థాయ్‌లాండ్‌లో అమల్లోకి వచ్చిన చట్టం
మొదటి రోజే ఒక్కటైన వందలాది జంటలు
బ్యాంకాక్: స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించే చట్టం థాయిలాండ్‌లో గురువారం అమల్లోకి వచ్చింది. దీంతో, మొదటిరోజే వందలాదిగా జంటలు ఒక్కటయ్యాయి. రాజధాని బ్యాంకాక్‌లోని ఓ షాపింగ్ మాల్‌లో ఏర్పాటైన ఈ వివాహ వేడుకలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెళ్లికి నిర్వచనం మారుస్తూ థాయ్ ప్రభుత్వం పౌర స్మృతిలోని కీలకమైన 1448 నిబంధనను ఆమోదించగా, దేశవ్యాప్తంగా ఒక్క రోజే నమోదైన వివాహాలు 1,448 మార్కును దాటే అవకాశముందని అధికా రులు తెలిపారు.
దావోస్‌లో ఉన్న ప్రధానమంత్రి షినవత్రా ఈ సందర్భంగా స్వలింగ జంటలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎల్జీబీటీక్యూ వర్గం ఇంద్ర ధనస్సు జెండా థాయ్‌లాండ్‌పై రెపరెపలాడుతోంది’అంటూ ఫేస్‌బుక్ పేజీలో కామెంట్ పెట్టారు. జిల్లా మ్యారేజీ కార్యాలయాల్లో అధికారులు కొత్త జంటల కోసం పార్టీలు, ఫొటో బూత్‌లను ఏర్పాటు చేశారు. కప్ కేక్‌లను పంచిపెట్టారు. మొదటిగా పెళ్లి రిజిస్టర్ చేసుకున్న వారికి విమాన ప్రయాణ టిక్కెట్లను సైతం ఆఫర్ చేశాయి కొన్ని కంపెనీలు. ఇలాంటి మధుర క్షణాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నట్లు కొన్ని జంటలు సంతోషం వ్యక్తం చేశాయి.
స్వలింగ వివాహం చట్టం ద్వారా ఏకమయ్యే వారు ఇకపై ఆస్తులను నిర్వహించుకోవచ్చు, వారసత్వంగా పొందొచ్చు పిల్లల్ని దత్తత తీసుకోవచ్చు. తమ జీవిత భాగస్వామి అనారోగ్య పాలైతే వైద్య సదుపాయాలను వర్తింప జేసుకోవచ్చు, ఆర్థిక ప్రయోజనాలను పంచుకోవచ్చు. గతేడాది జూన్‌లో ఈ చట్టాన్ని పార్లమెంట్‌లో ఉభయ సభలు దాదాపు ఏకగ్రీవంగా ఆమోదించాయి.
సెప్టెంబర్‌లో థాయ్ రాజు దీనిపై సంతకం చేశారు. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించిన మూడో ఆసియా దేశం థాయ్‌ల్యాండ్. ఇప్పటి వరకు ఇలాంటి వివాహాలను నేపాల్, తైవాన్ చట్టాలు మాత్రమే గుర్తించాయి. థాయ్ పౌరస్మృతిలోని 70 సెక్షన్లు మార్చారు. మగ, ఆడ, భర్త, భార్య వంటి లింగ సూచక పదాలకు బదులుగా వ్యక్తి, భాగస్వామి అనే వాటిని చేర్చారు. అయితే, స్వలింగ జంటలు సరోగసీ ద్వారా కుటుంబాలను కలిగి ఉండాలంటే చట్టాల్లో మరో డజను వరకు మార్పులు చేపట్టాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment