చాంబర్లను ఆధీనంలోకి తీసుకున్న తెలంగాణ ఉన్నత మండలి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి కార్యాలయ భవనాలు, చైర్మన్, వైస్ చైర్మన్, కార్యదర్శి చాంబర్లను తెలంగాణ ఉన్నత విద్యా మండలి గురువారం స్వాధీనం చేసుకుంది. కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణలో ఏపీ ఉన్నత విద్యా మండలి మనుగడలో లేనందున తమ ఆధీనంలోకి తీసుకుంది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొ.వెంకటాచలం, ప్రొ. మల్లేశ్, కార్యదర్శి శ్రీనివాసరావు గురువారం తెలంగాణ విద్యామండలి కార్యాలయంలో సమావేశం అయ్యా రు. ఈ సందర్భంగా ఏపీ మండలి ఆధీనంలోని కార్లు, ఇతర ఆస్తులు తెలంగాణ మండ లి ఆధీనంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఏపీ మండలి కొనసాగిన కార్యాలయాలు, భవనాలు, చాంబర్లు అన్నింటినీ పరిశీలించారు. ఇన్నాళ్లు ఏపీ మండలి చైర్మన్‌గా ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి కూర్చున్న చాంబర్‌ను కూడా పరిశీలించారు. అనంతరం తెలంగాణ మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు, కార్యదర్శి అదే చాంబర్ నుంచి ఏపీ మండలికి సంబంధించిన అన్ని భవనాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు.
అంతకుముందు ఏపీ మండలిలో పనిచేసిన ఉద్యోగులందరితో సమావేశం అయ్యారు. కోర్టు తీర్పు ప్రకారం ఏపీ మండలి మనుగడలో లేనందున ఉద్యోగులంతా తెలంగాణ మండలి పరిధిలోనే పని చేయాలని ఆదేశించారు. ఇందుకు వారంతా అంగీకారం తెలిపారని పేర్కొన్నారు. అయితే పాపిరెడ్డి ఏపీ మండలి చైర్మన్ చాంబర్‌లోని చైర్మన్ సీటులో కాకుండా సోఫాలో కూర్చుని మీడియాతో మాట్లాడడం గమనార్హం. ఈ విషయాన్ని లేవనెత్తగా.. ‘ఎలాగూ స్వాధీనం చేసుకున్నాం. పాత చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డికి మార్యదపూర్వకంగా ఓ మాట చెప్పి శుక్రవారం నుంచి ఆ సీట్లో కూర్చుంటా’ అని పాపిరెడ్డి పేర్కొన్నారు. అయితే అప్పటికే వేణుగోపాల్‌రెడ్డికి చెందిన అన్ని ఫైళ్లను సిబ్బంది బుధవారమే తరలించింది. అలాగే సాంకేతిక విద్యాభవన్‌లోని ప్రవేశాల కౌన్సెలింగ్ కార్యాలయాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఏపీ ఉన్నత మండలి కార్యాలయం స్వాధీనం
Published Fri, May 8 2015 1:02 AM | Last Updated on Sun, Sep 3 2017 1:36 AM
Advertisement