే కౌన్సెలింగ్‌లో తెలంగాణ విద్యార్థులు పాల్గొనాల్సిన అవసరం లేదని చెప్పారు. మండలి ప్రకటనపై వివరణ ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా... ఇక్కడి విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దనే ఉద్ధేశంతో చెబుతున్నామని జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు తదుపరి చర్యలు ఉంటాయన్నారు. జేఎన్టీయూ నుంచి అనుమతులు వచ్చాకే తెలంగాణలో కౌన్సెలింగ్ ఉంటుదన్నారు. సీఎంను కలిసిన వారిలో మంత్రితో పాటు విద్యాశాఖ అధికారులు ఉన్నారు. -
కౌన్సెలింగ్ మరింత ఆలస్యం!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం ఈనెల 29 నుంచి నిర్వహించాలనుకున్న కౌన్సెలింగ్ మరింత ఆలస్యం అయ్యే పరిస్థితి నెలకొంది. కొత్త కాలేజీలు, అదనపు సీట్ల పెంపునకు సంబంధించిన అనుమతుల గడువును అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) మరో ఐదు రోజులు పెంచడమే ఇందుకు కారణం. ఈ గడువును ఈనెల 15 నుంచి 20 వరకు పెంచారు. దీంతో వీలైతే జూలై మొదటి వారంలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాలేజీలకు ఏఐసీటీఈ నుంచి అనుమతులు వచ్చాక, ఉభయ రాష్ట్రాల్లోని యూనివర్సిటీలు వాటికి గుర్తింపు ఇవ్వాల్సి ఉంది. ఆ తర్వాతే ఆ కాలేజీలను కౌన్సెలింగ్‌లో ప్రవేశాలకు అనుమతిస్తారు. దీనికితోడు మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి రెండు ప్రభుత్వాల నుంచి ఇంకా ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. కాగా, వివిధ పీజీ కోర్సులు, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, లా, పోస్టు గ్రాడ్యుయేషన్ లా, ఫిజికల్ ఎడ్యుకేషన్ (పీఈ) కోర్సుల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ప్రారంభించేందుకు ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది. ఇందుకు శుక్రవారం షెడ్యూలు ఖరారు చేసింది. -
ప్రశాంతంగా ఇంజినీరింగ్ కౌన్సెలింగ్
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: స్థానిక డీఎస్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలోని ఎంసెట్-2013 హెల్ప్‌లైన్ సెంటర్లో ఇంజినీరింగ్, ఫార్మసీ కౌన్సెలింగ్ శనివారం రాత్రి 9 గంటల వరకు కొనసాగింది. ఈ హెల్ప్‌లైన్ సెంటర్లోనే మొత్తం 450 మంది విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకుని సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారు. ఈ సెంటర్‌కు 80001 ర్యాంకు నుంచి 90000 ర్యాంకు వరకు విద్యార్థులను కేటాయించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పీజీ సెంటర్ అధ్యాపకులు, సిబ్బంది సమైక్యాంధ్రకు మద్దతుగా శనివారం సామూహిక సెలవు పెట్టడంతో అక్కడ ఎంసెట్ కౌన్సెలింగ్ నిలిచిపోయింది. దీంతో ఆ కేంద్రానికి కేటాయించిన 90001 ర్యాంకు నుంచి 1,00,000 ర్యాంకు వరకు విద్యార్థులు పేర్లు నమోదు చేసుకునేందుకు ప్రభుత్వ మహిళా కళాశాలకు వచ్చారు. దీంతో ఈ సెంటర్లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి వరకు కౌన్సెలింగ్ నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీఎన్ రాజ్యలక్ష్మి తెలిపారు. సమైక్యాంధ్ర సమ్మె వల్ల ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ముందుగా విద్యార్థినీల సర్టిఫికెట్లు పరిశీలించి పంపించారు. తర్వాత మిగిలిన వారి సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమాన్ని కొనసాగించారు. మొత్తం 450 మంది విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించినట్లు ఆమె తెలిపారు. 1,00,001 నుంచి 1,10,000 వరకు ర్యాంకు అభ్యర్థులు ఆదివారం కళాశాలలో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని రాజ్యలక్ష్మి తెలిపారు. పీజీ సెంటర్ బంద్ రాష్ట్ర విభజనను నిరసిస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని యూనివర్సిటీ, పీజీ సెంటర్లు, పీజీ కళాశాలలను శనివారం బంద్ పాటిస్తున్న నేపథ్యంలో ఇక్కడ పీజీ సెంటర్లోని అధ్యాపకులు, సిబ్బంది సామూహిక సెలవు పెట్టి బంద్ పాటించారు. స్పెషలాఫీసర్ డాక్టర్ రాజమోహనరావు ఆధ్వర్యంలో అధ్యాపకులు, సిబ్బంది నిరసన చేపట్టారు. దీంతో పీజీ సెంటర్లో ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నిలిచిపోయింది. ఆదివారం కౌన్సెలింగ్ యథావిధిగా జరుగుతుందని రాజమోహనరావు చెప్పారు. ఆదివారం కౌన్సెలింగ్‌కు 1,10,001 నుంచి 1,20,000 ర్యాంకు వరకు విద్యార్థులు హాజరు కావాలని ఆయన కోరారు. శనివారం కౌన్సెలింగ్‌కు కేటాయించిన ర్యాంకుల అభ్యర్థులు కూడా హాజరు కావచ్చని చెప్పారు. -
కొనసాగిన కౌన్సెలింగ్
నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్: జిల్లాలోని రెండు కేంద్రాల్లో మంగళవారం ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ఎట్టకేలకు కొనసాగించారు. పాలిటెక్నిక్ కళాశాల సిబ్బం ది కౌన్సెలింగ్ విధులకు దూరంగా ఉండడంతో మధ్యాహ్నం వరకు అయోమయ పరిస్థితి నెలకొంది. కొత్త సిబ్బం ది కంప్యూటర్లను ఆన్చేసినా కోడ్ తెలియక పోవడంతో ఆన్లైన్ వ్యవస్థ ఓపెన్ కావడంలేదని చేతులెత్తేశారు. ఏజేసీ పెంచలరెడ్డి దర్గామిట్టలోని కౌన్సెలింగ్ కేంద్రాన్ని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఉదయం 8గంటలకు కౌన్సెలింగ్ కేం ద్రాలకు హాజరైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు మధ్యాహ్నం వరకు సమాధానం చెప్పేవారే లేకపోవడంతో చెట్లకింద పడిగాపులు కాశారు. ఒక దశలో ఆగ్రహావేశాలకు గురై ప్రిన్సిపల్ గది ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిబ్బంది, తల్లిదండ్రుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. నాల్గవ నగర పోలీస్‌స్టేషన్ ఎస్ ఐ మల్లికార్జున తల్లిదండ్రులకు సర్దిజెప్పి శాంతింపజేశారు. పాలిటెక్నిక్ ఆల్ లెక్చరర్స్ అసోసియేషన్ సభ్యులు సమ్మెలో ఉండడంతో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అధికారులు అనేక అవస్థలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కౌన్సెలింగ్ బాధ్యతను విధి గా నిర్వర్తించాల్సిన దర్గామిట్టలోని కళాశాల ప్రిన్సిపల్ చేతులెత్తేయడంతో జిల్లా ఉన్నతాధికారులకు దిక్కుతోచక తలలు పట్టుకున్నారు. సెట్నల్ సీఈఓ సుధాకర్‌రెడ్డి రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. డీఆర్డీఏ పీడీ వెంకటసుబ్బయ్య సహకారంతో ఆశాఖ సిబ్బందిని కౌన్సెలింగ్ విధులకు నియమించారు. డీఆర్డీఏ సిబ్బంది కౌన్సెలింగ్ ప్రక్రియను అవలీలగా పూర్తి చేశారు. మహిళా పాలిటెక్నిక్ కేంద్రంలో 94 మందికి, బాలుర పాలిటెక్నిక్ కేంద్రంలో 185 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. అడకత్తెరలో పోకచెక్కలా ప్రిన్సిపాళ్ల పరిస్థితి కౌన్సెలింగ్ ప్రక్రియలో ఇదివరకే శిక్షణ పొందిన పాలిటెక్నిక్ సిబ్బంది మినహాయించి కాంట్రాక్టు ఉద్యోగులతో కౌన్సెలింగ్ నిర్వహించకూడదని ఎంసె ట్ కన్వీనర్ నుంచి పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఫ్యాక్స్ సమాచారం అందింది. శిక్షణ పొందని పాలిటెక్నిక్ సిబ్బందితో కూడా కౌన్సెలింగ్ చేపట్టకూడదని, అలాచేస్తే సంబంధిత ప్రిన్సిపాళ్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. శిక్షణ పొందిన సిబ్బంది సమ్మెలో ఉండడంతో ప్రిన్సిపాళ్లకు ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ కౌన్సెలింగ్ నిర్వహించాల్సిందేనని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఎటూ నిర్ణయం తీసుకోలేకపోయారు. దర్గామిట్టలోని మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ ఏ నిర్ణయం తీసుకోలేక గదికే పరిమితమవడంతో సెట్నల్ సీఈఓ దగ్గరుండి కౌన్సెలింగ్ ప్రక్రియ జరిపించారు. -
ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌పై ‘సమైక్య’ ప్రభావం
విజయవాడ, న్యూస్‌లైన్ : ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ సమైక్య ఉద్యమం ప్రభావం కనిపించింది. విజయవాడలోని మూడు సెంటర్లలో అధికారులు కౌన్సెలింగ్ నిర్వహిం చారు. ఈ మూడు కేంద్రాల వద్ద సమైక్యవాదులు కౌన్సెలింగ్‌ను అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మూడు గంటలపాటు కౌన్సెలింగ్ నిలిచిపోయింది. ఇప్పటికే రెండునెలల ఆలస్యంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారని, ఇప్పుడు అడ్డుకుంటే ఎలాగని సమైక్యవాదులతో విద్యార్థుల తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. తమ పిల్లల భవిష్యత్ ఏమిటని ఆందోళనకారులను ప్రశ్నించారు. హైదరాబాద్ తెలంగాణకు వెళ్లిపోతే ఇంజినీరింగ్ విద్యార్థులకు భవిష్యత్తు అంధకారమవుతుందన్న ఆందోళనతోనే తాము ఉద్యమం చేస్తున్నామని, తల్లిదండ్రులు సహకరించాలని సమైక్యవాదులు కోరారు. పాలిటెక్నిక్ కళాశాలలో నిలిచిన కౌన్సెలింగ్ ప్రభుత్వ పాలిటెక్నిక కళాశాలలో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు సిబ్బంది హాజరుకాలేదు. సిబ్బంది మొత్తం ఉద్యమంలో పాల్గొనడంతో ఒకటి నుంచి 5 వేల ర్యాంక్ వరకూ జరగాల్సిన కౌన్సెలింగ్ నిలిచిపోయింది. ఈ కేంద్రానికి హాజరుకావాల్సిన విద్యార్థులను లయోలా కళాశాల, ఎస్ఆర్ఆర్ కళాశాల్లో జరిగే కౌన్సెలింగ్ సెంటర్లకు తరలించారు. ఆంధ్రా లయోలా కళాశాలలో లయోలా కాలేజీలో ఉదయం 9.30గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభమయ్యింది. ఏపీఎన్జీవోస్ జేఏసీ నాయకులు వచ్చి కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. పోలీసులు అక్కడికి వచ్చి సమైక్యవాదులను వారించారు. 5001నుంచి 10 వేల ర్యాంక్ వరకు కౌన్సెలింగ్ నిర్వహించగా, 285 మంది సర్టిఫికెట్లు పరిశీలించారు. ఎస్ఆర్ఆర్కళాశాలలో.... ఎస్ఆర్ఆర్ కళాశాలలో కౌన్సెలింగ్ ప్రారంభమైన సమయంలో సమైక్యవాదులు అడ్డుకున్నారు. విద్యార్థి జేఏసీ నాయకుడు దేవినేని అవినాష్ విద్యార్థి నాయకులతో కళాశాలకు వచ్చి ఉద్యమానికి మద్దతుగా కౌన్సెలింగ్ నిలిపివేయాల్సిందిగా నిర్వాహకులను కోరారు. దీంతో కొద్దిసేపు కౌన్సెలింగ్ నిలిచిపోయింది. అనంతరం నిర్వాహకులు ఉన్నతాధికారులతో సంప్రదించి కొనసాగించారు. 278 మంది విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. రెండో రోజూ కౌన్సెలింగ్‌ను అడ్డుకుంటామని సమైక్య వాదులు ప్రకటించారు. -
విభజనాగ్ని
తూర్పు దిక్కున సమైక్య సూరీడు భగ్గుమన్నాడు. విభజనాగ్ని సెగలు విరజిమ్ముతూనే ఉన్నారు. ఎన్ని అడ్డంకులెదురైనా, పోలీసులు ఉక్కు పాదం మోపినా ఉద్యమకారులలో మొక్కవోని దీక్ష.అణచివేత యత్నాలను తిప్పికొట్టి నగరంలోనూ, జిల్లావ్యాప్తంగా సింహాలై గర్జిస్తున్న సమైక్యవాదుల మడమతిప్పని వైఖరి పాలకులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. విశాఖ రూరల్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర కోరుతూ సమ్మెను ఈ నెల 31 వరకూ తీవ్రస్థాయిలో ఎలా నిర్వహించాలో కార్యాచరణ సిద్ధమైంది. ఇది సకల జనోద్యమం. అప్రతిహతమైన ఈ ఉద్యమం ఉప్పెనై పాలకులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉద్యమాన్ని అణచివేసేందుకు ఎలాంటి ఆటంకాలు ఎదురైన అకుంఠిత దీక్షతో ముందుకుసాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో జనావేశం ఏదో అ ద్భుతాన్ని సృష్టించేలా ఉంది. విశాఖ ప్రజల సమైక్య నినాదం ప్రతిధ్వనిస్తుంటే .. మరోవైపు ఉద్యోగ సంఘాలు పాలనను స్తంభింపచేస్తున్నాయి. ఒక వైపు ఉద్యమాన్ని అణగదొక్కేందుకు ప్రభుత్వం రోజుకో జీవో జారీ చేస్తూ హెచ్చరికలు జారీ చేస్తోంది. మరో పక్క ఉద్యోగసంఘాలు రోజుకో నిరసన కార్యక్రమంతో కార్యాచరణ సిద్ధం చేశాయి. జిల్లాలో గత 19 రోజులుగా అలుపెరగని పోరాటాన్ని సాగిస్తున్న సంఘాలన్నీ సోమవారం నుంచి ఏకతాటిపైకి వచ్చి సకల జనుల సమ్మెను మరింత ఉరకలెత్తించాలని నిర్ణయించాయి. ఏపీఎన్జీవోల పిలుపు మేరకు ఈ నెల 19 నుంచి 31 వరకు తీవ్ర స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమయ్యాయి. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ అడ్డగింపు విశాఖ కంచరపాలెం, నర్సీపట్నంలలోని పాలిటెక్నికల్ కళాశాలల్లో సోమవారం నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేసినా ప్రభుత్వం వెనక్కు తగ్గకపోవడంతో ఈ కౌన్సెలింగ్‌ను అడ్డుకునేందుకు ఉద్యోగ సంఘాలు సన్నద్ధమయ్యాయి. సకల జనుల సమ్మె కారణంగా బస్సులు లేకపోవడంతో దూర ప్రాంతాల నుంచి విద్యార్థులు కౌన్సెలింగ్‌కు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కౌన్సెలింగ్ నిర్వహించాల్సిన టెక్నికల్, నాన్‌టెక్నికల్ ఉద్యోగులు కూడా సమ్మెలో ఉన్నారు. దీంతో కౌన్సెలింగ్ నిర్వహించే వారు కూడా ఉండే అవకాశం లేదు. ఉన్నతాధికారులు మినహా ఉద్యోగులు, సిబ్బంది లేకుండా కౌన్సెలింగ్ నిర్వహణ సాధ్యమయ్యే పనికాదని వాయిదా వేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కౌన్సెలింగ్‌ను అడ్డుకునేందుకు ఉదయం 7 గంటల నుంచే పాలిటెక్నిక్ కళాశాల వద్ద భారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. అనంతరం ఉదయం 10 గంటలకు అక్కడ నుంచి ఎన్ఏడీ కొత్త రోడ్డు వరకు ఉద్యోగులందరూ మహా ర్యాలీ చేయనున్నారు. స్తంభించనున్న రవాణా సకల జనుల సమ్మెలో ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొనడంతో గత ఆరు రోజుల నుంచి బస్సు సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాలకు వెళ్లాలంటే ప్రైవేటు ఆపరేటర్లను ఆశ్రయిస్తున్నారు. ఎన్జీవో నేతలు ఆదివారం జిల్లా కలెక్టరేట్లో ఉన్న ఏపీఎన్జీవో హోమ్‌లో ఆయా యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రైవేటు సర్వీసుల యజమానులు 30 మంది పాల్గొన్నారు. హైదరాబాద్‌తో పాటు అన్ని బస్సు సర్వీసులను నిలిపివేసి ఉద్యమానికి మద్దతు తెలపాలని జేఏసీ చైర్మన్ ఈశ్వరరావు వారిని కోరారు. అందుకు వారు సానుకూలంగా స్పందించారు. 31 వరకు నిరసన కార్యక్రమాలు సకల జనుల సమ్మెను మరింత తీవ్రతరం చేయడానికి ఏపీఎన్జీవోల పిలుపు మేరకు అన్ని ఉద్యోగ సంఘాలు ఈ నెల 19 నుంచి 31 వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. 19 మహా ర్యాలీతో, 20న జాతీయ రహదారుల దిగ్బంధం, 21న నగరంలో భారీ బహిరంగ సభ, 22 నుంచి 31 వరకు అన్ని శాఖల ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులతో కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహారదీక్షలు, ర్యాలీలు నిర్వహించనున్నారు.