ఉద్యమానికి...కొత్త ఊపిరి
ఉద్యమానికి...కొత్త ఊపిరి
Published Tue, Aug 20 2013 12:10 AM | Last Updated on Tue, Oct 2 2018 6:48 PM
వైఎస్ విజయమ్మ సమర దీక్షతో సమైక్యాంధ్ర ఉద్యమానికి కొత్త ఊపిరి వచ్చింది. మూడు ప్రాంతాలకూ సమన్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని విభజించవద్దంటూ గుంటూరులో ఆమరణదీక్ష చేపట్టేందుకు గన్నవరం వచ్చిన ఆమెకు పార్టీ శ్రేణులు, సమైక్యవాదులు ఘన స్వాగతం పలికారు. విజయమ్మకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలే దీక్షలకు సిద్ధమవుతున్నారు. మరోపక్క జిల్లా అంతటా నిరసనలు హోరెత్తాయి.
సాక్షి, విజయవాడ : గుంటూరులో వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆమరణదీక్షకు మద్దతుగా జిల్లాలో సోమవారం రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. పెడన నియోజకవర్గ సమన్వయకర్త వాకా వాసుదేవరావు ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద దీక్షలు చేపట్టారు. కైకలూరు నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కైకలూరు, కలిదిండి మండలాల్లో రిలే దీక్షలు ప్రారంభించారు. నందిగామలో గాంధీబొమ్మ సెంటర్‌లో, విస్సన్నపేటలో మహిళలు దీక్షలు చేపట్టారు. మంగళవారం నుంచి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో దీక్షలు చేపట్టేందుకు నాయకులు సన్నద్ధమవుతున్నారు.
జ్యుడీషియల్ ఉద్యోగుల సమ్మె..
మచిలీపట్నంలో జ్యుడీషియల్ ఉద్యోగులు సమ్మె చేశారు. ఈ నెల 21 నుంచి సమ్మె చేయాలని ఉపాధ్యాయ సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. సమైక్యాంధ్ర కోరుతూ జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు మండలాల్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను పట్టణంలోని దీక్షా శిబిరం వద్దకు మద్దతు తెలిపారు. జగ్గయ్యపేటలో ఆర్టీసీ ఉద్యోగులు డిపో వద్ద నుంచి బస్టాండ్ వరకు యూనిఫాం ధరించి ర్యాలీ నిర్వహించారు.
గాంధీ విగ్రహానికి క్షీరాభిషేకం..
సమైక్యాంధ్రకు మద్దతుగా వత్సవాయిలో హమాలీ కూలీలు ర్యాలీ నిర్వహించి గాంధీ పార్కు సెంటర్‌లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. రాష్ట్రాన్ని విడదీసే శక్తుల్ని అడ్డుకుంటామని నినదించారు. అంగన్‌వాడీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి తహశీల్దార్ కార్యాలయంలోని నోటీస్ బోర్డుకు వినతిపత్రాన్ని అంటించారు. కైకలూరు వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద ఆ పార్టీ కార్యకర్తలు చేపట్టిన రిలే దీక్షలు 12వ రోజుకు చేరాయి. మండవల్లిలో దీక్షలు తొమ్మిదో రోజూ కొనసాగాయి. కలిదిండి మండలం కొండంగి గ్రామస్తులు 1500 మంది మండల కేంద్రానికి వచ్చి రోడ్డుపై వంటావార్పు చేసి నిరసన తెలిపారు. సింగరాయపాలెంలోనూ వంటవార్పు నిర్వహించారు. కైకలూరు తాలూకా సెంటర్‌లో ఎన్జీవోల ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షల్లో మండవల్లి పీహెచ్‌సీ సిబ్బంది పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నంలో ఆటో రిక్షా కార్మికులు బంద్ ప్రకటించి, ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. దీంతో విజయవాడ, మైలవరం, నందిగామ, స్థానిక రూరల్ గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెడ్డిగూడెంలో ఉపాధ్యాయులు నిరసన ప్రద ర్శన చేశారు.
గుడివాడలో హోరెత్తిన నిరసనలు..
గుడివాడ పట్టణంలో వేలాదిమంది విద్యార్థులు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు సమైక్యతకు మద్దతుగా ఈ ర్యాలీ జరిపాయి. పట్టణంలో లారీ యజమానులు ర్యాలీ నిర్వహించారు. నెహ్రూచౌక్ సెంటర్‌లో జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థుల మహాధర్నా జరిగింది. పంచాయతీరాజ్ ఉద్యోగులు ర్యాలీ జరిపి, రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. ఆర్టీసీ కార్మికులు మోకాళ్లపై అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.
న్యాయవాదుల రిలే దీక్షలు..
నూజివీడులో న్యాయవాదులు రిలేదీక్షలు చేపట్టారు. కూరగాయ దుకాణాల అసోసియేషన్ ఆధ్వర్యంలో కూరగాయల దుకాణాల బంద్ నిర్వహించారు. టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. ఆర్టీసీ కార్మికులు వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫొటోగ్రాఫర్‌ల సంఘం, తాపీ వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీలు జరిపారు. ఆర్టీసీ కార్మికులు బస్టాండు సెంటర్లో మానవహారం నిర్వహించారు. అంగన్‌వాడీ వర్కర్లు ర్యాలీ చేశారు.
విజయవాడలో భారీ ప్రదర్శన..
ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు, పంచాయతీరాజ్, విద్యార్థి సంఘ జేఏసీ నేతలతో విజయవాడ పాత బస్టాండ్ నుంచి ఏలూరురోడ్డు, మ్యూజియం రోడ్డు మీదుగా ఐవీ ప్యాలెస్ వరకు ర్యాలీ జరిగింది. మేళతాళాలు, చెవుల్లో పూలు పెట్టుకుని బైక్ ర్యాలీ విన్నూతంగా నిర్వహించారు. ర్యాలీ జరుగుతున్నప్పుడు ఏలూరురోడ్డు మొత్తం జనసందోహంతో నిండిపోయింది. రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆటో యూనియన్లతో విజయవాడలోని బందరురోడ్డు, ఏలూరురోడ్డులలో జరిగిన ర్యాలీ ఆకట్టుకుంది. ఎంసెట్ కౌన్సెలింగ్‌కూ సమైక్యాంధ్ర సెగ తగిలింది. సమైక్యాంధ్రవాదులు అడ్డుకోవడంతో పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సెలింగ్ ఆగిపోగా, ఎస్‌ఆర్‌ఆర్, లయోలా కళాశాలలో ఆలస్యంగా ప్రారంభమై నామమాత్రంగా ముగిసింది.
Advertisement
Advertisement