‘ఎన్‌బీఏ’ గుర్తింపే లక్ష్యం  | Increasing quality standards in government polytechnic colleges | Sakshi
Sakshi News home page

‘ఎన్‌బీఏ’ గుర్తింపే లక్ష్యం 

Published Mon, Oct 16 2023 4:54 AM | Last Updated on Mon, Oct 16 2023 9:43 AM

Increasing quality standards in government polytechnic colleges - Sakshi

శ్రీకాకుళంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ విద్యను ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కరిక్యులమ్‌లో మార్పులు చేయడంతో పాటు మొట్టమొదటిసారి సాంకేతిక విద్యా, శిక్షణ మండలి ద్వారా పాఠ్యపుస్తకాలను అందుబాటులోకి తెచ్చింది. ఇండస్ట్రీ కనెక్ట్‌ పేరుతో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ విద్యార్థులకు బోధన సమయంలోనే లభించేలా చర్యలు తీసుకుంది.

కోర్సు పూర్తయ్యేలోగా విద్యార్థులకు మెరుగైన కొలువులు లభించేలా సంస్కరణలు తెచ్చిది. అలాగే రాష్ట్రంలో మొత్తం 87 ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలుండగా.. తొలి దశలో 41 కాలేజీలకు నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ అక్రెడిటేషన్‌(ఎన్‌బీఏ) గుర్తింపు లభించేలా ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే తొమ్మిది కాలేజీల్లోని 16 ప్రోగ్రామ్‌లకు ఎన్‌బీఏ గుర్తింపు లభించింది.

మిగిలిన 32 కాలేజీలు కూడా ఈ విద్యా సంవత్సరం చివరి నాటికి ఎన్‌బీఏ గుర్తింపు పొందేందుకు సిద్ధమయ్యాయి. వీటిలోని 5 కాలేజీల్లో అన్ని రకాల తనిఖీలు పూర్తవ్వగా.. ఈనెల చివరి వారంలో మరో 5 కాలేజీల్లో ఎన్‌బీఏ బృందాల సందర్శనకు షెడ్యూల్‌ ఖరారైంది. రెండో దశలో భాగంగా వచ్చే విద్యా సంవత్సరంలో మరో 43 కాలేజీలకు ఎన్‌బీఏ గుర్తింపు లభించేలా సాంకేతిక విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. వృత్తి విద్యా రంగంలో నాణ్యత, కొలువులు సాధించే సామర్థ్యాలను నిర్ధారించే అంతర్జాతీయ ప్రమాణాల అక్రెడిటింగ్‌ ఏజెన్సీగా భారతదేశంలో ఎన్‌బీఏ వ్యవహరిస్తోంది.

విద్యార్థుల సంఖ్య, అధ్యాపకుల నిష్పత్తి, పీహెచ్‌డీ స్థాయి అర్హతలు, ఆర్థిక వనరుల వినియోగం, ఐపీఆర్‌–పేటెంట్లు, స్వీయ మూల్యాంకనం, జవాబుదారీతనం, నిపుణుల తయారీ తదితర అంశాలను ఎన్‌బీఏ పరిశీలిస్తుంది. వీటన్నింటి ఆధారంగా పాలిటెక్నిక్‌ కాలేజీలకు గుర్తింపునిస్తుంది. కాగా, ప్రభుత్వం ఇటీవల కొత్తగా 3 పాలిటెక్నిక్‌ కాలేజీలను ప్రారంభించింది. వీటికి మూడేళ్ల తర్వాతే ఎన్‌బీఏ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకునే అర్హత లభిస్తుంది.  

ప్రభుత్వ కృషితో పెరిగిన ప్లేస్‌మెంట్స్‌ 
మరోవైపు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల విద్యార్థులకు బోధన సమయంలోనే ఉపాధి లభించేలా వివిధ పరిశ్రమలతో సాంకేతిక విద్యా శాఖ 674 అవగాహన ఒప్పందాలు చేసుకుంది. దీంతో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల సంఖ్య భారీగా పెరిగింది. 2022–23 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 7,073 మంది విద్యార్థులు చదువు పూర్తి చేసు­కోగా.. వారిలో 4 వేల మందికిపైగా విద్యార్థులు కొలు­వులు సాధించారు. గతంలో పది శాతానికే పరిమితమైన ప్లేస్‌మెంట్స్‌.. ఇప్పుడు 59.6 శాతానికి పెరిగాయి. 

కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు 
గతంలో ఎన్‌బీఏ గుర్తింపు సాధించడంలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలు వెనుకబడ్డాయి. ఈ విషయాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌బీఏకు అనుగుణంగా కాలేజీల్లో ప్రమాణాలు పెంచాలని సాంకేతిక విద్యా శాఖను ఆదేశించింది. ఈ నేపథ్యంలో తీసుకువచ్చిన సంస్కరణల ఫలితంగా శ్రీకాకుళం, విజయవాడ, కుప్పం, అనకాపల్లి,  గన్నవరం, కళ్యాణదుర్గం, ఆమదాలవలస, కాకినాడ, గుంటూరు పాలిటెక్నిక్‌ కాలేజీలకు ఎన్‌బీఏ గుర్తింపు దక్కింది.

ఆయా కాలేజీల్లో పరిసరాల పరిశుభ్రత మొదలు భవనాల మరమ్మతులు, కొత్త నిర్మాణాలు, ప్రయోగశాలల ఆధునికీకరణ, విద్యార్థులకు వసతుల మెరుగు, సిబ్బంది రేషనలైజేషన్‌ తదితర మార్పులు తీసుకువచ్చాం. తద్వారా ప్రభుత్వ పాలిటెక్నిక్‌లకు ఎన్‌బీఏ గుర్తింపు లభించేలా చర్యలు తీసుకున్నాం.  
– చదలవాడ నాగరాణి, కమిషనర్, సాంకేతిక విద్యా శాఖ   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement