ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) వెంటనే రావాలనే వైపుంటారా, వ్యతిరేకంగా ఉంటారా అని లెక్కలు ఎందుకు? యూసీసీ కావాలా, వద్దా అనే పోటీ పెట్టి, ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయి అనేది సమాధానం కాదు. ఫేస్ బుక్‌లో, సామాజిక మీడియాలో, ఆలోచించే వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. హిందువులు, ముస్లింలు, జైనులు, క్రైస్తవులు, యూదులు, ఇతర మతాల వారు, ముఠాల వారు, అనేక రకాల వర్ణాల వారు, కులాల వారు, అటూ ఇటూ చీలిపోవడం న్యాయం కాదు.
ఏమైనా చేసి ఎన్నికల్లో గెలవడం అత్యవసరమైపోయింది. కొన్ని పార్టీలు ఓడిపోయేందుకు సిద్ధం. వందల కోట్ల రూపాయలు రాజకీయ నాయకులకు ఇస్తున్నారంటే అనేక పార్టీలు ఓడిపోవ డానికీ, ఓట్లు చీల్చడానికీ సిద్ధం. అందుకే రాజకీయ అవస రాలతో సంస్కరణ చేయాలనడం దారుణం.
పర్సనల్ లా అంటే ‘వ్యక్తిగతమైన’ అని అర్థం కాదు. ఒక మతానికి చెందిన చట్టాల ప్రకారం అని అర్థం. వివాహం, ఆస్తుల వారసత్వం ఇందులోని అంశాలు. ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయడానికి వైవిధ్యపూరిత దేశంలో ముందు సమానత్వం, దాంతో మొత్తం మీద భారతదేశానికి ఏకత్వాన్ని కూడా సాధించాల్సి ఉంటుంది.
ఇంతవరకు ఉమ్మడి పౌర స్మృతి మీద కోర్టులు సలహాలు ఇచ్చాయే గానీ స్పష్టమైన తీర్పులు ఇవ్వలేదు. గత 40 ఏళ్లలో భిన్న తీర్పుల్లో భాగంగా ‘దేశ సమైక్యత’ కోసం ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావాలంటూ సుప్రీం కోర్టు ప్రభుత్వాలకు సూచిస్తూ వచ్చింది. ఇటువంటి సంక్లి ష్టమైన యూసీసీ విషయంలో పార్లమెంట్ చట్టం చేయా ల్సిందే కానీ సుప్రీంకోర్టు ఆదేశాలు కావాలని స్పష్టం చేయడం సాధ్యం కాదు.
హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులకు తమ తమ మతాలకు వర్తించే విభిన్న చట్టాలున్నాయి. భారత రాజ్యాంగం కింద ఈ మతాలలో అమలు చేసుకునే హక్కులు ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గం మైనారీలకున్న ఈ హక్కులను ఉల్లంఘించి పార్లమెంటులో చట్టం చేస్తుంది కావచ్చు. కొన్ని సంవత్సరాల తరు వాత దాన్ని సవరించి కొట్టివేసేదాకా జనం ఎన్నికల్లో తమను సమర్థించాలనే ఆలోచన కూడా ఉండవచ్చు.
అనేక చట్టాలు అందరికీ వర్తించేలా ఉంటాయి. ఉదాహరణ: ప్రొటెక్షన్ ఫ్రమ్ డొమెస్టిక్ వయొలెన్స్ యాక్ట్. గృహ హింస నిరోధక చట్టం! ఈ చట్టం అన్ని మతాల వారికీ ఉపయోగమే. అందులో ‘వయొలెన్స్’ అన్నంత మాత్రాన దాన్ని క్రిమినల్ చట్టం అనుకుంటారు. కానీ అది సివిల్ కేసు. అవన్నీ సివిల్ కోర్టులో విచారణ చేస్తారు. క్రిమినల్ కేసులు కూడా అన్ని మతాల వారికీ ఉప యోగపడేవి. వీటిని ఎక్కువగా వాడుకునేది హిందువులే.
వారితోపాటు ముస్లింలు, క్రైస్తవులు కూడా వినియోగిస్తున్నారనడం నిజం. చాలామంది దుర్వినియోగం అంటారు. దానికి కారణం ఎక్కువమంది అబద్ధాలు ఆడతారు. భార్యలైనా భర్తలైనా లేదా వారి బంధువులైనా అబద్ధాలు విపరీతంగా చెబుతూ అంటారు. లాయర్లని బద్నాం చేస్తాం గానీ, అబద్ధాలు ఆడని వారెవరు?
ఎవరూ కోరని యూసీసీ ఇప్పుడెందుకు? తినే హక్కు గురించి ఎవరూ అడగడం లేదు. సంపాదించుకున్న ప్రకారం వండుకొని తినే హక్కు, ఇష్టమైన వస్త్రాలు వేసుకునే హక్కు, నచ్చిన భగవద్గీత, ఖురాన్, బైబిల్ చదువుకుని, పాడుకునే హక్కు ఉన్నాయి. ఇవి యూసీసీకి అతీతమైనవి కదా! రాజ్యాంగం తప్పనిసరిగా చదవాలనే శాసనం, లేదా చట్టం ఉండనవసరం లేదు.
అది స్వాతంత్య్రానికి సంబంధించిన అంశం. టమాటా ధరలను నియంత్రించే చట్టం ప్రభుత్వాలు చేయగలవా? దేశంలో పెళ్లి, విడాకులు, వారసత్వంగా వచ్చే ఆస్తి, పిల్లలను దత్తత తీసుకోవడం వంటి విషయాలకు సంబంధించి చట్టాలు అందరికీ ఒకేలా లేవు. ఆచరించే మతం, విశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా ఒక్కో వ్యక్తికి చట్టం ఒక్కోలా ఉంటుంది.
మాడభూషి శ్రీధర్
వ్యాసకర్త డీన్, స్కూల్ ఆఫ్ లా,మహీంద్రా యూనివర్సిటీ
తినే హక్కు గురించి కదా అడగాలి?
Published Sun, Sep 3 2023 12:35 AM | Last Updated on Sun, Sep 3 2023 12:37 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment