Civil Code
-
ఉమ్మడి పౌరస్మృతి ఆమోదయోగ్యం కాదు
న్యూఢిల్లీ: ఉమ్మడి పౌరస్మృతి ముస్లింలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పేర్కొంది. ముస్లిం పర్సనల్ లా విషయంలో తాము రాజీపడే ప్రసక్తే లేదని తేలి్చచెప్పింది. ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి మాట్లాడుతూ ‘లౌకిక పౌరస్మృతి’ తేవాల్సిన అవసరం ఉందన్న విషయం తెలిసిందే. మతపరమైన పౌరస్మృతిగా పర్సనల్ చట్టాలను మోదీ అభివర్ణించడంపై ముస్లిం బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. లౌకిక పౌరస్మృతి పక్కా ప్రణాళికతో కూడిన కుట్రని, తీవ్ర విపరిణామాలుంటాయని ముస్లిం బోర్డు అధికార ప్రతినిధి ఎస్.క్యూ.ఆర్.ఇలియాస్ అన్నారు. -
ఒకే దేశం.. ఒకే చట్టం సాధ్యమేనా!
ఉమ్మడి పౌరస్మృతిపై దేశంలో మళ్లీ చర్చ ఊపందుకుంది.ఒక దేశానికి రెండు చట్టాలు కావాలా అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూటిగానే ప్రశ్నించారు. ఒకే కుటుంబంలో ఉండే ఇద్దరు వ్యక్తులకి రెండు నిబంధనలు పెడితే దేశం ఎలా ముందుకు వెళుతుందని నిలదీశారు. ఇప్పటికే 22వ లా కమిషన్‌ను ఏర్పాటు చేసి దేశ ప్రజలు, మత సంస్థల అభిప్రాయాలను 30 రోజుల్లోగా తీసుకోవాలని గడువు విధించారు. ఈ పరిణామాలతో అసలు ఉమ్మడి పౌరస్మృతి అంటే ఏమిటి ? అది అమలు చేయడం వల్ల ఏమవుతుంది ? అనుకూల వర్గం ఏమంటోంది? ప్రతికూలుర వాదనలు ఏంటి ? వంటి ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. ఒకే దేశం.. ఒకే చట్టం.. ఇదే ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ముందున్న లక్ష్యం. బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) తీసుకువస్తామని హామీ ఇచ్చింది. అయోధ్య రామ మందిర నిర్మాణం, కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత బీజేపీ ఉమ్మడి పౌరస్మృతిపైనే దృష్టి సారించింది. ఉమ్మడి పౌరస్మృతి అంటే దేశవ్యాప్తంగా ఒకే పౌర చట్టం అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం మన దేశంలో వివాహం, విడాకులు, దత్తత, భరణం, సంరక్షణ, వారసత్వం తదితర వ్యక్తిగత అంశాల్లో మతాలవారీగా చట్టాలు అమల్లో ఉన్నాయి. హిందువులు, ముస్లింలు, క్యాథలిక్ క్రిస్టియన్లు, పార్సీలు ఎవరికి వారు తమ మత చట్టాలనే అనుసరిస్తారు. ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతిని అమల్లోకి తీసుకువస్తే ఈ వ్యక్తిగత చట్టాలన్నీ రద్దయి అందరికీ ఒకే చట్టం అమలవుతుంది. ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌లు యూసీసీని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాయి. రాజ్యాంగ హక్కులు వర్సెస్ ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 భారత పౌరులందరికీ ఒకే చట్టం వర్తించేలా యూసీసీ రూపొందించడానికి ప్రభుత్వం ప్రయత్నించాలని పేర్కొంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 37 ప్రకారం ఆదేశిక సూత్రాలలో ఉన్న నిబంధనలు దేశ పరిపాలనలో ప్రాథమికమైనవి. ఈ సూత్రాలను వర్తింప జేయడం ప్రభుత్వ విధి అని స్పష్టం చేసింది. అయితే యూసీసీ అనేది ఆదేశిక సూత్రాల్లో ఒకటిగా ఉంది తప్ప రాజ్యాంగం ఇచ్చిన హక్కు కాదు. అందుకే స్వాతంత్య్రానంతరం యూసీసీ అమలు చేయడానికి కొన్ని ప్రయత్నాలు జరిగినా అమల్లోకి రాలేదు. పర్సనల్ లా అనేది మత సంప్రదాయాలు, విశ్వాసాలకు సంబంధించినది కావడంతో వారి మనోభావాలు దెబ్బ తీసేలా యూసీసీ తీసుకురావడం అంత సులభం కాదన్న వాదనలు ఉన్నాయి. షాబానో కేసుతో మలుపు రాజ్యాంగాన్ని రచించిన సమయంలోనే ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని అప్పటి నాయకులు గుర్తించారు. భవిష్యత్‌లోనైనా దేశవ్యాప్తంగా ఒకే చట్టం తీసుకురావాలని అయితే ఇది నిర్బంధంగా కాకుండా స్వచ్ఛందంగా అమల్లోకి వస్తే బాగుంటుందని భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ అభిప్రాయపడ్డారు. మైనార్టీలు తిరుగుబాటు చేసే విధంగా ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు అని ఆయన అప్పట్లోనే వ్యాఖ్యానించారు. ఆ తర్వాత యూసీసీని తీసుకురావాలని ప్రభుత్వం పెద్దగా ప్రయత్నాలు చేయలేదు. 1985లో షా బానో కేసుతో యూసీసీ ఆవశ్యకత ఉందన్న అభిప్రాయం బలంగా వచ్చింది. మధ్యప్రదేశ్‌కు చెందిన షాబానో అనే ముస్లిం మహిళ 40 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత మూడు సార్లు తలాక్ చెప్పి తనకు విడాకులిచ్చిన భర్త నుంచి భరణం కోరుతూ కోర్టుకెక్కారు. సుప్రీం కోర్టు కూడా ఆమెకు జీవనభృతి చెల్లించాలని తీర్పు చెప్పింది. అయితే అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న రాజీవ్ గాంధీ సర్కార్ ముస్లిం మహిళల చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం ముస్లిం మహిళలకు విడాకులు ఇచ్చినా భర్త భరణం ఇవ్వక్కర్లేదు. ఇలా పర్సనల్ చట్టాల్లోని సంక్లిష్టత, వివక్షను ఆయుధాలుగా చేసుకొని బీజేపీ ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి తీసుకురావాలని గట్టి పట్టుదలతో ఉంది. మన దేశంలో గోవాలో మాత్రమే ఒకే చట్టం అమలవుతోంది. 1867లో పోర్చుగల్ సివిల్ కోడ్ అమల్లోకి వచ్చింది. అది ఇప్పటికీ కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో మాత్రమే అన్ని మతాలకు ఒకే చట్టం అమల్లో ఉంది. ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి తేవడంలో ఎన్ని అనుకూలతలు ఉన్నాయో అన్నే ప్రతికూలతలు కూడా ఉన్నాయి. దేశంలో ముస్లింలలో అభద్రతా భావం పెరిగిపోతుందన్నది ప్రధాన ఆందోళన. అటు హిందువుల్లో కూడా వ్యతిరేకత వచ్చే అవకాశాలున్నాయనే అనుమానాలున్నాయి. ఎందుకంటే నాగాలాండ్, మేఘాలయ, మిజోరం వంటి ఈశాన్య రాష్ట్రాల్లో హిందూ చట్టాల్లో కూడా తేడాలున్నాయి. 200కి పైగా ఆదివాసీ తెగలు తమ సొంత సంప్రదాయ చట్టాలనే అనుసరిస్తాయి. అనుకూలం ♦ రాజ్యాంగంలోని లౌకిక స్ఫూర్తికి అనుకూలంగా కులం, మతం, ప్రాంతం, వర్గం లింగ భేదాలు లేకుండా దేశవ్యాప్తంగా పౌరులందరికీ ఒకే చట్టం అమలై జాతి సమగ్రతకు దోహదçపడుతుంది. ♦ ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న మతపరమైన పర్సనల్ చట్టాలు కాలం చెల్లిపోయినవి. ఉమ్మడి పౌర స్మృతి వస్తే అవన్నీ రద్దవుతాయి ♦ పర్సనల్ చట్టాల్లో స్త్రీ, పురుష వివక్ష ఎక్కువగా ఉంది. ముస్లిం పర్సనల్ లా ప్రకారం పురుషులు నాలుగు పెళ్లిళ్లు చేసుకోవచ్చు. యూసీసీ వస్తే ఇలాంటి వివక్ష పోయి స్త్రీ, పురుష సమానత్వం సాధ్యపడుతుంది. ♦ చైనాను దాటేసి ప్రపంచ జనాభాలో నంబర్ వన్ స్థానానికి చేరుకున్నాం. జనాభా పెరుగుదల వల్ల కలిగే దు్రష్పభావాలను అరికట్టడానికి, అన్ని మతాల్లోనూ చిన్న కుటుంబాలను ప్రోత్సహించడానికి వీలవుతుంది ♦సుప్రీం కోర్టులో తీర్పులు చెప్పడం సులభమవుతుంది. భిన్న మతాచారాలకు సంబంధించిన కేసులు వస్తున్నప్పుడు తీర్పుల్లో విపరీతమైన గందరగోళం నెలకొంటోందని అత్యున్నత న్యాయస్థానం ఎన్నో సందర్భాల్లో స్పష్టం చేసింది. యూసీసీ ఆవశ్యకత గురించి పలు మార్లు వ్యాఖ్యలు చేసింది. దీనిని వీలైనంత తర్వగా తీసుకురావాలని కేంద్రానికి పలు కేసుల సందర్భంగా సూచించింది. ప్రతికూలం ♦ ఉమ్మడి పౌరస్మృతిని ముస్లిం సమాజంతీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ మీద జరిగే మత, సాంస్కృతిక దాడిగా భావిస్తోంది. బీజేపీ మైనార్టీ వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందన్న భావన ఇప్పటికే ఉంది. యూసీసీని కూడా తీసుకువస్తే దేశంలో ఘర్షణలకు దారి తీసే అవకాశాలున్నాయి ♦ ఉమ్మడి పౌరస్మృతిని రూపొందించడంలో సవాళ్లు ఎదురయ్యే అవకాశాలున్నాయి. పెళ్లి, విడాకులు, ఆస్తి, హక్కులు, భరణాలు వంటి వాటిపై ఏ మత ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకుంటారన్నది అతి పెద్ద సమస్యగా మేధోవర్గం భావిస్తోంది. ♦ యూనిఫామ్ సివిల్ కోడ్‌ని తీసుకురావడం కోసం 2016లో మోదీ ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. అప్పట్లో ఏర్పాటు చేసిన 21వ లా కమిషన్ దీనిని తీసుకురావడం ఏ మాత్రం వాంఛనీయం కాదని నివేదిక ఇచ్చింది. అప్పుడున్న పరిస్థితులకి, ఇప్పటికి పెద్ద తేడా ఏమీ రాలేదు. ♦ రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ద్వారా సంక్రమించే మత స్వేచ్ఛ, మైనార్టీ హక్కుల్ని పరిరక్షించే ఆర్టికల్ 29కి యూసీసీ అడ్డంకిగా మారుతుంది బ్రిటిష్ పాలకుల్ని కూడా అబ్బురపరిచిన భిన్నత్వంలో ఏకత్వం మన దేశం సొంతం. యూసీసీని తీసుకువస్తే సమాజంలో ఆ వైవిధ్యం దెబ్బ తింటుందన్న ఆందోళనలు ఉన్నాయి. - సాక్షి, నేషనల్ డెస్క్ -
‘ఉమ్మడి స్మృతి’పై రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు
న్యూఢిల్లీ: ఉమ్మడి పౌరస్మృతిని సిద్ధం చేసేందుకు ఓ ప్యానల్ ఏర్పాటు చేయాలని కోరుతూ వివాదాస్పద ప్రైవేట్ మెంబర్ బిల్లు శుక్రవారం రాజ్యసభ ముందుకొచ్చింది. విపక్ష సభ్యుల తీవ్ర అభ్యంతరాల మధ్య బీజేపీ ఎంపీ కిరోడీలాల్ మీనా దీన్ని ప్రవేశపెట్టారు. కాంగ్రెస్‌తో పాటు తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, సమాజ్‌వాదీ, సీపీఎం, సీపీఐ, ఆర్జేడీ తదితర విపక్షాలు బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. ఉమ్మడి స్మృతి దేశ సామాజిక నిర్మాణాన్ని నాశనం చేస్తుందంటూ ఆందోళన వెలిబుచ్చాయి. ‘‘ఆరెస్సెస్ అజెండాను అమలు చేసేందుకు పాలక బీజేపీ ప్రయత్నిస్తోంది. కశ్మీర్ అంశాన్ని ముగించేశారు. ఇప్పుడిక ఉమ్మడి స్మృతిపై పడ్డారు. ఈ బిల్లు పూర్తిగా అనైతికం. ప్రజా వ్యతిరేకం. రాజ్యాంగవిరుద్ధం. దీన్ని తక్షణం ఉపసంహరించాలి’’ అంటూ విపక్ష సభ్యులు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. దాంతో చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ ఓటింగ్ నిర్వహించారు. 63–23 తేడాతో బిల్లును ప్రవేశపెట్టడానికి ఆమోదం లభించింది. అనంతరం రాజ్యసభ నాయకుడు పీయూష్ గోయల్ మాట్లాడుతూ విపక్షాల అభ్యంతరాలు, ఆరోపణలను తోసిపుచ్చారు. ‘‘ఏ అంశాన్నైనా లేవనెత్తడం సభ్యుని హక్కు. ఉమ్మడి స్మృతిపై సభలో చర్చ జరగనిద్దాం’’ అని సూచించారు. ఉమ్మడి స్మృతిపై గతంలోనే బిల్లును లిస్ట్ చేసినా సభ దాకా రాలేదు. గవర్నర్ పాత్రపై సీపీఎం బిల్లు గవర్నర్ పాత్ర, అధికారులు, విధులను స్పష్టంగా నిర్వచిస్తూ రాజ్యాంగాన్ని సవరించాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ ఎంపీ వి.సదాశివన్ రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు. రాష్ట్రాల్లో తన అజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు గవర్నర్ల వ్యవస్థను కేంద్రం దారుణంగా దుర్వినియోగం చేస్తోందని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. ‘‘చరిత్రే ఇందుకు సాక్ష్యం. గవర్నర్ పదవి వలస పాలన సమయంలో భారతీయులను అణచేసేందుకు సృష్టించినది. గవర్నర్లు చాలావరకు ఇప్పటికీ అదే వలసవాద భావజాలంతో పని చేస్తున్నారు’’ అని విమర్శించారు. గవర్నర్‌ను కేంద్రమే నియమించేట్టయితే సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రికి మూడు పేర్లు ప్రతిపాదించి ఆయన సూచన మేరకు నడచుకోవాలన్నారు. ఇదీ చదవండి: ‘సీఎం పీఠం మా నేతకే..’ హిమాచల్‌లో ఆశావహుల మద్దతుదారుల డిమాండ్ -
ఉమ్మడి పౌరస్మృతి అవసరం లేదు
న్యూఢిల్లీ: ప్రస్తుత తరుణంలో ఉమ్మడి పౌరస్మృతి(అందరికీ ఒకే చట్టం) అవసరం గానీ, దానివల్ల ప్రయోజనం గానీ లేదని కేంద్ర న్యాయ కమిషన్ పేర్కొంది. వివాహం, విడాకులు, జీవనభృతి, పురుషులు, మహిళలకు చట్టబద్ధ వివాహ వయస్సు తదితర అంశాలపై ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల్లో మార్పులు అవసరమని ఉమ్మడి పౌరస్మృతిపై విడుదల చేసిన సంప్రదింపుల పత్రంలో అభిప్రాయపడింది. స్త్రీ, పురుషులకు వివాహ వయసును 18 ఏళ్లుగా మార్చాలంది. వివాహ చట్టాల్లో మార్పులు చేయాలి.. మహిళలకు సమాన హక్కులపై స్పందిస్తూ.. ‘ఒక మహిళ సంపాదనతో నిమిత్తం లేకుండా ఇంట్లో ఆమె పాత్రను గుర్తించాలి. వివాహం తర్వాత సంపాదించుకున్న ఆస్తిలో విడాకుల సమయంలో మహిళకు సమాన వాటా అందాలి’ అని తెలిపింది. ఇందుకోసం హిందూ వివాహ చట్టం 1955, ప్రత్యేక వివాహ చట్టం 1954, పార్సీ వివాహ, విడాకుల చట్టం యాక్ట్ 1936, క్రైస్తవ వివాహ చట్టం 1972, ముస్లిం వివాహ రద్దు చట్టం 1939లను సవరించవచ్చని పేర్కొంది. పురుషులకు, మహిళలకు కనిష్ట వివాహ వయస్సు 18 ఏళ్లుగా ఉండాలని, వేర్వేరు వివాహ వయస్సుల్ని రద్దు చేయాలంది. ప్రస్తుతం వివాహానికి పురుషుడికి 21 ఏళ్లు, మహిళకు 18 ఏళ్లు చట్టబద్ధ వయసుగా ఉంది. వితంతు హక్కులు, వివాహం అనంతరం సొంతంగా సంపాదించుకునే ఆస్తులపై చట్టాలు, సరిదిద్దలేనంతగా వివాహ జీవితం విచ్చిన్నం కావడాన్ని విడాకులను ప్రామాణికంగా తీసుకోవడం వంటి అంశాలపై సూచనలు చేసింది. పార్సీలకు సంబంధించి ఆ మతానికి చెందిన మహిళ వేరే మతస్తుడ్ని వివాహం చేసుకున్నా వారసత్వ ఆస్తిలో ఆమెకు భాగం ఉండాలంది. పిల్లల సంరక్షణ బాధ్యతల అప్పగింతలో వ్యక్తిగత చట్టాలకన్నా ఆ చిన్నారి క్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కమిషన్ పేర్కొంది. మతం ముసుగులో.. మత సంప్రదాయాల ముసుగులో ట్రిపుల్ తలాఖ్, బాల్య వివాహాలు వంటి సాంఘిక దురాచారాలు అమలుకాకుండా చూడాల్సి ఉందని కమిషన్ అభిప్రాయపడింది. ఉమ్మడి పౌరస్మృతి చాలా విస్తృతమైందని, దాని పరిణామాల ప్రభావంపై ఎలాంటి అధ్యయనం జరగలేదు అని పేర్కొంది. రెండేళ్ల పాటు విస్తృత పరిశోధన, సంప్రదింపుల అనంతరం భారతదేశంలోని కుటుంబ చట్టాలపై సంప్రదింపుల పత్రం సమర్పిస్తున్నామని తెలిపింది. విభేదించడం రాజద్రోహం కాదు ప్రభుత్వాన్ని విమర్శించడం, లేదా ప్రభుత్వానికి సంబంధించిన ఏవైనా అంశాలతో విభేదించడం రాజద్రోహం కాదని, ఉద్దేశ పూర్వకంగా చట్టవిరుద్ధంగా, హింసాత్మకంగా ప్రభుత్వాన్ని కూలగొట్టే చర్యలకు పాల్పడినప్పుడే ఆ నేరం రాజద్రోహంగా పరిగణిస్తారని పేర్కొంది. ఐపీసీ 124ఏ సెక్షన్‌ను సమీక్షించాలని, దేశంలో బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో రూపొందించిన రాజద్రోహం సెక్షన్‌ని పదేళ్ళ క్రితమే బ్రిటన్‌లో రద్దుచేసిన విషయాన్ని కమిషన్ గుర్తుచేసింది. ప్రజాస్వామ్య మనుగడకు భావప్రకటనా స్వేచ్ఛ ఎంతో అవసరమని, జాతి సమగ్రతను కాపాడాలనుకుంటే దానిని హరించకూడదని స్పష్టం చేసింది. -
రెచ్చగొట్టిన నగ్మా... మౌనంగా కుష్బు
సాక్షి, చెన్నై : తమిళనాడు కాంగ్రెస్‌లో ఇద్దరు స్టార్స్ మధ్య వార్ వెలుగులోకి వచ్చింది. వేదికపై పక్క పక్కనే ఒకటిగా కూర్చున్న వాళ్లు, ఆ తర్వాత కయ్యానికి కాలు దువ్వుకోవడం కాంగ్రెస్‌లో చర్చకు దారి తీసింది. ఈ స్టార్స్ ఎవరో కాదు, ఒకరు కుష్బు, మరొకరు నగ్మా. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో నగ్మా స్పందిస్తే... కళ్లతో చూడలేదు, చెవులతో వినలేదంటూ కుష్బు దాట వేయడం గమనార్హం. రాష్ట్ర కాంగ్రెస్‌లో వివిధ గ్రూపులుగా ఉన్న నేతల్ని ఏకం చేసి ఒకే వేదిక మీద కూర్చోబెట్టడంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ సఫలీకృతులయ్యారు. పార్టీలో సినీ స్టార్స్‌గా, జాతీయస్థాయి పదవుల్లో ఉన్న ఇద్దరు మహిళా నాయకుల్ని సైతం ఆ వేదిక మీదకు ఎక్కించి, ఐక్యత అంటే తమదే అని చాటుకున్నారు. ఉదయం సాగిన ఐక్యత, అదే రోజు సాయంత్రానికి పటాపంచలు అయినట్టుంది. శుక్రవారం ఉదయం నిరసనకు హాజరైన కుష్బు.. సాయంత్రం నగ్మా నేతృత్వంలో సత్యమూర్తి భవన్ వేదికగా సాగిన మహిళా కాంగ్రెస్ సమాలోచనకు గైర్హాజరైంది. దీనిని తీవ్రంగా పరిగణించిన నగ్మా.. సమాలోచన సమావేశంలో కుష్బును ఉద్దేశించి తీవ్రంగా విరుచుకుపడింది. అంతేకాకుండా.. ఉమ్మడి పౌర స్మృతి గురించి కుష్బు చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేయడానికి నగ్మా సిద్ధమైనట్టు సంకేతాలు వెలువడ్డాయి. పార్టీ అధిష్టానం వైఖరికి భిన్నంగా ఉమ్మడి పౌరస్మృతిపై కుష్బు స్పందించిన విషయం తెలిసిందే. స్టార్ వార్: కాంగ్రెస్‌లో వివిధ గ్రూపులుగా ఉన్న నేతలు తాజాగా ఒకే వేదిక మీదకు రాగా.. జాతీయ స్థాయి పదవుల్లో ఉన్న ఇద్దరు మహిళా నేతలు మాత్రం ఒకరినొకరు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసుకోవడం పార్టీలో కొత్త చర్చకు తెర లేపింది. మహిళా కాంగ్రెస్ సమావేశంలో నగ్మా తీవ్రంగా స్పందించిన వ్యాఖ్యలకు కొన్ని తమిళ పత్రికలు ప్రాధాన్యతను ఇచ్చాయి. సినిమాల్లో బొట్టు పెట్టుకుని నటించవచ్చు కానీ, వాస్తవిక జీవితంలో ఏ ముస్లిం మహిళ అలా చేయదని, అయినా, హిందూ వ్యక్తిని వివాహం చేసుకున్న వాళ్లకు ముస్లిం చట్టాల గురించి ఏమి తెలుసునంటూ కుష్బును ఉద్దేశించి నగ్మా మండిపడ్డారు. షరియత్ గురించి అసలు ఏమి తెలుసునని, ఉమ్మడి పౌర స్మృతికి మద్దతుగా కుష్బు ఆ వ్యాఖ్యలు చేశారో తెలుపాలంటూ మండిపడ్డారు. ఉదయం జరిగిన నిరసనకు హాజరైన వాళ్లకు , సాయంత్రం జరిగిన సమావేశానికి వచ్చే తీరిక లేదా..? అని కుష్బుపై నగ్మా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కష్టపడి పనిచేసే వాళ్లకు పదవులు అంటూ తీవ్రంగానే నగ్మా స్పందించినా, కుష్బు మాత్రం కళ్లతో చూడలేదు...చెవులతో వినలేదంటూ ఆమె వ్యాఖ్యలను తోసిపుచ్చడం గమనార్హం.