42:58 నిష్పత్తిలో విభజనకు చర్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉన్నత విద్యా మండలిని ఇటీవల ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలికి సంబంధించిన ఆస్తులు, అప్పులు, సిబ్బంది విభజనకు చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తమకు సిబ్బందిని కేటాయించాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రభుత్వానికి లేఖ రాసిన నేపథ్యంలో ఈ అంశంపై దృష్టి సారించింది. ఏడాదిపాటు రెండు రాష్ట్రాలకు సేవలందించే పదో షెడ్యూలులో ఉన్న ఏపీ ఉన్న త విద్యామండలిని విభజనకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది.
దీనిపై ఏపీ ప్రభుత్వంతో సంప్రదించి చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఆస్తులు, అప్పులను 42: 58 నిష్పత్తిలో ఈ విభజన చేపట్టాలని భావిస్తోంది. అలాగే ఏపీ మండలిలోని సిబ్బందిని కూడా విభజించి తెలంగాణ ఉన్నత విద్యా మండలికి కేటాయించే అంశంపై దృష్టి సారించింది. ప్రస్తుతం ప్రవేశాల ప్రక్రియను ఏపీ ఉన్నత విద్యా మండలి చూస్తోంది. ఇక వచ్చే ఏడాదికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంది. త్వరలోనే తెలంగాణలో ఉన్నత విద్యామండలి, తెలంగాణ యూనివర్సిటీల చట్టాలను రూపొందించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది.
త్వరలో ఉన్నత విద్యా మండలి ఆస్తులు, అప్పుల విభజన
Published Fri, Aug 22 2014 2:47 AM | Last Updated on Sat, Sep 2 2017 12:14 PM
Advertisement