ఇటీవలే ఓ వివాహిత 26 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. గర్భం దాల్చిన తొలినాళ్లలోనే అబార్షన్ చేయించుకోవాలని అనుకున్నప్పటికీ కొంతమంది మహిళలు న్యాయ, వైద్యపరమైన అడ్డంకులను దాటలేకపోతున్నారు. వేర్వేరు పరిస్థితుల కారణంగా మహిళలకు లేటైనా అబార్షన్ అవసరమవుతుంది. సరైన సమయంలో వైద్యం అందకపోవడం, లైంగికదాడి, గృహహింస, జైలు వంటివి ఎన్నో దీనికి కారణాలు. గర్భం ధరించిన తరువాత పరిస్థితుల్లో వచ్చే మార్పులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా మార్గదర్శకాల ప్రకారం... ప్రభుత్వాలు అబార్షన్‌ను నేరంగా పరిగణించడాన్ని నిలిపి వేయాలి. గర్భం వయసుపై పరిమితులు తొలగించాలి.
ప్రత్యేక పరిస్థితుల్లో అబార్షన్ చేయించుకునే విషయంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం 2021లో ఒక తీర్పునిచ్చింది. పిండం వయసు గరిష్ఠంగా 24 వారా లున్నా పీడిత మహిళలు అబార్షన్ చేయించుకునేందుకు వీలు కల్పించింది. వైకల్యమున్నప్పుడు మాత్రమే మెడికల్ బోర్డు సిఫారసుతో అబార్ష¯Œ కు అనుమతించే పాత చట్టం నుంచి వీరికి విముక్తిని ప్రసాదించింది. సుప్రీంకోర్టు, హైకోర్టుల ముందు అబార్షన్‌కు అనుమతించే విషయంపై అనేక పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో ఈ మార్పులు వచ్చాయి.
అంతకుముందు మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) యాక్ట్ (1971) ప్రకారం, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్లు (ఆర్‌ఎంపీలు) గర్భం ధరించిన 20 వారాల వరకూ అబార్షన్ చేసేందుకు అనుమతులుండేవి. 2021 నాటి సవరణ తీర్పు తరువాత కూడా చాలామంది మహిళలు వైద్యులు అబార్షన్‌కు నిరాకరించిన సందర్భాల్లో... కోర్టు నిర్దేశించిన సమయం దాటినా అఅబార్షన్‌కు అనుమతించాలని కోరుతూ న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు.
ఇటీవలే ఓ వివాహిత మహిళ 26 వారాల వయసున్న గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, విచారణ తరువాత కోర్టు అందుకు నిరాకరించడం తెలిసిన విషయాలే. పాలిచ్చే సమయంలో కొంతకాలం రుతుస్రావం జరగదు. అయితే ఈ మహిళ పాలిచ్చే సమ యంలోనే గర్భం ధరించింది. ఇది సహజం అనుకోవడంతో గర్భం ధరించినట్లు గుర్తించలేకపోయింది. ఏడాది క్రితమే బిడ్డకు జన్మనిచ్చి పోస్ట్‌పార్టమ్ సైకోసిస్‌కు చికిత్స తీసుకుంటున్న ఈ మహిళ మరోసారి గర్భం ధరించడం గమనార్హం.
జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.వి. నాగరత్న ధర్మాసనం అంతకుముందు పిటీషన్‌ను అనుమతిస్తూ, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)ను ప్రక్రియ చేపట్టాలని నిర్దేశించింది. 2021 సవరణలకు ముందు అబార్షన్ కోసం కోర్టుకు ఎక్కిన కేసుల్లో అత్యధికం మానభంగం లేదా పిండాల వైకల్యం ఉన్నవారికి సంబంధించినవి. పైగా చాలావాటిల్లో గర్భం వయసు 20 వారాల కంటే ఎక్కువే. వేర్వేరు పరిస్థితుల కారణంగా మహిళలకు కొంచెం లేటైనా అబార్షన్ అనేది అవసరమవుతుంది.
తొలినాళ్లలోనే అబార్షన్ చేసేందుకు వైద్యపరంగా అవకాశాల్లేకపోవడం వీటిల్లో ఒకటి. లైంగిక దాడి, గృహహింస, జైలు వంటివి ఇతర కారణాలు. గర్భం ధరించిన తరువాత పరిస్థితుల్లో వచ్చే మార్పులు (భాగస్వామి సాయం లేక పోవడం, ఆర్థిక పరిస్థితులు, విద్య, ఉద్యోగం వంటివి), శారీరక, మానసిక ఆరోగ్యం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసు కోవాల్సి ఉంటుంది. మెనోపాజ్ లేదా లాక్టేషనల్ అమెనోరియా (పాలిచ్చే సమయంలో రుతుస్రావం నిలిచిపోవడం) కూడా అబార్షన్‌కు తగిన కారణాలని చెప్పాలి.
అబార్షన్లకు సంబంధించి 2021 నాటి సుప్రీంకోర్టు సవరణ గర్భం తాలూకూ వయో పరిమితిని పెంచింది మినహా ఇతర మార్పులేవీ చేయలేదు. దీనివల్ల ప్రయోజనం కొద్దిమందికే. తల్లి ప్రాణాలు కాపాడాల్సిన పరిస్థితి వస్తే ఓ ఆర్‌ఎంపీ ఏ దశలోనైనా గర్భాన్ని తొలగించేందుకు అవకాశం ఉండగా చాలామంది కేసుల భయంతో ఆ పని చేసేందుకు జంకు తున్నారు. ఫలితంగా మహిళలు గత్యంతరం లేని పరిస్థితుల్లో కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తోంది. కోర్టులకు వెళ్లడం ఇష్టం లేని వారైతే గర్భాన్ని కొనసాగిస్తున్నారు లేదా ముతక పద్ధతులతో అబార్షన్ కు ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
గర్భం దాల్చిన తొలినాళ్లలోనే అబార్షన్ చేయించుకోవాలని అనుకున్నప్పటికీ కొంతమంది మహిళలు న్యాయ, వైద్యపరమైన అడ్డంకులను దాటలేకపోతున్నారు. పలుమార్లు వైద్యపరీక్షల అవసరం ఉండటం కూడా ప్రతిబంధకంగా మారుతోంది. ఒకవేళ న్యాయ స్థానాన్ని ఆశ్రయించినా న్యాయవాదుల ఇబ్బందికరమైన ప్రశ్నలను ఎదుర్కోవడం కూడా ఒక సమస్య. గత వారం సుప్రీంకోర్టులోనూ ఇలాంటి స్థితి ఎదురు కావడం చెప్పుకోవాల్సిన అంశం.
అబార్షన్ కోరిన మహిళ మానసిక పరిస్థితి బాగాలేదనీ, కౌన్సెలింగ్ తీసు కోవాలనీ పలుమార్లు న్యాయవాదులు సూచించారు. ఇంతటి కష్టా నికి, ఇబ్బందికి ఓర్చినా తుది ఫలితం అనుకూలంగా ఉంటుందన్న గ్యారెంటీ లేకపోవడం గమనార్హం. అయితే ఒక్క విషయం. ఇతర దేశాలతో పోలిస్తే అబార్షన్‌కు సంబంధించి భారతీయ చట్టాలు కొంత ఉదారంగానే ఉన్నాయని చెప్పాలి. అయినా అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాలు, అబార్షన్‌లో అత్యుత్తమ విధానాల విషయంలో మాత్రం అంత గొప్పగా ఏమీ లేవన్నదీ సుస్పష్టం.
గత ఏడాది ‘ఎక్స్’ వర్సెస్ ఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి మధ్య జరిగిన ఒక కేసు విషయంలో వైద్యపరమైన చట్టాలను అవసరాలకు తగ్గట్టుగా అర్థ వివరణ తీసుకోవచ్చునని సుప్రీంకోర్టు సూచించింది. ఆ కేసులో 24 వారాల వయసు గర్భంతో ఉన్న అవివాహిత మహిళకు అబార్షన్ చేయించుకునే హక్కు కల్పించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఆ మహిళకు ఉన్న హక్కుల ఆధారంగా వైద్యపరమైన పరీక్షలకు అతీతంగా నిర్ణయం తీసుకోవడం, ఎంటీపీ చట్టాలపై లక్ష్యాధారిత అర్థ వివరణ తీసు కోవడం గమనార్హం.
మహిళల వాస్తవిక జీవన పరిస్థితులు, సామాజిక వాస్తవాలను అర్థం చేసుకుని మరీ సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుందని అనుకోవాలి. అబార్షన్‌కు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం... ప్రభుత్వాలు అబార్షన్‌ను నేరంగా పరిగణించడాన్ని నిలిపివేయాలి. గర్భం వయసుపై పరిమితులు, ఇతర నియంత్రణలను కూడా తొలగించాలి. దీనివల్ల అందరికీ వివక్ష లేని అబార్షన్ సేవలు అందుతాయి. ఏ సమయంలోనైనా సురక్షితంగా గర్భాన్ని తొలగించేందుకు ఉన్న పద్ధతులను ఉపయోగించాలని కూడా ఈ మార్గదర్శకాలు సూచించాయి.
అబార్షన్ పై అడ్డంకులు విధాన పరమైన అడ్డంకులుగా మారుతున్నాయనీ, ఏ రకమైన శాస్త్రీయ ఆధా రాలు లేనివిగా మారాయనీ కూడా అవి వ్యాఖ్యానించాయి.
గత వారం జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.వి. నాగరత్నల ముందు విచారణకు వచ్చిన కేసులో జస్టిస్ నాగరత్న, జస్టిస్ హిమా కోహ్లీ తీర్పుతో విభేదించిన విషయం తెలిసిందే. ‘ఎక్స్’ కేసును ప్రస్తావించిన జస్టిస్ నాగరత్న గర్భం విషయంలో ఆ మహిళకు ఉన్న హక్కును గుర్తు చేశారు. మహిళ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఆ గర్భం అవాంఛితమైతే తొలగించుకునే హక్కు ఆ మహిళకు ఉందని స్పష్టం చేశారు.
గర్భాన్ని కొనసాగించాలని కోరడం ఆ మహిళ ఆరో గ్యాన్ని పణంగా పెట్టడం అవుతుందనీ, ఇది ఆర్టికల్ 21, 15 (3)లను అతిక్రమించినట్లు అనీ వివరించారు. అయితే చివరకు ఈ మహిళకు ‘ఎక్స్’ మాదిరిగా అబార్షన్ చేయించుకునే అవకాశం కలగకపోవడం గమనార్హం. ‘ఎక్స్’ కేసులో అవాంఛిత గర్భం తాలూకూ ప్రభావాన్ని అర్థం చేసుకున్న కోర్టు... ఇంకో మహిళ విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరించింది.
అబార్షన్‌ను తొమ్మిది నెలల వ్యవహారా నికి పరిమితం చేసేసింది. అవాంఛిత గర్భం కారణంగా ఆ మహిళ కాన్పు తరువాత కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నది గుర్తించకపోవడం దురదృష్టకరం. వాదనల సందర్భంగానూ న్యాయమూర్తులు, ప్రభుత్వం పలుమార్లు ఈ కేసుకు ఇతర కేసులకు మధ్య తేడాలను ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. అబార్షన్‌కు గల కార ణాల విలువ ఒకరికి ఎక్కువ? ఇంకొరికి తక్కువగా ఉంటాయా?
-వ్యాసకర్త బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ) బోధకులు
Comments
Please login to add a commentAdd a comment