సాక్షి, న్యూఢిల్లీ : కీలక కేసులను ఎంపిక చేసిన బెంచ్‌లకే కేటాయిస్తున్నారని భారత ప్రధాన న్యాయమూర్తిని నలుగురు సీనియర్ న్యాయమూర్తులు బహిరంగంగా ప్రశ్నించిన నేపథ్యంలో సోమవారం ప్రకటించిన ఐదుగురు జడ్జీల బెంచ్‌లో తక్కువ సీనియారిటీ ఉన్నవారిని సైతం కొనసాగించారు. తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నా ప్రధాన న్యాయమూర్తి జస్టిక్ దీపక్ మిశ్రా సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ జే చలమేశ్వర్, రంజన్ గగోయ్, ఎంబీ లోకూర్, కురియన్ జోసెఫ్‌లకు బెంచ్‌లో చోటు కల్పించలేదు.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ ఏ కే సిక్రీ, జస్టిస్ ఏఎం కన్విల్కార్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్‌లున్నారు. ఈ బెంచ్ బుధవారం నుంచి కీలక కేసుల విచారణను ప్రారంభిస్తుంది. ఆధార్ చట్టం చెల్లుబాటు, గే సెక్స్, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం వంటి ముఖ్యమైన కేసుల విచారణను చేపడుతుంది. 2017 అక్టోబర్ 10 నుంచి ఇదే ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాల మధ్య అధికారాల వివాదం, కారుణ్య మరణాల వంటి కీలక కేసులను విచారించింది.
సుప్రీం కోర్టు పనితీరు సజావుగా లేదని, కీలక కేసులను ఎంపిక చేసిన బెంచ్‌లకే కేటాయిస్తున్నారని నలుగురు సుప్రీం సీనియర్ న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపిన విషయం తెలిసిందే. జస్టిస్ లోయా మృతికి సంబంధించి దాఖలైన పిటిషన్‌ల లిస్టింగ్‌పైనా వారు ప్రశ్నలు లేవనెత్తారు. మరోవైపు రెబెల్ న్యాయమూర్తుల ఆరోపణల నేపథ్యంలోనూ ప్రధాన న్యాయమూర్తి రాజ్యాంగ ధర్మాసనంలో సీనియర్ న్యాయమూర్తులెవరికీ చోటు కల్పించకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment