తూర్పు దిక్కున సమైక్య సూరీడు భగ్గుమన్నాడు. విభజనాగ్ని సెగలు విరజిమ్ముతూనే ఉన్నారు. ఎన్ని అడ్డంకులెదురైనా, పోలీసులు ఉక్కు పాదం మోపినా ఉద్యమకారులలో మొక్కవోని దీక్ష.అణచివేత యత్నాలను తిప్పికొట్టి నగరంలోనూ, జిల్లావ్యాప్తంగా సింహాలై గర్జిస్తున్న సమైక్యవాదుల మడమతిప్పని వైఖరి పాలకులకు ముచ్చెమటలు పట్టిస్తోంది.
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర కోరుతూ సమ్మెను ఈ నెల 31 వరకూ తీవ్రస్థాయిలో ఎలా నిర్వహించాలో కార్యాచరణ సిద్ధమైంది. ఇది సకల జనోద్యమం. అప్రతిహతమైన ఈ ఉద్యమం ఉప్పెనై పాలకులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉద్యమాన్ని అణచివేసేందుకు ఎలాంటి ఆటంకాలు ఎదురైన అకుంఠిత దీక్షతో ముందుకుసాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో జనావేశం ఏదో అ ద్భుతాన్ని సృష్టించేలా ఉంది. విశాఖ ప్రజల సమైక్య నినాదం ప్రతిధ్వనిస్తుంటే .. మరోవైపు ఉద్యోగ సంఘాలు పాలనను స్తంభింపచేస్తున్నాయి.
ఒక వైపు ఉద్యమాన్ని అణగదొక్కేందుకు ప్రభుత్వం రోజుకో జీవో జారీ చేస్తూ హెచ్చరికలు జారీ చేస్తోంది. మరో పక్క ఉద్యోగసంఘాలు రోజుకో నిరసన కార్యక్రమంతో కార్యాచరణ సిద్ధం చేశాయి. జిల్లాలో గత 19 రోజులుగా అలుపెరగని పోరాటాన్ని సాగిస్తున్న సంఘాలన్నీ సోమవారం నుంచి ఏకతాటిపైకి వచ్చి సకల జనుల సమ్మెను మరింత ఉరకలెత్తించాలని నిర్ణయించాయి. ఏపీఎన్జీవోల పిలుపు మేరకు ఈ నెల 19 నుంచి 31 వరకు తీవ్ర స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమయ్యాయి.
ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ అడ్డగింపు
విశాఖ కంచరపాలెం, నర్సీపట్నంలలోని పాలిటెక్నికల్ కళాశాలల్లో సోమవారం నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేసినా ప్రభుత్వం వెనక్కు తగ్గకపోవడంతో ఈ కౌన్సెలింగ్‌ను అడ్డుకునేందుకు ఉద్యోగ సంఘాలు సన్నద్ధమయ్యాయి. సకల జనుల సమ్మె కారణంగా బస్సులు లేకపోవడంతో దూర ప్రాంతాల నుంచి విద్యార్థులు కౌన్సెలింగ్‌కు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కౌన్సెలింగ్ నిర్వహించాల్సిన టెక్నికల్, నాన్‌టెక్నికల్ ఉద్యోగులు కూడా సమ్మెలో ఉన్నారు.
దీంతో కౌన్సెలింగ్ నిర్వహించే వారు కూడా ఉండే అవకాశం లేదు. ఉన్నతాధికారులు మినహా ఉద్యోగులు, సిబ్బంది లేకుండా కౌన్సెలింగ్ నిర్వహణ సాధ్యమయ్యే పనికాదని వాయిదా వేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కౌన్సెలింగ్‌ను అడ్డుకునేందుకు ఉదయం 7 గంటల నుంచే పాలిటెక్నిక్ కళాశాల వద్ద భారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. అనంతరం ఉదయం 10 గంటలకు అక్కడ నుంచి ఎన్‌ఏడీ కొత్త రోడ్డు వరకు ఉద్యోగులందరూ మహా ర్యాలీ చేయనున్నారు.
స్తంభించనున్న రవాణా
సకల జనుల సమ్మెలో ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొనడంతో గత ఆరు రోజుల నుంచి బస్సు సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాలకు వెళ్లాలంటే ప్రైవేటు ఆపరేటర్లను ఆశ్రయిస్తున్నారు. ఎన్జీవో నేతలు ఆదివారం జిల్లా కలెక్టరేట్‌లో ఉన్న ఏపీఎన్‌జీవో హోమ్‌లో ఆయా యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు.
ఇందులో ప్రైవేటు సర్వీసుల యజమానులు 30 మంది పాల్గొన్నారు. హైదరాబాద్‌తో పాటు అన్ని బస్సు సర్వీసులను నిలిపివేసి ఉద్యమానికి మద్దతు తెలపాలని జేఏసీ చైర్మన్ ఈశ్వరరావు వారిని కోరారు. అందుకు వారు సానుకూలంగా స్పందించారు.
31 వరకు నిరసన కార్యక్రమాలు
సకల జనుల సమ్మెను మరింత తీవ్రతరం చేయడానికి ఏపీఎన్‌జీవోల పిలుపు మేరకు అన్ని ఉద్యోగ సంఘాలు ఈ నెల 19 నుంచి 31 వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. 19 మహా ర్యాలీతో, 20న జాతీయ రహదారుల దిగ్బంధం, 21న నగరంలో భారీ బహిరంగ సభ, 22 నుంచి 31 వరకు అన్ని శాఖల ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులతో కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహారదీక్షలు, ర్యాలీలు నిర్వహించనున్నారు.
విభజనాగ్ని
Published Mon, Aug 19 2013 1:51 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM
Advertisement
Advertisement