విజయవాడ, న్యూస్‌లైన్ : ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ సమైక్య ఉద్యమం ప్రభావం కనిపించింది. విజయవాడలోని మూడు సెంటర్లలో అధికారులు కౌన్సెలింగ్ నిర్వహిం చారు. ఈ మూడు కేంద్రాల వద్ద సమైక్యవాదులు కౌన్సెలింగ్‌ను అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మూడు గంటలపాటు కౌన్సెలింగ్ నిలిచిపోయింది. ఇప్పటికే రెండునెలల ఆలస్యంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారని, ఇప్పుడు అడ్డుకుంటే ఎలాగని సమైక్యవాదులతో విద్యార్థుల తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. తమ పిల్లల భవిష్యత్ ఏమిటని ఆందోళనకారులను ప్రశ్నించారు. హైదరాబాద్ తెలంగాణకు వెళ్లిపోతే ఇంజినీరింగ్ విద్యార్థులకు భవిష్యత్తు అంధకారమవుతుందన్న ఆందోళనతోనే తాము ఉద్యమం చేస్తున్నామని, తల్లిదండ్రులు సహకరించాలని సమైక్యవాదులు కోరారు.
పాలిటెక్నిక్ కళాశాలలో నిలిచిన కౌన్సెలింగ్
ప్రభుత్వ పాలిటెక్నిక కళాశాలలో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు సిబ్బంది హాజరుకాలేదు. సిబ్బంది మొత్తం ఉద్యమంలో పాల్గొనడంతో ఒకటి నుంచి 5 వేల ర్యాంక్ వరకూ జరగాల్సిన కౌన్సెలింగ్ నిలిచిపోయింది. ఈ కేంద్రానికి హాజరుకావాల్సిన విద్యార్థులను లయోలా కళాశాల, ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల్లో జరిగే కౌన్సెలింగ్ సెంటర్లకు తరలించారు.
ఆంధ్రా లయోలా కళాశాలలో
లయోలా కాలేజీలో ఉదయం 9.30గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభమయ్యింది. ఏపీఎన్జీవోస్ జేఏసీ నాయకులు వచ్చి కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. పోలీసులు అక్కడికి వచ్చి సమైక్యవాదులను వారించారు. 5001నుంచి 10 వేల ర్యాంక్ వరకు కౌన్సెలింగ్ నిర్వహించగా, 285 మంది సర్టిఫికెట్లు పరిశీలించారు.
ఎస్‌ఆర్‌ఆర్‌కళాశాలలో....
ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలలో కౌన్సెలింగ్ ప్రారంభమైన సమయంలో సమైక్యవాదులు అడ్డుకున్నారు. విద్యార్థి జేఏసీ నాయకుడు దేవినేని అవినాష్ విద్యార్థి నాయకులతో కళాశాలకు వచ్చి ఉద్యమానికి మద్దతుగా కౌన్సెలింగ్ నిలిపివేయాల్సిందిగా నిర్వాహకులను కోరారు. దీంతో కొద్దిసేపు కౌన్సెలింగ్ నిలిచిపోయింది. అనంతరం నిర్వాహకులు ఉన్నతాధికారులతో సంప్రదించి కొనసాగించారు. 278 మంది విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. రెండో రోజూ కౌన్సెలింగ్‌ను అడ్డుకుంటామని సమైక్య వాదులు ప్రకటించారు.