Andhra Pradesh Higher Education Council
-
ఏపీలో ఎంసెట్ దరఖాస్తుకు గడువు పొడిగింపు
సాక్షి, అమరావతి : కరోనా వైరస్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ఎంట్రెన్స్ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇంజనీరింగ్ తదితర ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశానికి ఎంసెట్ సహా ఇతర ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులకు ఏపీ ఉన్నత విద్యామండలి మరో అవకాశాన్ని కల్పించింది. ఎంసెట్, ఈసెట్, ఐసెట్, పీజీ సెట్, లాసెట్ ఆన్లైన్ పరీక్షలకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా వచ్చే నెల 7వ తేదీ వరకూ గడువు పొడిగించింది. ఈ మేరకు సెట్స్ ప్రత్యేక అధికారి డాక్టర్ సుధీర్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. -
‘కాలేజీలు నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి’
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని అన్ని కాలేజీలు నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీచేశారు. గురువారం ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్‌తో సీఎం వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం వైఎస్ జగన్‌తో పాటు కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, కమిటీ సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషన్ చేపడుతున్న కార్యక్రమాలపై అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు ప్రజంటేషన్ ఇచ్చారు. అలాగే కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పిల్లలకు పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వబోతున్నామని మరోసారి స్పష్టం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లలతోపాటు పేద పిల్లలు చాలా మంది దీనివల్ల లబ్ధి పొందుతారని తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ కాకుండా డిగ్రీ, ఆపై కోర్సులు చదువుతున్న వారికి ఏడాదికి రూ. 20వేల వసతి, భోజన ఖర్చుల కోసం ఇవ్వబోతున్నట్టు తెలిపారు. కోర్సుల పాఠ్యప్రణాళిక మార్చబోతున్నట్టు తెలిపిన సీఎం వైఎస్ జగన్.. ఉద్యోగం, ఉపాధి కల్పించేలా రూపొందించబోతున్నట్టు పేర్కొన్నారు. అలాగే ఏడాది పాటు అదనంగా అప్రెంటిస్ ఉంటుందని.. అందువల్ల వీటిని మాములు డిగ్రీలుగా కాకుండా ఆనర్ డిగ్రీలుగా పరిగణించాలని సూచించారు. ఒక ఏడాది అనుభవంతో కూడిన డిగ్రీకి మంచి విలువ ఉంటుందని.. సరైన ప్రాక్టికల్ అనుభవం లేకపోతే పోటీ ప్రపంచంలో నిలవలేరని అభిప్రాయపడ్డారు. ఉద్యోగాల కోసం దేశంలో కానీ, ప్రపంచంలో కానీ తీవ్రమైన పోటీ నెలకొందని గుర్తుచేశారు. అన్ని కాలేజీలు నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. లంచాలు ఇస్తే సరిపోతుందనే భావన కనిపించకూడదని తెలిపారు. నిర్దేశించుకున్న ప్రమాణాలను కాలేజీలు తప్పకుండా పాటించాలని అన్నారు. అందుకోసం అవసరమైతే కాలేజీలకు ఆరు నెలల సమయం ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు మెరుగుపడ్డాయన్న సందేశం వినిపించాలని అన్నారు. నియమాలు, నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవనే భయం ఉండాలన్నారు. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో కాలేజీలకు ఎలాంటి బకాయిలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం వైపు నుంచి చేయాల్సిందంతా చేద్దామని చెప్పారు. కాలేజ్‌ల్లో తనిఖీల సందర్భంగా గుర్తించిన అంశాలను కమిషన్ సభ్యులు ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. కాలేజీల్లో ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం క్వాలిఫైడ్ స్టాఫ్ లేరని కమిషన్ సభ్యులు తెలిపారు. ప్రయోగశాలల్లో పరికరాలు సరిగ్గాలేవని గుర్తించామన్నారు. టీచర్లు, స్టూడెంట్స్ హాజరు రిజిస్టర్లు కూడా సరిగా లేవని చెప్పారు. ఫైనాన్స్, జీతాల చెల్లింపులకు సంబంధించిన రికార్డులు సక్రమంగా లేవని.. చాలా కాలేజీల్లో ఆడ్మిషన్లు చాలా స్వల్ఫంగా ఉన్నాయని వివరించారు. ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడుతున్నందుకు ధన్యవాదాలు.. పాఠశాలల్లో 1వ తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడుతున్నందుకు సీఎం వైఎస్ జగన్‌కు కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య ధన్యవాదాలు తెలిపారు. సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తోన్న కార్యక్రమాలపై దేశం మొత్తం చూస్తోందన్నారు. తన చిన్నతనంలో ఒక ముక్క ఇంగ్లిష్ మాట్లాడితే గొప్పగా చూసేవాళ్లమని గుర్తుచేశారు. అలాంటిది పేదపిల్లలకు చిన్నప్పటి నుంచే ఇంగ్లిషులో బోధన ద్వారా ఉత్తమ విద్య అందించాలన్న సంకల్పం చాలా గొప్పదని అన్నారు. వాళ్లు ఒకటి పాటించి.. వేరేవాళ్లు ఇంకోటి చేయాలన్న రీతిలో ఇంగ్లిష్ మీడియంపై కొందరు మాట్లాడటం సరికాదని సూచించారు. -
ఉన్నత విద్యామండలిలో ఫైళ్ల విభజన
అంగీకరించిన టీ-సర్కారు దీనిపై రెండు రాష్ట్రాల నుంచి 8 మంది అధికారులతో కమిటీ ఇరు రాష్ట్రాల విద్యా మంత్రుల భేటీలో నిర్ణయం హైదరాబాద్: తెలంగాణ ఉన్నత విద్యా మండలి అధీనంలోని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలికి చెందిన ఫైళ్ల విభజనకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. అయితే ఏపీ ఉన్నత విద్యా మండలికి ప్రస్తుత తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఉన్న భవనంలో చోటు కల్పించే విషయంలో మాత్రం అడ్వొకేట్ జనరల్‌తో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈనెల 12 నుంచి ఏపీకి చెందిన ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో తమ ఫైళ్లు తమకు ఇవ్వడం లేదంటూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం గంటా శ్రీనివాసరావుతో కలసి గవర్నర్‌ను కలసిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి అయిన కడియం శ్రీహరి....నరసింహన్ సూచన మేరకు తన చాంబర్లో గంటా శ్రీనివాసరావుతో భేటీఅయ్యారు. ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల విద్యాశాఖ అధికారులు, ఉన్నత విద్యా మండళ్ల చైర్మన్లు ప్రొఫెసర్ పాపిరెడ్డి, ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలి విభజనకు సంబంధించిన అంశాలపై చర్చించారు. హైకోర్టు తీర్పు, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో కౌన్సెలింగ్ నిర్వహణకు ఫైళ్లు, సిబ్బంది ఏపీ కౌన్సిల్‌కు అవసరం ఉన్నందున ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే ఇందుకు రెండు రాష్ట్రాల నుంచి నలుగురు చొప్పున అధికారులతో కమిటీ వేయాలని ఇరువురు మంత్రులు నిర్ణయించారు. ఆ కమిటీ ఫైళ్లను పరిశీలించి విభజించనుంది. సమావేశం అనంతరం కడియం విలేకరులతో మాట్లాడుతూ ఏపీ విద్యార్థుల ప్రయోజనాలు కాపాడేందుకు, వారికి కౌన్సెలింగ్ సజావుగా జరిగేందుకు ఈ మేరకు అంగీకరించినట్లు తెలిపారు.ఇందుకు ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు. పదో షెడ్యూలులోని మిగితా అంశాలపై తరువాత మరోసారి సమావేశం అవుతామని, అవసరమైతే ముఖ్యమంత్రులు, గవర్నర్ సమావేశమై చర్చిస్తారని గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. మరోవైపు వరంగల్ ఎన్ఐటీలో తమకు సీట్ల విషయమై త్వరలో హైదరాబాద్ రానున్న కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీతో చర్చిస్తామని గంటా పేర్కొనగా ఏపీలో మరో ఎన్ఐటీ కావాలని అడగాలంటూ కడియం చమత్కరించారు. -
ఏపీ ఉన్నత మండలి కార్యాలయం స్వాధీనం
చాంబర్లను ఆధీనంలోకి తీసుకున్న తెలంగాణ ఉన్నత మండలి హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి కార్యాలయ భవనాలు, చైర్మన్, వైస్ చైర్మన్, కార్యదర్శి చాంబర్లను తెలంగాణ ఉన్నత విద్యా మండలి గురువారం స్వాధీనం చేసుకుంది. కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణలో ఏపీ ఉన్నత విద్యా మండలి మనుగడలో లేనందున తమ ఆధీనంలోకి తీసుకుంది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొ.వెంకటాచలం, ప్రొ. మల్లేశ్, కార్యదర్శి శ్రీనివాసరావు గురువారం తెలంగాణ విద్యామండలి కార్యాలయంలో సమావేశం అయ్యా రు. ఈ సందర్భంగా ఏపీ మండలి ఆధీనంలోని కార్లు, ఇతర ఆస్తులు తెలంగాణ మండ లి ఆధీనంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఏపీ మండలి కొనసాగిన కార్యాలయాలు, భవనాలు, చాంబర్లు అన్నింటినీ పరిశీలించారు. ఇన్నాళ్లు ఏపీ మండలి చైర్మన్‌గా ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి కూర్చున్న చాంబర్‌ను కూడా పరిశీలించారు. అనంతరం తెలంగాణ మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు, కార్యదర్శి అదే చాంబర్ నుంచి ఏపీ మండలికి సంబంధించిన అన్ని భవనాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. అంతకుముందు ఏపీ మండలిలో పనిచేసిన ఉద్యోగులందరితో సమావేశం అయ్యారు. కోర్టు తీర్పు ప్రకారం ఏపీ మండలి మనుగడలో లేనందున ఉద్యోగులంతా తెలంగాణ మండలి పరిధిలోనే పని చేయాలని ఆదేశించారు. ఇందుకు వారంతా అంగీకారం తెలిపారని పేర్కొన్నారు. అయితే పాపిరెడ్డి ఏపీ మండలి చైర్మన్ చాంబర్‌లోని చైర్మన్ సీటులో కాకుండా సోఫాలో కూర్చుని మీడియాతో మాట్లాడడం గమనార్హం. ఈ విషయాన్ని లేవనెత్తగా.. ‘ఎలాగూ స్వాధీనం చేసుకున్నాం. పాత చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డికి మార్యదపూర్వకంగా ఓ మాట చెప్పి శుక్రవారం నుంచి ఆ సీట్లో కూర్చుంటా’ అని పాపిరెడ్డి పేర్కొన్నారు. అయితే అప్పటికే వేణుగోపాల్‌రెడ్డికి చెందిన అన్ని ఫైళ్లను సిబ్బంది బుధవారమే తరలించింది. అలాగే సాంకేతిక విద్యాభవన్లోని ప్రవేశాల కౌన్సెలింగ్ కార్యాలయాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. -
అకౌంట్లు ఫ్రీజ్ చేస్తే క్రిమినల్ చర్యలు
బ్యాంకులకు ఏపీ ఉన్నత విద్యామండలి లేఖ సాక్షి, హైదరాబాద్: తమ బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్ చేస్తే ఆయా బ్యాంకులపై న్యాయపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు కూడా పెడతామని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది. ఖాతాలను స్తంభింపచేసేందుకు ఆంధ్రాబ్యాంకు అధికారులు నోటీసులు ఇవ్వడంతో.. ఆ బ్యాంకు అధికారులకు మండలి ఘాటైన పదజాలంతో ప్రత్యుత్తరమిచ్చింది. ఈ విషయంలో హైకోర్టు లేదా సుప్రీం కోర్టుకు కూడా వెళ్లేందుకు ఆలోచనలు చేస్తోంది. మరికొన్ని అకౌంట్లపైనా టి.మండలి లేఖలు:ఏపీ ఉన్నత విద్యామండలికి సంబంధించిన అకౌంట్లను కూడా స్తంభింపచేయాలంటూ తెలంగాణ ఉన్నత విద్యామండలి మరికొన్ని ఇతర బ్యాంకులకు లేఖలు పంపింది. శుక్రవారం శాంతినగర్ ఎస్బీఐ శాఖకు తెలంగాణ మండలి లేఖ పంపింది. -
భవితతో చెలగాటం!
* ఏపీ ఉన్నత విద్యా మండలి ఉదాసీనతపై విమర్శలు * సుప్రీంకోర్టులో సరైన వాదన వినిపించలేని వైనం * ముందే అదనపు గడువు కోరిన తెలంగాణ సర్కారు * ఆగ స్టు 31లోగా ప్రవేశాలు పూర్తి చేస్తామని అడ్డుపడిన ఏపీ * తొలి విడత కౌన్సెలింగ్ మాత్రమే పూర్తి, భారీగా మిగిలిపోయిన సీట్లు * రెండో విడతకు కోర్టు నిరాకరణతో అడ్మిషన్లకు మూసుకున్న ద్వారాలు సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: ఇంజనీరింగ్ ప్రవేశాలపై పంతాలకు వెళ్లిన ఇరు ప్రభుత్వాల వైఖరి అంతిమంగా విద్యార్థులకు శాపంగా పరిణమించింది. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఈ వ్యవహారంలో ఇరు ప్రభుత్వ వర్గాలు ఆది నుంచీ ఎడమొహం పెడమొహంగానే వ్యవహరించాయి. కొత్త రాష్ర్టంగా ఏర్పడిన తర్వాత పలు అంశాలపై విధివిధానాల ఖరారులో జాప్యం అవుతున్నందున ఈసారి ఇంజనీరింగ్ అడ్మిషన్లను ఆలస్యంగా చేపట్టడానికి అనుమతించాలని తెలంగాణ సర్కారు సుప్రీంను ఆశ్రయించింది. ఈ విషయాన్ని ఏపీ ఉన్నత విద్యా మండలి ఏమాత్రం పట్టించుకోలేదు. ఆగస్టు 31లోపు ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేస్తామంటూ ఏపీ కౌన్సిల్ ఈ కేసులో ఇంప్లీడ్ అయింది. ఏటా పాటించే షెడ్యూల్‌ని అనుసరించి కోర్టు కూడా ఇందుకు సమ్మతించింది. తర్వాత ఇరు రాష్ట్రాల విద్యాశాఖ అధికారులు కౌన్సెలింగ్‌ను చేపట్టారు. తీరా గడువులోగా తొలి విడత కౌన్సెలింగ్ మాత్రమే పూర్తిచేయగలిగారు. ఇప్పటికే ఇరు రాష్ట్రాల్లోని కాలేజీల్లో భారీగా సీట్లు మిగిలిపోయాయి. సీట్లు పొందిన చాలా మంది విద్యార్థులు కూడా మంచి కాలేజీలో.. మంచి కోర్సులో సీటు కావాలని కోరుకుంటూ రెండో విడత కౌన్సెలింగ్‌పై ఆసక్తిగా ఉన్నారు. రెండో విడతకు కోర్టు అనుమతి నిరాకరించడంతో అన్ని వర్గాలూ నిరాశకు గురయ్యాయి. ఏపీ మండలి ఉదాసీనత వల్లే... ఏటా ఎంసెట్‌కు రెండు, మూడు విడతలుగా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. సాంకేతిక కారణాల దృష్ట్యా ఇది తప్పనిసరి అని తెలిసి కూడా ఏపీ మండలి ఆగస్టు 31 వ రకే గడువు కోరింది. రెండో విడత కౌన్సెలింగ్‌కు అనుమతి విషయంలో ఏపీ మండలి గట్టి వాదనలు వినిపించలేకపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. ఎంతసేపూ వేలాది సీట్లు మిగిలిపోయాయన్న విషయాన్నే నొక్కి చొప్పింది కానీ విద్యార్థులు నష్టపోతారన్న విషయాన్ని ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం. భారీగా మిగిలిపోయిన సీట్లు తొలి దశ ఇంజనీరింగ్ ప్రవేశాలు గత నెల 30న ముగిసిన సంగతి తెలిసిందే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 575 ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 1,89,088 సీట్లు అందుబాటులో ఉండగా, 1,16,029 మంది విద్యార్థులకు సీట్లను కేటాయించింది. దీంతో 73,059 సీట్లు మిగిలిపోయాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 57,372 సీట్లు, తెలంగాణలో 15,677 సీట్లు మిగిలిపోయాయి. మరోవైపు కౌన్సెలింగ్‌లో పాల్గొన్న దాదాపు 4 వేల మందికి ఏ కాలేజీలోనూ సీటు రాలేదు. అంటే వీరు తమ ర్యాంకుకు తగిన రీతిలో ఎక్కువ కళాశాలలకు ఆప్షన్లు పెట్టుకోలేదు. ఇప్పుడు వీరికి కూడా రెండో విడత అవకాశం లేకుండా పోయింది. ఇక జేఎన్టీయూహెచ్ పరిధిలోని 174 కాలేజీలకు ప్రస్తుతం షరతులతో కూడిన అనుమతి ఉంది. వీటిలోనూ లక్షకుపైగా సీట్లు ఉంటాయి. వీటి భర్తీకి రెండో విడత కౌన్సెలింగ్ తప్పనిసరి. నష్టపోతున్న విద్యార్థులే సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఒక్కటే ఇప్పుడు చివరి అవకాశమని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థులకు ఎంత నష్టం..? రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించకపోతే విద్యార్థులకు పలు రకాలుగా నష్టం జరుగుతుంది. తొలి విడతలో ఒక బ్రాంచీలో చేరిన వారు.. మరో బ్రాంచీకి మారే అవకాశాన్ని కోల్పోతారు. అలాగే తొలివిడతలో మంచి కాలేజీలో సీటు దక్కక రెండో విడతలో కాలేజీ మారాలనుకుంటున్న వారికీ ఆ చాన్స్ లేకుండా పోతుంది. మేనే జ్మెంట్ కోటా సీట్ల భర్తీ కూడా గందరగోళంగా మారింది. ఈ పరిస్థితులను ఊహించిన కొన్ని మేనేజ్మెంట్లు ఏపీ ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండా ఆగస్టు 31లోగా ప్రవేశాలు పూర్తి చేశాయి. ఈ మేరకు ఇప్పటికే లేఖలు అందజేశాయి. అయితే మిగతా కాలేజీల్లో మేనేజ్మెంట్ సీట్ల భర్తీ ఎలాగన్నది ప్రశ్నార్థకమైంది. ఇక ప్రమాణాలు పాటించలేదన్న కారణంగా అఫిలియేషన్ కోల్పోయి తొలి విడత కౌన్సెలింగ్‌కు దూరంగా ఉన్న 174 ఇంజనీరింగ్ కాలేజీలకు సుప్రీం తాజా నిర్ణయం శరాఘాతం వంటిదే. ఇప్పటికే షరతులతో కూడిన అనుమతి పొందడంతో రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొని విద్యార్థులను చేర్చుకోవాలని అవి భావించాయి. కానీ ప్రస్తుతం ఆ మార్గం లేక లబోదిబోమంటున్నాయి. రివ్యూ పిటిషన్‌పై ఆలోచన సుప్రీంకోర్టు ఆదేశాలపై న్యాయ సలహా తీసుకుంటాం. రివ్యూ పిటిషన్ వేసే విషయాన్ని పరిశీలిస్తున్నాం. - ఏపీ మండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి ఇదంతా ఏపీ కౌన్సిల్ నిర్వాకమే తె లంగాణ ప్రభుత్వం ఎక్కువ గడువు కావాలని అడిగినప్పుడు అవసరం లేకపోయినా ఏపీ కౌన్సిల్ ఇంప్లీడ్ అయింది. దాంతో ఇప్పుడు విద్యార్థులకు నష్టం వాటిల్లుతోంది. ఈ పరిస్థితులతో ఇరు రాష్ట్రాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. ఏపీ కౌన్సిల్ అత్యుత్సాహం ప్రదర్శించకుండా ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. - టీ మండలి చైర్మన్ పాపిరెడ్డి -
త్వరలో ఉన్నత విద్యా మండలి ఆస్తులు, అప్పుల విభజన
42:58 నిష్పత్తిలో విభజనకు చర్యలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉన్నత విద్యా మండలిని ఇటీవల ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలికి సంబంధించిన ఆస్తులు, అప్పులు, సిబ్బంది విభజనకు చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తమకు సిబ్బందిని కేటాయించాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రభుత్వానికి లేఖ రాసిన నేపథ్యంలో ఈ అంశంపై దృష్టి సారించింది. ఏడాదిపాటు రెండు రాష్ట్రాలకు సేవలందించే పదో షెడ్యూలులో ఉన్న ఏపీ ఉన్న త విద్యామండలిని విభజనకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై ఏపీ ప్రభుత్వంతో సంప్రదించి చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఆస్తులు, అప్పులను 42: 58 నిష్పత్తిలో ఈ విభజన చేపట్టాలని భావిస్తోంది. అలాగే ఏపీ మండలిలోని సిబ్బందిని కూడా విభజించి తెలంగాణ ఉన్నత విద్యా మండలికి కేటాయించే అంశంపై దృష్టి సారించింది. ప్రస్తుతం ప్రవేశాల ప్రక్రియను ఏపీ ఉన్నత విద్యా మండలి చూస్తోంది. ఇక వచ్చే ఏడాదికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంది. త్వరలోనే తెలంగాణలో ఉన్నత విద్యామండలి, తెలంగాణ యూనివర్సిటీల చట్టాలను రూపొందించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది.