Telangana Higher Education Council
-
మే 9 నుంచి టీఎస్ఈఏపీసెట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్ఈఏపీసెట్)ను మే 9 నుంచి 12వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు సెట్ కన్వీనర్ డాక్టర్ దీన్‌కుమార్ వెల్లడించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 21వ తేదీన విడుదల చేస్తున్నామన్నారు. ఈసారి ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ సిలబస్‌ను వందశాతం అమలు చేస్తామని చెప్పారు. పరీక్ష ఆన్లైన్ విధానంలో ఉంటుందన్నారు. పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశపరీక్ష (టీఎస్‌పీజీ సెట్)ను జూన్ 6 నుంచి 9వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు పీజీ సెట్ కన్వీనర్ డాక్టర్ అరుణకుమారి తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి నేతృత్వంలో మంగళవారం సెట్స్ తేదీలు వెల్లడించారు. మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్కే మహ్మమూద్, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్, జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
TS: ఇంజనీరింగ్ కాలేజీల సీట్ల దందాపై ఉన్నత విద్యామండలి దృష్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల సీట్ల దందాకు చెక్ పెట్టేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు మొదలుపెట్టింది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న టాపర్స్ జాబితాపై దృష్టి పెట్టనుంది. జేఈఈ ద్వారా జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు పొంది, జోసా కౌన్సెలింగ్ ద్వారా వాటిల్లో చేరిన వారి వివరాలు సేకరించాలని యోచిస్తోంది. ఇదే విద్యార్థులు రాష్ట్ర ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా సీట్లు పొంది, చివరలో రద్దు చేసుకోవడం వెనుక కథేంటో తేల్చాలని నిర్ణయించింది. ప్రైవేటు కాలేజీలతో కుమ్మక్కయినట్లు బయటపడితే కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. దీనిపై ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన మండలి త్వరలో ఇందుకు సంబంధించిన విధివిధానాలకు రూపకల్పన చేయనుంది. ర్యాంకర్లకు కాలేజీల వల్ల జేఈఈ, ఎంసెట్‌లో టాప్ ర్యాంకులు సాధించిన రాష్ట్ర విద్యా ర్థులు అటు ఎన్ఐటీ, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజనీరింగ్ కాలేజీల్లో జరిగే కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్నారు. ముందుగా రాష్ట్ర ఎంసెట్ కౌన్సెలింగ్ మొదలవుతుంది. దీంతో డిమాండ్ ఎక్కువగా ఉన్న కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐఎంఎల్, డేటాసైన్స్ వంటి కోర్సుల్లో తొలి విడత కౌన్సెలింగ్‌లోనే సీట్లు పొందుతున్నారు. సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేస్తున్నారు. ఆ తర్వాత వీరికి జోసా కౌన్సెలింగ్‌లోనూ సీట్లు వస్తున్నాయి. వాటిల్లోనూ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తున్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా పొందిన సీటును రద్దు చేసుకోకుండా ఎంసెట్ కౌన్సెలింగ్ అన్ని దశలు అయిపోయే వరకు అలాగే ఉంచి చివర్లో రద్దు చేసుకుంటున్నారు. ఈ సీట్లను ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు స్పాట్ అడ్మిషన్ ద్వారా భర్తీ చేస్తున్నాయి. ఈ క్రమంలో ముందే ఎక్కువ డబ్బులకు మాట్లాడుకున్న వారికి కాలేజీలు సీట్లు కేటాయిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో టాప్ ర్యాంకర్లకు కూడా ముందే వల వేసి ఒప్పందం చేసుకుంటున్నారని, ఈ మేరకు కొంత మొత్తం ముట్టజెబు తున్నారని విద్యార్థి, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో రూ.కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయని, ఉన్నతాధికారులకు సైతం ఇందులో వాటాలు ఉంటున్నాయని ఆరోపిస్తున్నాయి. ప్రైవేటు కాలేజీల దందాపై ప్రతి ఏటా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఈ తంతుపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా నివేదికలు ఇస్తున్నాయి. దీంతో ఈ అడ్డగోలు వ్యాపారానికి చెక్ పెట్టాలనే నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం.. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఏం చేయబోతున్నారు..? తొలిదశలోనే సీటు సాధించి చివరి కౌన్సెలింగ్ వరకూ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరని వారి వివరాలు సేకరిస్తారు. జాతీయ సంస్థలతో సమన్వయం చేసుకుని, జోసా కౌన్సెలింగ్‌లో వారికి సీటు ఎప్పుడొచ్చింది? ఎప్పుడు రిపోర్టు చేశారు? అనే వివరాలు సేకరిస్తారు. ఇదంతా విద్యార్థుల ఆధార్ నంబర్ ఆధారంగా చేయాలని భావిస్తు న్నారు. విద్యార్థులకు ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల ద్వారా లబ్ధి చేకూరిందా అనేది నిగ్గు తేల్చేందుకు వారి బ్యాంకు ఖాతాలతో పాటు తల్లిదండ్రులు, బంధువుల బ్యాంకు ఖాతాలను కూడా చెక్ చేసే వీలుందని ఓ అధికారి తెలిపారు. ప్రాథమిక ఆధారాలు లభిస్తే తక్షణమే జాతీయ సంస్థలతో మాట్లాడి ఆ విద్యార్థి ఎక్కడ సీటు పొందినా బ్లాక్ చేయాలనే ఆలోచనలో అధికారులున్నారు. ఈ క్రమంలో కాలేజీలు, విద్యార్థులపై కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడ బోమని అధికారులు అంటున్నారు. కాలేజీల సీట్ల వ్యాపారంలో పావులు కావొద్దంటూ విద్యార్థులను హెచ్చరించేలా ప్రచారం సైతం చేసేందుకు మండలి సిద్ధమవుతోంది. -
విద్యార్థుల మెరుగైన కెరీర్ కోసం ‘ఇంటర్సెల్’తో తెలంగాణ ఒప్పందం
సాక్షి, హైదారాబాద్: విద్యార్థులకు మెరుగైన కేరీర్ ఎదుగుదల అవకాశాలను సృష్టించడానికి తెలంగాణ రాష్ట్ర కళాశాల విద్య, సాంకేతిక విద్యాశాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఆ దిశగా గణనీయమైన పురోగతి సాధిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే.. ఆన్లైన్ మెంటారింగ్ కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ, ఎస్ఏఏఎస్ ఆధారిత ప్లాట్ ఫామ్ అయిన ‘ఇంటర్సెల్’తో కలిసి పనిచేయనుంది. ఈ మేరకు ఉపాధి కల్పనకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషనరేట్ ఆఫ్ కాలేజియెట్ ఎడ్యుకేషన్(సీసీఈటీఎస్)తో ఇంటర్సెల్ ఎంవోయూ కుదుర్చుకుంది. ► విద్యార్థులు ఇంటర్సెల్ ప్లాట్‌ఫామ్‌పై తమ సంబంధిత రంగాల్లోని నిపుణుల నుంచి గైడెన్స్, కెరీర్ కౌన్సిలింగ్ పొందుతారు. ► రాష్ట్రంలోని గుర్తింపు పొందిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో మెంటారింగ్ సిస్టమ్ అమలుకు అవసరమైన సహాయాన్ని, మద్దతును సీసీఈటీఎస్ అందిస్తుంది. ► ఇంటర్సెల్ వర్చువల్ మెంటార్ నెట్వర్క్ విద్యార్థులు, యువ వృత్తినిపుణులు ప్రపంచవ్యాప్తంగా మెంటార్లతో కనెక్ట్ కావడానికి ఒక నిర్మాణాత్మక వేదికను అందిస్తుంది. ► ఈ ఎంవోయూ మూడు సంవత్సరాల కాలానికి చెల్లుబాటు అవుతుంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ కాలేజియోట్ ఎడ్యుకేషన్, సాంకేతిక విద్య కమిషనర్, ఐఏఎస్ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ.. ‘విద్యార్థులకు ఉపాధి కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక కెరీర్ అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికింది. ఇంటర్సెల్తో ఈ భాగస్వామ్యం మన రాష్ట్ర విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తును నిర్మించాలన్న మా లక్ష్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఉపయోగపడుతుంది’ అని చెప్పారు. ఇంటర్సెల్ వ్యవస్థాపకుడు, సీఈవో అరుణభ్ వర్మ మాట్లాడుతూ.. ‘తెలంగాణ రాష్ట్ర కళాశాల విద్య, తెలంగాణ విద్యాశాఖ, తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం. తెలంగాణలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు తమ కెరీర్ పురోభివృద్ధికి తోడ్పడటానికి మేం ఎదురు చూస్తున్నాం. మా ప్లాట్‌ఫామ్‌తో, విద్యార్థులు విభిన్న రంగాల్లోని అత్యుత్తమ కెరీర్ మెంటార్లను యూక్సెస్ చేసుకుంటారు. వారు కెరీర్ విజయానికి మార్గనిర్దేశం చేయడానికి అందుబాటులో ఉంటారు.’ అని చెప్పారు. ఇంటర్ సెల్ అంటే ఏమిటి? ఇంటర్సెల్ అనేది ప్రపంచంలోని మొట్టమొదటి ఏఐ, ఎస్ఏఏఎస్ ఆధారిత ఆన్లైన్ మెంటారింగ్ ప్లాట్‌ఫామ్. 30కిపైగా దేశాలకు చెందిన మెంటార్లు, 250కిపైగా కెరీర్ స్పైషలైజేషన్లతో ఇంటర్సెల్ విద్యార్థులు, యువ వృత్తి నిపుణులకు లైవ్ వన్ టూ వన్ మెంటారింగ్ సెషన్లను అందిస్తుంది. ఇంటర్సెల్ వద్ద మెంటార్లు అత్యంత గౌరవనీయమైన పరిశ్రమ నిపుణులు. వీరు విభిన్న రంగాలు, పరిశ్రమల్లో 5వేలకు పైగా బ్రాండ్లలో అపారమైన అనుభవాన్ని కలిగి ఉంటారు. ఇదీ చదవండి: Telangana: ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు.. ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీల్లో మార్పులు! -
ఉన్నత విద్యామండలి కృషి భేష్
సాక్షి, హైదరాబాద్: బ్రిటిష్ కౌన్సిల్ దక్షిణ భారత విభాగంతో కలిసి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన బోధన ప్రణాళికను రూపొందించే ప్రయత్నంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి అనూహ్య పురోగతి సాధిస్తోందని బ్రిటిష్ కౌన్సిల్ సౌత్ ఇండియా డైరెక్టర్ జనక పుష్పనాథన్∙ప్రశంసించారు. ఉన్నత విద్యలో లోతైన విషయ పరిజ్ఞానం, ప్రపంచ స్థాయి నైపుణ్యాలు అందించి, ఉపాధి అవకాశాలు పెంచేలా డిగ్రీ పాఠ్య ప్రణాళికను రూపొందించాలని ఉన్నత విద్యా మండలి భావించింది. ఈ ప్రక్రియలో భాగంగా 2018లో బ్రిటిష్ కౌన్సిల్, టీఎస్ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. ఆ తర్వాత యూకేకి చెందిన బంగోర్, అబ్యరిస్విత్ యూనివర్సిటీలు– తెలంగాణలోని ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల మధ్య 2020 మార్చిలో విద్యా ప్రాజెక్టుల రూపకల్పనపై ఎంవోయు జరిగింది. దీని పురోగతిపై మంగళవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ చైర్మన్ వెంకటరమణ, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్, కాకతీయ వర్సిటీ వీసీ టి.రమేశ్ నేతృత్వంలో సమావేశం జరిగింది. బ్రిటిష్ కౌన్సిల్ దక్షిణాది డైరెక్టర్ జనక పుష్పనాథన్, ఉన్నత విద్య డైరెక్టర్ సోను ఈ సమావేశంలో పాల్గొన్నారు. భాగస్వామ్య విశ్వవిద్యాలయాల సహకారంతో జూన్ 2023 నాటికి ఆశించిన కొత్త విద్యా ప్రణాళికను రూపొందించాలని సమావేశంలో నిర్ణయించారు. -
నైపుణ్యానిదే భవిష్యత్తు.. సాధారణ చదువులతో ఉపాధి అంతంత మాత్రమే
సాక్షి, హైదరాబాద్: నైపుణ్యంతో కూడిన విద్య అభ్యసిస్తేనే భవిష్యత్తు ఉంటుందని, ఎలాగో డిగ్రీ పూర్తి చేశామనుకుంటే చాలదని స్పష్టమవుతోంది. ఏదో ఒక అంశంలో నైపుణ్యం కలిగిన వారు కూడా ఎప్పటికప్పుడు నైపుణ్యాన్ని పెంచుకుంటూ సాంకేతిక, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా కొత్త నైపుణ్యాన్ని అవరుచుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ విధంగా పాఠ్య ప్రణాళికలు రూపొందించేందుకు అన్ని స్థాయిల్లోనూ కసరత్తు జరుగుతోంది. డిగ్రీ స్థాయి నుంచి మొదలయ్యే ఈ ప్రక్రియ వృత్తి విద్య కోర్సుల్లోనూ కొనసాగుతోంది. ఏటా కుప్పలు తెప్పలుగా.. ఏటా కుప్పలు తెప్పలుగా డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ విద్యార్థులు కోర్సులు పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారు. సంప్రదాయ డిగ్రీ కోర్సులు చేసిన వారు ఉద్యోగాల వేటలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వేలు, లక్షలు ఖర్చు పెట్టి ఇంజనీరింగ్ చేసిన వారికి కూడా ఉపాధి ఆమడ దూరంలోనే ఉంటోంది. ఏదో ఒక డిగ్రీలో ఉత్తీర్ణులవుతున్న విద్యార్థుల్లో దాదాపుగా సగం మందికి ఉపాధి లభించక పోవడం విస్మయం కలిగించే అంశమే అయినా వాస్తవం. 2020–21 అఖిల భారత సాంకేతిక విద్యా మండలి లెక్కల ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా 1,34,763 మంది గ్రాడ్యుయేట్, పోస్టు–గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరారు. ఇదే సంవత్సరంలో 85 వేల వరకు విద్యార్థులు తమ కోర్సులు పూర్తి చేశారు. అయితే ఉద్యోగాలు పొందిన వారి సంఖ్య 46,539 మాత్రమే. అకడమిక్ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతున్నా, నైపుణ్యం ఆశించిన మేర లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్) ఇటీవల ఓ అధ్యయనంలో తేల్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాంకేతిక మండళ్లు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో నైపుణ్యంతో కూడిన ఉన్నత విద్యను అందించడం ఇప్పుడు అనివార్యమైంది. ఇంజనీరింగ్ విద్యకు అదనపు సాంకేతికత ఈ ఏడాది ఇంజనీరింగ్ విద్యకు మరింత సాంకేతికత జోడిస్తున్నారు. నాస్కామ్తో కలిసి ఇటీవల జేఎన్టీయూహెచ్ ఓ అవగాహన ఒప్పందం చేసుకుంది. రాబోయే కాలంలో ఏ తరహా సాంకేతికత పరిశ్రమలకు అవసరమో గుర్తించారు. దాన్ని ఇంజనీరింగ్ స్థాయి నుంచే విద్యార్థులకు బోధించడం ఇందులో ప్రత్యేకత. జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక సంస్థలు ఇందులో భాగస్వామ్యమవుతాయి. ఆ కంపెనీలే అవసరమైన సాఫ్ట్వేర్ లాంగ్వేజీని ఇంజనీరింగ్ విద్యార్థులకు అందిస్తాయి. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, డేటాసైన్స్ కోర్సుల్లో అంతర్జాతీయ మార్పులను ఎప్పటికప్పుడు ఈ సంస్థలు విద్యార్థుల ముందుకు తెస్తాయి. మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ కోర్సులు సైతం ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానమవ్వాల్సిన అవసరం ఏర్పడింది. ఉదాహరణకు ఓ వాహనం డిజైన్‌లో ముందుగా ఉపయోగించేది సాఫ్ట్వేర్. దాని సామర్థ్య పరీక్షలన్నీ కంప్యూటర్‌పైనే రూపొందిస్తారు. అదే విధంగా సివిల్‌లో నిర్మాణ రంగం మొత్తం సాఫ్ట్‌వేర్‌పైనే ఆధారపడింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కంప్యూటర్ భాషతో కూడిన ప్రత్యేక ప్యాకేజీలు నాస్కామ్ విద్యార్థులకు అందిస్తుంది. అంతిమంగా ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు తమను తాము మలుచుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ప్రణాళికల్లో మార్పులు సంప్రదాయ డిగ్రీ కోర్సులను మరింత మెరుగ్గా అందించేందుకు రాష్ట్ర ఉన్నత విద్య మండలి ఇటీవల ఓ ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది ప్రయోగాత్మకంగా బీఏ హానర్స్ కోర్సులను ప్రవేశపెట్టింది. తరగతి విద్య తక్కువ, క్షేత్రస్థాయిలో, ప్రాజెక్టు వర్క్ ఎక్కువగా ఉండేలా పాఠ్య ప్రణాళికను రూపొందిస్తోంది. దేశవిదేశాల్లోని ఆర్థిక విధానాలను ఆర్థికశాస్త్ర అధ్యయనంలో జోడిస్తున్నారు. విధానపరమైన నిర్ణయాలను రూపొందించే శక్తి సామర్థ్యాలు పెంపొందించేలా కోర్సుల్లో మార్పులు ఉండబోతున్నాయని అధికారులు తెలిపారు. మరోవైపు డిగ్రీ కోర్సుల్లోనూ సాంకేతిక విద్యకు పెద్ద పీట వేస్తున్నారు. బీఎస్సీ డేటా సైన్స్‌ను కంప్యూటర్ ఇంజనీరింగ్‌తో సత్సమానంగా తీర్చిదిద్దేలా పాఠ్యాంశాలు రూపొందించారు. బీకాం విద్యార్థి కేవలం సబ్జెక్టుకే పరిమితం కాకుండా విద్యార్థి దశలోనే పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం సాధించేందుకు అవసరమైన బోధన మెళకువలను ప్రవేశ పెడుతున్నారు. బీఏ కోర్సులు చేసినా సాఫ్ట్వేర్ వైపు మళ్ళేందుకు వీలుగా కొన్ని రకాల సాఫ్ట్వేర్ కోర్సులను అందుబాటులోకి తెస్తున్నారు. ఇది గొప్ప మార్పు స్కిల్ డెవలప్మెంట్తో కూడిన విద్య నేటి తరానికి అవసరం. ఈ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. డిగ్రీ విద్యార్థిని కూడా ఉపాధి వేటలో ఏమాత్రం తీసిపోని విధంగా తయారు చేయాలన్నది లక్ష్యం. ఇంజనీరింగ్ విద్యార్థి కూడా మరింత నాణ్యమైన విద్యను సొంతం చేసుకునేలా ఆలోచనలు చేస్తున్నాం. తద్వారా వీరు భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాన్ని సొంతం చేసుకునే వీలుంది. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, చైర్మన్, ఉన్నత విద్యామండలి -
తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, వరంగల్: తెలంగాణ ఐసెట్ ఫలితాలను తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి విడుదల చేశారు. వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో గురువారం ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 56,962 మంది అభ్యర్థులు పరీక్షలు రాయగా 51,316 మంది అర్హత సాధించారు. ఉత్తీర్ణత 90.09 శాతం నమోదైంది. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి చదవండి: రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్.. హస్తినలో మూడు రోజులపాటు ర్యాంకులు ఇలా.. హైదరాబాద్‌కు చెందిన లోకేశ్ మొదటి ర్యాంక్ సాధించాడు. రెండో ర్యాంక్ హైదరాబాద్ విద్యార్థి పమిడి సాయి తనూజ, మల్కాజిగిరికి చెందిన నవీన్ కృష్ణన్ మూడవ ర్యాంక్, హైదరాబాద్ నుంచి ఆర్.నవీనశాంత, తుమ్మ రాజశేఖర నాల్గో ర్యాంక్ సాధించి సత్తా చాటారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ పరీక్ష ఫలితాలు వెలువడిన వెంటనే ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం షెడ్యూల్ విడుదల చేస్తామని ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. -
ప్రముఖులతో పాఠాలు
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ విద్యార్థులకు తరగతి గదుల్లో పాఠ్యపుస్తకాల చదువులను తగ్గించి, సామాజిక అవగాహన మేళవించి సరికొత్త బోధనను అందుబాటులోకి తేనున్నారు. రాజకీయ ప్రముఖులు, ఆర్థికవేత్తలు, మాజీ ఐఏఎస్‌లు, ఇతర మేధావులతో పాఠాలు చెప్పించబోతున్నారు. ఈ దిశగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి బీఏ ఆనర్స్ కోర్సులను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెస్తోంది. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ మంగళవారం హైదరాబాద్ కోఠి ఉమెన్స్ కాలేజీలో ఈ కొత్త కోర్సును లాంఛనంగా ప్రారంభించారు. ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కోఠి ఉమెన్స్ కాలేజీలో బీఏ ఆనర్స్ (పొలిటికల్), నిజామ్ కాలేజీలో బీఏ ఆనర్స్ (ఎకనామిక్స్)ను అమలు చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే మొదలుపెట్టనున్న ఈ కోర్సులో ఒక్కో కాలేజీలో 60 సీట్లు ఉంటాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న దోస్త్ మూడో దశ కౌన్సెలింగ్‌లో వీటిని చేరుస్తారు. రెండు కాలేజీల్లో లభించే ఆదరణను బట్టి రాష్ట్రవ్యాప్తంగా కోర్సును విస్తరించే వీలుందని మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. ప్రస్తుతానికి మూడేళ్ల కాలపరిమితితోనే కోర్సు ఉంటుందని, మున్ముందు నాలుగేళ్లకు పెంచుతామని అధికారులు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవీ, ఉన్నత విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ రవీందర్, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకట రమణ పాల్గొన్నారు. కోర్సు లక్ష్యం ఇదీ.. ఉమ్మడి రాష్ట్రంలో కొన్నేళ్ల క్రితం బీఏ ఆనర్స్ కోర్సును సమర్థవంతంగా నిర్వహించారు. అప్పట్లో ఈ కోర్సు చేసిన వారికి ఇంటర్మీడియెట్ బోధించే అర్హత కూడా ఉండేది. సైన్స్ కోర్సుల ప్రాధాన్యం పెరగడంతో ఆనర్స్ తెరమరుగైంది. సంప్రదాయ బీఏ కోర్సుల్లో చేరే వారి సంఖ్య 16 శాతానికి పరిమితమైంది. మరోవైపు ఇతర రాష్ట్రాల్లో బీఏ చదివే వారి సంఖ్య పెరుగుతోంది. అదీగాక ఈ కోర్సు కోసం ఇక్కడి నుంచి విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణలోనూ అందుబాటులోకి తెస్తున్నారు. సామాజిక అవగాహన పెంచడమే దీని ముఖ్య ఉద్దేశమని ఉన్నత విద్యామండలి తెలిపింది. పాఠ్యపుస్తకాల్లో అంశాలకు 50 శాతం మార్కులిస్తే, సామాజిక అవగాహనకు మరో 50 మార్కులు ఇస్తారు. ఆనర్స్ కోర్సును వ్యాపారం కాకుండా, ప్రభుత్వ కాలేజీల్లో నిర్వహిస్తే బాగుంటుందని వినోద్‌కుమార్ సలహా ఇచ్చారు. సమాజాన్ని అర్థం చేసుకోకపోతే అది చదువే కాదని, దీన్ని గుర్తించే ఆనర్స్ తెస్తున్నట్టు తెలిపారు. -
తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా లింబాద్రి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇన్చార్జి చైర్మన్‌గా ప్రొఫెసర్ లింబాద్రి నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. చైర్మన్‌గా ఉన్న పాపిరెడ్డి పదవీ కాలం ముగియడంతో వైఎస్ చైర్మన్‌గా ఉన్న లింబాద్రికి ఈ బాధ్యతలు అప్పగించారు. ఉత్తర్వులు వెలువడిన అనంతరం ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా ప్రొఫెసర్ లింబాద్రి బాధ్యతలు స్వీకరించారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఆయన చైర్మన్ పదవిలో కొనసాగుతారని సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చదవండి: ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలి.. సీఎం కేసీఆర్ చదవండి: ఎక్స్‌ప్రెస్ రైలు ఆలస్యం.. ప్రయాణికులకు గుడ్‌న్యూస్ -
అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పీహెచ్డీ ఉండాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలకు అర్హతగా పీహెచ్‌డీని తప్పనిసరి చేశారు. గతంలో నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) లేదా స్టేట్ లెవల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (స్లెట్) ఉంటే సరిపోయేది. కానీ ఈసారి ఆ రెండూ ఉన్నా పీహెచ్డీ తప్పనిసరి చేసినట్లు ఉన్నత విద్యా మండలి వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది జూన్ నుంచి ఈ కొత్త నిబంధనను యూజీసీ అమల్లోకి తెచ్చిందని అధికారులు చెబుతున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పీహెచ్డీ ఉండాలి. ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు వెళ్లాలంటే పీహెచ్‌డీతో పాటు, 8 ఏళ్ల టీచింగ్ అనుభవం, నిర్ణీత మేగజీన్లలో ఆర్టికల్స్ ముద్రితమై ఉండాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి ప్రొఫెసర్ పోస్టుకు వెళ్లాలంటే 10 ఏళ్ల అనుభవం సహా మేగజీన్లలో ఆర్టికల్స్ ముద్రితమై మంచి స్కోర్ సాధించి ఉండాలి. అసోసియేట్ ప్రొఫెసర్ నుంచి ప్రొఫెసర్‌గా వెళ్లాలంటే మూడేళ్ల అనుభవంతో పాటు పైన పేర్కొన్న విధంగా అర్హతలు ఉండాలి. రాష్ట్రంలోని 11 విశ్వవిద్యాలయాల్లో భర్తీ చేయబోయే 1,195 పోస్టులను యూజీసీ మార్గదర్శకాల ప్రకారమే భర్తీ చేస్తామని ఉన్నత విద్యామండలి చెబుతోంది. అసిస్టెంట్ పోస్టుల భర్తీలో నెట్, స్లెట్ ఉన్నవారికి 10 మార్కులు వెయిటేజీ ఇస్తామని అధికారులు పేర్కొంటున్నారు. 6 వేల మంది ఎదురుచూపులు రాష్ట్రంలో 11 యూనివర్సిటీల్లో భర్తీ చేయబోయే అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ సహా ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియను ఉన్నత విద్యా మండలి ప్రారంభించింది. ఏకీకృత రాత పరీక్ష, ఇంటర్వూ్య ప్రకారం పోస్టులను భర్తీ చేయా లని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. అయితే ఈ నిర్ణయం యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీయడమే అవుతుందని కొన్ని విద్యార్థి, ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. అన్ని యూనివర్సిటీల హక్కులను కాలరాసి కేంద్రీకృత పద్ధతిలో నియామకాలు చేపడితే అక్రమాలు జరగవన్న గ్యారంటీ ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాగా, రాష్ట్రంలో పీహెచ్డీ చేసి పోస్టుల కోసం ఎదురుచూసేవారు దాదాపు 6 వేల మంది ఉంటారని ఉన్నత విద్యామండలి అంచనా వేసింది. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే వారు దాదాపు 1,300 మంది ఉంటారని తెలుస్తోంది. మొత్తం పోస్టుల్లో దాదాపు సగం మేర ఆ కాంట్రాక్టు ఉద్యోగులే దక్కించుకునే అవకాశముంది. ఎందుకంటే వీరికి వెయిటేజీ ఉంటుంది. ఏకీకృత పరీక్ష పేరుతో కాలయాపన చేయకుండా నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి డిమాండ్ చేశారు. యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని ప్రభుత్వం కాల రాస్తోందని మండిపడ్డారు. -
Exams: అన్నీ ‘సెట్’ చేశారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే నెల 5 నుంచి నిర్వహించా ల్సిన ఎంసెట్‌ను ప్రభుత్వం వాయిదా వేసింది. కరోనా నేపథ్యంలో ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలను ప్రభుత్వం ఇటీవల వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో విద్యా ర్థులు ఎంసెట్‌కు ప్రిపేర్ అయ్యేందుకు సరిపడా సమయం ఇవ్వాలనే యోచనతో ఎంసెట్ పరీక్షను వాయిదా వేసింది. ముందస్తు షెడ్యూలు ప్రకారం జూలై 5 నుంచి 9 వరకు ఎంసెట్ ఆన్లైన్ పరీక్షలను నిర్వహించాల్సి ఉండగా, వాటిని ఆగస్టులో నిర్వహించాలని తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు ఆగస్టు 4, 5, 6 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంసెట్, 9, 10 తేదీల్లో అగ్రికల్చర్ ఎం సెట్‌ను నిర్వహించ నున్నారు. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన సోమ వారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎంసె ట్‌తోపాటు పీజీఈ సెట్, ఈసెట్ తేదీలను మార్పు చేశారు. పదో తరగతి పూర్తయిన విద్యా ర్థులు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో, బాసరలోని ట్రిపుల్ఐటీ (ఆర్జీ యూకేటీ)లో ఇంటిగ్రేటెడ్ బీటెక్‌లో ప్రవేశాల కోసం పాలీసెట్–2021ను వచ్చే నెల 17న నిర్వహించాలని నిర్ణయించారు. దానికి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునే గడువు ఈనెల 25తో ముగియనుంది. కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ పరీక్షలను నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశిం చారు. అనంతరం ఉమ్మడి ప్రవేశపరీక్ష (సెట్స్)ల తాజా షెడ్యూలును విడుదల చేశారు. జూలైలో ఫైనలియర్ పరీక్షలు పూర్తి చేయండి డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ ఫైనలియర్ పరీ క్షలను జూలై మొదటి వారంలో ప్రారంభించి, నెలాఖరులోగా పూర్తి చేయాలని యూనివర్సిటీల అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. విదేశాల్లో, ఇతర ప్రాంతాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారి సౌలభ్యం కోసం ఫైనల్ ఇయర్ పరీక్షలను త్వరగా నిర్వహించాలని సీఎం ఆదేశించినట్లు సబితా చెప్పారు. అందుకనుగుణంగానే ఫైనల్ ఇయర్ విద్యార్థుల బ్యాక్లాగ్ సబ్జెక్టుల పరీక్షలను కూడా జూలై నెలాఖరులోగా నిర్వహించాలని స్పష్టం చేశారు. దీంతో డిగ్రీ వార్షిక పరీక్షలతో ముడిపడిన ఐసెట్, లాసెట్, ఎడ్‌సెట్ పరీక్షలను ముందుగా నిర్ణయించిన తేదీల్లోనే (ఆగస్టులో) నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
ఆగస్టులో ఎంసెట్!
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ పరీక్షలు ఆగస్టు మొదటి వారంలో నిర్వహించాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వాస్తవానికి జూలై 5 నుంచి 9 వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహించాలని తేదీలు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. కానీ కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలను మరికొంత కాలం వాయిదా వేయాలని భావించారు. తీవ్రత తగ్గిన తర్వాత పరీక్షలు నిర్వహించే అంశంపై చర్చించి ఆగస్టు మొదటి వారంలో నిర్వహించాలని నిర్ణయానికి వచ్చినట్లు సమా చారం. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిన తర్వాత తేదీలు ప్రకటించే అవకాశం ఉంది. అలాగే ఈసెట్, పీజీఈసెట్ పరీక్షల తేదీలు కూడా మారే అవకాశముందని తెలుస్తోంది. -
కరోనా ఎఫెక్ట్: తెలంగాణలో పరీక్షలన్నీ వాయిదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర అన్ని కోర్సుల సెమిస్టర్ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. ప్రస్తుతం విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలల్లో బీఏ, బీకాం, బీఎస్సీ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎం.ఫార్మసీ, ఎంటెక్ తదితర కోర్సులకు వార్షిక పరీక్షలు జరుగుతున్నాయి. విద్యా సంస్థల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం విద్యాసంస్థలన్నింటినీ బుధవారం నుంచి తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయూ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీల పరిధిలోని కళాశాలల్లో కొనసాగుతున్న సెమిస్టర్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని మంగళవారం ఆయా విశ్వవిద్యాలయాలు ప్రకటించాయి. దీంతో ప్రభుత్వం ఈ విషయంపై సీరియస్ అయింది. విద్యాసంస్థలనే మూసివేసినప్పుడు పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తూ.. వాటిని కూడా వాయిదా వేసేలా విశ్వవిద్యాలయాలకు ఆదేశాలివ్వాలని ఉన్నత విద్యా మండలిని ఆదేశించింది. దీంతో అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలోని సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి ప్రకటించారు. ఆన్లైన్ తరగతులకు ఓకే.. మరోవైపు పరీక్షలను వాయిదా వేయాలని, ఆన్లైన్ తరగతులను మాత్రమే కొనసాగించాలని వర్సిటీల రిజిస్ట్రార్లకు కళాశాల, సాంకేతిక విద్యాశాఖ ఇన్చార్జి కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ లేఖ రాశారు. ప్రస్తుతం అన్ని కోర్సుల పరీక్షలను వాయిదా వేస్తున్నామని, పరీక్షల నిర్వహణ తేదీలను తర్వాత ప్రకటిస్తామని ఆయా యూనివర్సిటీలు వెల్లడించాయి. -
తెలంగాణలో ‘సెట్స్’ తేదీలు ఖరారు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఉన్నత విద్యామండలి సోమవారం ఉమ్మడి ప్రవేశ పరీక్ష తేదీలను ఖరారు చేసింది. రాష్ట్రంలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యాకోర్సుల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణకు కరసత్తు పూర్తయింది. ఈ నెల 31న ఈసెట్, సెప్టెంబర్ 2న పాలిసెట్ నిర్వహించనుంది. అలాగే సెప్టెంబర్ 9,10,11,14 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింతగ్ పరీక్షలను నిర్వహించనుంది. కోర్టు అనుమతితో ఈ తేదీలను ఉన్నత విద్యామండలి అధికారికంగా ప్రకటించనుంది. అలాగే అగ్రికల్చర్ ఎంసెట్ సహా లాసెట్, పీజీఈసెట్, ఎడ్‌సెట్, ఐసెట్, పీఈసెట్ తదితర సెట్స్ తేదీలను పరీక్షల నిర్వహణలో సాంకేతిక సహకారం అందించే టీసీఎస్ స్లాట్స్‌ను బట్టి తేదీలను ఖరారు చేయాలని నిర్ణయించింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో 2020–21 విద్యా సంవత్సరంలో అకడమిక్ వ్యవహారాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకుంది. అయితే తాము తీసుకున్న నిర్ణయాలను హైకోర్టుకు తెలియజేసి, కోర్టు ఆమోదంతో అమల్లోకి తేవాలని నిర్ణయించింది. ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామ్‌చంద్రన్, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలు, ఫైనల్ సెమిస్టర్ పరీక్షలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెలాఖరు లేదా సెప్టెంబర్‌లో పరీక్షల నిర్వహణకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోందని ప్రభుత్వం ఈ సందర్భంగా న్యాయస్థానంకు తెలిపింది. ఇక ఫైనల్ సెమిస్టర్ పరీక్షలపై సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. -
తెలంగాణ పీజీ ఈసెట్ షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఎంటెక్, ఎంఫార్మా ప్రవేశాల కోసం నిర్వహించే పీజీ ఈసెట్ షెడ్యూల్ విడుదలయింది. ఈ మేరకు మార్చి 3న పీజీ ఈసెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యా మండలి అధికారులు తెలిపారు. అప్లికేషన్‌ను ఆన్లైన్లోనే దరఖాస్తూ చేసుకోవాల్సిందిగా అధికారులు పేర్కొన్నారు. షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి. పీజీ ఈసెట్ నోటిఫికేషన్ జారీ : మార్చి 3, 2020 ఆన్లైన్లో అప్లికేషన్ ప్రారంభ తేది : మార్చి 12.2020 అప్లికేషన్ గడువుకు చివరి తేది : ఏప్రిల్ 30, 2020 ఆలస్య రుసుముతో దరఖాస్తుల స్వీకరణ గడువు : మే 26,2020 హాల్ టికెట్ల డౌన్లోడ్ : మే 20 నుంచి 27 మే వరకు పరీక్ష తేదీలు : మే 28 నుంచి 31మే వరకు పరీక్షా ఫలితాలు : జూన్ 15, 2020 -
బీఎస్సీ డేటా సైన్స్.. బీకాం అనలిటిక్స్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో కొత్త కోర్సులు రాబోతున్నాయి. బీఎస్సీ డేటా సైన్స్, బీకాం అనలిటిక్స్ వంటి కోర్సులను ప్రవేశపెట్టేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు ప్రారంభిం చింది. ఇందులో భాగంగా విధి విధానాలను ఖరారు చేసేందుకు అధికారులు, పారిశ్రామిక వర్గాలతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. సోమవారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల ను పెంపునకు అవసరమైన కోర్సులను ప్రవేశపెట్టాలని ఏకాభిప్రాయానికి వచ్చా రు. వచ్చే వారం రోజుల్లో మళ్లీ సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. 2020–21 విద్యా సంవత్సరం నుంచే కొత్త కోర్సులను అమల్లోకి తేనున్నారు. డిగ్రీలో ఇకపై మ్యాథ్స్, స్టాటిస్టిక్స్‌తోపాటు డేటా సైన్స్‌ను చదువుకోవచ్చు. బీకాంలో బిజినెస్ అనలిటిక్స్‌ను చదువుకునే వీలు కల్పించనుంది. వీటిల్లోనే ఆనర్స్ డిగ్రీలను కూడా ప్రవేశపెట్టాలని భావిస్తోంది. రెగ్యులర్ డిగ్రీల కంటే ఆనర్స్ డిగ్రీల్లో 20 నుంచి 30 క్రెడిట్స్ ఎక్కువగా ఇచ్చి అమలు చేయాలని యోచిస్తోంది. ఇవి కాకుండా కాలేజీలు ముందుకొస్తే బీఎస్సీ మెషీన్ లెర్నింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కోర్సులను ప్రవేశపెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ కోర్సులను ముందుగా సోషల్ వెల్ఫేర్ గురుకులాలు, అటానమస్ కాలేజీలు, ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఆ సబ్జెక్టులను బోధించే ఫ్యాకల్టీకిచ్చే శిక్షణలో పారి శ్రామిక వర్గాలను భాగస్వాములను చేయనుంది. భేటీలో కమిటీ సభ్యులు, ఉన్నత విద్యామండలి వైస్చైర్మన్లు లింబాద్రి, వెంకటరమణ, ఓయూ మాజీ వీసీ రామచంద్రం, ప్రొఫెసర్లు ఫాతిమా బేగం, జయశ్రీ, ఓయూ రిజిస్ట్రార్ గోపాల్‌రెడ్డి, ట్రిపుల్ ఐటీ ప్రొఫెసర్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
సెట్ పరీక్ష షెడ్యూల్లో స్వల్ప మార్పులు
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్, లాసెట్, పీజీ ఈసెట్.. ఈ మూడు సెట్స్ పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసినట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి గురువారం తెలిపారు. మే నెల 5, 6, 7 తేదీల్లో జరగాల్సిన ఎంసెట పరీక్షలు.. మే నెల 4, 7, 8 తేదీల్లో నిర్వహిస్తామని తెలిపారు. అదే విధంగా మే 25 తేదీన జరగాల్సిన లాసెట్ పరీక్షను మే 27 వ తేదిన జరుగుతుందన్నారు. పీజీసెట్ పరీక్ష 27 నుంచి 30 వరకు జరగాల్సి ఉండగా 28 నుంచి 31 వరకు జరుగుతాయని కొత్త షెడ్యూల్లో ఆయన పేర్కొన్నారు. దీంతోపాటు పరీక్ష ఫీజులు ఈ ఏడాది పెంచటం లేదన్నారు. గురువారం నిర్వహించిన కన్వీనర్ సమావేశంలో ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోలేదని పాపిరెడ్డి చెప్పారు. పరీక్షలు సక్రమంగా నిర్వహించడం కోసం కన్వీనర్లకు పలు కీలక సూచనలు ఇచ్చామని ఆయన అన్నారు. ఫేస్ రికగ్నిషన్ సిస్టం గురించి తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీస్( టీఎస్టీఎస్)తో మాట్లాడి అవగాహన చేసుకున్న తర్వాతనే అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రంజాన్ పండుగ ఉండటం వల్ల పరీక్ష తేదీలను మార్చటం జరిగిందని పాపిరెడ్డి వెల్లడించారు. చదవండి: సెట్ కన్వీనర్లు ఖరారు -
పాఠశాల విద్య పరిస్థితి ఏమిటి?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాల విద్యలో ఎన్నో అంతరాలు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, ప్రైవేటు స్కూళ్లు, కార్పొరేట్ విద్యా సంస్థలు, ఇంటర్నేషనల్ స్కూళ్లు, కేంద్రీయ విద్యాలయాల్లో ఒక్కో రకమైన విద్యా విధానం అమలవుతోంది. ఈ నేపథ్యంలో ఆయా పాఠశాలల్లోని స్థితిగతులు, విద్యా విధానం, ప్రమాణాలు, ఆర్థిక పరిస్థితులు, సదుపాయాలు, టీచర్లకు జీతభత్యాలు, విద్యార్థులకు ప్రయో జనాలు తదితర అంశాలపై సమగ్ర అధ్యయనానికి ఉన్నత విద్యామండలి సిద్ధం అవుతోంది. తద్వారా భవిష్యత్తు కార్యాచరణకు అది ఉపయోగపడేలా చూడాలన్న భావనతో ఈ ఆలోచన చేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. దీనికి సంబంధించి త్వరలోనే సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్‌తో (సెస్) ఒప్పందం చేసుకునేందుకు సిద్ధం అవుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నత విద్యారంగం ఎలా ఉందన్న వివరాలు మండలి వద్ద ఉన్నాయి. కానీ పాఠశాల విద్యారంగంపై అధికారిక అధ్యయనాలేవీ లేవన్న ఉద్దేశంతో ఇందుకు సిద్ధం అవుతున్నట్లు వివరించారు. (చదవండి : ఫీజులకు 2,042 కోట్లు) జనవరిలో నెలలో ఒప్పందం.. పాఠశాల విద్యపై సమగ్ర అధ్యయనం కోసం జనవరిలో సెస్‌తో ఎంవోయూ చేసుకోవాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. ఒప్పందం అనంతరం చేసే అధ్యయనంలో సమగ్ర సమాచారం సేకరించనుంది. 2020 ఏప్రిల్ నాటికి ఈ అధ్యయనం పూర్తి చేయాలని యోచిస్తోంది. వీలైతే అధ్యయన నివేదిక ప్రకారం వచ్చే విద్యా సంవత్సరంలో (2020–21)లో ఏమైనా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటే ప్రభుత్వం తీసుకుంటుందనే ఆలోచనతో ఉన్నత విద్యామండలి సర్వే చేయించేందుకు సిద్ధమైంది. ఇందులో ఎక్కువ మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, తల్లిదండ్రులతోపాటు విద్యారంగ నిపుణులు, విద్యావేత్తలు, విద్యాసంస్థల యాజమాన్యాలను సెస్ సంప్రదించనుంది. ఎక్కువ మంది నుంచి అభిప్రాయాలు తీసుకొని సమగ్ర నివేదికను రూపొందించనుంది. ప్రమాణాలు, సామర్థ్యాలపై ప్రత్యేక దృష్టి.. ఈ అధ్యయనంలో పాఠశాల విద్యలో నాణ్యతా ప్రమాణాలు, విద్యార్థుల ఉత్తీర్ణత, వారి సామర్థ్యాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉంటోంది. అందుకు కారణాలు ఏమిటి? ఆయా పాఠశాలల్లోని విద్యార్థుల సామర్థ్యాల్లో తేడా ఎందుకు వస్తోంది? ప్రైవేటు, కార్పొరేట్ విద్యార్థుల ఉత్తీర్ణత కంటే గురుకులాల్లో ఉత్తీర్ణత ఎక్కువగా ఉండటానికి కారణం ఏమిటనే అంశంపై శాస్త్రీయ కోణంలో విశ్లేషణ ఉండేలా చూడాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. ఉత్తీర్ణత, సామర్థ్యాలే కాకుండా క్రీడలు, సాంçస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థుల ప్రావీణ్యం, ఉత్సాహం తదితర అంశాలను కూడా పరిశీలించనున్నారు. ఉత్తీర్ణతలో ప్రధానంగా తక్కువ మంది విద్యార్థులున్న చోట పరిస్థితి ఎలా ఉంది? అదే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నచోట ఎంత మంది ఉత్తీర్ణులు అవుతున్నారనే విషయాన్ని బేరీజు వేయనున్నారు. పాఠశాలల్లో సౌకర్యాలు, చెల్లించే వేతనాలు, వాటి ప్రభావం, విద్యార్థులకు కల్పించే సదుపాయాల ప్రభావం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. వాటిన్నింటి ద్వారా రాష్ట్ర సమగ్ర పాఠశాల విద్యా నివేదికను సిద్ధం చేయించాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. -
1 నుంచి ఎంసెట్ వెబ్ ఆప్షన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం గురువారం నుంచి చేపట్టాల్సిన వెబ్ ఆప్షన్ల ప్రక్రియ వాయిదా పడింది. ఫీజుల వ్యవహారంలో తలెత్తిన గందరగోళం కారణంగా ప్రవేశాల కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను మాత్రం గురువారం నుంచి వచ్చే నెల 3 వరకు యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించింది. జూలై 1వ తేదీ నుంచి 4 వరకు వెబ్ ఆప్షన్లు నిర్వహించేలా రివైజ్డ్ షెడ్యూల్ జారీ చేసింది. ఫీజుల ఖరారులో గందరగోళంతో... రాష్ట్రంలోని ఇంజనీరింగ్ తదితర వృత్తి విద్యా కాలేజీల్లో వచ్చే మూడేళ్లకు వార్షిక ఫీజు ఖరారు చేయాల్సిన టీఏఎఫ్ఆర్సీకి చైర్మన్‌ను నియమించడంలో జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలతో టీఏఎఫ్ఆర్సీ సభ్య కార్యదర్శి ఫీజుల ఖరారు కోసం నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు స్వీకరించారు. కొన్ని కాలేజీలు ఫీజులు ఖరారు చేయాలని కోర్టును ఆశ్రయించడంతో టీఏఎఫ్ఆర్సీ చైర్మన్‌ను నియమించి ఫీజులు ఖరారు చేసే వరకు యాజమాన్యాలు ప్రతిపాదించిన ఫీజును అమలు చేయాలని కోర్టు తీర్పు వెలువరిం చింది. అనంతరం ఆయా ఫీజుల్లో ఏమైనా హెచ్చుతగ్గులు ఉంటే తర్వాత సర్దుబాటు చేసుకోవాలని సూచించింది. కోర్టును ఆశ్రయించిన 81 కాలేజీలు ప్రతిపాదించిన ఫీజును అమలు చేస్తే తల్లిదండ్రులపై భారం పడుతుందని, తర్వాత సర్దుబాటు చేసే అవకాశం ఉన్నా ముం దుగా ఆ భారం భరించాల్సిన పరిస్థితి వస్తుం దని భావించిన విద్యాశాఖ ఆ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లాలని నిర్ణయించింది. టీఏఎఫ్ఆర్సీ చైర్మన్ నియామకం జరిగి ఫీజులు ఖరారు చేసేవరకు పాత ఫీజులను అమలు చేయాలని కోరుతూ అప్పీలుకు వెళ్లనుంది. కాగా, తీర్పు కాపీ బుధవారం రాత్రి అందిందని, దీనిపై గురువారం అప్పీల్‌కు వెళ్తున్నామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గురువారం నుంచి ప్రారంభం కావాల్సిన వెబ్ ఆప్షన్ల ప్రక్రియ వాయిదా వేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. టీఏఎఫ్ఆర్సీ చైర్మన్ నియామకానికి ముగ్గురు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేయాలంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి గురువారం ప్రతిపాదన పంపించనున్నట్టు తెలిపారు. ముగ్గురిలో ఒకరిని ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. యథావిధిగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం బుధవారం వరకు 45,156 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకొని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్లుæ బుక్ చేసుకున్నారు. గురువారం నుంచి వచ్చేనెల 3వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను నిర్వహించనున్నారు. విద్యార్థులు జూలై ఒకటో తేదీ వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవచ్చని ప్రవేశాల కమిటీ కన్వీనర్ నవీన్‌మిట్టల్ తెలిపారు. -
24న ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను ఈనెల 24న విడుదల చేసేందుకు ఉన్నత విద్యా మండలి, ప్రవేశాల కమిటీ కసరత్తు చేస్తోంది. గత నెల 3, 4, 6, 8, 9 తేదీల్లో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను ఈనెల 9న విడుదల చేసింది. ఎంసెట్‌కు మొత్తంగా 2,17,199 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఇంజనీరింగ్ ఎంసెట్ రాసేందుకు 1,42,210 మంది దరఖాస్తు చేసుకోగా, 1,31,209 మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 1,08,213 మంది (82.47 శాతం) అర్హత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ ఎంసెట్ రాసేందుకు 74,989 మంది దరఖాస్తు చేసుకోగా, 68,550 మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 63,758 మంది (93.01 శాతం) అర్హత సాధించారు. ప్రస్తుతం వాటిల్లో అర్హత సాధించిన విద్యార్థులంతా ప్రవేశాల కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేశాయి. ఈ సారి 90 వేల వరకు ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఇంజనీరింగ్ ఫీజుల వ్యవహారం ఇంకా తేలకపోవడం, యాజమాన్యాలు కోర్టులో కేసు వేయడంతో ప్రవేశాల కమిటీ కౌన్సెలింగ్ షెడ్యూలు విషయంలో ఇప్పటివరకు తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇంకా ఆలస్యం అయితే ఇబ్బందులు తలెత్తుతాయన్న ఉద్దేశంతో ఈనెల 24న ప్రవేశాల నోటిఫికేషన్ జారీ చేసి, కౌన్సెలింగ్ నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. ఆ తర్వాత వారం రోజుల సమయంలో వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ప్రారంభించి, సీట్లు కేటాయింపు చేపట్టాలని ఆలోచిస్తోంది. మరోవైపు బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాల కోసం (లేటరల్ ఎంట్రీ) డిప్లొమా పూర్తయిన విద్యార్థులకు నిర్వహించిన ఈసెట్ ప్రవేశాలకు కూడా ఈనెల 22న నోటిఫికేషన్ జారీ చేయాలని ఉన్నత విద్యా మండలి ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగానే ఈనెల 20న ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి, ఆ రెండింటి ప్రవేశాలకు సంబంధించిన పూర్తి స్థాయి షెడ్యూలు జారీ చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. -
రెగ్యులర్ కోర్సులుగా గేమింగ్, యానిమేషన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గేమింగ్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్ డిజైనింగ్, ఫిలిం మేకింగ్ వంటి వివిధ కోర్సులపై ప్రభుత్వం దృష్టి సారించింది. భవిష్యత్తులో వాటికి డిమాండ్ ఉండనున్నందున, వాటిని రెగ్యులర్ కోర్సులుగా మార్పు చేసేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు ప్రారంభించింది. ఇప్పటివరకు అలాంటి కోర్సులను రాష్ట్రంలో వివిధ సంస్థలు నిర్వహిస్తున్నా.. అనేకమంది వాటిని అభ్యసిస్తున్నా.. వ్యాలిడి టీ కలిగిన డిగ్రీలు అందజేసే యంత్రాంగం లేదు. వాటిని వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు కలిగిన, నైపుణ్యాలు అందించే శిక్షణ కోర్సులుగానే నిర్వహిస్తుండటంతో వాటిలో శిక్షణ పొందిన అభ్యర్థులకు గుర్తింపు లభించడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలోని కొన్ని సంస్థలే జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీకి అనుబంధంగా కొన్ని రెగ్యులర్ కోర్సులను నిర్వహిస్తున్నాయి. అనేక సంస్థలు వాటిని రెగ్యులర్ కోర్సులుగా నిర్వహించడం లేదు. వాటిని రెగ్యు లర్ డిగ్రీలు ప్రదానం చేసే కోర్సులుగా మార్పు చేయాల ని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. తద్వారా అవి వ్యాలిడిటీ కలిగిన కోర్సులుగా మారడంతోపాటు ఆయా సంస్థలకూ అనుబంధ గుర్తింపు ఇవ్వడం వల్ల పక్కాగా నిర్వహణ సాధ్యం అవుతుందని భావిస్తోంది. ఇటీవల ఇమేజ్ టవర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వీటిపై మంత్రి కేటీఆర్, ఉన్నత విద్యామండలి అధికారులు చర్చించారు. మార్కెట్లో డిమాండ్ కలిగిన ఆయా కోర్సులను రెగ్యులర్, వ్యాలిడిటీ కలిగిన కోర్సులుగా నిర్వహించాలని కేటీఆర్ సూచించడంతో ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించిన వి«ధివిధానాలపై మండలి అధికారులు సోమవారం సమావేశమై చర్చించారు. మరో రెండుసార్లు సమావేశమై వాటిని ఖరారు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. -
బీఎడ్ ప్రవేశాలు అనుమానమే!
2016 రెండో దశ బీఎడ్ కౌన్సెలింగ్‌కు ససేమిరా అంటున్న అధికారులు 2017లోనూ ఎడ్‌సెట్ కష్టమంటున్న ఉన్నత విద్యాశాఖ వర్గాలు ఎడ్‌సెట్ తేదీ ఖరారు చేసినా, కన్వీనర్‌ను ఎంపిక చేయని ఉన్నత విద్యామండలి సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్)లో ప్రవేశాల కోసం ప్రస్తుత (2016–17) విద్యా సంవత్సరంలో రెండో దశ కౌన్సెలింగ్‌కు ప్రభుత్వం ససేమిరా అంటున్న నేపథ్యంలో 2017–18లో బీఎడ్ ప్రవేశాల విషయంలో అధికారుల్లోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్యా కోర్సులు పూర్తి చేసినా, విద్యాపరంగా నాణ్యత ఉండటం లేదని, ప్రైవేటు బీఎడ్ కాలేజీలు సర్టిఫికెట్లు ఇచ్చే కేంద్రాలుగా తయారయ్యాయనే ఆరోపణలతో వచ్చే విద్యా సంవత్సరంలో బీఎడ్‌లో ప్రవేశాలను ప్రభుత్వం చేపడుతుందా, లేదా, అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. స్వయంగా అసెంబ్లీలోనే బీఎడ్ కాలేజీల తీరుపై సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో 2017–18లో బీఎడ్ ప్రవేశాలపై యాజమాన్యాల్లో ఆందోళన నెలకొంది. ఇటీవల రాష్ట్రంలో వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. వచ్చే మే 28వ తేదీన బీఎడ్‌లో ప్రవేశాల కోసం ఎడ్‌సెట్–2017ను నిర్వహిస్తామని ప్రకటించింది. ఉస్మానియా వర్సిటీ ఆధ్వర్యంలో పరీక్ష జరుగుతుందని పేర్కొంది. కానీ కన్వీనర్ ఎంపిక విషయాన్ని మాత్రం పక్కన పెట్టింది. ప్రభుత్వం నుంచి ఎడ్‌సెట్ కన్వీనర్ నియామకానికి గ్రీన్‌సిగ్నల్ రాకపోవడంతో ప్రకటన చేయలేదు. అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు కన్వీనర్లను ప్రకటించిన మండలి ఎడ్‌సెట్ కన్వీనర్‌ను ప్రకటించలేదు. రాష్ట్రం లో బీఎడ్ కాలేజీల్లోని 13 వేల సీట్లలో ప్రస్తుతం రెండో దశ కౌన్సెలింగ్ లేకపోవడం వల్లే 8 వేలకు పైగా సీట్లు మిగిలిపోయాయి. -
ఏ అధికారంతో స్వాధీనం చేసుకున్నారు?
♦ ఉన్నత విద్యామండలి ఆస్తులపై తెలంగాణకు సుప్రీం ప్రశ్న ♦ సెక్షన్ 75 సేవలకు ఉద్దేశించిందేనని వ్యాఖ్య ♦ తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం సాక్షి, న్యూఢిల్లీ: ఉన్నత విద్యామండలి ఆస్తులను ఏ అధికారంతో స్వాధీనం చేసుకున్నారని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 75 ద్వారా సంక్రమించిన అధికారంతోనే వాటిని స్వాధీనం చేసుకున్నట్టు తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకురాగా.. సంబంధిత సెక్షన్ ఇరు ప్రాంతాలకు సేవలు అందించేందుకు ఉద్దేశించింది మాత్రమే అని వ్యాఖ్యానించింది. మంగళవారం ఏపీ ఉన్నత విద్యామండలి ఖాతాలకు సంబంధించిన కేసును విచారించిన సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుకు సంబంధించి తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. తమ ఖాతాలు తెలంగాణ ఉన్నత విద్యామండలికే చెందుతాయంటూ ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ఉన్నత విద్యామండలి సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం ఈ కేసు జస్టిస్ గోపాలగౌడ, జస్టిస్ అరుణ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం వద్దకు విచారణకు వచ్చింది. జనాభా ప్రాతిపదికన పంచాలి: ఏపీ ఏపీ ఉన్నత విద్యామండలి తరఫున సీనియర్ న్యాయవాది పీపీ రావు, ఏపీ ప్రభుత్వం తరఫున బసవ ప్రభు పాటిల్ వాదనలు విని పిస్తూ.. ప్రాంతీయ స్థాయి ఉన్న సంస్థలే తెలంగాణకు చెందుతాయని, ఏపీ ఉన్నత విద్యామండలి ప్రాంతీయ సంస్థ కాదని కోర్టు దృష్టికి తెచ్చారు. పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 53(4) ప్రకారం ఆస్తులను జనాభా ప్రాతిపదికన పంచాలని న్యాయస్థానాన్ని కోరారు. జనాభా నిష్పత్తిలో పంపిణీకి ప్రతిపాదించగా ఒక దశలో తెలంగాణ అంగీకరించిందని పాటి ల్ కోర్టుకు తెలిపారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఇదే తరహాలో విభజించిన తర్వాత తప్పు జరిగిందంటూ స్వాధీనం చేసుకున్నారని వివరించారు. ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతానికే.. తెలంగాణ తరఫున అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, సీనియర్ న్యాయవాది అంధ్యార్జున వాదనలు వినిపించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఆస్తులను పంచాలని తాము కోరడం లేదని వివరిస్తూ ఇందుకు పద్మావతి విశ్వవిద్యాలయాన్ని ఉదాహరణగా చూపారు. నగదు మినహా ఏ ప్రాంతంలో ఉన్న సంస్థల ఆస్తులు ఆ రాష్ట్రానికే చెందుతాయని పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 75 కింద స్పష్టంగా ఉందని వాదించారు. ఈ సందర్భంలో రాష్ట్రం విడిపోయిన ఏడాది కాలంలో సమస్యలను రెండు రాష్ట్రాలు పరిష్కరించుకోవాల్సి ఉందని, లేనిపక్షంలో కేంద్రం జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని చట్టంలో ఉన్న విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ రంజిత్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. రెండు రాష్ట్రాల సీఎస్‌లను సమావేశపరిచి సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలని కేంద్రం సూచించిందని తెలిపారు. అవిభాజ్య రాష్ట్రం వెలుపల ఆస్తులు ఉంటే జనాభా ప్రాతిపదికన పంచుకోవాల్సి ఉంటుందని వివరించారు. రెండు పక్షాల వాదనలు విన్న అనంతరం ధర్మాసనం అన్ని సంస్థలు తెలంగాణలోనే ఉన్నాయని, అన్నీ తెలంగాణకే చెందుతాయా? అంటూ వ్యాఖ్యానించింది. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు విడిపోయిన తరువాత అక్కడి వారిని అర్ధరాత్రి గెంటేశారని ధర్మాసనం గుర్తుచేసింది. ఏ ప్రాతిపదికన, ఏ అధికారంతో ఉన్నత విద్యామండలిని స్వాధీనం చేసుకున్నారని ధర్మాసనం ప్రశ్నించగా ప్రాంతీయత ఆధారంగానే స్వాధీనం చేసుకున్నామని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాదులు వివరించారు. ఆస్తుల పంపకానికి ఇది సరైన మార్గం కాదేమోనని అభిప్రాయపడిన సుప్రీంకోర్టు ఈ కేసులో తీర్పును రిజర్వ్ చేసింది. -
'యూఎస్‌లో చదువుతోపాటు ఉద్యోగం కష్టమే'
హైదరాబాద్ : అమెరికాలో తెలుగు విద్యార్థులు చదువుతోపాటు ఉద్యోగం చేయడం కష్టమే అని తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి అన్నారు. అమెరికా నుంచి విద్యార్థులను తిరిగి పంపడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్‌లో తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో మండలి డైరీతోపాటు స్టాటిస్టికల్ బుక్‌లెట్‌ను పాపిరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం పాపిరెడ్డి మాట్లాడుతూ... ఉప ముఖ్యమంత్రి ఆమోదంతో తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. యూనివర్సీటీలకు వీసీల ఎంపిక ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందని తెలిపారు. ఈ ఏడాది ఉన్నత విద్యామండలి ముందుకు వెళ్లేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు పాపిరెడ్డి వెల్లడించారు. -
బ్యాంకు ఖాతా వినియోగానికి అనుమతివ్వండి
సుప్రీం కోర్టులో ఏపీ ఉన్నత విద్యామండలి అభ్యర్థన సాక్షి, న్యూఢిల్లీ: ప్రవేశ పరీక్షల రుసుములను జమ చేసే బ్యాంకు ఖాతాలను వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థిస్తూ ఏపీ ఉన్నత విద్యామండలి సుప్రీం కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది. ఫైళ్లు, ఖాతాలు తెలంగాణ ఉన్నత విద్యామండలి అజమాయిషీలో ఉండటం వల్ల తమకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొంది. నాలుగు వారాల్లో బదులివ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఉనికిలో ఉండదన్న హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి మేలో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌లోని విద్యాసంస్థలకు ప్రవేశ పరీక్షలు నిర్వహించుకునే స్వేచ్ఛను కల్పిస్తూ సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అయితే మిగిలిన అంశాలపై విచారణ పెండింగ్‌లో ఉండిపోయింది. ఏపీ తాజా పిటిషన్‌ను జస్టిస్ విక్రమ్‌జిత్ సేన్, జస్టిస్ శివకీర్తిసింగ్‌తో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. వాదనలు విన్న ధర్మాసనం విచారణను నవంబర్ 30కి వాయిదా వేసింది. -
ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు షురూ!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలైంది. శుక్రవారం సాయంత్రం నుంచి విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేలా తెలంగాణ ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది.tseamcet.nic.in ద్వారా వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించిన మొదటి రెండు గంటల్లోనే 10,298 మంది విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకున్నారు. కాలేజీలు, బ్రాంచీల వారీగా, సీట్ల వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. మొత్తంగా రాష్ట్రంలోని 260 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,22,786 సీట్లు ఉండగా, కన్వీనర్ కోటాలో 86,862 సీట్ల (70 శాతం) భర్తీకి ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. ఇందులోప్రభుత్వ కాలేజీల్లో 3,041 సీట్లు ఉండగా, ప్రైవేటు కాలేజీల్లో 83,821 సీట్లు ఉన్నట్లు వెల్లడించింది. ఇక మేనేజ్మెంట్ కోటాలో 35,923 సీట్లు ఉన్నట్లు తెలిపింది. కాలేజీలను మూడు కేటగిరీలుగా విభజించి వెబ్సైట్లో విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. జేఎన్టీయూహెచ్ అనుబంధ గుర్తింపు ఇచ్చిన కాలేజీలకు ఆకు పచ్చ (లైట్ గ్రీన్) రంగు కేటాయించారు. వీటిని ఎలాంటి వివాదం లేని, అనుబంధ గుర్తింపు ఉన్న కాలేజీలుగా పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలతో ఈనెల 20 నుంచి చేపట్టబోయే తనిఖీ నివేదికలకు లోబడి వెబ్ కౌన్సెలింగ్‌లో చేర్చిన కాలేజీలకు నీలి రంగు (లైట్ బ్లూ) కేటాయించారు. తనిఖీల్లో అన్ని ఫ్యాకల్టీ అన్ని సదుపాయాలు ఉన్నట్లు తేలితేనే వాటికి అనుబంధ గుర్తింపు లభిస్తుంది. కోర్టును ఆశ్రయించకుండా త్వరలో చేపట్టే తనిఖీ నివేదికలకు కట్టుబడి ఉంటామని లేఖలు అందజేసిన కాలేజీలకు ఉదారంగు (లైట్ పర్పుల్) కేటాయించారు. వీటిల్లోనూ ఫ్యాకల్టీ సదుపాయాలు ఉన్నట్లు తేలితేనే అనుబంధ గుర్తింపు వస్తుంది. కాబట్టి విద్యార్థులు ఆయా రంగుల్లోని కాలేజీల జాబితాలను పరిశీలించుకున్నాకే కాలేజీలను ఎంచుకొని వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేప్పుడు ఆయా కాలేజీలకు, వాటిలోని కోర్సులకు కూడా పైన పేర్కొన్న రంగులు ఉంటాయని, వాటిని పరిశీలించుకొని నిర్ణయం తీసుకోవాలని ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ వెల్లడించారు. ఏ రోజు ఎంత ర్యాంకు వరకు..? శుక్రవారం నుంచి ఈనెల 19 సాయంత్రం 5 గంటల వరకు ఒకటో ర్యాంకు నుంచి 44 వేల ర్యాంకు వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 19 సాయంత్రం 5 గంటల నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటలకు వరకు 44,001వ ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. అన్ని ర్యాంకుల వారు 22వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు వెబ్ ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చు. మరోవైపు 44 వేల ర్యాంకులోపు వారిలో 32,857 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్న వారు ఉన్నారని, అందులో శుక్రవారం మొదటి రెండు గంటల్లో 10,298 మంది విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకున్నట్లు క్యాంపు అధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు. -
ఉన్నత విద్యామండలిలో ఫైళ్ల విభజన
అంగీకరించిన టీ-సర్కారు దీనిపై రెండు రాష్ట్రాల నుంచి 8 మంది అధికారులతో కమిటీ ఇరు రాష్ట్రాల విద్యా మంత్రుల భేటీలో నిర్ణయం హైదరాబాద్: తెలంగాణ ఉన్నత విద్యా మండలి అధీనంలోని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలికి చెందిన ఫైళ్ల విభజనకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. అయితే ఏపీ ఉన్నత విద్యా మండలికి ప్రస్తుత తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఉన్న భవనంలో చోటు కల్పించే విషయంలో మాత్రం అడ్వొకేట్ జనరల్‌తో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈనెల 12 నుంచి ఏపీకి చెందిన ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో తమ ఫైళ్లు తమకు ఇవ్వడం లేదంటూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం గంటా శ్రీనివాసరావుతో కలసి గవర్నర్‌ను కలసిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి అయిన కడియం శ్రీహరి....నరసింహన్ సూచన మేరకు తన చాంబర్లో గంటా శ్రీనివాసరావుతో భేటీఅయ్యారు. ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల విద్యాశాఖ అధికారులు, ఉన్నత విద్యా మండళ్ల చైర్మన్లు ప్రొఫెసర్ పాపిరెడ్డి, ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలి విభజనకు సంబంధించిన అంశాలపై చర్చించారు. హైకోర్టు తీర్పు, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో కౌన్సెలింగ్ నిర్వహణకు ఫైళ్లు, సిబ్బంది ఏపీ కౌన్సిల్‌కు అవసరం ఉన్నందున ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే ఇందుకు రెండు రాష్ట్రాల నుంచి నలుగురు చొప్పున అధికారులతో కమిటీ వేయాలని ఇరువురు మంత్రులు నిర్ణయించారు. ఆ కమిటీ ఫైళ్లను పరిశీలించి విభజించనుంది. సమావేశం అనంతరం కడియం విలేకరులతో మాట్లాడుతూ ఏపీ విద్యార్థుల ప్రయోజనాలు కాపాడేందుకు, వారికి కౌన్సెలింగ్ సజావుగా జరిగేందుకు ఈ మేరకు అంగీకరించినట్లు తెలిపారు.ఇందుకు ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు. పదో షెడ్యూలులోని మిగితా అంశాలపై తరువాత మరోసారి సమావేశం అవుతామని, అవసరమైతే ముఖ్యమంత్రులు, గవర్నర్ సమావేశమై చర్చిస్తారని గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. మరోవైపు వరంగల్ ఎన్ఐటీలో తమకు సీట్ల విషయమై త్వరలో హైదరాబాద్ రానున్న కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీతో చర్చిస్తామని గంటా పేర్కొనగా ఏపీలో మరో ఎన్ఐటీ కావాలని అడగాలంటూ కడియం చమత్కరించారు. -
ఇకపై సెమిస్టర్ విధానం
డిగ్రీ, పీజీ కోర్సుల్లో భారీ మార్పులు హైదరాబాద్: డిగ్రీ, పీజీ కోర్సుల్లో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్) అమలు చేయాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఇందులో భాగంగా ముందు సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో గురువారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో పలు మార్పులపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్య, తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ వెంకటాచలం, ప్రొఫెసర్ మల్లేశ్, కళాశాల విద్య కమిషనర్ వాణి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీబీసీఎస్ అమలుకు చేపట్టాల్సిన చర్యలు, రాష్ట్రంలో విద్యా సంస్థల్లో వాస్తవ పరిస్థితులు, అధ్యాపకుల కొరతపై జరిగిన చర్చల అనంతరం సీబీసీఎస్‌ను అమలు చేయాలని నిర్ణయానికొచ్చారు. కొత్త కోర్సులు, కొత్త సబ్జెక్టులు లేనట్టే.. ప్రస్తుతం ఉన్న సబ్జెక్టులు, కోర్సుల్లోనే సీబీసీఎస్ వర్తింపచేయాలని, కొత్త కోర్సులు, కొత్త సబ్జెక్టులు ప్రస్తుతానికి పక్కన పెట్టాలని నిర్ణయించారు. కొత్త కోర్సులు, కొత్త సబ్జెక్టులు ప్రవేశ పెడితే కాలేజీల్లోనే కాకుండా యూనివర్సిటీల్లోనూ ఇబ్బందులు తప్పవని భావించారు. అందుకే ప్రస్తుతం డిగ్రీ కోర్సులో సివిల్స్‌కు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేయనున్న నేపథ్యంలో.. ఆ సిలబస్‌లోనే 2015-16 విద్యా సంవత్సరం నుంచే సీబీసీఎస్ విధానం వర్తింపజేయాలని, ఇందులో భాగంగా అన్ని రకాల డిగ్రీ, పీజీ కోర్సుల్లో సెమిస్టర్ విధానం, పరీక్షల ఫలితాల్లో గ్రేడింగ్ విధానం అమలు చేయాలని నిర్ణయానికొచ్చారు. గతంలో యూనివర్సిటీలు, అటానమస్ కాలేజీలు, ఇతర డిగ్రీ కాలేజీల్లో దశల వారీగా అమలు చేయాలని భావించినా అది సాధ్యం కాదని తేల్చారు. రాష్ట్రంలోని 1,200కు పైగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు, పీజీ కాలేజీలు, యూనివర్సిటీల్లో ఈ విధానం అమలు చేయనున్నారు. సీబీసీఎస్‌లోని కోర్ సబ్జెక్టుల్లోనే (ప్రస్తుతం ఉన్న సబ్జెక్టులు) దీన్ని ప్రవేశపెట్టాలని, మరో రెండు అంశాలైన ఎలక్టివ్, ఫౌండేషన్ సబ్జెక్టుల విషయాన్ని తరువాత పరిశీలించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే సీబీసీఎస్ అమలుకు ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పేర్కొన్న కోర్సులు, సబ్జెక్టులు కాకుండా రాష్ట్రంలో ఉన్న కోర్సుల్లో దీన్ని అమలు చేయాలని నిర్ణయించారు. కొన్ని నోడల్ కాలేజీలను ఏర్పాటు చేసి, వాటి పరిధిలోని కాలేజీల్లో సీబీసీఎస్ అమలును అవి పర్యవేక్షి ంచేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. అలాగే అటానమస్ కాలేజీల ఏర్పాటు కోసం ప్రోత్సాహకాలు అందించాలన్న అభిప్రాయానికి వచ్చారు. సెమిస్టర్ విధానంలో సమస్యలు ఉంటాయని, అందుకే జిల్లాకో పరీక్షల విభాగం ఏర్పాటు చేసి, పరీక్షల నిర్వహణ పక్కాగా ఉండేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. -
నెలాఖరులోగా అన్ని సెట్స్
మూడో వారంలో నోటిఫికేషన్ల జారీ షురూ! ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంసెట్ సహా వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) నోటిఫికేషన్లను ఈ నెలాఖరులోగా జారీ చేస్తామని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి పేర్కొన్నారు. ఈ నెల మూడో వారంలో ఈ ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. ఇటీవల నియమితులైన వివిధ సెట్స్ కన్వీనర్లు సోమవారం మండలి కార్యాలయంలో పాపిరెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా నోటిఫికేషన్ల జారీకి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. నోటిఫికేషన్ల జారీని మూడో వారంలో ప్రారంభించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఈలోగా ఒక్కో సెట్‌కు కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. మొదట ఎంసెట్ నోటిఫికేషన్‌ను జారీ చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. పాపిరెడ్డితో సమావేశమైన వారిలో ఎంసెట్, లాసెట్, ఎడ్‌సెట్, ఈసెట్, ఐసెట్, పీజీ ఈసెట్, పీఈసెట్ కన్వీనర్లు రమణరావు, రంగారావు, ప్రసాద్, యాదయ్య, ఓంప్రకాష్, వేణుగోపాల్‌రెడ్డి, ప్రభాకర్‌రావు ఉన్నారు. ప్రభుత్వం దృష్టికి ప్రైవేటు కోచింగ్ సెంటర్ల నియంత్రణ రాష్ట్రంలో వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే ప్రైవేటు కోచింగ్ సెంటర్ల నియంత్రణ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు. కనీస వసతుల్లేకపోయినా ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తుండడం, ఫంక్షన్‌హాళ్లలో ఒక్కో బ్యాచ్‌లో వేయి మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తుండడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. -
మండలిలో ‘ఎంసెట్’ చిచ్చు!
ఏపీ ఉన్నత విద్యా మండలిలో పనిచేసే తెలంగాణ ఉద్యోగులకు సంకటం నేటి నుంచి తమ వద్దే పనిచేయాలంటూ టీ ఉన్నత విద్యా మండలి ఉత్తర్వులు విభజన కాకుండా వెళ్తే న్యాయపరమైన చిక్కులు తప్పవంటున్న ఏపీ మండలి సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ వివాదం ఏపీ ఉన్నత విద్యామండలిలో కూడా గందరగోళాన్ని రేపింది. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఏర్పాటు కావడంతో దానికి ఏపీ ఉన్నత విద్యామండలి తన భవనంలోని పై అంతస్తును కేటాయించింది. చైర్మన్‌కు, ఇతర ముఖ్యులకు వాహనాలు సమకూర్చింది. ఆ మండలికి తాత్కాలికంగా కొంతమంది ఉద్యోగులను కూడా సర్దుబాటు చేసింది. విభజన వ్యవహారం తేలేవరకు ఉద్యోగులు రెండు చోట్లా పనిచేసేలా ఏర్పాట్లు చేశారు. అయితే తాజాగా ఏపీ ఉన్నత విద్యామండలిలో ఉన్న తెలంగాణ ఉద్యోగులు మంగళవారం నుంచి తమ వద్ద మాత్రమే పనిచేయాలంటూ తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏపీ మండలిలో ఉన్న తెలంగాణ ఉద్యోగులు గందరగోళానికి గురవుతున్నారు. తమ ఆదేశాల ప్రకారం రాకపోతే వేరేగా ఉద్యోగులను నియమించుకుని, వారినే శాశ్వత ఉద్యోగులుగా కొనసాగిస్తామని టీ మండలి చెప్పడంతో ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఉద్యోగులు తెలంగాణ ఉన్నత విద్యామండలికి వెళ్లాలంటే ముందుగా ఏపీ ఉన్నత విద్యామండలి అధికారికంగా విభజన అవ్వాలని, అది కాకుండా వె ళ్తే ఇబ్బందుల పాలవుతారని ఏపీ మండలి అధికారులు స్పష్టం చేస్తున్నారు. ‘‘ఉన్నత విద్యా మండలిని కేంద్ర ప్రభుత్వం పదో షెడ్యూల్ నుంచి తొలగించాక నోడల్ అధికారిని నియమించి ఉద్యోగులు, ఆస్తులు అప్పుల పంపకాలు చేయాలి. అప్పటివరకు అధికారిక విభజన కానట్టే’’ అని స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఏపీ ఉన్నత విద్యామండలిలో ప్రస్తుతం 36 మంది ఉద్యోగుల్లో 14 మంది శాశ్వత ఉద్యోగులు... మిగతావారు ఒప్పంద ఉద్యోగులు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు 10 మందికి మించి లేరు. సోమవారం తెలంగాణ ఉద్యోగులు ఏపీ ఉన్నత విద్యా మండలి కార్యదర్శి కృష్ణమూర్తిని కలసి తెలంగాణ విద్యామండ లికి తమను కేటాయించాలని కోరారు. అనధికారికంగా ఎవరు ఎక్కడ పనిచేసినా అభ్యంతరం లేదని, అయితే అధికారిక బదిలీకి నిబంధనలు అంగీకరించవని ఆయన స్పష్టం చేశారు. -
ఏపీ కంటే ముందే తెలంగాణ ఎంసెట్
-
ఏపీ కంటే ముందే తెలంగాణ ఎంసెట్
* ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట ప్రభుత్వం నిర్వహించబోయే ఉమ్మడి ప్రవేశ పరీక్షల(సెట్స్) తేదీలను వచ్చే నెల 5న ప్రకటిస్తామని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు. వివిధ విశ్వ విద్యాలయాల వైస్‌చాన్సలర్లు, హైదరాబాద్ జేఎన్టీయూ అధికారులతో చర్చించి తాము నిర్వహించబోయే సెట్స్ తేదీలను ఖరారు చేస్తామని సోమవారం మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నిర్వహించే ఎంసెట్ తేదీ కంటే వారం పది రోజుల ముందుగానే తెలంగాణ ఎంసెట్ ఉండేలా షెడ్యూల్ ఖరారు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా అన్ని సెట్స్ తేదీలు ఉంటాయన్నారు. తెలంగాణలోని విద్యా సంస్థల్లో 15 శాతం ఓపెన్ కోటాలో మెరిట్ ఆధారంగా సీట్లు పొందేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా తాము నిర్వహించబోయే సెట్స్ రాయవచ్చని స్పష్టం చేశారు. ఈ కోటా ప్రవేశాల విషయంలో గందరగోళం తలెత్తకుండా ఏపీ ఒప్పుకొంటే ఆ ప్రభుత్వ ప్రతినిధిని కూడా ప్రవేశాల కమిటీలోకి సభ్యునిగా తీసుకుంటామన్నారు. రాష్ర్ట విభజన చట్టంలోని సెక్షన్ 75 ప్రకారం రెండు రాష్ట్రాల్లో సెట్స్ నిర్వహణ అధికారం తమకే ఉందని, ఏపీ ముందుకు వస్తే వారికీ సేవలు అందిస్తామన్నారు. ఎంసెట్, ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీల ప్రకటన విషయంలో ఏపీ విద్యా మండలి ఏకపక్షంగా వ్యవహరించిందని పాపిరెడ్డి విమర్శించారు. తమతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే షెడ్యూల్ ప్రకటించి, విద్యార్థులను ఏపీ సర్కారు గందరగోళంలో పడేసిందన్నారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలికి చట్టబద్ధత లేదన్న ఏపీ కౌన్సిల్ వాదన సరైంది కాదన్నారు. తమకు చట్ట బద్ధత లేకపోతే సుప్రీంకోర్టు, హైకోర్టు తమను ఎందుకు బాధ్యులను చేస్తుందని ప్రశ్నించారు. రాష్ర్టంలో ఉమ్మడి ప్రవేశాల నిర్వహణకు తమను ఆదేశిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిందని తెలిపారు. కాగా, తెలంగాణ ఎంసెట్‌ను ఏప్రిల్ 30న లేదా మే 3వ తేదీన జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. -
కళాశాలల్లో టాస్క్‌ఫోర్స్ తనిఖీలు
నాణ్యత ప్రమాణాలకు పెద్దపీట వేసేందుకు ఉన్నత విద్యా మండలి చర్యలు హైదరాబాద్: రాష్ట్రంలోని ఉన్నత, వృత్తి విద్య కాలేజీల్లో నాణ్యత ప్రమాణాలకే పెద్దపీట వేయాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన కాలేజీల్లో నాణ్యత ప్రమాణాలు పాటించని కాలేజీలపై కఠిన వైఖరి అవలంభించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా గ్రాడ్యుయేషన్ (డిగ్రీ), పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ), బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) తదితర అన్ని ఉన్నత విద్యా కోర్సులను నిర్వహించే కాలేజీల్లో టాస్క్‌ఫోర్స్ తనిఖీలు చేపట్టాలనే ఆలోచనలు చేస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో చర్చించాక త్వరలోనే టాస్క్‌ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయనుంది. ఆ కమిటీల నేతృత్వంలో తనిఖీలు చేపట్టి నాణ్యత, ప్రమాణాలు పాటించే కాలేజీలనే కొనసాగించాలనే యోచన చేస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో 726 ప్రైవేటు డిగ్రీ కాలేజీలు ఉండగా, ఈ ఏడాది మరో 150 కాలేజీలకు ఉన్నత విద్యా మండలి అనుమతి ఇచ్చింది. అయితే అవసరం లేని చోట కాలేజీలకు అనుమతులు పొందారని, రాజకీయ పరపతితో అనుమతులు తెచ్చుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిపై తెలంగాణ ఉన్నత విద్యా మండలికి ఫిర్యాదులు కూడా అందాయి. నిబంధనల ప్రకారం నాలుగైదు జూనియర్ కాలేజీలున్న మండలంలో ఒక డిగ్రీ కాలేజీకి మాత్రమే అనుమతి ఇవ్వాల్సి ఉండగా... ఒకట్రెండు జూనియర్ కాలేజీలు ఉంటే.. నాలుగైదు డిగ్రీ కాలేజీలకు అనుమతులు ఇచ్చినట్లు ఫిర్యాదులు అందాయి. యూనివర్సిటీల నుంచి తనిఖీలకు వెళ్లిన బృందాలు అలాంటి ప్రాంతాల్లో కొత్త కాలేజీల అనుమతులకు ఎలా సిఫారసు చేశారన్న అంశాలపైనా విచారణ జరిపి, చర్యలు చేపట్టాలనే ఆలోచనలు చేస్తోంది. తద్వారా భవిష్యత్తులో ఇష్టారాజ్యంగా కాలేజీల ఏర్పాటుకు తప్పుడు నివేదికలు ఇవ్వకుండా చూడాలని భావిస్తోంది. ఇప్పటికే మూడు నాలుగు కాలేజీలున్న చోట వాస్తవ అవసరాలను బట్టి ఎన్ని కాలేజీలను కొనసాగించాలనే విషయాలపై అధ్యయనం చేయాలని యోచిస్తోంది. ఇందుకు నాణ్యత ప్రమాణాలు పాటించని కాలేజీల అఫిలియేషన్లను రద్దు చేసే యోచన కూడా చేస్తోంది. మరోవైపు అనేక బీఎడ్ కాలేజీల్లో అధ్యాపకులే లేరు. తరగతులూ కొనసాగడం లేదు. అవి సర్టిఫికెట్లు ఇచ్చే కేంద్రాలుగా మారినట్లు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో వీటితోపాటు పోస్టు గ్రాడ్యుయేషన్ తదితర ఉన్నత విద్యా కాలేజీలు అన్నింట్లో తనిఖీలు చేపట్టి తగిన చర్యలు చేపట్టాలని భావిస్తోంది. -
ఇంకా పెత్తనం చెలాయిస్తే ఊరుకోం
టీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి ఏపీ ఉన్నత విద్యావుండలిపై మండిపాటు సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ రాష్ట్రంలోని కాలేజీలపై ఆజమాయిషీ అధికారం తెలంగాణ ప్రభుత్వానికే ఉంటుంది, మేనేజ్మెంట్ కోటా సీట్ల ర్యాటిఫికేషన్ అధికారం కూడా తెలంగాణ ఉన్నత విద్యా మండలికే ఉంటుంది’ అని టీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి పేర్కొన్నారు. వివిధ రకాల కోర్సులకు సాధ్యమైనంత త్వరగా మేనేజ్మెంట్ కోటా ప్రవేశాలు పూర్తి చేసి తెలంగాణ ఉన్నత విద్యా మండలికే ర్యాటిఫికేషన్ ఫైళ్లను పంపించాలని తెలిపారు. ఇందుకు విరుద్ధంగా ఏపీ మండలికి పంపితే తరువాత పరిణావూలకు కాలేజీలే బాధ్యతవహించాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఏపీ ఉన్నత విద్యా మండలి ఇంకా పెత్తనం చలాయిస్తే ఊరుకోబోమని తెలిపారు. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీ ఉన్నత విద్యా మండలి తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందన్నారు. పాలన పరమైన సమస్యల వల్ల ఇంజనీరింగ్ ప్రవేశాలు పూర్తి చేసేందుకు అక్టోబర్ 31 వరకు గడువు కావాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే, ఆగస్టు 31లోగా ప్రవేశాలు పూర్తి చేస్తామంటూ ఏపీ ఉన్నత విద్యా మండలి కేసులో ఇంప్లీడ్ అయి మరీ సుప్రీంకోర్టుకు చెప్పిందని గుర్తుచేశారు. ఇపుడేమో మళ్లీ రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని అంటున్నారెందుకని ప్రశ్నించారు. ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వులను ధిక్కరించడమేనని పేర్కొన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తరగతులను ప్రారంభిస్తామని చెప్పిన ఏపీ ఉన్నత విద్యా మండలి ఇపుడు మొదటి దశ కౌన్సెలింగ్ అరుున వారికి తరగతులు ప్రారంభిస్తే, రెండో దశవారి సంగతేమిటని ప్రశ్నించారు. పైగా రెండో విడత ప్రవేశాలు చేపట్టాలంటే మళ్లీ సుప్రీం కోర్టును ఆశ్రయించి, కోర్టు అనుమతిస్తేనే చేపట్టాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని తెలంగాణ అడ్వకేట్ జనరల్ కూడా చెప్పారని వెల్లడించారు. రెండు మూడు రోజుల్లో ఏపీ ఉన్నత విద్యా మండలి ఆస్తులు, అప్పులు, సిబ్బంది విభజన ఉత్తర్వులు వస్తాయని తెలిపారు. -
త్వరలో ఉన్నత విద్యా మండలి ఆస్తులు, అప్పుల విభజన
42:58 నిష్పత్తిలో విభజనకు చర్యలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉన్నత విద్యా మండలిని ఇటీవల ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలికి సంబంధించిన ఆస్తులు, అప్పులు, సిబ్బంది విభజనకు చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తమకు సిబ్బందిని కేటాయించాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రభుత్వానికి లేఖ రాసిన నేపథ్యంలో ఈ అంశంపై దృష్టి సారించింది. ఏడాదిపాటు రెండు రాష్ట్రాలకు సేవలందించే పదో షెడ్యూలులో ఉన్న ఏపీ ఉన్న త విద్యామండలిని విభజనకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై ఏపీ ప్రభుత్వంతో సంప్రదించి చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఆస్తులు, అప్పులను 42: 58 నిష్పత్తిలో ఈ విభజన చేపట్టాలని భావిస్తోంది. అలాగే ఏపీ మండలిలోని సిబ్బందిని కూడా విభజించి తెలంగాణ ఉన్నత విద్యా మండలికి కేటాయించే అంశంపై దృష్టి సారించింది. ప్రస్తుతం ప్రవేశాల ప్రక్రియను ఏపీ ఉన్నత విద్యా మండలి చూస్తోంది. ఇక వచ్చే ఏడాదికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంది. త్వరలోనే తెలంగాణలో ఉన్నత విద్యామండలి, తెలంగాణ యూనివర్సిటీల చట్టాలను రూపొందించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. -
కౌన్సెలింగ్ మేమే నిర్వహిస్తాం!
సుప్రీం తీర్పు నేపథ్యంలో తెలంగాణ సర్కారు కసరత్తు సీఎం కేసీఆర్‌తో ఉన్నత విద్యా మండలి చైర్మన్ భేటీ ఉమ్మడిగానే ఆప్షన్లు, ప్రవేశాలు తప్పదంటున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను తామే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. సుప్రీం తీర్పునకు లోబడి, రాష్ర్ట విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం రెండు రాష్ట్రాల విద్యార్థులకు ఉమ్మడి ప్రవేశాల ప్రక్రియను తామే చేపట్టాలని తాజాగా నిర్ణయానికి వచ్చింది. పైగా ఎంసెట్ పరీక్షను నిర్వహించిన జేఎన్టీయూహెచ్ తమ పరిధిలోనే ఉన్నందున తెలంగాణ ఉన్నత విద్యా మండలి నేతృత్వంలోనే కౌన్సెలింగ్ చేపట్టాలని అభిప్రాయపడుతోంది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి అధికారులతో చర్చించేందుకు విద్యా శాఖ అధికారులు సిద్దమవుతున్నారు. వీలైతే మంగళవారమే షెడ్యూల్ జారీ చేసి.. వెంటనే సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభించాలని కూడా భావిస్తున్నారు. అయితే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వేర్వేరుగా చేపట్టినా, కౌన్సెలింగ్ ఎవరు నిర్వహించినా వెబ్ ఆప్షన్లను మాత్రం ఉమ్మడిగానే ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. రెండు రాష్ట్రాల విద్యార్థులకు ఒకే పరీక్ష ద్వారా ఉమ్మడి ర్యాంకులు కేటాయించినందున ఈ విధానం తప్పదని వ్యాఖ్యానిస్తున్నారు. పైగా విభజన చట్టం ప్రకారం ఉమ్మడి ప్రవేశాలు కల్పించాలన్నా.. ఉమ్మడిగా వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ నెలాఖరులోగా ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేయాలన్న సుప్రీం తీర్పు నేపథ్యంలో సోమవారం రాత్రి సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి భేటీ అయ్యారు. తదుపరి చర్యలపై చర్చించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రవేశాల కౌన్సెలింగ్‌ను తెలంగాణ ఉన్నత విద్యా మండలి నేతృత్వంలోనే నిర్వహిస్తామని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆయన తెలిపారు. మరోవైపు సుప్రీం ఆదేశాల మేరకు తెలంగాణలోనూ కౌన్సెలింగ్ చేపడతామని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి కూడా ప్రకటించారు. తెలంగాణ అధికారులతో సమావేశమై సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీలను ఖరారు చేస్తామని చెప్పారు. వీలైతే ఈనెల 14 నుంచి వెరిఫికేషన్ ప్రారంభించి.. ఈ నెల 23లోగా ఈ ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు చేపడతామన్నారు. మొదటి దశ కౌన్సెలింగ్‌ను ఈ నెల 31లోగా పూర్తి చేసి తరగతులను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఐదు రోజులుగా దాదాపు 10 వేల మంది వెరిఫికేషన్ పూర్తయిందని, తెలంగాణలోనూ రోజుకు పది లేదా 20 వేల మందికి వెరిఫికేషన్ చేస్తే 23వ తేదీ నాటికి వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చని వివరించారు. -
సుప్రీం కోర్టు తీర్పు తర్వాతే కౌన్సెలింగ్ షెడ్యూల్!
* కౌన్సెలింగ్‌పై తెలంగాణ ఉన్నత విద్యా మండలి తొలి భేటీలో నిర్ణయం * ఎల్లుండి కోర్టు ఆదేశాలను బట్టి చర్యలకు యోచన సాక్షి, హైదరాబాద్: సొంతంగా ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించుకునేందుకే సిద్ధమైన రాష్ర్ట ప్రభుత్వం.. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాతే ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం తెలంగాణకు వేరుగా షెడ్యూల్ ప్రకటిస్తే న్యాయపరమైన సమస్యలు వస్తాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి. కౌన్సెలింగ్‌కు గడువు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 11న సుప్రీంలో తుది విచారణ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ రోజున సుప్రీం నిర్ణయాన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయానికి అధికారులు వచ్చారు. ఈ నేపథ్యంలో తీర్పు వచ్చిన తర్వాత సమావేశమై ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రవేశాలపై భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించాలని నిర్ణయానికి వచ్చారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి తొలి పాలకవర్గ సమావేశం శుక్రవారం సచివాయంలో జరిగింది. పలు దపాలుగా జరిగిన భేటీలో మండలి చైర్మన్ పాపిరెడ్డితోపాటు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, సాంకేతిక విద్యా కమిషనర్ శైలజా రామయ్యర్, మండలి వైస్ చైర్మన్, కార్యదర్శితో పాటు కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సంబంధించిన అంశాలపై చర్చించారు. కాలేజీల టాస్క్‌ఫోర్స్ తనిఖీలకు ఇంకా ఎంత సమయం పడుతుందనే విషయాన్ని పరిశీలించారు. కోర్టు తీర్పు రానున్నందున ముందుగానే షెడ్యూలు ప్రకటించడం ఎందుకనే దిశగా చర్చ జరిగినట్లు తెలిసింది. పైగా తెలంగాణ ప్రభుత్వం ఇంకా వాదనలు వినిపించాల్సి ఉన్నందున కూడా ప్రస్తుతానికి షెడ్యూల్‌ను ప్రకటించకపోవడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. అందుకే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించాలని నిర్ణయించారు. ఇందుకోసం సాయంత్రం 5 గంటలకు అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. అయితే ఆయనను కలవలేకపోయారు. దీంతో కోర్టు తీర్పు కాపీ అందిన తర్వాతే ఈ విషయంలో స్పందించాలని నిర్ణయించారు. కాగా, ఈ సమావేశానికి ముందే విద్యా శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితోనూ అధికారులు చర్చించారు. విధుల్లో చేరిక సమావేశానికి ముందే తెలంగాణ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ మల్లేశం, కార్యదర్శి శ్రీనివాసరావు తమ బాధ్యతలు చేపట్టారు. వీరితో పాటు ఇతర సభ్యులూ చైర్మన్ పాపిరెడ్డికి రిపోర్టు చేశారు. మరో వైస్ చైర్మన్ వెంకటాచలం కూడా చైర్మన్‌ను కలిసినప్పటికీ విధుల్లో చేరలేదు. ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించే అవకాశముంది. -
తెలంగాణకు వేరుగా కౌన్సెలింగ్!
-
వేరుగా నోటిఫికేషన్
* ఎంసెట్ కౌన్సెలింగ్‌పై టీ ఉన్నత విద్యామండలి చైర్మన్ * ధ్రువపత్రాల పరిశీలనకు వీలైతే రేపే నోటిఫికేషన్ * ‘సుప్రీం’ తీర్పును బట్టి 12 నుంచి ప్రక్రియ * వెబ్ ఆప్షన్లు మాత్రం ఉమ్మడిగా చేపట్టే అవకాశం * విద్యార్థులెవరూ ఆందోళన చెందవద్దని సూచన * నేడు టీ ఉన్నత విద్యామండలి సమావేశం సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించి విద్యార్థుల ధ్రువపత్రాల తనిఖీకి తెలంగాణలో వేరుగా నోటిఫికేషన్ జారీ చేసేందుకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి సిద్ధమైంది. వీలయితే ఈ నెల 9న నోటిఫికేషన్ జారీ చేసి.. 12 నుంచి వెరిఫికేషన్ చేపట్టే అవకాశం ఉంది. వెబ్ ఆప్షన్లను మాత్రం రెండు రాష్ట్రాలకు కలిపి ఒకేసారి చే పట్టే అవకాశం ఉంది. మండలి చైర్మన్‌గా గురువారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే 11వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును బట్టి సర్టిఫికెట్ల తనిఖీ, వెబ్ ఆప్షన్లు, ఇతర అంశాలపై తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో గురువారం సాయంత్రం 4 గంటలకు పాపిరెడ్డి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు కార్యాలయం రెండో అంతస్తులోని ప్రస్తుత కార్యదర్శి చాంబర్‌ను కేటాయించారు. అనంతరం పాపిరెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి సమావేశాన్ని శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహిస్తామని.. ఇందులో ఎంసెట్‌కు సంబంధించిన అన్ని అంశాలను చర్చిస్తామని ఆయన తెలిపారు. తెలంగాణకు వేరుగా ధ్రువపత్రాల తనిఖీ షెడ్యూలును ప్రకటిస్తామని.. ఏపీ మండలి అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పునకు, రాష్ట్ర విభజన చ ట్టంలోని నిబంధనలకు లోబడే ఈ ప్రక్రియ చేపడతామని.. ఆ మేరకే ప్రవేశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. ప్రవేశాల ప్రక్రియ అనుకున్నంత త్వరగా పూర్తి కాకపోవచ్చని, అయితే విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పాపిరెడ్డి భరోసా ఇచ్చారు. ప్రవేశాల ప్రక్రియ గతంలోనూ ఆలస్యం అయిందని, ప్రస్తుతం విద్యార్థులకు నష్టం వాటిల్లకుండా చూస్తామని చెప్పారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ హెల్ప్‌లైన్ కేంద్రాలకు సంబంధించి ఇంకా అన్ని ఏర్పాట్లు పూర్తి కాలేదన్నారు. సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌తో మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు పాపిరెడ్డి చెప్పారు. తాము చేపట్టబోయే ప్రక్రియ కామన్ అడ్మిషన్ విధానం ప్రకారమే ఉంటుందని, కోటా విషయంలో ఏపీ విద్యార్థులకు ఏ నష్టమూ ఉండదన్నారు. కాగా బాధ్యతల స్వీకరణ సందర్భంగా పాపిరెడ్డి వెంట విద్యాశాఖ కార్యదర్శి వికాస్‌రాజ్, ప్రభుత్వ సలహాదారు పాపారావు, జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు తదితరులు వెంట ఉన్నారు. అనంతరం ఏపీ మండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి, కాసేపు చర్చించారు. పాపిరెడ్డి అంతకుముందు గవర్నర్ నరసింహన్‌ను కూడా కలిసి వచ్చారు. టీ మండలికి ఇద్దరు వైస్ చైర్మన్లు తెలంగాణ ఉన్నత విద్యా మండలికి పూర్తిస్థాయి పాలక మండలిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పాలమూరు విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ ఎస్.వెంకటాచలం, ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.మల్లేశంలను వైస్ చైర్మన్లుగా నియమించారు. టీ మండలికి సంబంధించి గత ఉత్తర్వుల్లో ఒక వైస్ చైర్మన్ అని మాత్రమే పేర్కొనగా... ఆ ఉత్తర్వులను సవరిస్తూ ఇద్దరు వైస్ చైర్మన్లు అని చేర్చారు. ఇక కార్యదర్శిగా శ్రీనివాసరావు పేరును ఖరారు చేసినట్లు తెలిసింది. దీనిపై మండలి చైర్మన్ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న మండలి కార్యదర్శి సతీష్‌రెడ్డి ఏపీ ఉన్నత విద్యా మండలి కార్యదర్శిగా కొనసాగుతారు. మండలిలో ఎక్స్అఫీషియో సభ్యులుగా తెలంగాణలోని వివిధ వర్సిటీల వైస్ చాన్సలర్లను... సభ్యులుగా పలువురు విద్యా రంగ నిపుణులు, పారిశ్రామికవేత్తలను నియమిం చారు. సభ్యుల కేటగిరీలో ఉస్మానియా, కాకతీయ వర్సిటీలు, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీల్లో పనిచేసిన ప్రొఫెసర్లు పీవీ రమణారావు, ధనావత్ సూర్య, ఎ.సదానందం, సి.వెంకటయ్యతో పాటు పారిశ్రామికవేత్తలైన సాల్గుటీ ఇండస్ట్రీస్‌కు చెందిన ఎస్.విష్ణువర్ధన్‌రెడ్డి, ప్రభుత్వ నామినే టెడ్ కేటగిరీలో ఇందూ అరణ్యకు చెందిన ఒ.నర్సింహారెడ్డి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ జి.పాపయ్య, ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్ పి.లక్ష్మీనారాయణను (టెక్నికల్ ఎక్స్‌పర్ట్‌గా) నియమించారు. వీరంతా మూడేళ్లు ఈ పదవుల్లో కొనసాగుతారు. ఏపీలో వెరిఫికేషన్ ప్రారంభం ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో భాగంగా గురువారం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది. ఆంధ్రా యూనివర్సిటీ, శ్రీవేంకటేశ్వర వర్సిటీ పరిధిలోని విద్యార్థుల సర్టిఫికెట్ల తనిఖీని ప్రారంభించారు. దీనికి ఒకటి నుంచి 5 వేల ర్యాంకులోపు విద్యార్థులు 2,716 మంది గురువారం హాజరు కావాల్సి ఉండగా... సాయంత్రం 6 గంటల వరకు 725 మంది మాత్రమే వచ్చారు. ఇక ఎన్సీసీ, వికలాంగులు, స్పోర్ట్స్ తదితర ప్రత్యేక విభాగాల ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులకు హైదరాబాద్‌లోని సాంకేతిక భవన్లో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించారు. నిర్ణయాధికారం మాదే: ఏపీ మండలి చైర్మన్ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు, కౌన్సెలింగ్ నిర్వహణలో నిర్ణయాధికారం ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలికే ఉంటుందని మండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లోని విద్యా మండలి కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల ప్రకారం ఉమ్మడి ప్రవేశాలు, కౌన్సెలింగ్‌లపై అధికారం తమదేనని చెప్పారు. తెలంగాణకు ప్రత్యేక ఉన్నత విద్యా మండలి ఏర్పాటైనందున.. ఆ మండలి చైర్మన్ పాపిరెడ్డిని ప్రత్యేక ఆహ్వానితుడిగా ప్రవేశాల కమిటీల్లో చేర్చుతామని... ఈ మేరకు కమిటీల సమావేశాలకు ఆయనను ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. వృత్తి విద్యా కోర్సులపైనా దృష్టి ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రవేశాల వ్యవహారం ఓ కొలిక్కి వస్తున్న నేపథ్యంలో.. ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలపై అధికారులు దృష్టి సారించారు. లాసెట్, ఎడ్‌సెట్, పాలిసెట్, ఈసెట్ ద్వారా చేపట్టాల్సిన వృత్తి విద్య సీట్ల భర్తీకి ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఈ మేరకు సాధ్యమైనంత త్వరగా ఆయా సెట్ల ప్రవేశాల కమిటీలను సమావేశపర్చి.. ధ్రువపత్రాల తనిఖీ, కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు తేదీలను ఖరారు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
తెలంగాణకు వేరుగా కౌన్సెలింగ్!
* ఎంసెట్ ప్రవేశాలకు విడిగా నోటిఫికేషన్ జారీ యోచనలో టీ సర్కారు సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రవేశాలకు సొంతంగానే కౌన్సెలింగ్ నిర్వహించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. సొంతంగా ప్రవేశాలు చేపట్టేందుకు వీలయ్యే అంశాలపై పరిశీలిస్తోంది. ఈ అంశంలో సుప్రీంకోర్టు ఆదేశాలపై కోర్టు కాపీ ఇంకా రానందున, అధికారిక నిర్ణయం జరగనందున తమ తుది నిర్ణయాన్ని తేలనట్లు సమాచారం. 10వ తేదీ నాటికి విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకొందని ఏపీ ఉన్నత విద్యామండలి చెప్పినా... విడిగా ప్రవేశాలు చేపట్టేందుకు ఏం చేయాలనే అంశంపైనే తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. ఇక్కడ 10వ తేదీ నాటికి సర్టిఫికెట్ల తనిఖీ ప్రారంభించినా... తెలంగాణకు ప్రత్యేకంగా నోటిఫికేషన్‌ను జారీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.పదో తేదీన పండుగ కావడంతో.. వెరిఫికేషన్‌కు అవకాశం ఎలాగూ ఉండదు. 11న సుప్రీంలో తుది తీర్పు రానుండటంతో... ఆ రోజు తమ వాదనలు కోర్టు దృష్టికి తీసుకెళ్లవచ్చని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకోసం పకడ్బందీగా సిద్ధం కావాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలిసింది. దీంతోపాటు మండలి ఏర్పాటు, చైర్మన్ నియామకం, సర్టిఫికెట్ల తనిఖీ, కౌన్సెలింగ్ నిర్వహణ స్థితిగతులు వంటి అంశాలపై బుధవారం పొద్దంతా సీఎం, అధికారులు చర్చలు జరుపుతూనే ఉన్నారు. బుధవారం ఉదయమే సీఎం కేసీఆర్‌తో విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, తెలంగాణ మండలి చైర్మన్ పాపిరెడ్డి సమావేశమయ్యారు. ఆ తరువాత ఎంసెట్ ప్రవేశాల కమిటీ సమావేశంలో కార్యదర్శి వికాస్‌రాజ్, సాంకేతిక విద్య కమిషనర్ శైలజారామయ్యర్ పాల్గొన్నారు. అనంతరం ఎంసెట్ వ్యవహరంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ వద్ద జరిగిన సమావేశంలో వికాస్‌రాజ్ పాల్గొన్నారు.