ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను ఈనెల 24న విడుదల చేసేందుకు ఉన్నత విద్యా మండలి, ప్రవేశాల కమిటీ కసరత్తు చేస్తోంది. గత నెల 3, 4, 6, 8, 9 తేదీల్లో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను ఈనెల 9న విడుదల చేసింది. ఎంసెట్‌కు మొత్తంగా 2,17,199 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఇంజనీరింగ్ ఎంసెట్ రాసేందుకు 1,42,210 మంది దరఖాస్తు చేసుకోగా, 1,31,209 మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 1,08,213 మంది (82.47 శాతం) అర్హత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ ఎంసెట్ రాసేందుకు 74,989 మంది దరఖాస్తు చేసుకోగా, 68,550 మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 63,758 మంది (93.01 శాతం) అర్హత సాధించారు. ప్రస్తుతం వాటిల్లో అర్హత సాధించిన విద్యార్థులంతా ప్రవేశాల కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేశాయి.
ఈ సారి 90 వేల వరకు ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఇంజనీరింగ్ ఫీజుల వ్యవహారం ఇంకా తేలకపోవడం, యాజమాన్యాలు కోర్టులో కేసు వేయడంతో ప్రవేశాల కమిటీ కౌన్సెలింగ్ షెడ్యూలు విషయంలో ఇప్పటివరకు తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇంకా ఆలస్యం అయితే ఇబ్బందులు తలెత్తుతాయన్న ఉద్దేశంతో ఈనెల 24న ప్రవేశాల నోటిఫికేషన్ జారీ చేసి, కౌన్సెలింగ్ నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. ఆ తర్వాత వారం రోజుల సమయంలో వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ప్రారంభించి, సీట్లు కేటాయింపు చేపట్టాలని ఆలోచిస్తోంది. మరోవైపు బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాల కోసం (లేటరల్ ఎంట్రీ) డిప్లొమా పూర్తయిన విద్యార్థులకు నిర్వహించిన ఈసెట్ ప్రవేశాలకు కూడా ఈనెల 22న నోటిఫికేషన్ జారీ చేయాలని ఉన్నత విద్యా మండలి ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగానే ఈనెల 20న ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి, ఆ రెండింటి ప్రవేశాలకు సంబంధించిన పూర్తి స్థాయి షెడ్యూలు జారీ చేయాలన్న నిర్ణయానికి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment