ఒకే దేశం.. ఒకే చట్టం సాధ్యమేనా! | Is possible One country One law | Sakshi
Sakshi News home page

ఒకే దేశం.. ఒకే చట్టం సాధ్యమేనా!

Published Wed, Jun 28 2023 3:26 AM | Last Updated on Wed, Jun 28 2023 3:26 AM

Is possible One country One law - Sakshi

ఉమ్మడి పౌరస్మృతిపై దేశంలో మళ్లీ చర్చ ఊపందుకుంది.ఒక దేశానికి రెండు చట్టాలు కావాలా అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూటిగానే ప్రశ్నించారు. ఒకే కుటుంబంలో ఉండే ఇద్దరు వ్యక్తులకి రెండు నిబంధనలు పెడితే దేశం ఎలా ముందుకు వెళుతుందని నిలదీశారు. ఇప్పటికే 22వ లా కమిషన్‌ను ఏర్పాటు చేసి దేశ ప్రజలు, మత సంస్థల అభిప్రాయాలను 30 రోజుల్లోగా తీసుకోవాలని గడువు విధించారు. ఈ పరిణామాలతో అసలు ఉమ్మడి పౌరస్మృతి అంటే ఏమిటి ? అది అమలు చేయడం వల్ల ఏమవుతుంది ? అనుకూల వర్గం ఏమంటోంది? ప్రతికూలుర వాదనలు ఏంటి ? వంటి ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. 

ఒకే దేశం.. ఒకే చట్టం.. ఇదే ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ముందున్న లక్ష్యం. బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ (యూసీసీ) తీసుకువస్తామని హామీ ఇచ్చింది. అయోధ్య రామ మందిర నిర్మాణం, కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత బీజేపీ ఉమ్మడి పౌరస్మృతిపైనే దృష్టి సారించింది. ఉమ్మడి పౌరస్మృతి అంటే దేశవ్యాప్తంగా ఒకే పౌర చట్టం అమల్లోకి వస్తుంది.

ప్రస్తుతం మన దేశంలో వివాహం, విడాకులు, దత్తత, భరణం, సంరక్షణ, వారసత్వం తదితర వ్యక్తిగత అంశాల్లో మతాలవారీగా చట్టాలు అమల్లో ఉన్నాయి. హిందువులు, ముస్లింలు, క్యాథలిక్‌ క్రిస్టియన్లు, పార్సీలు ఎవరికి వారు తమ మత చట్టాలనే అనుసరిస్తారు. ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతిని అమల్లోకి తీసుకువస్తే ఈ వ్యక్తిగత చట్టాలన్నీ రద్దయి అందరికీ ఒకే చట్టం అమలవుతుంది. ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌లు యూసీసీని తీసుకురావాలని డిమాండ్‌ చేస్తున్నాయి. 

రాజ్యాంగ హక్కులు వర్సెస్‌ ఆదేశిక సూత్రాలు  
రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 44 భారత పౌరులందరికీ ఒకే చట్టం వర్తించేలా యూసీసీ రూపొందించడానికి ప్రభుత్వం ప్రయత్నించాలని పేర్కొంది. రాజ్యాంగంలో ఆర్టికల్‌ 37 ప్రకారం ఆదేశిక సూత్రాలలో ఉన్న నిబంధనలు దేశ పరిపాలనలో ప్రాథమికమైనవి. ఈ సూత్రాలను వర్తింప జేయడం ప్రభుత్వ విధి అని స్పష్టం చేసింది.

అయితే యూసీసీ అనేది ఆదేశిక సూత్రాల్లో ఒకటిగా ఉంది తప్ప రాజ్యాంగం ఇచ్చిన హక్కు కాదు. అందుకే స్వాతంత్య్రానంతరం యూసీసీ అమలు చేయడానికి కొన్ని ప్రయత్నాలు జరిగినా అమల్లోకి రాలేదు. పర్సనల్‌ లా అనేది మత సంప్రదాయాలు, విశ్వాసాలకు సంబంధించినది కావడంతో వారి మనోభావాలు దెబ్బ తీసేలా యూసీసీ తీసుకురావడం అంత సులభం కాదన్న వాదనలు ఉన్నాయి.  

షాబానో కేసుతో మలుపు 
రాజ్యాంగాన్ని రచించిన సమయంలోనే ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని అప్పటి నాయకులు గుర్తించారు. భవిష్యత్‌లోనైనా దేశవ్యాప్తంగా ఒకే చట్టం తీసుకురావాలని అయితే ఇది నిర్బంధంగా కాకుండా స్వచ్ఛందంగా అమల్లోకి వస్తే బాగుంటుందని భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ అభిప్రాయపడ్డారు. మైనార్టీలు తిరుగుబాటు చేసే విధంగా ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు అని ఆయన అప్పట్లోనే వ్యాఖ్యానించారు.

ఆ తర్వాత యూసీసీని తీసుకురావాలని ప్రభుత్వం పెద్దగా ప్రయత్నాలు చేయలేదు. 1985లో షా బానో కేసుతో యూసీసీ ఆవశ్యకత ఉందన్న అభిప్రాయం బలంగా వచ్చింది. మధ్యప్రదేశ్‌కు చెందిన షాబానో అనే ముస్లిం మహిళ 40 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత మూడు సార్లు తలాక్‌ చెప్పి తనకు విడాకులిచ్చిన భర్త నుంచి భరణం కోరుతూ కోర్టుకెక్కారు. సుప్రీం కోర్టు కూడా ఆమెకు జీవనభృతి చెల్లించాలని తీర్పు చెప్పింది. అయితే అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న రాజీవ్‌ గాంధీ సర్కార్‌ ముస్లిం మహిళల చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించింది.

ఈ చట్టం ప్రకారం ముస్లిం మహిళలకు విడాకులు ఇచ్చినా భర్త భరణం ఇవ్వక్కర్లేదు. ఇలా పర్సనల్‌ చట్టాల్లోని సంక్లిష్టత, వివక్షను ఆయుధాలుగా చేసుకొని బీజేపీ ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి తీసుకురావాలని గట్టి పట్టుదలతో ఉంది. మన దేశంలో గోవాలో మాత్రమే ఒకే చట్టం అమలవుతోంది. 1867లో పోర్చుగల్‌ సివిల్‌ కోడ్‌ అమల్లోకి వచ్చింది. అది ఇప్పటికీ కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో మాత్రమే అన్ని మతాలకు ఒకే చట్టం అమల్లో ఉంది.  

ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి తేవడంలో ఎన్ని అనుకూలతలు ఉన్నాయో అన్నే ప్రతికూలతలు కూడా ఉన్నాయి. దేశంలో ముస్లింలలో అభద్రతా భావం పెరిగిపోతుందన్నది ప్రధాన ఆందోళన. అటు హిందువుల్లో కూడా వ్యతిరేకత వచ్చే అవకాశాలున్నాయనే అనుమానాలున్నాయి. ఎందుకంటే నాగాలాండ్, మేఘాలయ, మిజోరం వంటి ఈశాన్య రాష్ట్రాల్లో హిందూ చట్టాల్లో కూడా తేడాలున్నాయి. 200కి పైగా ఆదివాసీ తెగలు తమ సొంత సంప్రదాయ చట్టాలనే అనుసరిస్తాయి. 

అనుకూలం
రాజ్యాంగంలోని లౌకిక స్ఫూర్తికి అనుకూలంగా కులం, మతం, ప్రాంతం, వర్గం లింగ భేదాలు లేకుండా దేశవ్యాప్తంగా పౌరులందరికీ ఒకే చట్టం అమలై జాతి సమగ్రతకు దోహదçపడుతుంది. 

♦ ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న మతపరమైన పర్సనల్‌ చట్టాలు కాలం చెల్లిపోయినవి. ఉమ్మడి పౌర స్మృతి వస్తే అవన్నీ రద్దవుతాయి 

♦ పర్సనల్‌ చట్టాల్లో స్త్రీ, పురుష వివక్ష ఎక్కువగా ఉంది. ముస్లిం పర్సనల్‌ లా ప్రకారం పురుషులు నాలుగు పెళ్లిళ్లు చేసుకోవచ్చు. యూసీసీ వస్తే ఇలాంటి వివక్ష పోయి స్త్రీ, పురుష సమానత్వం సాధ్యపడుతుంది.  

♦ చైనాను దాటేసి ప్రపంచ జనాభాలో నంబర్‌ వన్‌ స్థానానికి చేరుకున్నాం. జనాభా పెరుగుదల వల్ల కలిగే దు్రష్పభావాలను అరికట్టడానికి, అన్ని మతాల్లోనూ చిన్న కుటుంబాలను ప్రోత్సహించడానికి వీలవుతుంది 

సుప్రీం కోర్టులో తీర్పులు చెప్పడం సులభమవుతుంది. భిన్న మతాచారాలకు సంబంధించిన కేసులు వస్తున్నప్పుడు తీర్పుల్లో విపరీతమైన గందరగోళం నెలకొంటోందని అత్యున్నత న్యాయస్థానం ఎన్నో సందర్భాల్లో స్పష్టం చేసింది. యూసీసీ ఆవశ్యకత గురించి పలు మార్లు వ్యాఖ్యలు చేసింది. దీనిని వీలైనంత తర్వగా తీసుకురావాలని కేంద్రానికి పలు కేసుల సందర్భంగా సూచించింది.

ప్రతికూలం  
♦ ఉమ్మడి పౌరస్మృతిని ముస్లిం సమాజంతీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ మీద జరిగే మత, సాంస్కృతిక దాడిగా భావిస్తోంది. బీజేపీ మైనార్టీ వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందన్న భావన ఇప్పటికే ఉంది. యూసీసీని కూడా తీసుకువస్తే దేశంలో ఘర్షణలకు దారి తీసే అవకాశాలున్నాయి 

♦ ఉమ్మడి పౌరస్మృతిని రూపొందించడంలో సవాళ్లు ఎదురయ్యే అవకాశాలున్నాయి. పెళ్లి, విడాకులు, ఆస్తి, హక్కులు, భరణాలు వంటి వాటిపై ఏ మత ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకుంటారన్నది అతి పెద్ద సమస్యగా మేధోవర్గం భావిస్తోంది.  

♦ యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ని తీసుకురావడం కోసం 2016లో మోదీ ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. అప్పట్లో ఏర్పాటు చేసిన 21వ లా కమిషన్‌ దీనిని తీసుకురావడం ఏ మాత్రం వాంఛనీయం కాదని నివేదిక ఇచ్చింది. అప్పుడున్న పరిస్థితులకి, ఇప్పటికి పెద్ద తేడా ఏమీ రాలేదు.  

♦ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25 ద్వారా సంక్రమించే మత స్వేచ్ఛ, మైనార్టీ హక్కుల్ని పరిరక్షించే ఆర్టికల్‌ 29కి యూసీసీ అడ్డంకిగా మారుతుంది బ్రిటిష్‌ పాలకుల్ని కూడా అబ్బురపరిచిన భిన్నత్వంలో ఏకత్వం మన దేశం సొంతం. యూసీసీని తీసుకువస్తే సమాజంలో ఆ వైవిధ్యం దెబ్బ తింటుందన్న ఆందోళనలు ఉన్నాయి.  

-  సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement