న్యూఢిల్లీ: ‘‘స్వలింగ వివాహాల అంశం అత్యంత సంక్లిష్టమైనది. సమాజంపై ఇది పెను ప్రభావం చూపుతుంది’’ అని కేంద్ర ప్రభు త్వం పేర్కొంది. కాబట్టి దీన్ని పూర్తిగా పార్లమెంటు పరిశీలనకు వదిలేసే అంశాన్ని పరిశీలించాల్సిందిగా సుప్రీంకోర్టును కోరింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కోరుతూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ముందు వాదనలు బుధవారం ఐదో రోజూ కొనసాగాయి.
కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు కొనసాగించారు. వివాహమంటే ఏమిటి, ఎవరి మధ్య జరుగుతుందన్న కీలకాంశాలపై నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరన్నదే కీలక ప్రశ్న అని ఆయనన్నారు. ‘‘నిజానికి పార్లమెంటుకు స్థాయికి కూడా ఇదెంతో విస్తృతమైన కసరత్తు. స్వలింగ వివాహాలపై తీసుకోబోయే నిర్ణయం పలు చట్టాలకు సంబంధించి ఏకంగా 160 నిబంధనలను ప్రభావితం చేస్తుంది. దీనిపై కసరత్తు చేసేందుకు కావాల్సిన వనరులు న్యాయవ్యవస్థ వద్ద లేవు.
పెళ్లి ఒక సామాజిక, చట్టపరమైన వ్యవస్థ. దానికి గుర్తింపు పూర్తిగా శాసనవ్యవస్థ విధాన నిర్ణయాల పరిధిలోని అంశం. ఆ అధికారాన్ని న్యాయవ్యవస్థ లాక్కోజాలదు’’ అన్నారు. తన వాదనకు మద్దతుగా అబార్షన్‌కు రాజ్యాంగపరమైన హక్కు కల్పించేందుకు నిరాకరిస్తూ అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకించారు. దీన్ని ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించింది. ‘‘మీ వాదనను అర్థం చేసుకున్నాం. న్యాయమూర్తులు చట్టాలు చేయరనేది అందరికీ తెలిసిన విషయమే. మహిళల హక్కుల పరిరక్షణలో అమెరికా కంటే భారత్ ఎంతో ముందుకు వెళ్లింది. కనుక అక్కడి తీర్పులను ప్రస్తావించొద్దు’’ అని సీజేఐ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment