ఢిల్లీ: స్వలింగ వివాహాల చట్టబద్ధతపై కేంద్రం తన వైఖరిని మరోసారి కుండబద్ధలు కొట్టింది. అలాంటి వివాహాలకు చట్టబద్ధత ఇవ్వడం సరికాదని తేల్చేసింది. ఈ మేరకు సుప్రీం కోర్టులో స్వలింగ వివాహలకు చట్టబద్దత కల్పించాలంటూ దాఖలైన పిటిషన్లపై రేపు(మంగళవారం) విచారణ కొనసాగనుండగా.. ఈలోపు కేంద్రం తన వాదనలను సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించింది.
స్వలింగ వివాహానికి చట్టపరమైన గుర్తింపును కోరుతూ దాఖలైన పిటిషన్లు.. కేవలం పట్టణ ప్రాంతాల్లో ఉండే ఉన్నత వర్గాల అభిప్రాయాలను మాత్రమే ప్రతిబింబిస్తున్నాయి. పిటిషనర్లు దేశ ప్రజల అభిప్రాయాలను ప్రతిబించేవాళ్లు కాదు. ఈ పిటిషన్లు తీవ్ర పరిణామాలకు సంబంధించినవి అని కేంద్రం తన వాదనల్లో స్పష్టం చేసింది. భారత సమాజంలో.. వివాహ వ్యవస్థ అనేది ప్రస్తుతానికి చట్టపరమైన గుర్తింపుతో కొనసాగుతున్న ఒక భిన్నమైన సంస్థ. మతాలపరంగానూ ఇది ప్రభావితం చూపించే అంశం. కాబట్టి, ఇది దేశంలోని ప్రతీ పౌరుడిని ప్రభావితం చేస్తుందని అని న్యాయస్థానానికి కేంద్రం తెలిపింది.
కాబట్టి, స్వలింగ వివాహం లాంటి కొత్త సామాజిక సంస్థను సృష్టించే ప్రశ్నకు.. కోర్టు తీర్పు సమాధానం ఇవ్వబోదని కేంద్రం వాదించింది. ఇది పూర్తిగా చట్ట పరిధిలో కొనసాగాల్సిన అంశమని, ఆర్టికల్ 246 ప్రకారం సామాజిక సంబంధాలనేవి చట్టపరమైన సిద్ధాంతంలోని భాగమని కేంద్రం సుప్రీం కోర్టుకు గుర్తు చేసింది. స్వలింగ వివాహాన్ని గుర్తించడం వల్ల దేశవ్యాప్తంగా భిన్నమైన వివాహ సంస్థలు అనుభవిస్తున్న ప్రత్యేక హోదా మసకబారుతుందని పేర్కొంది. ఏ మతం, ఉప మతం, కులం, ఉప కులం కూడా వ్యక్తిగత చట్టాలు, ఆచారాలు భిన్న లింగ వ్యక్తుల మధ్య వివాహాన్ని మాత్రమే గుర్తిస్తాయని(స్వలింగ వివాహాలకు ఒప్పుకోవని..) కేంద్రం నొక్కి చెప్పింది.
అన్నింటికి మించి.. వివాహా వ్యవస్థ అనేది సామాజిక అంశంమని, దానికి సామాజిక గుర్తింపు ఉండాల్సిన అవసరం ఉందని కేంద్రం అభిపప్రాయపడింది. స్వలింగ వివాహాలకు చట్ట బద్ధత కల్పించాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం రేపటి (మంగళవారం) నుంచి వాదనలు విననుంది. సీజేఐ డీవై చంద్రచూడ్‌తో పాటు జస్టిస్ ఎస్‌కే కౌల్, రవీంద్ర భట్, హిమా కోహ్లీ, పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment