constitutional bench
-
ఎన్నికల బాండ్ల స్కీమ్‌పై సంచలన తీర్పు
రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రాథమిక హక్కుల ఆర్టికల్ 19(1)(ఎ)ను అనుసరించి.. ఈ పథకం సమాచార హక్కును ఉల్లంఘిస్తుందని.. ఇది రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. అలాగే.. నల్లధనాన్ని అరికట్టేందుకు సమాచార హక్కును ఉల్లంఘించడం సమంజసం కాదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ మేరకు ఎలక్టోరల్ బాండ్స్ చెల్లుబాటు కాదంటూ ఏకగ్రీవ తీర్పును రాజ్యాంగ ధర్మాసనం వెల్లడించింది . ‘‘ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధం. ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే. బ్లాక్ మనీ నిర్మూలనకు ఈ స్కీమ్ ఒక్కటే మార్గం కాదు. ఇంకా అనేక మార్గాలు ఉన్నాయి. రాజకీయ పార్టీలకు విరాళాలు అనేది క్విడ్ ప్రోకో కు దారి తీస్తుంది. విరాళాలు ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచడం తగదు. ఇది సమాచార హక్కు ఉల్లంఘన కిందకే వస్తుంది. రహస్య విరాళాలు ప్రాథమిక హక్కుల ఉల్లంఘన. కాబట్టి ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్‌ను రద్దు చేయాల్సిన అవసరం ఉంది’’ అని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు వెల్లడించింది. అదే సమయంలో ఎలక్టోరల్ బాండ్స్‌ను వెంటనే నిలిపివేయాలని.. వాటిని అమ్మకూడదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2019 నుంచి ఇప్పటిదాకా జారీ చేసిన ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను మూడు వారాల్లో(మార్చి 6వ తేదీలోగా) కేంద్ర ఎన్నికల సంఘానికి అందించాలని ఎస్బీఐను సుప్రీం ఆదేశించింది. అలాగే పార్టీలకు వచ్చిన ఫండ్ ఎవరిచ్చారో తెలియ పర్చాల్సిన అవసరం ఉందని.. ఆ వివరాలను బహిర్గత పర్చాల్సిన అవసరమూ ఉందని.. ఎలక్టోరల్ బాండ్స్ ఏ రాజకీయ పార్టీకి ఎంత వచ్చాయన్న వివరాలు మార్చి 13వ తేదీ లోగా తన వెబ్సైట్లో పొందుపర్చాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీం ఆదేశించింది. మరోవైపు.. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో తీసుకున్న విరాళాలను వెనక్కి ఇచ్చేయాల్సిందేనని(ఇంకా ఎన్‌క్యాష్ అవ్వని బాండ్లను) రాజకీయ పార్టీలకు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇందుకోసం 15 రోజుల గడువు విధించింది. తీర్పుపై పిటిషనర్ల లాయర్ స్పందన ఎన్నికల బాండ్స్‌ను సుప్రీం కోర్టు ఆపేసింది పిటిషనర్ల వాదనతో పూర్తిస్థాయిలో కోర్టు ఏకీభవించింది ఇన్కమ్ ట్యాక్స్, కంపెనీల చట్టాల్లో చేసిన సవరణలను కొట్టేసింది సమాచార చట్టం ఉల్లంఘన కింద సుప్రీం కోర్టు పరిగణించింది విరాళాలు ఇచ్చేవారి వివరాలు గోప్యంగా ఉంచడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది పిటిషనర్ల తరఫు వాదించిన సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ పిటిషన్ల నేపథ్యం.. రాజకీయ పార్టీలకు అందే నిధుల్లో పారదర్శకత తీసుకువచ్చే ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2018 జనవరి 2న అమల్లోకి తెచ్చింది. ఈ పథకాన్ని సవాల్ చేస్తూ ఏడీఆర్, కాంగ్రెస్ నాయకురాలు జయా ఠాకుర్, సీపీఎం, మరో పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్నికల బాండ్లను ప్రారంభించడానికి ముందే ఈ పథకంపై సమగ్ర విచారణ అవసరమని అక్టోబరు 10న సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్(ఏడీఆర్ తరఫున) చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. దీంతో కిందటి ఏడాది అక్టోబర్ 31న వాదనలు ప్రారంభమయ్యాయి. ఈ పిటిషన్లపై మూడు రోజులపాటు విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం.. నవంబర్ 2వ తేదీన తీర్పు రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కానిస్టిట్యూషన్ బెంచ్‌లో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ఈ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో.. సీల్డ్ కవర్లో 2023 సెప్టెంబర్ 30 వరకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందిన నిధుల వివరాలు ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది కూడా. ఏంటీ ఎన్నికల బాండ్లు..? ఎన్నికల బాండ్లు ఒక ప్రామిసరీ నోట్ లాంటివి. ఇవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో లభ్యం అవుతాయి. వ్యక్తులు, కంపెనీలు వీటిని కొనుగోలు చేయవచ్చు. అలా కొనుగోలు చేసిన వాటిని నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వొచ్చు. రాజకీయ పార్టీలు తమకు వచ్చిన బాండ్లను నగదుగా మార్చుకొని పార్టీ కార్యక్రమాల కోసం వినియోగించుకుంటాయి. రాజకీయ పార్టీల విరాళాల విషయంలో పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్రంలోని అధికార బీజేపీ ప్రభుత్వం 2018లో ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే, రాజకీయ పార్టీలు తాము స్వీకరించిన విరాళాల గురించి బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చట్టం-2017 సవరణ చేసింది. దాంతో ఎన్నికల బాండ్ల విధానంలో పారదర్శకత లోపించిందని పలువురు విమర్శించారు. ఈ క్రమంలోనే ఈ పథకాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఇదీ చదవండి: విరాళాల సేకరణలో బీజేపీ టాప్.. ఆరేళ్లలో వేల కోట్లు పోగు! పిటిషనర్ల వాదన ఇదే.. కేంద్రం తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకం పారదర్శకత కొరవడంతో పాటు ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేస్తోంది అధికారప్రతిపక్ష పార్టీలకు సమాన అవకాశాలను కల్పించకపోగా అవినీతిని ప్రోత్సహిస్తోంది ఎన్నికల బాండ్ల ద్వారా ఇప్పటి వరకూ సమకూరిన నిధుల్లో అత్యధిక భాగం కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకే వెళ్లాయి విపక్ష పార్టీలకు స్వల్ప మొత్తంలోనే విరాళాలు వచ్చాయి ఈ మేరకు గణాంకాలతో సహా వివరించారు సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ కేంద్రం వాదన.. ప్రపంచంలోని అనేక దేశాలు ఎన్నికల్లో నల్లధనం ప్రభావాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. మన దేశంలో నల్లధనాన్ని అరికట్టడానికి డిజిటల్ చెల్లింపుల విధానం అమలు, 2.38 లక్షల డొల్ల కంపెనీలపై చర్యలు వంటివి కేంద్రం తీసుకుంది. స్వచ్ఛమైన డబ్బే రాజకీయ పార్టీలకు విరాళాలుగా అందేలా చేయడానికి ఎన్నికల బాండ్ల పథకం రూపంలో కేంద్రం మరో ప్రయత్నం చేసింది ఒక దశలో సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ జోక్యం చేసుకుంటూ...‘‘అధికార పార్టీకే అధిక విరాళాలు ఎందుకు వెళ్తున్నాయి. దీనికి కారణమేమిటి’’ అని ప్రశ్నించారు. ఎన్నికల బాండ్ల ద్వారా సమకూరిన మొత్తం నిధులను ఎన్నికల సంఘం వద్ద ఉంచి, దాని ద్వారా అన్ని పార్టీలకు సమానంగా పంపిణీ చేయవచ్చు కదా అని ఆయన సూచించారు. కేంద్రం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బదులిస్తూ....‘అప్పుడు అసలు విరాళాలే రావ’ని అభిప్రాయపడ్డారు. అంతకుముందు ఈ పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. ఎన్నికల బాండ్ల నిధుల మూలాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే హక్కు దేశ పౌరులకు లేదని అందులో పేర్కొన్నారు. ధర్మాసనం కీలక వ్యాఖ్యలు రాజకీయ పార్టీల నిధుల సమీకరణలో పారదర్శకత కోసం తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకం లక్ష్య సాధనలో కొన్ని సమస్యలున్నాయి గోప్యత, విశ్వసనీయత కొందరికే పరిమితమవుతోంది ఎస్బీఐ వద్ద ఉన్న వివరాలను దర్యాప్తు సంస్థల ద్వారా ఏ రాజకీయ పార్టీకి, ఎవరు ఎంత విరాళం ఇచ్చారన్నది అధికారంలో ఉన్న వారు తెలుసుకోగలరు అదే విపక్షంలో ఉన్న వారికి అటువంటి అవకాశం లేదు అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించలేనప్పుడు పథకం నిష్పాక్షికత, పారదర్శకత ప్రశ్నార్థకమవుతుంది ఇదీ చదవండి: 2023 డిసెంబర్ నాటికి రూ.15 వేల కోట్ల ఎలక్టోరల్ బాండ్ల అమ్మకం రాజకీయ అభ్యంతరాలు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం మధ్య ఎలక్టోరల్ బాండ్ల రూపంలో భారతీయ జనతా పార్టీకి రూ.5,127.97 కోట్ల మేర విరాళాలు వచ్చాయి. మిగతా అన్ని జాతీయ పార్టీలకు కలిసి కేవలం రూ.1,783.93 కోట్లు మాత్రమే వచ్చాయి. దీని ప్రకారం ఎలక్టోరల్ బాండ్లతో అధికార పార్టీకి ఎంతమేర ప్రయోజనం కలుగుతుందో అర్థం చేసుకోవచ్చని విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్వలింగ వివాహాల గుర్తింపు చట్టపరిధిలోనిది: కేంద్రం
ఢిల్లీ: స్వలింగ వివాహాల చట్టబద్ధతపై కేంద్రం తన వైఖరిని మరోసారి కుండబద్ధలు కొట్టింది. అలాంటి వివాహాలకు చట్టబద్ధత ఇవ్వడం సరికాదని తేల్చేసింది. ఈ మేరకు సుప్రీం కోర్టులో స్వలింగ వివాహలకు చట్టబద్దత కల్పించాలంటూ దాఖలైన పిటిషన్లపై రేపు(మంగళవారం) విచారణ కొనసాగనుండగా.. ఈలోపు కేంద్రం తన వాదనలను సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించింది. స్వలింగ వివాహానికి చట్టపరమైన గుర్తింపును కోరుతూ దాఖలైన పిటిషన్లు.. కేవలం పట్టణ ప్రాంతాల్లో ఉండే ఉన్నత వర్గాల అభిప్రాయాలను మాత్రమే ప్రతిబింబిస్తున్నాయి. పిటిషనర్లు దేశ ప్రజల అభిప్రాయాలను ప్రతిబించేవాళ్లు కాదు. ఈ పిటిషన్లు తీవ్ర పరిణామాలకు సంబంధించినవి అని కేంద్రం తన వాదనల్లో స్పష్టం చేసింది. భారత సమాజంలో.. వివాహ వ్యవస్థ అనేది ప్రస్తుతానికి చట్టపరమైన గుర్తింపుతో కొనసాగుతున్న ఒక భిన్నమైన సంస్థ. మతాలపరంగానూ ఇది ప్రభావితం చూపించే అంశం. కాబట్టి, ఇది దేశంలోని ప్రతీ పౌరుడిని ప్రభావితం చేస్తుందని అని న్యాయస్థానానికి కేంద్రం తెలిపింది. కాబట్టి, స్వలింగ వివాహం లాంటి కొత్త సామాజిక సంస్థను సృష్టించే ప్రశ్నకు.. కోర్టు తీర్పు సమాధానం ఇవ్వబోదని కేంద్రం వాదించింది. ఇది పూర్తిగా చట్ట పరిధిలో కొనసాగాల్సిన అంశమని, ఆర్టికల్ 246 ప్రకారం సామాజిక సంబంధాలనేవి చట్టపరమైన సిద్ధాంతంలోని భాగమని కేంద్రం సుప్రీం కోర్టుకు గుర్తు చేసింది. స్వలింగ వివాహాన్ని గుర్తించడం వల్ల దేశవ్యాప్తంగా భిన్నమైన వివాహ సంస్థలు అనుభవిస్తున్న ప్రత్యేక హోదా మసకబారుతుందని పేర్కొంది. ఏ మతం, ఉప మతం, కులం, ఉప కులం కూడా వ్యక్తిగత చట్టాలు, ఆచారాలు భిన్న లింగ వ్యక్తుల మధ్య వివాహాన్ని మాత్రమే గుర్తిస్తాయని(స్వలింగ వివాహాలకు ఒప్పుకోవని..) కేంద్రం నొక్కి చెప్పింది. అన్నింటికి మించి.. వివాహా వ్యవస్థ అనేది సామాజిక అంశంమని, దానికి సామాజిక గుర్తింపు ఉండాల్సిన అవసరం ఉందని కేంద్రం అభిపప్రాయపడింది. స్వలింగ వివాహాలకు చట్ట బద్ధత కల్పించాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం రేపటి (మంగళవారం) నుంచి వాదనలు విననుంది. సీజేఐ డీవై చంద్రచూడ్‌తో పాటు జస్టిస్ ఎస్కే కౌల్, రవీంద్ర భట్, హిమా కోహ్లీ, పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. -
దేశానికి అలాంటి ఎన్నికల కమిషనర్ కావాలి: సుప్రీం
న్యూఢిల్లీ: దేశ ప్రధాన మంత్రిపై సైతం చర్యలు తీసుకునేంత సత్తా ఉన్న ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్రస్తుతం మన దేశానికి అవసరమని దేశ సర్వోత్తమ న్యాయస్థానం అభిప్రాయపడింది. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తుల ఎంపిక సరైందంటూ అభిప్రాయపడింది సుప్రీం కోర్టు. కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి.. ఎన్నికల కమిషనర్ల నియామకానికి ప్రస్తుతం నడుస్తున్న వ్యవస్థ సరికాదని.. కొలీజియంలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ క్రమంలో.. బుధవారం విచారణ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలే చేసింది బెంచ్. ప్రధాన మంత్రికి వ్యతిరేకంగా చర్యలు తీసుకునే ప్రధాన ఎన్నికల కమిషనర్ మనకు అవసరం. ఉదాహరణకు.. ప్రధానికి వ్యతిరేకంగా ఆరోపణలు వచ్చాయనుకుందాం. ఆ సమయంలో సీఈసీ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సీఈసీ గనుక బలహీనంగా ఉంటే ఎలాంటి చర్యలు తీసుకోలేరు కదా అని జస్టిస్ కె.ఎం.జోసెఫ్, జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ హృషీకేశ్ రాయ్, జస్టిస్ సి.టి.రవికుమార్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనే ఉన్నత స్థానం రాజకీయ ప్రభావం నుంచి రక్షించబడాలి. స్వతంత్రంగా ఉండాలి. కానీ, అలా జరగడం లేదు. ఇది పూర్తిగా వ్యవస్థ విచ్ఛిన్నం కాదా అని కేంద్రం తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. ఎన్నికల కమిషనర్ నియామకంలో అనుసరిస్తున్న యంత్రాంగాన్ని తమకు చూపాలని కేంద్రం తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. దీంతో ప్రభుత్వం తరపున వాదిస్తున్న అటార్నీ జనరల్ & బృందం వివరణలు ఇచ్చుకుంది. కేంద్ర మంత్రివర్గం సలహా మేరకు ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమించాలని రాజ్యాంగంలో ఉందని, ఇంతవరకు అదే అమలవుతోందని ఏజీ ఆర్.వెంకటరమణి బెంచ్‌కు వివరించారు. అంతకు ముందు మంగళవారం వాదనల సందర్భంగా.. సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సున్నితంగా ఉండే ఎన్నికల సంఘం భుజాలపై అపారమైన అధికారాలను రాజ్యాంగం మోపిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సర్వోత్తముడైన వ్యక్తిని ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమించేలా ఓ వ్యవస్థను రూపొందించాలని కేంద్రానికి సూచించింది. ఈ క్రమంలో మాజీ సీఈసీ టీఎన్ శేషన్‌ను గుర్తు చేస్తూ.. అలాంటి గట్టి వ్యక్తి, సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. సమర్థతే కాకుండా దృఢమైన వ్యక్తిత్వం ఉన్నవారిని సీఈసీగా నియమించేందుకు సరైన విధానం రూపొందించాలని అటార్నీ జనరల్ (ఏజీ) ఆర్.వెంకటరమణికి సూచించింది. ఏజీ వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన బెంచ్.. 2004 నుంచి ఒక్క సీఈసీ కూడా ఆరేళ్ల పదవీ కాలాన్ని పూర్తిచేయలేదని తెలిపింది. యూపీఏ, ఎన్డీయే హయాంలో సీఈసీలు మారిన విషయాన్ని గుర్తు చేసింది. అందువల్ల దృఢమైన వ్యక్తులను నియమించేందుకు స్పష్టమైన విధానం ఉండాలని అభిప్రాయపడింది. ఎన్నికల కమిషనర్ల నియామకానికి కొలీజియంలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలంటూ పిల్ దాఖలైంది గతంలో. ఈ పిల్‌ను అక్టోబర్ 2018లో సీఈసీ, ఈసీలతో కూడిన ఐదుగురు జడ్జిల బెంచ్‌కు సిఫార్సు చేసింది. అయితే కేంద్రం మాత్రం అలాంటి వ్యవస్థ అవసరం లేదంటూ వాదిస్తూ వస్తోంది. ఇదీ చదవండి: మోర్బీ విషాదం.. తుప్పుపట్టిన కేబుళ్లు, వదులైన బోల్టులు!! -
హిజాబ్ తీర్పు: సుప్రీంలో ఊహించని పరిణామం
న్యూఢిల్లీ: కర్ణాటకలో విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించటంపై నిషేధం విధించటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై గురువారం తీర్పు సందర్భంలో.. సుప్రీం కోర్టులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సుప్రీం ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు తీర్పులు వెలువరించారు. దీంతో సరైన దిశానిర్దేశం కోసం ఈ పిటిషన్లను సీజేఐకి సిఫారసు చేస్తున్నట్లు జస్టిస్ హేమంత్ గుప్తా తెలిపారు. సుమారు పదిరోజులపాటు హిజాబ్ పిటిషన్లపై వాదనలు వినింది ద్విసభ్య న్యాయమూర్తుల ధర్మాసనం. చివరికి.. కర్ణాటక హైకోర్టును తీర్పును జస్టిస్ హేమంత్ గుప్తా సమర్థించగా.. తీర్పును తోసిపుచ్చారు జస్టిస్ సుధాన్షు దులియా. దీంతో ఈ వివాదం సీజేఐకి ముందుకు చేరగా.. మరో బెంచ్ లేదంటే రాజ్యాంగ ధర్మాసనం ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యాసంస్థల్లో విద్యార్థుల దుస్తులపై కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. స్కూల్స్, పాఠశాలల్లో హిజాబ్ ధరించకూడదని ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటంతో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. హిజాబ్ నిషేధాన్ని సవాల్ చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, హిజాబ్‌పై నిషేధాన్ని ఎత్తివేయాటనికి నిరాకరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. 10 రోజుల పాటు వాదనలు విన్న జస్టిస్ హేమంత్ గుప్తా, సుధాన్షు ధులియాల ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఇరువురు జడ్జీలు హిజాబ్ నిషేధంపై ఏకాభిప్రాయానికి రాకపోవటం గమనార్హం. ఇదీ చదవండి: గాల్లోకి ఎగిరాక ఊడిపోయిన విమానం టైర్.. వీడియో వైరల్ -
‘అభిశంసన’పై రాజ్యాంగ ధర్మాసనం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అభిశంసన కోరుతూ రాజ్యసభ చైర్మన్‌కు ఇచ్చిన తీర్మానాన్ని తిరస్కరించడాన్ని కాంగ్రెస్ ఎంపీలు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ పిటిషన్ విచారణను ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం నేడు విచారించనుంది. జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఏకే గోయల్‌ల ధర్మాసనం పిటిషన్ విచారిస్తుందని సుప్రీంకోర్టు కేసుల రిజిస్ట్రీలో పేర్కొన్నారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తుల సీనియారిటీ జాబితాలో ఏకే సిక్రీ ప్రస్తుతం ఆరోస్థానంలో కొనసాగుతున్నారు. రాజ్యసభ సభ్యులు ప్రతాప్ సింగ్ బజ్వా(పంజాబ్), అమీ హర్షద్రాయ్ యాజ్ఞిక్‌లు దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై జస్టిస్ జే చలమేశ్వర్, జస్టిస్ ఎస్కే కౌల్ ధర్మాసనం ముందు సోమవారం ఉదయం కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, మరో సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌లు వాదనలు వినిపించారు. పిటిషన్‌ను వెంటనే విచారణకు స్వీకరించాలని వారు కోరగా.. అత్యవసర విచారణ కోసం ఈ విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి ముందు ప్రస్తావించాలని ధర్మాసనం వారికి సూచించింది. ఈ సందర్భంగా మాస్టర్ ఆఫ్ రోస్టర్‌పై రాజ్యాంగ ధర్మాసనం తీర్పును జస్టిస్ చలమేశ్వర్ ప్రస్తావిస్తూ.. ‘మాస్టర్ ఆఫ్ రోస్టర్‌పై ఇప్పటికే రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. అందువల్ల ఈ అంశాన్ని ఒకటో నంబరు కోర్టులో ప్రధాన న్యాయమూర్తి ముందు ప్రస్తావిస్తే బాగుంటుంది’ అని సూచించారు. సీజేఐపై ప్రతిపక్ష ఎంపీలు ఇచ్చిన అభిశంసన తీర్మానంలో సీజేఐ దుష్ప్రవర్తనను నిరూపించే ఆధారాలు ఏవీ లేవని పేర్కొంటూ నోటీసును రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ‘సీజేఐ నిర్ణయం తీసుకోవడం సబబు కాదు’ అభిశంసన తీర్మానం సీజేఐకి సంబంధించింది కాబట్టి ఆయన నిర్ణయం తీసుకోవడం సరికాదని, రాజ్యాంగ ప్రాధాన్యమున్న అంశం కావడంతో సుప్రీంలో సీనియర్ మోస్ట్ న్యాయమూర్తిగా మీరే నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ చలమేశ్వర్‌ను సిబల్ కోరారు. మాస్టర్ ఆఫ్ రోస్టర్‌పై రాజ్యాంగ ధర్మాసనం తీర్పు గురించి తనకు అవగాహన ఉందని, అయితే ఈ అంశంలో తక్షణ ఆదేశాలు కోరడం లేదని, వెంటనే విచారణకు స్వీకరించాలని మాత్రమే అడుగుతున్నానని ధర్మాసనానికి సిబల్ విజ్ఞప్తి చేశారు. 64 మంది ప్రస్తుత ఎంపీలు, ఏడుగురు మాజీ ఎంపీలతో కూడిన నోటీసును ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంటూ వెంటనే తిరస్కరించే అధికారం రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడుకు లేదని ఆయన వాదించారు. ‘దయచేసి పిటిషన్ స్వీకరణపై నిర్ణయం తీసుకోండి. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాలేదు. ఈ అంశాన్ని ఎవరు చేపట్టాలి.. ఎలా పరిష్కరించాలన్న దానిపై కోర్టు ఉత్తర్వులు జారీ చేయాలి’ అని సిబల్ కోరారు. ఈ సందర్భంగా జస్టిస్ చలమేశ్వర్ స్పందిస్తూ.. ‘నేను రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాను’ అని గుర్తుచేశారు. పిటిషన్‌ను ఒకవేళ పరిగణనలోకి తీసుకున్నప్పటికీ.. ఈ అంశాన్ని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావిస్తే సముచితంగా ఉంటుందని జస్టిస్ కౌల్ సూచించారు. న్యాయవాది ప్రశాంత్ భూషణ్ జోక్యం చేసుకుంటూ ‘ఈ అంశంలో ఎలాంటి ఆదేశాలు జారీ చేయడానికి సీజేఐకు అధికారాలు లేవు. సుప్రీంలోని సీనియర్ మోస్ట్ న్యాయమూర్తి మాత్రమే దీనిపై నిర్ణయం తీసుకోవాలి’ అని ధర్మాసనాన్ని కోరారు. -
అయినా..అదే బెంచ్
సాక్షి, న్యూఢిల్లీ : కీలక కేసులను ఎంపిక చేసిన బెంచ్‌లకే కేటాయిస్తున్నారని భారత ప్రధాన న్యాయమూర్తిని నలుగురు సీనియర్ న్యాయమూర్తులు బహిరంగంగా ప్రశ్నించిన నేపథ్యంలో సోమవారం ప్రకటించిన ఐదుగురు జడ్జీల బెంచ్‌లో తక్కువ సీనియారిటీ ఉన్నవారిని సైతం కొనసాగించారు. తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నా ప్రధాన న్యాయమూర్తి జస్టిక్ దీపక్ మిశ్రా సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ జే చలమేశ్వర్, రంజన్ గగోయ్, ఎంబీ లోకూర్, కురియన్ జోసెఫ్‌లకు బెంచ్‌లో చోటు కల్పించలేదు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ ఏ కే సిక్రీ, జస్టిస్ ఏఎం కన్విల్కార్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్లున్నారు. ఈ బెంచ్ బుధవారం నుంచి కీలక కేసుల విచారణను ప్రారంభిస్తుంది. ఆధార్ చట్టం చెల్లుబాటు, గే సెక్స్, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం వంటి ముఖ్యమైన కేసుల విచారణను చేపడుతుంది. 2017 అక్టోబర్ 10 నుంచి ఇదే ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాల మధ్య అధికారాల వివాదం, కారుణ్య మరణాల వంటి కీలక కేసులను విచారించింది. సుప్రీం కోర్టు పనితీరు సజావుగా లేదని, కీలక కేసులను ఎంపిక చేసిన బెంచ్‌లకే కేటాయిస్తున్నారని నలుగురు సుప్రీం సీనియర్ న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపిన విషయం తెలిసిందే. జస్టిస్ లోయా మృతికి సంబంధించి దాఖలైన పిటిషన్ల లిస్టింగ్‌పైనా వారు ప్రశ్నలు లేవనెత్తారు. మరోవైపు రెబెల్ న్యాయమూర్తుల ఆరోపణల నేపథ్యంలోనూ ప్రధాన న్యాయమూర్తి రాజ్యాంగ ధర్మాసనంలో సీనియర్ న్యాయమూర్తులెవరికీ చోటు కల్పించకపోవడం గమనార్హం. -
ట్రిపుల్ తలాఖ్... మరో మలుపు
-
ట్రిపుల్ తలాఖ్... మరో మలుపు
ఆరు రోజుల పాటు ముమ్మరంగా విచారణ జరిపిన తర్వాత.. ట్రిపుల్ తలాఖ్ కేసుపై తీర్పును సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో వాదనలు గురువారంతో ముగిశాయి. ఈ విషయంపై నిపుణుల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకున్న తర్వాత క్షుణ్ణంగా చర్చించి జూలై నెలలో తుది తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. అంతకుముందు షయారా బానో తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది అమిత్ ఛద్దా తన వాదనలు వినిపించారు. ట్రిపుల్ తలాఖ్‌ను ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఒక పాపంగా ఆమోదించాలని ఆయన అన్నారు. అయితే ముస్లిం పర్సనల్ లా బోర్డు తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మాత్రం, ట్రిపుల్ తలాఖ్ అనేది విశ్వాసానికి, నమ్మకానికి సంబంధించిన విషయమని చెప్పారు. ఈ వాదనను షయారా బానో న్యాయవాది తిప్పికొట్టారు. అసలు ట్రిపుల్ తలాఖ్ అనే పదం గానీ, ఆ ఆచారం గానీ పవిత్ర ఖురాన్లో ఎక్కడా లేదని, అది ఆమోదయోగ్యం కాని విషయమని స్వయంగా పర్సనల్ లాబోర్డే చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇది పితృస్వామ్య వ్యవస్థకు నిదర్శనమని, పాపమని కూడా చాలావరకు ఇస్లాం స్కూళ్లలో చెప్పారని, అయినా దాని విషయంలో కోర్టు జోక్యం చేసుకోకూడదనడం సరికాదని ఛద్దా చెప్పారు. ఈ విషయంలో రాజ్యాంగ పరిరక్షణ వ్యవస్థ అయిన సుప్రీంకోర్టును ఆశ్రయించడమే ఏకైక మార్గమని ఆయన వాదించారు. మతం ఏం చెబుతుందో ఆర్టికల్ 25 కూడా అదే చెబుతుందని, ఈ అలవాటు ఇస్లాం ప్రకారం సరైంది కాదని, అందువల్ల ఇందులో మతాచారాలను ఉల్లంఘించినట్లు ఏమీ లేదని కూడా ఛద్దా చెప్పారు. ఈ సమయంలో జస్టిస్ నారిమన్ జోక్యం చేసుకున్నారు. ''మీరు వాదించేదాన్ని బట్టి అసలు ట్రిపుల్ తలాఖ్ అనే అలవాటు మతంలో భాగమే కాదు కదా'' అని ఆయన ప్రశ్నించగా, ఛద్దా అవునని చెప్పారు. దాంతో ఈ కేసులో వాదనలు మొత్తం ముగిసినట్లు రాజ్యాంగ ధర్మాసనం ప్రకటించింది. ఇక సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును బట్టే ట్రిపుల్ తలాఖ్ ఉంటుందా.. ఉండదా అనే విషయం తేలనుంది. -
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కొత్త మలుపు
-
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కొత్త మలుపు
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారం సరికొత్త మలుపు తిరిగింది. ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్కే అగర్వాల్, జస్టిస్ రోహింగ్టన్ ఫాలీ నారిమన్ నిర్ణయించారు. స్పీకర్ వద్ద పిటిషన్ల విచారణ పెండింగులో ఉన్నప్పుడు దానిపై కోర్టులు జోక్యం చేసుకోలేవని అటార్నీ జనరల్ వాదించారు. గతంలో ఈ విషయమై సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా ఆయన ఉదహరించారు. ఆయన వాదనలపై సుప్రీం ధర్మాసనం నిశితంగా ప్రశ్నలు వేసింది. గతంలో సుప్రీంకోర్టు ఈ అంశంపై తీర్పు ఇచ్చినప్పటికి, ఇప్పటికి పరిస్థితులు చాలా మారాయని, దేశంలో ఏం జరుగుతోందో చూస్తున్నాం కదా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనర్హత పిటిషన్లు స్పీకర్ వద్ద దీర్ఘకాలం పెండింగులో ఉండిపోతే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది కదా అని ప్రశ్నించింది. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత కోర్టులు జోక్యం చేసుకుంటాయని, అలాంటిది పిటిషన్లు పెండింగులో ఉన్నప్పుడు కోర్టులు జోక్యం చేసుకోకూడదా అని ప్రశ్నించింది. వివిధ పార్టీల నుంచి అధికార పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ల విచారణను స్పీకర్ ఆలస్యం చేస్తున్నారని, వారందరిపైనా అనర్హత వేటు వేయాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఎప్పటిలోగా దీనిపై నిర్ణయం తీసుకుంటారో ఈనెల 8వ తేదీన చెప్పాలని ఇంతకుముందు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్‌కు సూచించింది. దానిపై మంగళవారం నాటి వాదనల్లో కొత్త అంశాలు తెరపైకి రావడంతో.. ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలని న్యాయమూర్తులు నిర్ణయించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ముఖ్యమంత్రులు దాన్ని ఎలా ఉల్లంఘిస్తారన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు వెలువరిస్తే ఇక అది అన్ని రాష్ట్రాలకూ ఒక మార్గదర్శకంగా కూడా ఉంటుంది. దాన్ని తప్పనిసరిగా పాటించాలి. ప్రాథమిక హక్కులకు సంబంధించి, ప్రజాస్వామ్య స్ఫూర్తికి సంబంధించిన కేసులు వచ్చినప్పుడు.. ఇక వాటిని సవాలు చేయడానికి కూడా వీల్లేకుండా రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు ఇస్తుంది. ఈ ధర్మాసనంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఉంటారు.