విశాఖ విద్య: పదో తరగతి ఉత్తీర్ణత తర్వాత ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి మార్గం వేసే పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల వైపు విద్యార్థులు మొగ్గుచూపుతున్నారు. పదో తరగతి తర్వాత మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు అభ్యసిస్తే చాలు మంచి ఉద్యోగావకాశాలు తలుపు తడుతున్నాయి. అంతేకాకుండా డిప్లొమా పూర్తి చేశాక ఏపీ ఈసెట్ రాసి నేరుగా బీటెక్ సెకండియర్‌లో చేరే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ కోర్సులు చదివేవారికి సత్వర ఉపాధి, ఉద్యోగావకాశాలు దక్కేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
2023–24 విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 34 వేల మందికి పైగా విద్యార్థులు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రాష్ట్రంలో 84 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 17 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు యాజమాన్యాల ఆధ్వర్యంలో 250కి పైగా కాలేజీలు ఉన్నాయి. పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్–2023లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా ఇటీవలే పూర్తయింది.
విద్యార్థులు కళాశాలల్లో చేరికకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కోరుకున్న కాలేజీలో నచ్చిన బ్రాంచ్ ఎంచుకునేలా సాంకేతిక విద్యాశాఖాధికారులు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 26 జిల్లాల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఈ నెల 12 నుంచి సదస్సులు నిర్వహిస్తున్నారు. వీటిని ఈ నెల 24 వరకు నిర్వహించాలని నిర్ణయించారు.
పాలిటెక్నిక్‌తో దండిగా అవకాశాలు
రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చొరవతో రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు తరలివస్తున్నాయి. పారిశ్రామికీకరణతో భవిష్యత్తులో సాంకేతిక కోర్సులు చేసిన వారికి దండిగా ఉపాధి, ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. మూడేళ్లలోనే చేతికొచ్చే డిప్లొమా సర్టిఫికెట్‌తో ఉపాధి లేదా ఉద్యోగం పొందే వీలు ఉండటం.. అలాగే ఏపీ ఈసెట్ రాసి నేరుగా బీటెక్‌లో సెకండియర్‌లో చేరే అవకాశం ఉండటంతో విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సులపై ఆసక్తి కనబరుస్తున్నారు.
ప్రభుత్వ కాలేజీల బలోపేతం దిశగా..
పాలిటెక్నిక్ కోర్సులకు డిమాండ్ పెరగడంతో అధికారులు ప్రభుత్వ కాలేజీల్లో నూరు శాతం సీట్లు భర్తీ అయ్యేలా దృష్టి సారించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అర్హులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ సకాలంలో ఇస్తుండటంతో గతంలో మూత పడిన కాలేజీలను సైతం ప్రైవేట్ యాజమాన్యాలు మళ్లీ తిరిగి ప్రారంభిస్తున్నాయి. అయితే ఇలాంటి ప్రమాణాలు లేని కళాశాలల్లో విద్యార్థులు చేరకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
అవగాహన సదస్సుల్లో భాగంగా కాలేజీల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ కాలేజీల్లో ఉన్న మౌలిక సౌకర్యాలు, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ వంటి అంశాలపై వివరిస్తున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో చదివి.. ఉన్నత స్థానాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులను సైతం సదస్సులకు ఆహ్వానించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.
ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన వసతులు..
ఉన్నత విద్య, ఉద్యోగాల పరంగా మంచి అవకాశాలు ఉండటంతో విద్యార్థులు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో మెరుగైన వసతులున్నాయి. క్యాంపస్ ప్లేస్‌మెంట్ల ద్వారా ఉద్యోగాలు కల్పించేలా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. అవగాహన సదస్సుల ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి.
– డాక్టర్ ఎన్.చంద్రశేఖర్, అధ్యక్షుడు, ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ పాలిటెక్నిక్ టీచర్స్ అసోసియేషన్, విశాఖపట్నం
Comments
Please login to add a commentAdd a comment