నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్: జిల్లాలోని రెండు కేంద్రాల్లో మంగళవారం ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ఎట్టకేలకు కొనసాగించారు. పాలిటెక్నిక్ కళాశాల సిబ్బం ది కౌన్సెలింగ్ విధులకు దూరంగా ఉండడంతో మధ్యాహ్నం వరకు అయోమయ పరిస్థితి నెలకొంది. కొత్త సిబ్బం ది కంప్యూటర్లను ఆన్‌చేసినా కోడ్ తెలియక పోవడంతో ఆన్‌లైన్ వ్యవస్థ ఓపెన్ కావడంలేదని చేతులెత్తేశారు.
ఏజేసీ పెంచలరెడ్డి దర్గామిట్టలోని కౌన్సెలింగ్ కేంద్రాన్ని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఉదయం 8గంటలకు కౌన్సెలింగ్ కేం ద్రాలకు హాజరైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు మధ్యాహ్నం వరకు సమాధానం చెప్పేవారే లేకపోవడంతో చెట్లకింద పడిగాపులు కాశారు. ఒక దశలో ఆగ్రహావేశాలకు గురై ప్రిన్సిపల్ గది ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిబ్బంది, తల్లిదండ్రుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. నాల్గవ నగర పోలీస్‌స్టేషన్ ఎస్ ఐ మల్లికార్జున తల్లిదండ్రులకు సర్దిజెప్పి శాంతింపజేశారు. పాలిటెక్నిక్ ఆల్ లెక్చరర్స్ అసోసియేషన్ సభ్యులు సమ్మెలో ఉండడంతో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అధికారులు అనేక అవస్థలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కౌన్సెలింగ్ బాధ్యతను విధి గా నిర్వర్తించాల్సిన దర్గామిట్టలోని కళాశాల ప్రిన్సిపల్ చేతులెత్తేయడంతో జిల్లా ఉన్నతాధికారులకు దిక్కుతోచక తలలు పట్టుకున్నారు. సెట్నల్ సీఈఓ సుధాకర్‌రెడ్డి రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. డీఆర్‌డీఏ పీడీ వెంకటసుబ్బయ్య సహకారంతో ఆశాఖ సిబ్బందిని కౌన్సెలింగ్ విధులకు నియమించారు. డీఆర్‌డీఏ సిబ్బంది కౌన్సెలింగ్ ప్రక్రియను అవలీలగా పూర్తి చేశారు. మహిళా పాలిటెక్నిక్ కేంద్రంలో 94 మందికి, బాలుర పాలిటెక్నిక్ కేంద్రంలో 185 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు.
అడకత్తెరలో పోకచెక్కలా
ప్రిన్సిపాళ్ల పరిస్థితి
కౌన్సెలింగ్ ప్రక్రియలో ఇదివరకే శిక్షణ పొందిన పాలిటెక్నిక్ సిబ్బంది మినహాయించి కాంట్రాక్టు ఉద్యోగులతో కౌన్సెలింగ్ నిర్వహించకూడదని ఎంసె ట్ కన్వీనర్ నుంచి పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఫ్యాక్స్ సమాచారం అందింది. శిక్షణ పొందని పాలిటెక్నిక్ సిబ్బందితో కూడా కౌన్సెలింగ్ చేపట్టకూడదని, అలాచేస్తే సంబంధిత ప్రిన్సిపాళ్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. శిక్షణ పొందిన సిబ్బంది సమ్మెలో ఉండడంతో ప్రిన్సిపాళ్లకు ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ కౌన్సెలింగ్ నిర్వహించాల్సిందేనని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఎటూ నిర్ణయం తీసుకోలేకపోయారు. దర్గామిట్టలోని మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ ఏ నిర్ణయం తీసుకోలేక గదికే పరిమితమవడంతో సెట్నల్ సీఈఓ దగ్గరుండి కౌన్సెలింగ్ ప్రక్రియ జరిపించారు.
కొనసాగిన కౌన్సెలింగ్
Published Wed, Aug 21 2013 2:56 AM | Last Updated on Mon, Sep 17 2018 7:38 PM
Advertisement
Advertisement