అయిదు నెలల కిందట నాకు మూడో నెల ప్రెగ్రెన్సీ అబార్షన్ అయిపోయింది. డాక్టర్ దగ్గరకేమీ వెళ్లలేదు. తర్వాత నెల నుంచి కూడా మామూలుగానే పీరియడ్స్ వస్తున్నాయి. కానీ కొంచెం కడుపు నొప్పి ఉంటోంది. ఇది అబార్షన్ వల్లే అంటారా? ఇప్పుడు డాక్టర్‌కి చూపించు కోవాలా? మళ్లీ గర్భం వచ్చే చాన్స్ ఉంటుందా?
– మమత గ్రేస్, సామర్లకోట
ప్రతి అయిదుగురిలో ఒకరికి ఇలా మూడునెలల లోపే గర్భస్రావం అవుతుంటుంది. అయితే ఇది మళ్లీ మళ్లీ రిపీట్ అయ్యే చాన్సెస్ తక్కువ. మళ్లీ గర్భం దాల్చినప్పుడు సక్సెస్ అయ్యే చాన్స్ 90 శాతం పైనే ఉంటుంది. సాధారణంగా.. క్రోమోజోమ్స్, జన్యు లోపాలతో కూడిన పిండం వల్లే గర్భస్రావం అవుతూంటుంది. కానీ ఇలా గర్భస్రావం అయినప్పుడు కచ్చితంగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ తప్పకుండా చేయించుకుని అంతా నార్మల్‌గానే ఉందా.. ఏమైనా ముక్కలు ఉండిపోయాయా అని చెక్ చేయడం మంచిది.
కడుపు నొప్పి చాలారోజుల వరకు కొనసాగుతుంటే ఇంటర్నల్ వెజైనల్ ఎగ్జామినేషన్ చేసి లోపల ఇన్‌ఫెక్షన్ ఏమైనా ఉందా అని కూడా చెక్ చేయాలి. మీకు మళ్లీ నెలసరి సరిగ్గా వస్తోంది అంటే గర్భసంచికి ప్రాబ్లమ్ ఏమీ లేదు అనే అర్థమవుతోంది. అయితే ఎందుకు మీకు మూడో నెలకు అబార్షన్ అయింది.. ఇప్పుడు కడుపు నొప్పి ఎందుకు వస్తోంది అనేది తేలాలి.
ఇందుకు ఒకసారి మీరు డాక్టర్‌ను సంప్రదించాలి. కొన్ని రకాల రక్తపరీక్షలు, మూత్ర పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. తరువాత ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి ముందు మీరు థైరాయిడ్, బ్లడ్ సుగర్ టెస్ట్‌లు చేయించుకోవాలి. అలాగే ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి కనీసం నెల ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ మాత్రలను తీసుకుంటే మంచిది. పౌష్టికాహారం తప్పనిసరి. అధిక రక్తస్రావం, దుర్వాసన, జ్వరం ఉంటే మాత్రం వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.
Comments
Please login to add a commentAdd a comment