common civil code
-
ఉత్తరాఖండ్‌లో ఈ నెల నుంచే యూసీసీ
బరెల్లీ: దేశంలోనే ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ)ని మొట్టమొదటి సారిగా అమలు చేసే రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుంది. తమ రాష్ట్రంలో ఈ జనవరిలోనే ఉమ్మడి పౌర స్మృతిని అమల్లోకి తేనున్నట్లు సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు. గురువారం బరెల్లీలో ఆయన 29వ ఉత్తరాయణి మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..దేశానికి జీవజలాలను అందించే పవిత్ర శారద, గంగ, సరస్వతి, కావేరీ నదుల వంటిదే యూసీసీ కూడా అని ఆయన పేర్కొన్నారు. యూసీసీని దేశవ్యాప్తంగా అమలు చేయాలన్నది బీజేపీ ఎజెండాగా ఎప్పటి నుంచో ఉందని గుర్తు చేశారు. యూసీసీ బిల్లుకు గతేడాది ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం తెలపగా మార్చిలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంతకంతో చట్టంగా మారింది. -
ఉమ్మడి పౌరస్మృతి ఆమోదయోగ్యం కాదు
న్యూఢిల్లీ: ఉమ్మడి పౌరస్మృతి ముస్లింలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పేర్కొంది. ముస్లిం పర్సనల్ లా విషయంలో తాము రాజీపడే ప్రసక్తే లేదని తేలి్చచెప్పింది. ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి మాట్లాడుతూ ‘లౌకిక పౌరస్మృతి’ తేవాల్సిన అవసరం ఉందన్న విషయం తెలిసిందే. మతపరమైన పౌరస్మృతిగా పర్సనల్ చట్టాలను మోదీ అభివర్ణించడంపై ముస్లిం బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. లౌకిక పౌరస్మృతి పక్కా ప్రణాళికతో కూడిన కుట్రని, తీవ్ర విపరిణామాలుంటాయని ముస్లిం బోర్డు అధికార ప్రతినిధి ఎస్.క్యూ.ఆర్.ఇలియాస్ అన్నారు. -
ఉత్తరాఖండ్‌లో బహుభార్యత్వం రద్దు!
డెహ్రాడూన్: బీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌లో బహుభార్యత్వంపై నిషేధంతో పాటు సహజీవనాన్ని ధ్రువీకరిస్తూ డిక్లరేషన్‌నూ తప్పనిసరి చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) అమలుకు సంబంధించిన ముసాయిదాను జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్ కమిటీ శుక్రవారం సీఎం పుష్కర్ సింగ్ ధామికి సమరి్పంచింది. అందులో కీలక ప్రతిపాదనలు చేసింది. ‘‘రాష్ట్రంలో జరిగే ప్రతి పెళ్లినీ విధిగా రిజిస్ట్రర్ చేయించాల్సిందే. విడాకులు కోరే హక్కులు భార్యభర్తలకు సమానంగా ఉంటాయి. భార్య జీవించి ఉండగా భర్త మరో పెళ్లి చేసుకోవడం చట్టప్రకారం నేరం. బహు భార్యత్వంపై నిషేధం అమలు చేయాలి. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకూ వారసత్వ హక్కులుంటాయి. సహజీవనం చేస్తుంటే దానిని అధికారికంగా ధ్రువీకరిస్తూ స్త్రీ, పురుషులిద్దరూ డిక్లరేషన్‌ను సమరి్పంచాలి’’ అని పేర్కొంది. ఈ నిబంధనల నుంచి షెడ్యూల్ తెగలకు మినహాయింపు ఇవ్వనున్నారు. యూసీసీ ముసాయిదా రూపకల్పన కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం 202లో ఈ కమిటీని వేసింది. 2022 అసెంబ్లీ ఎన్నికల హామీ అమలు దిశగా ఇదో కీలక అడుగని ధామీ అభివరి్ణంచారు. ముసాయిదాను క్షుణ్నంగా పరిశీలించాక అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామని చెప్పారు. ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు జరిగే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో యూసీసీ బిల్లును తెచ్చి ఆమోదించి చట్టం చేస్తామన్నారు. యూసీసీ అమలైతే వివాహం, విడాకులు, ఆస్తి, వారసత్వం వంటి అంశాల్లో పౌరులందరికీ మతంతో సంబంధం లేకుండా సమాన చట్టాలు అమలవుతాయి. మేమూ అదే బాటలో: అసోం సీఎం బహుభార్యత్వం విధానాన్ని రద్దుచేయనున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి çహిమంత బిశ్వ శర్మ కూడా ప్రకటించారు. ‘‘అసోంలో యూసీసీ అమలుపై గతేడాదే మాకు నివేదిక అందింది. దానిని న్యాయశాఖ పరిశీలిస్తోంది. కుదిరితే ఫిబ్రవరి ఐదున మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లుగా ప్రవేశపెట్టి చట్టంగా తెస్తాం’’ అని హిమంత అన్నారు. -
UCC CODE: ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌర స్మృతి!
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచీ దేశవ్యాప్తంగా విస్తృతంగా చర్చల్లో నిలుస్తూ వస్తున్న ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్–యూసీసీ)ని హిమాలయ రాష్ట్రం ఉత్తరాఖండ్ త్వరలో అమలు చేయనున్నట్టు సమాచారం. వచ్చే వారమే ఈ దిశగా చర్యలు చేపట్టబోతోందని తెలుస్తోంది. తద్వారా దేశంలో యూసీసీని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా అది నిలవనుంది. యూసీసీపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ సారథ్యంలో ఏర్పాటైన కమిటీ ఒకట్రెండు రోజుల్లో సీఎం పుష్కర్‌సింగ్ ధామికి నివేదిక సమరి్పంచనుంది. దీపావళి అనంతరం రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై యూసీసీ బిల్లును ఆమోదించనుంది. తద్వారా దానికి చట్టబద్ధత కలి్పంచనుంది. ఎన్నికల వాగ్దానం: ఉత్తరాఖండ్‌లో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేసిన ఎన్నికల వాగ్దానాల్లో యూసీసీ అమలు ప్రధానమైనది. ఆ మేరకు జస్టిస్ దేశాయ్ సారథ్యంలో ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తూ తొలి కేబినెట్ భేటీలోనే సీఎం ధామీ నిర్ణయం తీసుకున్నారు. డ్రాఫ్ట్ తయారీ కోసం రాష్ట్రంలో దాదాపు 2.3 లక్షల మందితో కమిటీ చర్చలు జరిపింది. యూసీసీ డ్రాఫ్ట్ కమిటీలో కూడా ఆమె సభ్యురాలు. ఏమిటీ ఉమ్మడి పౌర స్మృతి? ► కులం, మతం, ఆడ–మగ వంటి తేడాలు, లైంగిక ప్రవృత్తులతో నిమిత్తం లేకుండా దేశ పౌరులందరికీ ఒకే రకమైన వ్యక్తిగత చట్టాలను వర్తింపజేయడం ఉమ్మడి పౌర స్మృతి ప్రధానోద్దేశం. ► ఇది అమలైతే ప్రస్తుతం అమల్లో ఉన్న పలు మత, ఆచార, సంప్రదాయ ఆధారిత వ్యక్తిగత చట్టాలన్నీ రద్దవుతాయి. ► వివాహాలు, విడాకులు, వారసత్వం, దత్తత తదితరాలతో పాలు పలు ఇతర వ్యక్తిగత అంశాలు కూడా యూసీసీ పరిధిలోకి వస్తాయి. ► రాజ్యాంగంలోని 44వ అధికరణం ఆధారంగా దీన్ని తెరపైకి తెచ్చారు. ► 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందే బీజేపీ పాలిత గుజరాత్ కూడా ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయనుందని చెబుతున్నారు! ► గోవాలో ఇప్పటికే గోవా పౌర స్మృతి అమల్లో ఉంది. ఇది చాలా రకాలుగా యూసీసీని పోలి ఉంటుంది. రాజ్యాంగం ఏమంటోంది? ‘‘దేశవ్యాప్తంగా పౌరులందరికీ ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలి’’ అని రాజ్యాంగంలోని 4వ భాగం స్పష్టంగా నిర్దేశిస్తోంది. అయితే దీన్ని రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో భాగంగా పేర్కొన్నారు. కనుక దీని అమలు తప్పనిసరి కాదు. ఆ దృష్ట్యా యూసీసీ అమలుకు కోర్టులు ఆదేశించజాలవు. సుప్రీంకోర్టు కూడా... అత్యున్నత న్యాయస్థానం కూడా పలు తీర్పుల సందర్భంగా యూసీసీ అమలు ఆవశ్యకతను నొక్కిచెప్పింది. అయితే 2018లో మోదీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు యూసీసీపై లోతుగా పరిశీలించిన కేంద్ర లా కమిషన్ మాత్రం భిన్నాభిప్రాయం వెలిబుచ్చడం విశేషం. ‘‘ఈ దశలో దేశానికి ఉమ్మడి పౌర స్మృతి అవసరమూ లేదు. అభిలషణీయమూ కాదు’’ అంటూ కేంద్రానికి ఏకంగా 185 పేజీల నివేదిక సమరి్పంచింది! పారీ్టల్లో భిన్నాభిప్రాయాలు... యూసీసీ అమలుపై రాజకీయ పక్షాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. బీజేపీ దీన్ని గట్టిగా సమరి్థంచడమే గాక అధికారంలోకి వస్తే దేశమంతటా యూసీసీని కచి్చతంగా అమలు చేస్తా మని 2019 లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో హా మీ కూడా ఇచ్చింది. ఇక కాంగ్రెస్, మజ్లిస్ తదితర పక్షాలు యూసీసీని వ్యతిరేకిస్తున్నాయి... ► ప్రధాని మోదీ తొలినుంచీ యూసీసీ అమలును గట్టిగా సమరి్థస్తూ వస్తున్నారు. రెండు రకాల చట్టాలతో దేశం ఎలా నడుస్తుందని మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కూడా ప్రశ్నించారు. ► ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ తదితరులు కూడా పలు సందర్భాల్లో యూసీసీని సమరి్థంచారు. ‘‘దేశ పౌరులందరికీ ఉమ్మడి పౌర స్మృతి ఉండాలన్నదే మన రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశం కూడా. దాని అమలుకు ఇదే సమయం’’ అని ధన్‌ఖడ్ అభిప్రాయపడ్డారు. ► యూసీసీ పేరుతో ద్రవ్యోల్బణం, అవినీతి, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి పెను సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడమే మోదీ లక్ష్యమని కాంగ్రెస్ దుయ్యబడు తోంది. ► రాజ్యాంగంలోని 29వ అధికరణానికి యూసీసీ విరుద్ధమని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆక్షేపించారు. ‘‘బహుళత్వం, వైవిధ్యమే మన దేశ సంపద. యూసీసీ పేరుతో వాటికి తూట్లు పొడిచేందుకు మోదీ ప్రయ తి్నస్తున్నారు’’ అంటూ మండిపడ్డారు. ► యూసీసీ వస్తే తమ సాంప్రదాయిక ఆచారాలకు అడ్డుకట్ట పడుతుందేమోనని దేశవ్యాప్తంగా 30 పై చిలుకు గిరిజన సంఘాలు కూడా ఇప్పటికే సందేహం వెలిబుచ్చాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తినే హక్కు గురించి కదా అడగాలి?
ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) వెంటనే రావాలనే వైపుంటారా, వ్యతిరేకంగా ఉంటారా అని లెక్కలు ఎందుకు? యూసీసీ కావాలా, వద్దా అనే పోటీ పెట్టి, ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయి అనేది సమాధానం కాదు. ఫేస్ బుక్‌లో, సామాజిక మీడియాలో, ఆలోచించే వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. హిందువులు, ముస్లింలు, జైనులు, క్రైస్తవులు, యూదులు, ఇతర మతాల వారు, ముఠాల వారు, అనేక రకాల వర్ణాల వారు, కులాల వారు, అటూ ఇటూ చీలిపోవడం న్యాయం కాదు. ఏమైనా చేసి ఎన్నికల్లో గెలవడం అత్యవసరమైపోయింది. కొన్ని పార్టీలు ఓడిపోయేందుకు సిద్ధం. వందల కోట్ల రూపాయలు రాజకీయ నాయకులకు ఇస్తున్నారంటే అనేక పార్టీలు ఓడిపోవ డానికీ, ఓట్లు చీల్చడానికీ సిద్ధం. అందుకే రాజకీయ అవస రాలతో సంస్కరణ చేయాలనడం దారుణం. పర్సనల్ లా అంటే ‘వ్యక్తిగతమైన’ అని అర్థం కాదు. ఒక మతానికి చెందిన చట్టాల ప్రకారం అని అర్థం. వివాహం, ఆస్తుల వారసత్వం ఇందులోని అంశాలు. ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయడానికి వైవిధ్యపూరిత దేశంలో ముందు సమానత్వం, దాంతో మొత్తం మీద భారతదేశానికి ఏకత్వాన్ని కూడా సాధించాల్సి ఉంటుంది. ఇంతవరకు ఉమ్మడి పౌర స్మృతి మీద కోర్టులు సలహాలు ఇచ్చాయే గానీ స్పష్టమైన తీర్పులు ఇవ్వలేదు. గత 40 ఏళ్లలో భిన్న తీర్పుల్లో భాగంగా ‘దేశ సమైక్యత’ కోసం ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావాలంటూ సుప్రీం కోర్టు ప్రభుత్వాలకు సూచిస్తూ వచ్చింది. ఇటువంటి సంక్లి ష్టమైన యూసీసీ విషయంలో పార్లమెంట్ చట్టం చేయా ల్సిందే కానీ సుప్రీంకోర్టు ఆదేశాలు కావాలని స్పష్టం చేయడం సాధ్యం కాదు. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులకు తమ తమ మతాలకు వర్తించే విభిన్న చట్టాలున్నాయి. భారత రాజ్యాంగం కింద ఈ మతాలలో అమలు చేసుకునే హక్కులు ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గం మైనారీలకున్న ఈ హక్కులను ఉల్లంఘించి పార్లమెంటులో చట్టం చేస్తుంది కావచ్చు. కొన్ని సంవత్సరాల తరు వాత దాన్ని సవరించి కొట్టివేసేదాకా జనం ఎన్నికల్లో తమను సమర్థించాలనే ఆలోచన కూడా ఉండవచ్చు. అనేక చట్టాలు అందరికీ వర్తించేలా ఉంటాయి. ఉదాహరణ: ప్రొటెక్షన్ ఫ్రమ్ డొమెస్టిక్ వయొలెన్స్ యాక్ట్. గృహ హింస నిరోధక చట్టం! ఈ చట్టం అన్ని మతాల వారికీ ఉపయోగమే. అందులో ‘వయొలెన్స్’ అన్నంత మాత్రాన దాన్ని క్రిమినల్ చట్టం అనుకుంటారు. కానీ అది సివిల్ కేసు. అవన్నీ సివిల్ కోర్టులో విచారణ చేస్తారు. క్రిమినల్ కేసులు కూడా అన్ని మతాల వారికీ ఉప యోగపడేవి. వీటిని ఎక్కువగా వాడుకునేది హిందువులే. వారితోపాటు ముస్లింలు, క్రైస్తవులు కూడా వినియోగిస్తున్నారనడం నిజం. చాలామంది దుర్వినియోగం అంటారు. దానికి కారణం ఎక్కువమంది అబద్ధాలు ఆడతారు. భార్యలైనా భర్తలైనా లేదా వారి బంధువులైనా అబద్ధాలు విపరీతంగా చెబుతూ అంటారు. లాయర్లని బద్నాం చేస్తాం గానీ, అబద్ధాలు ఆడని వారెవరు? ఎవరూ కోరని యూసీసీ ఇప్పుడెందుకు? తినే హక్కు గురించి ఎవరూ అడగడం లేదు. సంపాదించుకున్న ప్రకారం వండుకొని తినే హక్కు, ఇష్టమైన వస్త్రాలు వేసుకునే హక్కు, నచ్చిన భగవద్గీత, ఖురాన్, బైబిల్ చదువుకుని, పాడుకునే హక్కు ఉన్నాయి. ఇవి యూసీసీకి అతీతమైనవి కదా! రాజ్యాంగం తప్పనిసరిగా చదవాలనే శాసనం, లేదా చట్టం ఉండనవసరం లేదు. అది స్వాతంత్య్రానికి సంబంధించిన అంశం. టమాటా ధరలను నియంత్రించే చట్టం ప్రభుత్వాలు చేయగలవా? దేశంలో పెళ్లి, విడాకులు, వారసత్వంగా వచ్చే ఆస్తి, పిల్లలను దత్తత తీసుకోవడం వంటి విషయాలకు సంబంధించి చట్టాలు అందరికీ ఒకేలా లేవు. ఆచరించే మతం, విశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా ఒక్కో వ్యక్తికి చట్టం ఒక్కోలా ఉంటుంది. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త డీన్, స్కూల్ ఆఫ్ లా,మహీంద్రా యూనివర్సిటీ -
అసలు కావలిసింది ‘ఉమ్మడి ఆర్థిక స్మృతి!’
దేశ పౌరుల్లో కొందరికి భారీ ఆస్తులున్నాయి! కొందరికి రెక్కల కష్టం తప్ప వేరే మార్గం లేదు. దేశంలో భూములు ఎన్ని? అవి ఉమ్మడిగానే ఉంటున్నాయా? దేశంలో, ఉత్పత్తి రాసుల్ని కురిపించే పరిశ్రమల్లో పౌరులందరూ సమానులేనా? సమస్త రవాణా సాధనాలనూ నిర్మించడానికీ, నడపడానికీ, కోట్ల కోట్ల డబ్బు రాసుల రాబడులకూ కారకులు ఎవరు? వాటి యాజమాన్యాలు ఎవరివి? ఆస్తి హక్కులకు కారణాలు ఏమిటి? పాకీ దొడ్లు తుడిచే అట్టడుగు కులాల శ్రామికులకు దేని మీద యాజమాన్యం ఉంది? దేశంలో, నిత్యం 24 గంటలూ ఉత్పత్తుల కార్యాలలో మునిగి బ్రతికే శ్రామికులకు సుఖ శాంతుల్లో ఉమ్మడితనం ఉందా? ‘ఉమ్మడి పౌర స్మృతి’ అనేది నిజంగా ఎప్పుడు సాధ్యం? ‘ఉమ్మడి ఆర్థిక స్మృతి’ అనేది ఉన్నప్పుడు మాత్రమే! ‘ఒకే ఇంట్లో వున్న ఇద్దరు వ్యక్తులకు రెండు వేరు వేరు చట్టాలు వుంటే, ఆ కుటుంబం సవ్యంగా సాగుతుందా, చెప్పండి?’ అని ప్రధాని మోదీ, బీజేపీ కార్యకర్తల్ని అడిగిన వార్త, పది రోజులుగా ఒక చర్చనీయాంశం అయింది! అన్ని మతాల వారినీ ఒకే రకపు పౌరులుగా చేయాలనే ప్రయత్నంతో, ‘ఉమ్మడి పౌర స్మృతి’ అనే విధానం ఎంత అవసరమో చెప్పడానికి మోదీ తమ పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన ఉపన్యాసం అది! దేశంలో, ఐదు రాష్ట్రాలలో, త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని, అన్న బోధనగా ఆ మాటల్ని అర్ధం చేసుకోవచ్చు. ముస్లిం ఓటర్ల ఓట్లు బీజేపీకి ఎలానూ రావని ఆ పార్టీకి తెలుసు. కాబట్టి, హిందూ ఓటర్లలో అత్యధికుల్ని తన వైపు తిప్పుకోవడానికే బీజేపీ చేసే ప్రయత్నం అది. ఆ విధంగా భారత దేశ ప్రజలందర్నీ పౌరులుగా కాక, హిందువులుగా, ముస్లిములుగా, విభజించడానికే మోదీ వేసిన ఎత్తుగడ అది– అని కొన్ని ప్రతిపక్షాలు సరిగానే విమర్శిస్తున్నాయి. ‘ఉమ్మడి పౌర స్మృతి’ అనే విధానపు మంచి చెడ్డల గురించి చెప్పుకోవాలంటే, ముందు అది ఏమిటో కనీసంగా తెలియాలి. ఒక దేశంలోనే కాదు, ప్రపంచం లోనే వున్న ఆడా, మగా పౌరులందరికీ, మతం, కులం, ప్రాంతం వంటి తేడాలు లేకుండా, పౌరుల వ్యక్తిగత జీవితాల్నీ, కుటుంబ జీవితాల్నీ శాసించే, ఒకే రకమైన చట్టం (‘స్మృతి’) ఉండవలిసిందే! ఎందుకంటే, ఉదాహరణకి, ఒకటి రెండు మతాల్లో, పురుషులకు ఎక్కువ మంది స్త్రీలతో పెళ్ళిళ్ళు! ఇంకో మతంలో, పెళ్ళయిన వాళ్ళు విడిపోవడంలో స్త్రీలకే కాదు, పురుషులకు కూడా అసాధ్యమైనంత కష్టం! మతాల్లో, ఆస్తి హక్కులు ఆడవాళ్ళకీ, మగవాళ్ళకీ వేరు వేరుగా! మొగవాడి దృష్టిలో ఆడది తక్కువ! ఆడదాని దృష్టిలో మొగవాడు ఎక్కువ! ఈ విధంగా, పెళ్ళీ, విడాకులూ, దత్తతా, ఆస్తి హక్కూ, వంటి విషయాల్లో, వేరు వేరు మతస్తుల ఆచారాలూ, నియమాలూ, వేరు వేరే! ఎందుకూ? భారత్‌లో, మతాల గురించీ, కులాల గురించీ, సమానత్వాల బోధనలతో మాట్లాడే వాళ్ళు, అసలు బ్రతుకు తెరువుకి పునాది కారణం అయిన ఆదాయాల్లో తేడాల గురించి ఎందుకు ఎత్తరు? ‘ఉమ్మడి పౌర స్మృతి’ కోసం ప్రయత్నించాలని, భారత రాజ్యాంగంలో కూడా ఒక చోట చెప్పారని తెలుస్తుంది! కానీ, దాన్ని సాధించడానికి సరైన పునాదిగా ఏ పరిస్థితులు ఏర్పడాలో భారత రాజ్యాంగం చెప్పదు! ఎవరి మతాచారాల్ని వారు ఆచరించే హక్కులు ఉండవచ్చని ఒక వేపు చెపుతూనే, ‘మతాలతో నిమిత్తం లేకుండా’ పౌరులందరికీ, వ్యక్తిగత, కుటుంబ జీవితాలకు సంబంధించి ఒకే చట్టం ఉండాలని ఇంకో పక్క సూచిస్తుంది. ఎంత గడుసు రాజ్యాంగం! ఒకటి ‘ప్రాధమికమైన హక్కూ’! రెండోది కేవలం ‘సూచన’! సూచన, నిబంధనగా ఎప్పటికీ అవదు. ఉమ్మడి పౌర స్మృతి కూడా నిజానికి సూచన వంటిదే! కానీ, దాన్ని చట్టంగా నిలబెట్టాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పుడు. మోదీని, బీజేపీ కార్యకర్తలు ఈ తర్కంతో అడగాలి: అయ్యా! తమరు ఉమ్మడి పౌర స్మృతి పేరుతో పౌరులందరికీ ఒకే చట్టం ఉండాలంటున్నారు! ఆ స్మృతి, కేవలం వ్యక్తిగత, కుటుంబ జీవితాలకు మాత్రమే కదా? మరి, పౌరులందరూ ఆర్ధికంగా ఒకే స్తితిలో లేరు! ‘ఆర్ధికంగా’ అంటే, ‘రూపాయి నోట్ల’ పరంగా కాదు, శ్రమలు చేయడాల పరంగా, ఉత్పత్తి కార్యాల పరంగా! దేశ పౌరుల్లో, కొందరికి భారీ భారీ ఆస్తులున్నాయి! కొందరికి రెక్కల కష్టం తప్ప వేరే మార్గం లేదు. దేశంలో భూములు ఎన్ని? అవి ఉమ్మడిగానే వుంటున్నాయా? దేశంలో, ఉత్పత్తి రాసుల్ని కురిపించే పరిశ్రమల్లో పౌరులందరూ సమానులేనా? సమస్త రవాణా సాధనాలనూ నిర్మించడానికీ, నడపడానికీ, కోట్ల కోట్ల డబ్బు రాసుల రాబడులకూ కారకులు ఎవరు? వాటి యాజమాన్యాలు ఎవరివి? ఆస్తి హక్కులకు కారణాలు ఏమిటి? పాకీ దొడ్లు తుడిచే అట్టడుగు కులాల శ్రామికులకు దేనిమీద యాజమాన్యం వుంది? దేశంలో, నిత్యం, 24 గంటలూ, ఉత్పత్తుల కార్యాలలో మునిగి బ్రతికే శ్రామికులకు, సుఖ శాంతుల్లో ఉమ్మడితనం వుందా? ఆడవాళ్ళ గృహ కార్యాలలో, పిల్లల పెంపకాల్లో, వృద్ధుల సంరక్షణల్లో, పురుషుల ఉమ్మడి పాత్ర వుందా? శ్రామిక జనంలో, మేధా శ్రామికులు వేరూ, శారీరక శ్రమల వారు వేరూ! శ్రమలు చేయడాల్లో ఉమ్మడితనం లేకపోతే, పౌరులుగా సమానులా? ఈ రకంగా ఆర్ధిక అసమానతల గురించి స్పష్టంగా గ్రహిస్తూ, మోదీ వంటి నాయకుల్ని అడగవలిసిన ప్రశ్న ఏమిటి? వ్యవసాయంలో, పరిశ్రమల్లో, రవాణాల్లో, సమస్త శ్రమల్లోనూ కాదా; ఏ ఒక్క శ్రమలో అయినా వేలు పెట్టని పౌరులకూ, రాత్రింబవళ్ళూ డ్యూటీలతో సతమతమయ్యే పౌరులకూ మధ్య ఉమ్మడితనం ఉన్నట్టా? ఇది వుందో లేదో ప్రశ్న లేకుండా, పెళ్ళికో, విడాకులకో, దత్తతకో, దీనికో, దానికో ఉమ్మడి చట్టాలా? హక్కులే సమానంగా, ఉమ్మడిగా లేనప్పుడు, ఉమ్మడి పౌర çస్మృతి గురించి ఉపన్యాసం ఇస్తున్నారేమీ మహాశయా?– అని మోదీని ప్రజలందరూ ప్రశ్నించలేరా? ఎన్నికల ముచ్చట్లలోనూ, నాయకుల ఆరాధనల్లోనూ మునిగిపోయిన ఏ పార్టీ ప్రజలకైనా, ఏ ప్రశ్నలూ రావు. ‘ఉమ్మడి పౌర స్మృతి’ అనేది నిజంగా ఎప్పుడు సాధ్యం? ‘ఉమ్మడి ఆర్ధిక స్మృతి’ అనేది ఉన్నప్పుడు! ఉమ్మడి ఆర్ధిక స్మృతి అంటే: మానవుల మనుగడకు ఆధారమైన భూములూ, గనులూ, అడవులూ, పరిశ్రమలూ, రవాణా సాధనాలూ వంటి ఉత్పత్తి సాధనాలు, పౌరులందరి ఉమ్మడి ఆస్తిగా, అంటే, ‘సమాజపు ఆస్తి’ గా ఉన్నప్పుడు! అలా ఉంచే చట్టమే ఉమ్మడి ఆర్ధిక స్మృతి! చిన్న పిల్లలూ, వృద్ధులూ, అనారోగ్యంతో వున్నవారూ తప్ప, ఇతర స్త్రీ–పురుషులందరూ, వేరు వేరు విలువలు కలిగిన, ఉత్పత్తి కార్యాలలో బాధ్యతలు కలిగి వుండే విధానమే ఉమ్మడి ఆర్ధిక స్మృతి! ఆ విధానమే ఉమ్మడి పౌర స్మృతికి దారితీయగలదు! శ్రమ దోపిడీని అనుమతించే వర్గ భేదాల రాజ్యాంగ పాలన వున్న చోట, తర్క రహిత మతాచారాలు జీవితాల్ని శాసిస్తూ వుంటాయి. సమానత్వం లేని శ్రమ విభజన వల్ల తలెత్తిన కుల వ్యవస్త ఉన్నంతవరకూ, కుల కట్టుబాట్లూ, కులాచారాలూ, సమస్త కులాల పౌరుల్నీ ఎంతగానో లొంగదీస్తాయి! ఉమ్మడి ఆర్ధిక వ్యవస్త లేని సమాజంలో, దుర్భరమైన దారిద్య్రం కారణంగా, స్త్రీలని భోగ్య వస్తువులుగా కొనడాలూ, అమ్మడాలూ వంటి ‘వృత్తులు’ పుట్టుకొచ్చి సాగుతున్నాయి. కేవలం ఉమ్మడి పౌర çస్మృతి వల్ల, మతం గానీ, కులం గానీ, వ్యభిచారం వంటి ‘వృత్తులు’ గానీ మాయం అవుతాయా? ఉన్న అసమానతల మీద సంస్కరణలు కొంత ఉపశమనాన్ని ఇస్తాయి. నిజమే! కానీ, మౌలికమైన మార్పులు అత్యవసరమైన సమాజంలో, చిట్టి పొట్టి సంస్కరణలు స్తిరపడతాయా? ‘ఉమ్మడి పౌర స్మృతి’ని వ్యతిరేకించే వారు, ముస్లిం ఆడకూతుర్లకూ (‘ముసల్మాన్ బేటియా’), ముస్లింలలో వెనకబడ్డ ‘పాస్మండా’ కులాలకూ ద్రోహం చేస్తున్నారు– అని వాపోయింది ప్రధాని కరుణా హృదయం! మరి, మొన్న బిల్కిస్ బానోనీ, ఇతర ముస్లిం స్త్రీలనీ అత్యాచారాలకు గురిచేసిన నేరస్తుల్ని, బీజేపీ ప్రభుత్వం విడుదల చేయడం ‘ముస్లిం బేటీయా’లకు ద్రోహం చేయడం అవలేదా? రంగనాయకమ్మ వ్యాసకర్త సుప్రసిద్ధ రచయిత్రి -
యూసీసీని వ్యతిరేకిస్తాం
లక్నో: ఒకే దేశం ఒకే చట్టం ఆవశ్యకతపై ప్రధానమంత్రి మంత్రి నరేంద్ర మోదీ బహిరంగంగానే వ్యాఖ్యానించడంతో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మంగళవారం రాత్రికి రాత్రి సమావేశమైంది. ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టుగా స్పష్టం చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించిన బోర్డు సభ్యులు యూసీసీకి వ్యతిరేకంగా న్యాయపరమైన పోరాటంపై వ్యూహ రచన చేయనున్నట్టు చెప్పారు. ఈ అంశంలో ఏర్పాటు చేసిన 22వ లా కమిషన్‌కు సమరి్పంచాల్సిన ముసాయిదా పత్రంపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్టుగా ఏఐఎంపీఎల్బీ సభ్యుడు ఖలీద్ రషీద్ వెల్లడించారు. న్యాయ కమిషన్ ఎదుట అభ్యంతరాలను వెల్లడించడానికి చివరి తేదీ జూలైæ 14 అని, అందుకే దీనిపై విస్తృతంగా చర్చించామన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉండే యూసీసీని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. భారత్‌లో ఎన్నో మతాలు, సంస్కృతులకు ఉన్నాయని ఉమ్మడి పౌరచట్టాన్ని తీసుకువస్తే ముస్లింలతో పాటు హిందువులు, క్రిస్టియన్లు, జైనులు, పార్సీలు, యూదులు ఇలా అందరిపై ప్రభావం చూపిస్తుందన్నారు. -
యూసీసీకి మతం రంగు పులమొద్దు: రాజ్‌నాథ్ సింగ్
జోద్పూర్: దేశంలో ఉమ్మడిపౌర స్మృతి(యూసీసీ) అమలు గురించి కేంద్ర ప్రభుత్వం మాట్లాడినప్పుడల్లా ప్రతిపక్షాలు మతం కోణాన్ని తెరపైకి తీసుకొస్తున్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. సమాజాన్ని చీల్చే రాజకీయాలు చేయొద్దని విపక్షాలకు హితవు పలికారు. యూసీసీకి మతం రంగు పులమొద్దని సూచించారు. రాజ్యాంగం ప్రకారమే ముందుకెళ్తున్నామని, ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. ఆయన బుధవారం రాజస్తాన్‌లో ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. మహిళల గౌరవాన్ని కాపాడే విషయంలో మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో, అంకితభావంతో పని చేస్తోందన్నారు. -
ఉమ్మడి పౌర స్మృతిపై 8.5 లక్షల ప్రతిస్పందనలు
న్యూఢిల్లీ: ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ)పై ఇప్పటిదాకా ప్రజల నుంచి 8.5 లక్షల ప్రతిస్పందనలు తమకు అందాయని లా కమిషన్ చైర్మన్ జస్టిస్ రితూ రాజ్ అవస్తీ బుధవారం చెప్పారు. యూసీసీపై అభిప్రాయాలు తెలియజేయాలని రెండు వారాల క్రితం లా కమిషన్ కోరిన సంగతి తెలిసిందే. యూసీసీపై రాజకీయ పక్షాలు, మత సంస్థలు, ప్రజల నుంచి రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలోకి వస్తే యూసీసీని అమలు చేస్తామని బీజేపీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచి్చంది. ఒక దేశంలో రెండు రకాల చట్టాలు ఉండడం సమంజసం కాదని తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఉమ్మడి పౌర స్మృతికి ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) మద్దతు పలికింది. అయితే, ఏకాభిప్రాయంతోనే యూసీసీని అమలు చేయాలని సూచించింది. -
ఒకే దేశం.. ఒకే చట్టం సాధ్యమేనా!
ఉమ్మడి పౌరస్మృతిపై దేశంలో మళ్లీ చర్చ ఊపందుకుంది.ఒక దేశానికి రెండు చట్టాలు కావాలా అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూటిగానే ప్రశ్నించారు. ఒకే కుటుంబంలో ఉండే ఇద్దరు వ్యక్తులకి రెండు నిబంధనలు పెడితే దేశం ఎలా ముందుకు వెళుతుందని నిలదీశారు. ఇప్పటికే 22వ లా కమిషన్‌ను ఏర్పాటు చేసి దేశ ప్రజలు, మత సంస్థల అభిప్రాయాలను 30 రోజుల్లోగా తీసుకోవాలని గడువు విధించారు. ఈ పరిణామాలతో అసలు ఉమ్మడి పౌరస్మృతి అంటే ఏమిటి ? అది అమలు చేయడం వల్ల ఏమవుతుంది ? అనుకూల వర్గం ఏమంటోంది? ప్రతికూలుర వాదనలు ఏంటి ? వంటి ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. ఒకే దేశం.. ఒకే చట్టం.. ఇదే ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ముందున్న లక్ష్యం. బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) తీసుకువస్తామని హామీ ఇచ్చింది. అయోధ్య రామ మందిర నిర్మాణం, కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత బీజేపీ ఉమ్మడి పౌరస్మృతిపైనే దృష్టి సారించింది. ఉమ్మడి పౌరస్మృతి అంటే దేశవ్యాప్తంగా ఒకే పౌర చట్టం అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం మన దేశంలో వివాహం, విడాకులు, దత్తత, భరణం, సంరక్షణ, వారసత్వం తదితర వ్యక్తిగత అంశాల్లో మతాలవారీగా చట్టాలు అమల్లో ఉన్నాయి. హిందువులు, ముస్లింలు, క్యాథలిక్ క్రిస్టియన్లు, పార్సీలు ఎవరికి వారు తమ మత చట్టాలనే అనుసరిస్తారు. ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతిని అమల్లోకి తీసుకువస్తే ఈ వ్యక్తిగత చట్టాలన్నీ రద్దయి అందరికీ ఒకే చట్టం అమలవుతుంది. ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌లు యూసీసీని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాయి. రాజ్యాంగ హక్కులు వర్సెస్ ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 భారత పౌరులందరికీ ఒకే చట్టం వర్తించేలా యూసీసీ రూపొందించడానికి ప్రభుత్వం ప్రయత్నించాలని పేర్కొంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 37 ప్రకారం ఆదేశిక సూత్రాలలో ఉన్న నిబంధనలు దేశ పరిపాలనలో ప్రాథమికమైనవి. ఈ సూత్రాలను వర్తింప జేయడం ప్రభుత్వ విధి అని స్పష్టం చేసింది. అయితే యూసీసీ అనేది ఆదేశిక సూత్రాల్లో ఒకటిగా ఉంది తప్ప రాజ్యాంగం ఇచ్చిన హక్కు కాదు. అందుకే స్వాతంత్య్రానంతరం యూసీసీ అమలు చేయడానికి కొన్ని ప్రయత్నాలు జరిగినా అమల్లోకి రాలేదు. పర్సనల్ లా అనేది మత సంప్రదాయాలు, విశ్వాసాలకు సంబంధించినది కావడంతో వారి మనోభావాలు దెబ్బ తీసేలా యూసీసీ తీసుకురావడం అంత సులభం కాదన్న వాదనలు ఉన్నాయి. షాబానో కేసుతో మలుపు రాజ్యాంగాన్ని రచించిన సమయంలోనే ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని అప్పటి నాయకులు గుర్తించారు. భవిష్యత్‌లోనైనా దేశవ్యాప్తంగా ఒకే చట్టం తీసుకురావాలని అయితే ఇది నిర్బంధంగా కాకుండా స్వచ్ఛందంగా అమల్లోకి వస్తే బాగుంటుందని భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ అభిప్రాయపడ్డారు. మైనార్టీలు తిరుగుబాటు చేసే విధంగా ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు అని ఆయన అప్పట్లోనే వ్యాఖ్యానించారు. ఆ తర్వాత యూసీసీని తీసుకురావాలని ప్రభుత్వం పెద్దగా ప్రయత్నాలు చేయలేదు. 1985లో షా బానో కేసుతో యూసీసీ ఆవశ్యకత ఉందన్న అభిప్రాయం బలంగా వచ్చింది. మధ్యప్రదేశ్‌కు చెందిన షాబానో అనే ముస్లిం మహిళ 40 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత మూడు సార్లు తలాక్ చెప్పి తనకు విడాకులిచ్చిన భర్త నుంచి భరణం కోరుతూ కోర్టుకెక్కారు. సుప్రీం కోర్టు కూడా ఆమెకు జీవనభృతి చెల్లించాలని తీర్పు చెప్పింది. అయితే అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న రాజీవ్ గాంధీ సర్కార్ ముస్లిం మహిళల చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం ముస్లిం మహిళలకు విడాకులు ఇచ్చినా భర్త భరణం ఇవ్వక్కర్లేదు. ఇలా పర్సనల్ చట్టాల్లోని సంక్లిష్టత, వివక్షను ఆయుధాలుగా చేసుకొని బీజేపీ ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి తీసుకురావాలని గట్టి పట్టుదలతో ఉంది. మన దేశంలో గోవాలో మాత్రమే ఒకే చట్టం అమలవుతోంది. 1867లో పోర్చుగల్ సివిల్ కోడ్ అమల్లోకి వచ్చింది. అది ఇప్పటికీ కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో మాత్రమే అన్ని మతాలకు ఒకే చట్టం అమల్లో ఉంది. ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి తేవడంలో ఎన్ని అనుకూలతలు ఉన్నాయో అన్నే ప్రతికూలతలు కూడా ఉన్నాయి. దేశంలో ముస్లింలలో అభద్రతా భావం పెరిగిపోతుందన్నది ప్రధాన ఆందోళన. అటు హిందువుల్లో కూడా వ్యతిరేకత వచ్చే అవకాశాలున్నాయనే అనుమానాలున్నాయి. ఎందుకంటే నాగాలాండ్, మేఘాలయ, మిజోరం వంటి ఈశాన్య రాష్ట్రాల్లో హిందూ చట్టాల్లో కూడా తేడాలున్నాయి. 200కి పైగా ఆదివాసీ తెగలు తమ సొంత సంప్రదాయ చట్టాలనే అనుసరిస్తాయి. అనుకూలం ♦ రాజ్యాంగంలోని లౌకిక స్ఫూర్తికి అనుకూలంగా కులం, మతం, ప్రాంతం, వర్గం లింగ భేదాలు లేకుండా దేశవ్యాప్తంగా పౌరులందరికీ ఒకే చట్టం అమలై జాతి సమగ్రతకు దోహదçపడుతుంది. ♦ ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న మతపరమైన పర్సనల్ చట్టాలు కాలం చెల్లిపోయినవి. ఉమ్మడి పౌర స్మృతి వస్తే అవన్నీ రద్దవుతాయి ♦ పర్సనల్ చట్టాల్లో స్త్రీ, పురుష వివక్ష ఎక్కువగా ఉంది. ముస్లిం పర్సనల్ లా ప్రకారం పురుషులు నాలుగు పెళ్లిళ్లు చేసుకోవచ్చు. యూసీసీ వస్తే ఇలాంటి వివక్ష పోయి స్త్రీ, పురుష సమానత్వం సాధ్యపడుతుంది. ♦ చైనాను దాటేసి ప్రపంచ జనాభాలో నంబర్ వన్ స్థానానికి చేరుకున్నాం. జనాభా పెరుగుదల వల్ల కలిగే దు్రష్పభావాలను అరికట్టడానికి, అన్ని మతాల్లోనూ చిన్న కుటుంబాలను ప్రోత్సహించడానికి వీలవుతుంది ♦సుప్రీం కోర్టులో తీర్పులు చెప్పడం సులభమవుతుంది. భిన్న మతాచారాలకు సంబంధించిన కేసులు వస్తున్నప్పుడు తీర్పుల్లో విపరీతమైన గందరగోళం నెలకొంటోందని అత్యున్నత న్యాయస్థానం ఎన్నో సందర్భాల్లో స్పష్టం చేసింది. యూసీసీ ఆవశ్యకత గురించి పలు మార్లు వ్యాఖ్యలు చేసింది. దీనిని వీలైనంత తర్వగా తీసుకురావాలని కేంద్రానికి పలు కేసుల సందర్భంగా సూచించింది. ప్రతికూలం ♦ ఉమ్మడి పౌరస్మృతిని ముస్లిం సమాజంతీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ మీద జరిగే మత, సాంస్కృతిక దాడిగా భావిస్తోంది. బీజేపీ మైనార్టీ వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందన్న భావన ఇప్పటికే ఉంది. యూసీసీని కూడా తీసుకువస్తే దేశంలో ఘర్షణలకు దారి తీసే అవకాశాలున్నాయి ♦ ఉమ్మడి పౌరస్మృతిని రూపొందించడంలో సవాళ్లు ఎదురయ్యే అవకాశాలున్నాయి. పెళ్లి, విడాకులు, ఆస్తి, హక్కులు, భరణాలు వంటి వాటిపై ఏ మత ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకుంటారన్నది అతి పెద్ద సమస్యగా మేధోవర్గం భావిస్తోంది. ♦ యూనిఫామ్ సివిల్ కోడ్‌ని తీసుకురావడం కోసం 2016లో మోదీ ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. అప్పట్లో ఏర్పాటు చేసిన 21వ లా కమిషన్ దీనిని తీసుకురావడం ఏ మాత్రం వాంఛనీయం కాదని నివేదిక ఇచ్చింది. అప్పుడున్న పరిస్థితులకి, ఇప్పటికి పెద్ద తేడా ఏమీ రాలేదు. ♦ రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ద్వారా సంక్రమించే మత స్వేచ్ఛ, మైనార్టీ హక్కుల్ని పరిరక్షించే ఆర్టికల్ 29కి యూసీసీ అడ్డంకిగా మారుతుంది బ్రిటిష్ పాలకుల్ని కూడా అబ్బురపరిచిన భిన్నత్వంలో ఏకత్వం మన దేశం సొంతం. యూసీసీని తీసుకువస్తే సమాజంలో ఆ వైవిధ్యం దెబ్బ తింటుందన్న ఆందోళనలు ఉన్నాయి. - సాక్షి, నేషనల్ డెస్క్ -
ఒకే దేశం, ఒకే చట్టం... సాధ్యమయ్యేనా?
ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫాం సివిల్ కోడ్–యూసీసీ) మరోసారి తెరపైకి వచ్చింది. ఒకే దేశం ఒకే చట్టం ఎజెండాతో గతంలో ఉత్తరాఖండ్ ఎన్నికలప్పుడు యూసీసీ అమలుకు బీజేపీ సర్కారు కమిటీ వేయడం తెలిసిందే. తాజాగా గుజరాత్ కూడా అదే బాట పట్టింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇలా వరసగా యూసీసీ అమలుకు సై అంటూ ఉండడంపై చర్చ మొదలైంది. విభిన్న పరిస్థితులున్న దేశంలో ఒకే చట్టం ఎలా సాధ్యమన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి... కుల, మత, జాతి, ప్రాంత, లింగ భేదాలు లేకుండా దేశ పౌరులందరికీ ఒకే విధమైన చట్టాలను అమలు చేయడమే ఉమ్మడి పౌరస్మృతి. ఇది అమల్లోకి వస్తే పెళ్లిళ్లు, విడాకులు, వారసత్వ హక్కులు, జనన మరణాలు, దత్తత ప్రక్రియకు సంబంధించి పౌరులందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది. పౌరులందరికీ ఒకే చట్టాన్ని అమలు చేయడానికి ప్రభుత్వాలు కృషి చేయాలని, అప్పుడే సమానత్వ హోదా దక్కుతుందని రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 కూడా చెబుతోంది. హిందూత్వ ఎజెండాతో రాజకీయాలు చేస్తున్న బీజేపీ ఉమ్మడి పౌరస్మృతిని ఎన్నడో తన మేనిఫెస్టోలో చేర్చింది. తన రాజకీయ ఎజెండాలో ఆగ్రభాగాన ఉన్న అయోధ్య రామ మందిర నిర్మాణం చేపట్టింది. కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370ను రద్దు చేసింది. ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతిపై దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా ఒకేసారి అమలు చేయకుండా ముందు తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల నుంచి మొదలు పెట్టే వ్యూహంతో ముందుకు వెళ్తోంది. బీజేపీ పాలిత యూపీ, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ యూసీసీని దేశవ్యాప్తంగా అమలు చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. అనుమానాలూ లేకపోలేదు... అయితే యూసీసీపై హిందువుల్లోనే కాస్త వ్యతిరేకత వచ్చే ఆస్కారముందా అన్న అనుమానాలూ లేకపోలేదు. ‘‘భిన్న మతాలకు చెందిన వారికి వేర్వేరు లా బోర్డులున్నాయి. హిందూ మతానికి చెందినవారు కూడా వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు ఆచారాలు పాటిస్తున్నారు. వాటన్నింటికీ ఏకరూపత ఎలా సాధ్యం?’’ అన్నది ఒక వాదన. కేవలం మెజార్టీ ఓటు బ్యాంకును ఏకమొత్తంగా కొల్లగొట్టేందుకేనని ఒక వర్గం ఆరోపిస్తోంది. ఇది బీజేపీ ఎన్నికల స్టంటని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితర నేతలు అంటున్నారు. అందరికీ ఒకే చట్టాల్లేవా...? ప్రస్తుతం దేశంలో ముస్లింలు, క్రిస్టియన్లు, పార్సీలకు వారి మత సంప్రదాయాలకు అనుగుణంగా వ్యక్తిగత చట్టాలున్నాయి. ముస్లింలకు షరియా చట్టాలకు అనుగుణంగా ముస్లిం పర్సనల్ లా అమలవుతోంది. దాని ప్రకారం ముస్లిం పురుషులకు నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడానికి అనుమతి ఉంది. వేరే మతస్తులకు మాత్రం చట్టప్రకారం ఒక్క భార్యే ఉండాలి. సివిల్ అంశాల్లో కాంట్రాక్ట్ చట్టం, సివిల్ ప్రొసీజర్ కోడ్ వంటి అనేకానేక ఉమ్మడి చట్టాలనూ పలు రాష్ట్రాల్లో భారీగా సవరించారు. గోవాలో 1867 నాటి కామన్ సివిల్ కోడ్ అమల్లో ఉన్నా అక్కడా కేథలిక్కులకు, ఇతర మతాలకు భిన్నమైన నియమాలు పాటిస్తున్నారు. నాగాలాండ్, మిజోర, మేఘాలయాల్లోనైతే హిందూ చట్టాల్లో కూడా భిన్నత్వం ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మోదీ-షా తదుపరి టార్గెట్ అదేనా?
సాక్షి,న్యూఢిల్లీ: భారత ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్పీకరించినప్పటి నుంచి మూడోకంటికి తెలియకుండా సంచలన నిర్ణయాలను తీసుకుంటున్నారు. ప్రతిపక్షాల ఆరోపణలకు, ఆందోళనలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ముందస్తు సమాచారం లేకుండా అనూహ్యమైన చర్యలను చేపడుతున్నారు. పెద్దనోట్ల రద్దు, పాకిస్తాన్‌పై మెరుపుదాడులు, బాలాకోట్‌పై వైమానిక దాడి వంటి సాహసోపేత నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు. తాజాగా కశ్మీర్‌కు ప్రత్యేక ప్రత్తిపత్తి హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేసి చరిత్రలో నిలిచిపోయారు. ఈ చర్య దేశ ప్రజలనే కాక యావత్ ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా పార్లమెంట్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆర్టికల్ 370ని రద్దు చేశామని చెప్పారు. దీంతో మోదీ ప్రభుత్వం తదుపరి నిర్ణయం ఏ విధంగా ఉంటుంది, దేనిపై తీసుకుంటారన్న అంశం ఉత్కంఠగా మారింది. ఉమ్మడి పౌరస్మృతి.. ఈ నేపథ్యంలో గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లు మోదీ సర్కారు తదుపరి అడుగు ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ప్రవేశ పెట్టడం వైపేనా! ఆ దిశగా ఎన్డీయే సర్కారు నిర్ణయం తీసుకోనుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇటీవల పరిణామాలను పరిశీలిస్తే వీటికి ‘ఔను’ అనే సమాధానాలు కూడా వినిపిస్తున్నాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు, ఉమ్మడి పౌరస్మృతి.. ఇవన్నీ దశాబ్దాలుగా బీజేపీ ఎజెండాలో ఉన్నప్పటికీ ఆచరణలో మాత్రం సాధ్యంకాలేదు. లోక్‌సభలో పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ రాజ్యసభలో సరిపడ బలం లేకపోవడంతో సర్కార్ ఆచితూచి అడుగులు వేసింది. ప్రస్తుతం ఇలాంటి అనుమానాలకు అంతగా తావులేకుండా పార్లమెంట్లో ప్రత్యేమైన వ్యూహాలను రచిస్తున్నారు. లోక్‌సభలో సంపూర్ణ మెజార్టీ ఉండటం, రాజ్యసభలో కూడా విపక్షాల నుంచి అంతోకొంత మద్దతు లభించడం కేంద్ర ప్రభుత్వానికి కలిసొచ్చే అంశం. ఊపునిచ్చిన ట్రిపుల్ తలాక్.. 370 ఆర్టికల్‌ను మోదీ సర్కారు నిర్వీర్యం చేయడంతో బీజేపీ సర్కారు తన మేనిఫేస్టోలో ప్రకటించిన ‘హామీ’లను ఒక్కొక్కటిగా అమలు చేసే దిశగా అడుగులు వేయనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యసభలో సంఖ్యాపరంగా, సిద్ధాంతపరంగా పరిమితులున్నా ట్రిపుల్ తలాక్ నిషేధ బిల్లు, 370 ఆర్టికల్‌ను రద్దు చేసే బిల్లు ఆమోదం పొందడం బీజేపీ సర్కారుకు ఊపునిచ్చింది. దీంతో ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేసేందుకు బీజేపీ ఇక ఎంత మాత్రం సందేహించకపోవచ్చునని విశ్లేషకులు అంటున్నారు. మన దేశంలో ‘ఉమ్మడి పౌరస్మృతి’ అంశం చాలాకాలంగా ఆలోచనల స్థాయిలోనే ఉన్న విషయం తెలిసిందే. దీనిపై ఇంతవరకూ ఎలాంటి ఫలవంతంగా చర్చలు గానీ, నిర్ణయాలు గానీ జరగలేదు. ఉమ్మడి పౌరస్మృతి గురించి భారత రాజ్యాంగంలోని 44వ అధికరణంలో ఏకపంక్తి వాక్యంలో ప్రస్తావించారు. ప్రభుత్వం భారత భూ భాగమంతటా పౌరులందరికీ ఒకే విధమైన పౌరస్మృతి తీసుకొని రావటానికి ప్రయత్నించవలెను అని మాత్రమే రాసి ఉండడంతో దీనిపై ఏ ప్రభుత్వమూ ఇప్పటి వరకూ సరైన నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం దేశంలో ఒక్క గోవాలో మాత్రమే దీనిని అమలు చేస్తున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా దీనిని దేశమంతా అమలు చేయండని పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే. -
కామన్ సివిల్ కోడ్ కుదరదు
– ట్రిపుల్ తలాక్ సమస్య ప్రభుత్వ సృష్టి – జేఐహెచ్ జాతీయ సలహా మండలి సభ్యుడు అమీనుల్ హసన్ కర్నూలు (ఓల్డ్‌సిటీ): ‘మనది భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశమని, ఎవరి మతాచారాలు వారవి ఇక్కడ కామన్ సివిల్ కోడ్ అమలు కుదరదు’ అని జమాతే ఇస్లామీ హింద్ (జేఐహెచ్) జాతీయ సలహా మండలి సభ్యుడు అమీనుల్ హసన్ పేర్కొన్నారు. ముస్లిం పర్సనల్‌లా జాగృతి ఉద్యమంలో భాగంగా జేఐహెచ్ జిల్లా శాఖ శుక్రవారం సాయంత్రం పాతబస్తీలోని అమాన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన గొప్ప బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకు ముందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రిపుల్ తలాక్‌తో ముస్లిం మహిళలకు ఎలాంటి సమస్య లేదని, అయితే ప్రభుత్వమే సమస్యను సృష్టిస్తుందని తెలిపారు. విడాకుల సమస్య ముస్లింలకు 0.5 శాతం ఉండగా హిందూవులకు 3.7 శాతంగా ఉందని వివరించారు. ఇస్లాం ధర్మంలో షరియత్లోని అంశాలను మార్చే అధికారం ఎవరికీ ఉండదన్నారు. ఈ విషయం ప్రస్తుతం తరం యువకులకు తెలియదని, వారందరికి అవగాహన కల్పించేందుకే ముస్లిం పర్సనల్‌లా జాగృతి ఉద్యమం చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం దంపతులు వివాహ బంధాన్ని ఎలా కొనసాగించాలనే అంశాన్ని వివరించారు. కార్యక్రమంలో ఏపీ కార్యదర్శి, క్యాంప్ కన్వీనర్ మౌలానా సయ్యద్ ఇమ్దాదుల్లా హుసేని నిజామి, ప్రభుత్వ ఖాజీ సయ్యద్ సలీం బాష ఖాద్రి, అహ్లెహదీస్ ఖాజీ ముతహ్హర్ జామయీ, ముఫ్తి సయ్యద్ ఆరిఫ్‌పాషా ఖాద్రి, మౌలానాలు మాట్లాడారు. కార్యక్రమంలో జేఐహెచ్ జిల్లా ఆర్గనైజర్ చాంద్‌బాష, నగర ప్రచార కార్యదర్శి సైఫుద్దీన్, సభ్యుడు ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. -
కామన్ సివిల్‌కోడ్‌ను వ్యతిరేకిస్తాం
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి నసీర్ అహ్మద్ కొరిటెపాడు (గుంటూరు): కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నిర్ణయాలు ఇస్లాం మత ఔన్నత్యాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి యం.డి.నసీర్ అహ్మద్ ఆరోపించారు. కామన్ సివిల్‌కోడ్‌ను వ్యతిరేకిస్తూ ముస్లిం నాయకులతో కలసి బుధవారం నినాదాలు రాసి ఉన్న ప్లకార్డులతో మార్కెట్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, మతపరమైన హక్కులను కాలరాస్తూ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ముస్లింలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను సాధించుకోవడానికి కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి ప్రతి ముస్లిం యువకుడు, మహిళ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ముస్లిం నాయకులు షేక్ గులాం రసూల్, యం.డి.హిదాయతుల్లా, యం.డి.అస్లం మట్లాడుతూ ముస్లిం హక్కులకు భంగం కల్గించిన ఏ ప్రభుత్వాలు మనుగడ సాధించలేవని హెచ్చరించారు.