same-sex marriage
-
స్వలింగ వివాహాలకు థాయ్‌లాండ్ చట్టబద్ధత
బ్యాంకాక్: స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయాలని థాయ్‌లాండ్ నిర్ణయించింది. ఇందుకు వీలు కలి్పంచే చరిత్రాత్మక వివాహ సమానత్వ బిల్లుపై థాయ్‌లాండ్ రాజు మహా వజ్రలాంగ్కర్ణ్ తాజాగా సంతకం చేశారు. దీంతో ఆగ్నేయాసియాలో స్వలింగ సంబంధాలకు అధికారిక గుర్తింపు ఇచి్చన తొలి దేశంగా థాయ్‌లాండ్ నిలిచింది. 2025 జనవరి 22 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం వివాహ చట్టంలో భార్య, భర్త వంటి పదాలకు బదులుగా ఇకపై వ్యక్తి, స్త్రీ, పురుషుడు అనే పదాలు వాడతారు. స్వలింగ జంటకు దత్తత, వారసత్వంతో పాటు పూర్తిస్థాయి ఆర్థిక, వైద్య, చట్టపరమైన హక్కులు లభిస్తాయి. ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే స్వలింగ సంపర్కు (ఎల్జీబీటీక్యూ)లకు థాయ్‌లాండ్‌లో మొదటినుంచీ స్వేచ్ఛ ఎక్కువే. అయితే పూర్తిస్థాయి హక్కుల కోసం వాళ్లు 20 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత బిల్లు జూన్‌లో సెనేట్ ఆమోదం పొందింది. రాజు ఆమోదంతో మంగళవారం చట్టరూపు దాల్చింది. ఇది చరిత్రాత్మకమంటూ ఎల్జీబీటీక్యూ ఉద్యమకారులు ప్రశంసించారు. ‘‘చరిత్రలో చెరిగిపోని ఒక పేజీని లిఖించుకున్నాం. సమానత్వానికి, మానవ గౌరవానికి దక్కిన విజయమిది’’అని ఎల్జీబీటిక్యూ హక్కుల కోసం దీర్ఘకాలంగా పని చేస్తున్న చుమాపోన్ అన్నారు. చట్టం అమల్లోకి రానున్న జనవరి 22న 1,000కి పైగా ఎల్జీబీటీక్యూ జంటలకు సామూహిక వివాహాలు నిర్వహించే యోచన ఉన్నట్టు ఆమె తెలిపారు.ఆసియాలో మూడో దేశం తైవాన్, నేపాల్ తర్వాత ఆసియాలో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కలి్పంచిన మూడో దేశంగా థాయ్‌లాండ్ నిలిచింది. తైవాన్ 2019లో తొలిసారి ఈ చర్య తీసుకుంది. అనంతరం నేపాల్ సుప్రీంకోర్టు కూడా ఎల్జీబీటీక్యూ బంధాల చట్టబద్ధతకు అనుకూలంగా తీర్పు ఇచి్చంది. -
చట్టబద్ధత కల్పించలేం
న్యూఢిల్లీ: స్వలింగ వివాహాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రత్యేక వివాహాల చట్టం ప్రకారం అలాంటి వివాహాలకు చట్టబద్ధత కల్పించేందుకు నిరాకరించింది. ‘‘అది న్యాయస్థానానికి సంబంధించింది కాదు. పార్లమెంటు పరిధిలోని అంశం. కోర్టులు చట్టాలు చేయవు. వాటిని మంచి చెడులను బేరీజు వేస్తాయంతే’’ అని పేర్కొంది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఏకగ్రీవ తీర్పు వెలువరించింది. అయితే స్వలింగ సంపర్కులకు పెళ్లాడే స్వేచ్ఛ, హక్కు ఉంటాయని స్పష్టం చేసింది. అంతేగాక ఇతరుల మాదిరిగానే వారికి అన్ని రకాల హక్కులూ సమానంగా ఉంటాయని, వారిపై వివక్ష చూపొద్దని పేర్కొంది. వారి హక్కులను కాపాడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ విషయమై సాధారణ ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని ప్రభుత్వాలకు సూచించింది. తద్వారా స్వలింగ సంపర్కులు వివక్ష ఎదుర్కోకుండా చూడాలని పేర్కొంది. అలాగే స్వలింగ బంధాలు పట్టణ, సంపన్న వర్గాలకు పరిమితమైన ధోరణి అన్న కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని ధర్మాసనం తప్పుట్టింది. ‘‘స్వలింగ సంపర్కం అనాది కాలం నుంచీ ఉన్న సహజ ధోరణే. అది కేవలం పట్టణాలకో, సంపన్న వర్గాలకో సంబంధించింది కాదు. ఈ విషయంలో కుల, సామాజిక వర్గ భేదాలూ ఉండవు. కనుక ఆ అపోహను వదిలించుకోవాలి’’ అని సూచించింది. కాకపోతే స్వలింగ జంటలకు పిల్లలను దత్తత తీసుకునే హక్కుండబోదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు 3:2తో మెజారిటీ తీర్పు వెలువరించింది. దత్తతతో పాటు పలు న్యాయపరమైన అంశాల విషయంలో సీజేఐ జస్టిస్ చంద్రచూడ్, న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్‌తో న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పి.ఎస్.నరసింహ విభేదించారు. నాలుగు తీర్పులు స్వలింగ సంపర్కం నేరం కాదంటూ 2018లో సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కూడా కల్పించాలంటూ ఎల్జీబీటీక్యూఐఏ++ వర్గాల తరఫున 21 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై సుదీర్ఘ విచారణ అనంతరం గత మే 11న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. తాజాగా దీనిపై మొత్తం 4 తీర్పులు వెలువరించింది. మొత్తం అంశంపై సీజేఐ 247 పేజీల తీర్పు వెలువరించారు. స్వలింగ జంటల దత్తత తదితర అంశాలపై సీజేఐ అభిప్రాయాలతో ఏకీభవిస్తూ జస్టిస్ కౌల్ విడిగా 17 పేజీల తీర్పు వెలువరించారు. కాగా వాటితో విభేదిస్తూ తనతో పాటు జస్టిస్ కోహ్లీ తరఫున జస్టిస్ భట్ 89 పేజీల తీర్పు వెలువరించారు. దానితో పూర్తిగా ఏకీభవిస్తూ జస్టిస్ నరసింహ 13 పేజీల తీర్పు రాశారు. స్వలింగ ప్రవృత్తి సహజమైనదే తప్ప మానసిక రుగ్మత కాదని సీజేఐ స్పష్టం చేశారు. లైంగిక గుర్తింపు, ప్రవృత్తుల గురించి విచారణ జరిపే నెపంతో స్వలింగ జంటలను పోలీసులు వేధించవద్దని ఆదేశించారు. ఈ నిమిత్తం వారిని పోలీస్ స్టేషన్లకు పిలిపించడం గానీ, వారి నివాసాలకు వెళ్లడం గానీ చేయొద్దని చెప్పారు. దత్తతపై... అవివాహితులకు, స్వలింగ జంటలకు దత్తత హక్కుండదంటూ ధర్మాసనం 3:2 మెజారిటీతో తీర్పు వెలువరించింది. వారికి ఆ హక్కును నిషేధిస్తున్న దత్తత చట్ట నిబంధనలను సమర్థిస్తున్నట్టు పేర్కొంది. అయితే దీనిపై కూడా పార్లమెంటు సమగ్రంగా చర్చించి సరైన నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడింది. సమస్యల పరిష్కారానికి కమిటీ స్వలింగ సంపర్కులకు చట్టబద్ధ వివాహ హక్కు లేదని, రాజ్యాంగం ప్రకారం దాన్ని మౌలిక హక్కుగా పొందజాలరని పేర్కొంటూ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. అదే సమయంలో, స్వలింగ జంటల సమస్యలు, ఆందోళనల పరిష్కారానికి తీసుకోవాల్సిన పాలనాపరమైన చర్యలను పరిశీలించేందుకు కేబినెట్ కార్యదర్శి సారథ్యంలో ఉన్నత స్థాయి కమిటీ వేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఎల్జీబీటీ కమ్యూనిటీతో పాటు సామాజిక తదితర రంగాల నిపుణులకు అందులో చోటుండాలని సూచించింది. వీటికి సంబంధించి ఎలాంటి నిర్ణయానికైనా వచ్చే ముందు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు అన్ని వర్గాల వారి వాదనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని తెలియజేసింది. రేషన్ కార్డు తదితరాల నిమిత్తం స్వలింగ జంటను ఒకే కుటుంబంగా పరిగణించడం, ఉమ్మడి బ్యాంకు ఖాతా తెరవడం, డెత్ బెనిఫిట్స్ తదితరాల నిమిత్తం తమలో ఒకరిని నామినీగా పేర్కొనడం వంటి సౌకర్యాలను కల్పించవచ్చేమో పరిశీలించాలని సూచించింది. దాంతో ఆ మేరకు చర్యలు తీసుకుంటామని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హామీ ఇచ్చారు. అన్ని అంశాలనూ సమగ్రంగా పరిశీలించిన మీదట కమిటీ ఇచ్చే తుది నివేదికను కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల్లో పాలనపరంగా అన్ని స్థాయిల్లోనూ అమలు చేయాలని సీజేఐ స్పష్టం చేశారు. ‘స్వలింగ జంటల బంధాన్ని చట్టపరంగా గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. లేదంటే వారికి అన్యాయం చేసినట్టే అవుతుంది’ అని సీజేఐ అభిప్రాయపడ్డారు. ఎల్జీబీటీక్యూఐఏ++ అంటే లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్, క్వీర్, క్వశ్చనింగ్, ఇంటర్‌సెక్స్, పాన్‌సెక్సువల్, టూ స్పిరిట్, అసెక్సువల్ తదితరులు కేవలం లైంగిక ప్రవృత్తి ఆధారంగా పెళ్లి చేసుకునే విషయంలో ఫలానా వారికి ఫలానా హక్కు వర్తించబోదని చెప్పబోవడం పొరపాటే అవుతుంది. స్వలింగ జంటలు పరస్పరం ప్రేమను వ్యక్తం చేసుకోవడాన్ని ఎవరూ నిషేధించలేరు. కానీ దానికి చట్టపరమైన గుర్తింపును మాత్రం ఇప్పటికైతే వారు కోరజాలరు. అలాగే దత్తత హక్కును కూడా! ఈ విషయంలో జస్టిస్ భట్ తీర్పుతో పూర్తిగా ఏకీభవిస్తున్నా – జస్టిస్ నరసింహ ఎవరేమన్నారు.. అవివాహితులు, స్వలింగ జంటలు దత్తత తీసుకోవడాన్ని నిషేధిస్తున్న సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్అథారిటీ (సీఏఆర్ఏ) నిబంధన 5(3) రాజ్యాంగవిరుద్ధం, చట్టవిరుద్ధం. స్త్రీ పురుష జంటలు మాత్రమే మంచి తల్లిదండ్రులు కాగలరన్న భావన సరికాదు. అది స్వలింగ జంటల పట్ల వివక్షే అవుతుంది. అసలు వివాహమనే బంధానికి సమానంగా వర్తించే సార్వత్రిక భావనంటూ ఏదీ లేనే లేదు – సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్వలింగ సంపర్కుల పట్ల జరుగుతున్న చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దేందుకు బహుశా ఇది సరైన సందర్భం. ఈ దిశగా రాజ్యాంగ వ్యవస్థలన్నీ సకారాత్మక చర్యలు చేపట్టాలి. ఈ విషయంలో జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నా – జస్టిస్ ఎస్.కె.కౌల్ ఎల్‌జీబీటీక్యూఏఐ++ జంటల సమస్యలు మా దృష్టికి రాకపోలేదు. కానీ వారికి దత్తత హక్కు లేదన్న సీఏఆర్ఏలోని నిబంధన 5(3) చెల్లుబాటవుతుంది. అయితే స్వలింగ స్వభావులకు భాగస్వాములను ఎంచుకునేందుకు, సహజీవనం చేసేందుకు పూర్తి హక్కుంటుంది. అయితే ఆ బంధంతో వారికి దఖలు పడాల్సిన హక్కులను గుర్తించాల్సిన అనివార్యత మాత్రం ప్రభుత్వాలకు లేదు -జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ హిమా కోహ్లీ -
పార్లమెంటుకు వదిలేయండి
న్యూఢిల్లీ: ‘‘స్వలింగ వివాహాల అంశం అత్యంత సంక్లిష్టమైనది. సమాజంపై ఇది పెను ప్రభావం చూపుతుంది’’ అని కేంద్ర ప్రభు త్వం పేర్కొంది. కాబట్టి దీన్ని పూర్తిగా పార్లమెంటు పరిశీలనకు వదిలేసే అంశాన్ని పరిశీలించాల్సిందిగా సుప్రీంకోర్టును కోరింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కోరుతూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ముందు వాదనలు బుధవారం ఐదో రోజూ కొనసాగాయి. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు కొనసాగించారు. వివాహమంటే ఏమిటి, ఎవరి మధ్య జరుగుతుందన్న కీలకాంశాలపై నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరన్నదే కీలక ప్రశ్న అని ఆయనన్నారు. ‘‘నిజానికి పార్లమెంటుకు స్థాయికి కూడా ఇదెంతో విస్తృతమైన కసరత్తు. స్వలింగ వివాహాలపై తీసుకోబోయే నిర్ణయం పలు చట్టాలకు సంబంధించి ఏకంగా 160 నిబంధనలను ప్రభావితం చేస్తుంది. దీనిపై కసరత్తు చేసేందుకు కావాల్సిన వనరులు న్యాయవ్యవస్థ వద్ద లేవు. పెళ్లి ఒక సామాజిక, చట్టపరమైన వ్యవస్థ. దానికి గుర్తింపు పూర్తిగా శాసనవ్యవస్థ విధాన నిర్ణయాల పరిధిలోని అంశం. ఆ అధికారాన్ని న్యాయవ్యవస్థ లాక్కోజాలదు’’ అన్నారు. తన వాదనకు మద్దతుగా అబార్షన్‌కు రాజ్యాంగపరమైన హక్కు కల్పించేందుకు నిరాకరిస్తూ అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకించారు. దీన్ని ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించింది. ‘‘మీ వాదనను అర్థం చేసుకున్నాం. న్యాయమూర్తులు చట్టాలు చేయరనేది అందరికీ తెలిసిన విషయమే. మహిళల హక్కుల పరిరక్షణలో అమెరికా కంటే భారత్ ఎంతో ముందుకు వెళ్లింది. కనుక అక్కడి తీర్పులను ప్రస్తావించొద్దు’’ అని సీజేఐ స్పష్టం చేశారు. -
స్వలింగ బంధాల విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: స్వలింగ బంధాల విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘లైంగిక లక్షణాలు, మొగ్గుదలల మీద వ్యక్తులకు అదుపు ఉండదు. అవి స్వతఃసిద్ధమైనవి. కనుక వాటి ప్రాతిపదికన ప్రభుత్వాలు ఎవరి పట్లా వివక్ష చూపజాలవు’’ అని స్పష్టం చేసింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ముందు బుధవారం రెండో రోజు కూడా వాదనలు కొనసాగాయి. ఈ పిటిషన్లు పట్టణ, ఉన్నత వర్గ ధోరణిని ప్రతిబింబిస్తున్నాయన్న కేంద్రం వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. స్వలింగ ధోరణి పట్టణ, ఉన్నత వర్గాలకే పరిమితమైనదన్న వాదనను బలపరిచే సాక్ష్యాలేవీ కేంద్రం చూపలేకపోయిందని పేర్కొంది. ‘‘లైంగిక ధోరణి స్వతఃసిద్ధ భావనే తప్ప దానికి సామాజిక, వర్గ ప్రాతిపదికలేవీ ఉండవన్న సీనియర్ న్యాయవాది ఎ.ఎం.సింఘ్వి వాదనతో ఏకీభవిస్తున్నాం. స్వేచ్ఛాయుత వాతావరణం కారణంగా పట్టణ ప్రాంతాల్లో ఈ ధోరణులు ఎక్కువగా బయటికి కన్పిస్తుండవచ్చు’’ అని అభిప్రాయపడింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తే స్త్రీ పురుషుల పెళ్లీడు, దత్తత వంటివాటిపై పడే ప్రభావంతో పాటు తెరపైకి రాగల పలు ఇతర పరిణామాలను కూడా ధర్మాసనం లోతుగా చర్చించింది. ‘స్వలింగ జంట ఆడయినా, మగయినా పిల్లలను దత్తత తీసుకోవచ్చు. పెరిగే క్రమంలో తమ తల్లుల/తండ్రుల లైంగిక ధోరణి తాలూకు ప్రభావం ఆ పిల్లల మనసులపై ఎలా ఉంటుందన్నది ఆలోచించాల్సిన అంశమే’’ అని అభిప్రాయపడింది. పార్లమెంటులో ప్రాతినిధ్యం లేకే సుప్రీంకోర్టే చొరవ తీసుకుని స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ విజ్ఞప్తి చేశారు. 142వ అధికరణ కింద రాజ్యాంగం కల్పిచిన ప్లీనరీ అధికారాలను వినియోగిస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని కోరారు. ‘‘అత్యున్నత న్యాయస్థానికి ఉన్న ప్రతిష్ట, నైతికత దృష్ట్యా సమాజమూ ఈ నిర్ణయాన్ని అంగీకరించి స్వలింగ వివాహాలను ఆమోదిస్తుందన్న విశ్వాసముంది. తద్వారా వారూ సమాజంలో గౌరవప్రదమైన జీవనం గడపగలరు. వితంతు వివాహాలకూ తొలుత సామాజిక ఆమోదం లేదు. కానీ చట్టం చేశాక ఆమోదం లభించింది’’ అని కోర్టు దృష్టికి తెచ్చారు. కేసులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కూడా ప్రతివాదులుగా చేర్చాలంటూ సుప్రీంకోర్టులో కేంద్రం తాజాగా తాజా అఫిడవిట్ దాఖలు చేసింది. స్వలింగ వివాహాలపై వైఖరి తెలపాల్సిందిగా రాష్ట్రాలకు లేఖ రాశామని, వాటి అభిప్రాయాలతో నివేదిక సమర్పించేందుకు అనుమతించాలని కోరింది. -
స్వలింగ వివాహాల గుర్తింపు చట్టపరిధిలోనిది: కేంద్రం
ఢిల్లీ: స్వలింగ వివాహాల చట్టబద్ధతపై కేంద్రం తన వైఖరిని మరోసారి కుండబద్ధలు కొట్టింది. అలాంటి వివాహాలకు చట్టబద్ధత ఇవ్వడం సరికాదని తేల్చేసింది. ఈ మేరకు సుప్రీం కోర్టులో స్వలింగ వివాహలకు చట్టబద్దత కల్పించాలంటూ దాఖలైన పిటిషన్లపై రేపు(మంగళవారం) విచారణ కొనసాగనుండగా.. ఈలోపు కేంద్రం తన వాదనలను సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించింది. స్వలింగ వివాహానికి చట్టపరమైన గుర్తింపును కోరుతూ దాఖలైన పిటిషన్లు.. కేవలం పట్టణ ప్రాంతాల్లో ఉండే ఉన్నత వర్గాల అభిప్రాయాలను మాత్రమే ప్రతిబింబిస్తున్నాయి. పిటిషనర్లు దేశ ప్రజల అభిప్రాయాలను ప్రతిబించేవాళ్లు కాదు. ఈ పిటిషన్లు తీవ్ర పరిణామాలకు సంబంధించినవి అని కేంద్రం తన వాదనల్లో స్పష్టం చేసింది. భారత సమాజంలో.. వివాహ వ్యవస్థ అనేది ప్రస్తుతానికి చట్టపరమైన గుర్తింపుతో కొనసాగుతున్న ఒక భిన్నమైన సంస్థ. మతాలపరంగానూ ఇది ప్రభావితం చూపించే అంశం. కాబట్టి, ఇది దేశంలోని ప్రతీ పౌరుడిని ప్రభావితం చేస్తుందని అని న్యాయస్థానానికి కేంద్రం తెలిపింది. కాబట్టి, స్వలింగ వివాహం లాంటి కొత్త సామాజిక సంస్థను సృష్టించే ప్రశ్నకు.. కోర్టు తీర్పు సమాధానం ఇవ్వబోదని కేంద్రం వాదించింది. ఇది పూర్తిగా చట్ట పరిధిలో కొనసాగాల్సిన అంశమని, ఆర్టికల్ 246 ప్రకారం సామాజిక సంబంధాలనేవి చట్టపరమైన సిద్ధాంతంలోని భాగమని కేంద్రం సుప్రీం కోర్టుకు గుర్తు చేసింది. స్వలింగ వివాహాన్ని గుర్తించడం వల్ల దేశవ్యాప్తంగా భిన్నమైన వివాహ సంస్థలు అనుభవిస్తున్న ప్రత్యేక హోదా మసకబారుతుందని పేర్కొంది. ఏ మతం, ఉప మతం, కులం, ఉప కులం కూడా వ్యక్తిగత చట్టాలు, ఆచారాలు భిన్న లింగ వ్యక్తుల మధ్య వివాహాన్ని మాత్రమే గుర్తిస్తాయని(స్వలింగ వివాహాలకు ఒప్పుకోవని..) కేంద్రం నొక్కి చెప్పింది. అన్నింటికి మించి.. వివాహా వ్యవస్థ అనేది సామాజిక అంశంమని, దానికి సామాజిక గుర్తింపు ఉండాల్సిన అవసరం ఉందని కేంద్రం అభిపప్రాయపడింది. స్వలింగ వివాహాలకు చట్ట బద్ధత కల్పించాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం రేపటి (మంగళవారం) నుంచి వాదనలు విననుంది. సీజేఐ డీవై చంద్రచూడ్‌తో పాటు జస్టిస్ ఎస్కే కౌల్, రవీంద్ర భట్, హిమా కోహ్లీ, పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. -
‘స్వలింగ వివాహం’పై ధర్మాసనం: సుప్రీం
న్యూఢిల్లీ: స్వలింగ వివాహాలకు చట్టబద్దత కల్పించాలంటూ దాఖలైన పిటిషన్లను ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారించనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసింది. ‘‘స్వలింగ వివాహాలకు చట్టబద్ధత ఇవ్వాలా వద్దా అనే అంశానికి ఒకవైపు రాజ్యాంగం ప్రసాదించిన మానవహక్కులు, మరోవైపు ప్రత్యేక శాసనాలు, ఇంకోవైపు ప్రత్యేక వివాహ చట్టం ఉన్నాయి. ఇంతటి ప్రధానమైన అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనమే తేల్చాలి’’ అని వ్యాఖ్యానించింది. ఇలాంటి వివాహాలను అనుమతించకూడదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అభిప్రాయాన్ని వెల్లడించడం తెల్సిందే. ‘‘భారతీయ కుటుంబ వ్యవస్థకు స్వలింగ వివాహాలు పూర్తి విరుద్ధం. వ్యక్తిగత చట్టాలు, సామాజిక విలువల సున్నిత సమతుల్యతను ఇవి భంగపరుస్తాయి’ అంటూ ఆదివారం కోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. ‘‘ఈ అంశంలో శాసన అంశాలు, మానవ హక్కులు ఇమిడి ఉన్నాయి. దీనిని రాజ్యాంగ ధర్మాసనమే పరిష్కరిస్తుంది’ అంటూ సుప్రీంకోర్టు ఈ అంశాన్ని ఏప్రిల్ 18వ తేదీకి వాయిదావేసింది. ‘స్వలింగ వివాహాలను అనుమతిస్తే ఎదురయ్యే సమస్యల గురించీ ఆలోచించాలి. ఇద్దరు తండ్రులు లేదా కేవలం ఇద్దరు తల్లులు మాత్రమే జంటగా జీవించే కుటుంబంలో ఎదిగే పిల్లల మానసిక స్థితి ఎలా ఉంటుంది ? ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబమైన పార్లమెంట్ ఇలాంటి విషయాలను సమీక్షించాల్సి ఉంది. ఈ కేసు తీర్పు మొత్తం భారతీయ సమాజంపై తీవ్ర ప్రభావం చూపనుంది. అందుకే కేసులో భాగస్వామ్య పక్షాల వాదోపవాదనలను విస్తృతస్థాయిలో వినాలి’ అని కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టును కోరారు. ఈ కేసు విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఒక న్యాయవాది కోరగా రాజ్యాంగ ధర్మాసనాల విచారణలన్నీ ప్రత్యక్ష ప్రసారాలు అవుతున్నాయని ధర్మాసనం గుర్తుచేసింది. -
స్వలింగ వివాహాలపై మీ వైఖరేంటి?
న్యూఢిల్లీ: స్వలింగ వివాహాలపై తమ స్పందనను తెలియజేయాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రంతోపాటు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ప్రత్యేక వివాహ చట్టం కింద తమ వివాహం చేసుకునేందుకు అనుమతించాలని ఒక జంట, అమెరికాలో జరిగిన తమ పెళ్లిని విదేశీ వివాహ చట్టం కింద భారత్‌లో నమోదు చేయాలని ఇంకో జంట వేర్వేరుగా వేసిన పిటిషన్లపై జస్టిస్ ఆర్.ఎస్. ఎండ్లా, జస్టిస్ ఆషా మీనన్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ప్రత్యేక వివాహ చట్టం కింద వివాహం చేసుకుంటామని ప్రతిపాదించిన మహిళలు ఇద్దరు ఆ చట్టంలో స్వలింగ వివాహాలకు తగిన నిబంధనలు లేకపోవడాన్ని సవాలు చేశారు. మరోవైపు అమెరికాలో వివాహం చేసుకుని రాగా విదేశీ వివాహ చట్టం కింద తమ వివాహాన్ని నమోదు చేయకపోవడాన్ని ఇద్దరు పురుషులు సవాలు చేశారు. కేసు తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరి 8వ తేదీకి వాయిదా పడింది. అయితే వివాహం చట్టాలు స్వలింగ వివాహాలకు అనుమతి ఇవ్వవని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రత్యేక, విదేశీ వివాహ చట్టాలు రెండింటిలోనూ వివాహానికి నిర్వచనం లేకున్నా సంప్రదాయక చట్టాల ప్రకారం దాన్ని అర్థం చేసుకుంటారని వివరించింది. దీన్ని పిటిషన్‌దారులు సవాలు చేయాలని భావిసే,్త ఇప్పుడే చేయాలని స్పష్టం చేసింది. అయితే.. పిటిషన్‌దారులు సంప్రదాయ, మత చట్టాల కింద గుర్తింపు కావాలని కోరడం లేదని, కులాంతర, మతాంతర వివాహాలను గుర్తించే పౌర చట్టాల (ప్రత్యేక, విదేశీ వివాహ చట్టాలు) కింద మాత్రమే గుర్తింపు కోరుతున్నారని పిటిషన్‌దారుల తరఫు న్యాయవాది మేనక గురుస్వామి వాదించారు. ఇదే తొలిసారి.. ఐదు వేల ఏళ్ల సనాతన ధర్మ సంప్రదాయంలో ఇలాంటి పరిస్థితి ఎదురు కావడం ఇదే తొలిసారి అని కేంద్రం తరఫున వాదనలు వినిపించిన రాజ్‌కుమార్ యాదవ్ బెంచ్‌కు నివేదించారు. ఇందుకు బెంచ్ బదులిస్తూ... చట్టాల్లోని భాష ఏ ఒక్కరివైపో (పురుషులు, మహిళలు) సూచించడం లేదని, దేశ పౌరులందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చట్టాన్ని అర్థం చేసుకోవాలని చెప్పింది. పిటిషన్లు రెండూ ప్రకృతికి విరుద్ధమైనవి కావని అనగా కేంద్రం తరఫు మరో న్యాయవాది కీర్తిమాన్ సింగ్ అంగీకరించారు. తాము ఎనిమిదేళ్లుగా కలిసి జీవిస్తున్నామని, కష్టసుఖాలన్నింటినీ పంచుకుంటున్నామని.. కానీ ఇద్దరూ మహిళలమే (ఒకరి వయసు 47, ఇంకొరిది 36) అయినందున పెళ్లి మాత్రం చేసుకోలేకపోతున్నామని పిటిషన్‌దారులైన ఇద్దరు మహిళలు తమ పిటిషన్లో పేర్కొన్నారు. పెళ్లి కాని కారణంగా మిగిలిన జంటల్లాగా సొంతిల్లు, బ్యాంక్ అకౌంట్ తెరవడం, కుటుంబ బీమా తదితరాలను పొందలేకపోతున్నామని వాపోయారు. ఆర్టికల్ 21 ద్వారా పౌరులకు సంప్రదించే హక్కు స్వలింగ దంపతులకు కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు అమెరికాలో జరిగిన తమ వివాహాన్ని భారత కాన్సులేట్ విదేశీ వివాహ చట్టం కింద నమోదు చేయలేదని, ఇతర జంటల మాదిరిగానే తమ వివాహాన్ని కూడా భారత కాన్సులేట్ గుర్తించి ఉండాల్సిందని పురుష పిటిషన్‌దారులు ఇద్దరూ పేర్కొన్నారు. 2017లో జరిగిన తమ వివాహాన్ని గుర్తించకపోవడం కారణంగా కోవిడ్–19 కాలంలో దంపతులుగా కలిసి ప్రయాణించేందుకు, తమ కుటుంబాలతో కలిసి ఉండేందుకు ప్రతిబంధకంగా మారిందన్నారు. భారత కాన్సులేట్ నిర్ణయం ఆర్టికల్ 14, 15, 19, 21లను అతిక్రమించిందని ఆరోపించారు. -
బాలునిపై అమానుషం
సాక్షి, మండ్య(కర్ణాటక) : 17 సంవత్సరాల మైనర్ బాలునితో స్వలింగ సంపర్కం పెట్టుకుని, బాలుడు మర్మాంగం కోసుకునేలా చేసిన కిరాతకున్ని శ్రీరంగపట్టణం పోలీసులు అరెస్టు చేశారు. దుండగుడు మండ్య జిల్లాలోని పాండవపుర తాలుకాలోని సీతాపుర గ్రామానికి చెందిన సునీల్‌కుమార్ (28). బాలునికి మాయమాటలు చెప్పి ఇతడు అసహజ వాంఛలు తీర్చుకుంటూ ఈ ఘాతుకానికి ఒడిగట్టిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏం జరిగిందంటే వివరాలు.. సీతాపురకు చెందిన సునీల్‌కుమార్ ఏడాదిన్నరగా బాలున్ని లొంగదీసుకున్నాడు. అతనితో ప్రతిరోజు ఫోన్లో మాట్లాడటం, గ్రామంలో ఉన్న దేవాలయంలో ప్రతి శుక్రవారం కలవడం చేసేవారు. తనకు దేవుడు పూనుతాడని, చెప్పినట్లు చేయాలని బాలున్ని తన వశంలోకి తెచ్చుకున్నాడు. తాను చేసేది ఎవరికీ చెప్పవద్దని, చెబితే దేవుడు చంపేస్తాడని బెదిరించాడు. నేను దేవుడని నిన్ను ఇష్టపడుతున్నానని, నాతో ఉండు, నిన్ను నేను పెళ్ళి చేసుకుంటానని చెప్పి చివరికి మర్మాంగం కోసుకునేలా ప్రేరేపించాడు. ఫిబ్రవరిలో ప్రేమికుల దినోత్సవం రోజున తాలూకాలోని హరవు ఎల్లెకెరె రోడ్డులో ఉన్న పొదల్లోకి తీసుకెళ్లి కత్తిరించుకునేలా చేశాడు. అనంతరం గాయపడిన బాలుడిని తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించాడు. అస్పత్రిలో డాక్టర్లకు విషయం చెప్పవద్దని, కారులో డ్రాప్ అడిగి వస్తుంటే ఎవరో దుండగులు ఇలా చేసి పారిపోయారని చెప్పాలని సూచించాడు. అనుమానంతో ఫిర్యాదు ఆస్పత్రిలో చేర్చగా, అనుమానం వచ్చిన వైద్యులు శ్రీరంగపట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి బాలున్ని విచారించగా, విషయం మొత్తం బాలుడు వివరించాడు. దీంతో పోలీసులే నివ్వెరపోయారు. చివరకు కామాంధుడు సునీల్‌కుమార్‌ను అరెస్టు చేసి కేసు నమోదు -
పెళ్లితో ఒక్కటైన ఇద్దరమ్మాయిలు
సాక్షి, మల్కన్‌గిరి(ఒడిశా) : ఆ అమ్మాయిలిద్దరూ చిన్ననాటి స్నేహితులు. ఇద్దరూ ఒకేచోట చదువు సాగించారు. చిన్ననాటి నుంచే ఒకరిపై ఒకరు ప్రేమ పెంచుకున్నారు. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆ ఇద్దరి ప్రేమబంధం బలపడుతూ వచ్చింది. ఒడిశా రాజధానం భువనేశ్వర్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారిద్దరూ స్వస్థలమైన మల్కన్‌గిరికి వారం రోజుల క్రితం వచ్చి తామిద్దరం పెళ్లి చేసుకుంటామని ఇరు కుటుంబాల పెద్దలకు చెప్పారు. అమ్మాయిలైన మీరిద్దరూ ఎలా పెళ్లి చేసుకుంటారంటూ ఇరు కుటుంబాల పెద్దలు నిరాకరించారు. దీంతో ఆ ఇద్దరిలో ఒక అమ్మాయి ఢిల్లీ వెళ్లి లింగ మార్పిడి చేయించుకుని వచ్చింది. దీంతో ఆ అమ్మాయిలిద్దరూ స్నేహితుల సహకారంతో బుధవారం రాత్రి మల్కన్‌గిరిలోని ఓ ఆలయంలో సంప్రదాయ బద్ధంగా వివాహం చేసుకున్నారు. -
ఇద్దరు వివాహితలు లేచిపోయి..
జైపూర్: వాళ్లిద్దరూ మహిళలే అయినప్పటికీ, ఒకరినొకరు ఇష్టపడ్డారు. తాము కలసి ఉండేందుకు భర్తలతో పాటు కన్న బిడ్డలను కాదనుకున్నారు. ఎన్నో మలుపులు, ట్విస్ట్‌లతో ఉన్న ఈ కథతో ఓ సూపర్ హిట్ సినిమా తీయడానికి కావల్సిన అన్ని ఎలిమెంట్లు ఉన్నాయి. వివరాల్లోకి వెళితే.. సోనియా(27), మమత(26)లు ఇద్దరు ఇరుగు పొరుగు ఇళ్లలో నివాసముండేవారు. వీరిద్దరికి ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. అంతేకాకుండా ఆ వివాహితలకు చెరో సంతానం కూడా ఉంది. వారి భర్తలు రోజువారి పనిలో భాగంగా విధులకు వెళ్లేవారు. ఆ తర్వాత ఒంటరిగా ఉన్న వీరిద్దరూ ఒకేచోట చేరి ఎక్కువ సమయాన్ని గడిపేవారు. ఒకరిని ఒకరూ బాగా అర్థం చేసుకున్నారో లేక అభిప్రాయాలే నచ్చాయో తెలియదు కానీ వారిద్దరూ ప్రేమలో పడ్డారు. అంతే ఇద్దరూ కలిసి వివాహం చేసుకొని దాంపత్య జీవితాన్ని ఆనందంగా గడపాలని నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆ ఇద్దరు వివాహితలు తమ తమ కుటుంబాలను వదిలిపెట్టి పెళ్లి చేసుకోవాలని భావించారు. మన్సరోవర్ గ్రామంలోని ఓ ఆలయంలో ఈ మహిళలు ఇద్దరూ వివాహం చేసుకున్నారు. వాళ్లు పెళ్లి కోసం చేసుకున్న ఏర్పాట్లు ప్రకారం...సోనియా భర్తగా, మమతా భార్యగా వ్యవహరించారు. వారిరువురి కుటుంబాలకు దూరంగా వారి దాంపత్య జీవితాన్ని ప్రారంభించారు. అయితే ఆరు నెలల తర్వాత మమత సోదరుడు వీరిద్దరు కలిసి నివాసం ఉంటున్న చోటును కనుగొన్నాడు. వారి దగ్గరికి వెళ్లి మీ వివాహనికి ఇరు కుటుంబాలు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాయని నమ్మించి, ఇంటికి రావాల్సిందిగా కోరాడు. వారు స్వగ్రామానికి తిరిగి రాగానే మొదటి వివాహానికి సంబంధించి ఇరువురి అత్తలు సోనియా(భర్తగా చెప్పుకునే మహిళ)ను చితకబాది, ఊరి నుంచి తరిమికొట్టారు. సోనియా వెళ్లిన తర్వాత మమతా కనిపించకుండా పోయింది. ఈ సంఘటన రాజస్థాన్‌లోని టోన్క్ జిల్లాలోని అమ్లీ గ్రామంలో చోటు చేసుకుంది. తన భాగస్వామి మమత జాడ కోసం సానియా అన్ని ప్రాంతాల్లో వెతుకుతూనే ఉంది. తామున్న చోటు ఎవరికీ తెలియకుండా ఉండటానికి మమత కుటుంబ సభ్యులు ఇంటిని కూడా వదిలి పోవడంతో.. తన తోడు కోసం వెతికి వెతికి నీరసించి చివరకు డిగ్గి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. స్వలింగ వివాహాలు చెల్లుతాయని, వారి విషయంలో ఎవరి అనుమతి అవసరం లేదని నిరూపించడానికి న్యాయ సహాయం కోసం కోర్టు మెట్లు కూడా సానియా ఎక్కింది. కోర్టు మమత కుటుంబ సభ్యులకు లీగల్ నోటీసులు పంపింది. మమత కోరికలు నెరవేర్చడానికి తన ఇంటిని కూడా అమ్మేసినట్టు సోనియా చెబుతోంది. మమతా ఆచూకీ గనుక దొరక్కపోతే ఆత్మహత్య చేసుకుంటానని సోనియా కన్నీటి పర్యంతమవుతోంది. -
స్వలింగ వివాహలకు ఇటలీ ఆమోదం
రోమ్: స్వలింగ సంపర్కుల వివాహాలకు ఇటాలియన్ పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ దేశ పార్లమెంట్లో కాన్ఫిడెన్స్ ఓటు ద్వారా బిల్లుపై బుధవారం ఆమోదముద్ర వేసింది. దీంతో ఇకపై స్వలింగ సంపర్కులు ఇటలీలో స్వేచ్ఛగా వివాహం చేసుకోవచ్చు. అందరిలాగే జీవితం గడపవచ్చు. చారిత్రాత్మక నిర్ణయంతో ఎల్జీబీటీ(లెస్బియన్, గే, బెసైక్సువల్, ట్రాన్స్‌జెండర్) వర్గాల్లో కొత్త ఆశలు చిగురించాయి. 'తమ ఆకాంక్షలు గుర్తించినందుకు ఈ రోజు చాలామంది వేడుకలు జరుపుకుంటారు' అని ఈ సందర్భంగా ఇటలీ ప్రధానమంత్రి మట్టెయో రెంజీ తన అధికారిక ఫేస్బుక్ పేజీలో పేర్కొన్నారు. తమ భాగస్వామి లేనందున రాత్రుళ్లు నిద్రపట్టక ఒత్తిడి గురయ్యేవారికి ఇది మంచివార్త అని, వాళ్లంతా తాజా నిర్ణయంతో వేడుక చేసుకుంటారన్నారు. రెంజీ ఈ సందర్భంగా ఫ్లోరెన్స్ కౌన్సిలర్‌గా పని చేసిన అలెస్సియా బెల్లినీ ని ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. తాను స్వలింగ సంపర్కురాలినని బహిరంగంగా ప్రకటించిన బెల్లినీ క్యాన్సర్‌తో 2011లో మరణించింది. -
స్వలింగ సంపర్క చట్టంపై యూఎన్ చీఫ్ హర్షం
ఐక్యరాజ్యసమితి: అమెరికాలో స్వలింగ సంపర్క పెళ్లిళ్లకు చట్టబద్దత కల్పించడంపై ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరి బాన్ కీ మూన్ హర్షం వ్యక్తం చేశారు. యూఎస్ లోని 50 రాష్ట్రాల్లో స్వలింగ సంపర్క పెళ్లిళ్లకు ఆమోద ముద్ర లభించడం నిజంగానే మానవహక్కుల పరిరక్షణలో ఓ భాగమని ఆయన స్పష్టం చేశారు. గేలు మరియు లెస్బియన్స్ కు చట్టపరంగా పెళ్లిళ్లు చేసుకోవడానికి సుప్రీంకోర్టు అంగీకారం లభించడం ఆహ్వానించదగ్గ పరిణామంగా ఆయన పేర్కొన్నారు. స్వలింగ సంపర్క చట్టంపై అమెరికా సుప్రీంకోర్టు శుక్రవారం మరోసారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దేశంలో నివసించే స్వలింగ సంపర్క పౌరులకు ఇది చట్టపరంగా లభించిన హక్కుగా తెలిపింది. ఇప్పటికీ 14 రాష్ట్రాల్లో స్వలింగ సంపర్క చట్టంపై నిషేధం కొనసాగడంపై ధర్మాసనం తనదైన శైలిలో స్పందించింది. వారిపై బలవంతంగా నిషేధం విధించాలని ప్రయత్నించినా అది ఎంతో కాలం నిలవదని పేర్కొంది. గత సంవత్సరం నవంబర్ లో స్వలింగ వివాహాలకు అమెరికా సుప్రీంకోర్టు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.