CJI Justice Mishra
-
జస్టిస్ జోసెఫ్ పేరు మళ్లీ కేంద్రానికి!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్‌ను సుప్రీంకోర్టు జడ్జిగా నియమించేలా కేంద్రానికి మరోసారి సిఫారసు చేసేందుకు సుప్రీంకోర్టు కొలీజియం ఏకగ్రీవంగా అంగీకరించింది. ప్రస్తుతం వివిధ హైకోర్టుల్లో జడ్జీలుగా ఉన్న వారినీ సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమించేందుకు సిఫారసు చేయాలనీ, వారి పేర్లతోపాటే జస్టిస్ జోసెఫ్ పేరును కేంద్రానికి పంపాలని కొలీజియం శుక్రవారం తీర్మానించింది. ఏపీæ–తెలంగాణ ఉమ్మడి హైకోర్టు, రాజస్తాన్, కలకత్తా హైకోర్టుల న్యాయమూర్తుల పేర్లూ సిఫార్సుచేయొచ్చని సమాచారం. ఎవరి పేర్లను సిఫార్సు చేయాలనే దానిపై నిర్ణయించేందుకు సీజేఐ జస్టిస్ మిశ్రా, జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌ల కొలీజియం మే 16న సాయంత్రం భేటీ కానుంది. ఇదీ నేపథ్యం.. 2016లో ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా, మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని నిర్ణయించింది. ఆ నిర్ణయాన్ని జస్టిస్ జోసెఫ్ నేతృత్వంలోని ఉత్తరాఖండ్ హైకోర్టు కొట్టేసింది. తర్వాత జస్టిస్ కేఎం జోసెఫ్‌ను సుప్రీం జడ్జిగా నియమించాలని కొలీజియం ఈ ఏడాది జనవరిలో సిఫారసు చేయగా, కేంద్రం ఆ ప్రతిపాదనను తోసిపుచ్చింది. సిఫార్సు నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కేంద్రం అప్పట్లో సుప్రీం జడ్జీలను కోరింది. సుప్రీంకోర్టు జడ్జిగా ఉండటానికి అవసరమైన ప్రమాణాలు, అనుభవం జస్టిస్ జోసెఫ్‌కు లేవనీ కొలీజియం సిఫారసును కేంద్రం తిరస్కరించింది. తర్వాత జస్టిస్ జోసెఫ్ విషయంపై చర్చించేందుకు కొలీజియం సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా జస్టిస్ చలమేశ్వర్ సీజేఐకి మే 9న లేఖ రాయగా కొలీజియం శుక్రవారం భేటీ అయ్యి పై నిర్ణయం తీసుకుంది. జస్టిస్ జోసెఫ్ పేరును తిరస్కరిస్తూ న్యాయశాఖ మంత్రి రవిశంకర్ లేవనెత్తిన అన్ని అంశాలతో జస్టిస్ చలమేశ్వర్ విభేదించారు. కొలీజియం సిఫారసులను కేంద్రం ఒకసారి తిరస్కరించాక రెండోసారి కూడా కొలీజియం అదే న్యాయమూర్తి పేరునే సిఫారసు చేస్తే మరోసారి తిరస్కరించే అవకాశం కేంద్రానికి లేదు. కొలీజియం సిఫారసులను ఆమోదించి ఆ వ్యక్తిని సుప్రీంకోర్టు జడ్జిగా నియమించాల్సిందే. -
ఆధార్‌పై తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ: ఆధార్ పథకం, దాని అమలుకు రూపొందించిన చట్టం రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. సీజేఐ జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ముందు మొత్తం 31 పిటిషన్లు దాఖలు కాగా.. వాటిలో హైకోర్టు మాజీ జడ్జి కేఎస్ పుట్టుస్వామి దాఖలు చేసిన పిటిషనూ ఉంది. ఈ పిటిషన్లపై నాలుగున్నర నెలల వ్యవధిలో మొత్తం 38 రోజులు ధర్మాసనం వాదనల్ని ఆలకించింది. 1973లో చారిత్రాత్మక కేశవానంద భారతీ కేసు అనంతరం ఎక్కువ రోజులు విచారించిన కేసు ఇదే. ధర్మాసనం ముందు పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గోపాల సుబ్రమణియమ్ వాదిస్తూ.. ‘సేవలు అందించేందుకు ఆధార్ చట్టం మాధ్యమం కాదు. ఇది కేవలం ఒక గుర్తింపు మాత్రమే. ఆధార్ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం గౌరవం, స్వేచ్ఛకు భద్రత లేదు. ధ్రువీకరణ అనేది ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. ధ్రువీకరణలో విఫలమైతే సేవల్ని నిరాకరించవచ్చని చట్టంలో పేర్కొన్నారు’ అని వాదించారు. ఆధార్ సమాచారాన్ని పొందేందుకు ప్రైవేటు వ్యక్తులకు అనుమతిచ్చారని, ఈ చట్టానికి ఎలాంటి భద్రతా లేదన్నారు. ఆధార్ వంటి చట్టానికి నియంత్రణ అవసరమని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. మనీ లాండరింగ్ నియంత్రణ చట్టం ప్రకారం ఆధార్ కేవలం బ్యాంకులకు మాత్రమే పరిమితం కాదని.. మ్యూచువల్ ఫండ్లు, బీమా పాలసీలు, క్రెడిట్ కార్డులు, ఇతర అంశాలకు అవసరమని మరో సీనియర్ న్యాయవాది అర్వింద్ దతర్ ఆందోళన వెలిబుచ్చారు. ఈ కేసులో కక్షిదారుల పక్షాన సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, పి.చిదంబరం, శ్యామ్ దివాన్, కేవీ విశ్వనాథ్, ఆనంద్ గ్రోవర్, సజన్ పూవయ్యలు వాదనలు వినిపించారు. రామన్ మెగసెసె అవార్డు గ్రహీత శాంతా సిన్హా, సామాజిక కార్యకర్తలు అరుణా రాయ్, నిఖిల్ డే, నచికెత్ ఉడుప తదితరులు ఆధార్‌ను వ్యతిరేకిస్తూ పిటిషన్లను దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వం, ఆధార్ అధీకృత సంస్థ(యూఐడీఏఐ), మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలు, ఆర్బీఐలు ఆధార్‌కు అనుకూలంగా వాదనలు వినిపించగా.. వారి తరఫున అటార్నీ జనరల్ వేణుగోపాల్, అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్, లాయర్లు రాకేశ్ ద్వివేది, జయంత్ భూషణ్‌లు వాదించారు. -
‘అభిశంసన’పై రాజ్యాంగ ధర్మాసనం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అభిశంసన కోరుతూ రాజ్యసభ చైర్మన్‌కు ఇచ్చిన తీర్మానాన్ని తిరస్కరించడాన్ని కాంగ్రెస్ ఎంపీలు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ పిటిషన్ విచారణను ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం నేడు విచారించనుంది. జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఏకే గోయల్‌ల ధర్మాసనం పిటిషన్ విచారిస్తుందని సుప్రీంకోర్టు కేసుల రిజిస్ట్రీలో పేర్కొన్నారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తుల సీనియారిటీ జాబితాలో ఏకే సిక్రీ ప్రస్తుతం ఆరోస్థానంలో కొనసాగుతున్నారు. రాజ్యసభ సభ్యులు ప్రతాప్ సింగ్ బజ్వా(పంజాబ్), అమీ హర్షద్రాయ్ యాజ్ఞిక్‌లు దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై జస్టిస్ జే చలమేశ్వర్, జస్టిస్ ఎస్కే కౌల్ ధర్మాసనం ముందు సోమవారం ఉదయం కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, మరో సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌లు వాదనలు వినిపించారు. పిటిషన్‌ను వెంటనే విచారణకు స్వీకరించాలని వారు కోరగా.. అత్యవసర విచారణ కోసం ఈ విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి ముందు ప్రస్తావించాలని ధర్మాసనం వారికి సూచించింది. ఈ సందర్భంగా మాస్టర్ ఆఫ్ రోస్టర్‌పై రాజ్యాంగ ధర్మాసనం తీర్పును జస్టిస్ చలమేశ్వర్ ప్రస్తావిస్తూ.. ‘మాస్టర్ ఆఫ్ రోస్టర్‌పై ఇప్పటికే రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. అందువల్ల ఈ అంశాన్ని ఒకటో నంబరు కోర్టులో ప్రధాన న్యాయమూర్తి ముందు ప్రస్తావిస్తే బాగుంటుంది’ అని సూచించారు. సీజేఐపై ప్రతిపక్ష ఎంపీలు ఇచ్చిన అభిశంసన తీర్మానంలో సీజేఐ దుష్ప్రవర్తనను నిరూపించే ఆధారాలు ఏవీ లేవని పేర్కొంటూ నోటీసును రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ‘సీజేఐ నిర్ణయం తీసుకోవడం సబబు కాదు’ అభిశంసన తీర్మానం సీజేఐకి సంబంధించింది కాబట్టి ఆయన నిర్ణయం తీసుకోవడం సరికాదని, రాజ్యాంగ ప్రాధాన్యమున్న అంశం కావడంతో సుప్రీంలో సీనియర్ మోస్ట్ న్యాయమూర్తిగా మీరే నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ చలమేశ్వర్‌ను సిబల్ కోరారు. మాస్టర్ ఆఫ్ రోస్టర్‌పై రాజ్యాంగ ధర్మాసనం తీర్పు గురించి తనకు అవగాహన ఉందని, అయితే ఈ అంశంలో తక్షణ ఆదేశాలు కోరడం లేదని, వెంటనే విచారణకు స్వీకరించాలని మాత్రమే అడుగుతున్నానని ధర్మాసనానికి సిబల్ విజ్ఞప్తి చేశారు. 64 మంది ప్రస్తుత ఎంపీలు, ఏడుగురు మాజీ ఎంపీలతో కూడిన నోటీసును ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంటూ వెంటనే తిరస్కరించే అధికారం రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడుకు లేదని ఆయన వాదించారు. ‘దయచేసి పిటిషన్ స్వీకరణపై నిర్ణయం తీసుకోండి. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాలేదు. ఈ అంశాన్ని ఎవరు చేపట్టాలి.. ఎలా పరిష్కరించాలన్న దానిపై కోర్టు ఉత్తర్వులు జారీ చేయాలి’ అని సిబల్ కోరారు. ఈ సందర్భంగా జస్టిస్ చలమేశ్వర్ స్పందిస్తూ.. ‘నేను రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాను’ అని గుర్తుచేశారు. పిటిషన్‌ను ఒకవేళ పరిగణనలోకి తీసుకున్నప్పటికీ.. ఈ అంశాన్ని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావిస్తే సముచితంగా ఉంటుందని జస్టిస్ కౌల్ సూచించారు. న్యాయవాది ప్రశాంత్ భూషణ్ జోక్యం చేసుకుంటూ ‘ఈ అంశంలో ఎలాంటి ఆదేశాలు జారీ చేయడానికి సీజేఐకు అధికారాలు లేవు. సుప్రీంలోని సీనియర్ మోస్ట్ న్యాయమూర్తి మాత్రమే దీనిపై నిర్ణయం తీసుకోవాలి’ అని ధర్మాసనాన్ని కోరారు. -
‘కేంద్రానికి ఆ హక్కుంది’
సాక్షి, న్యూఢిల్లీ : జస్టిస్ కేఎం జోసెఫ్ పేరును సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా కేంద్రం ఆమోదించనంత మాత్రాన సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా ఇందూ మల్హోత్రా నియామకాన్ని నిలిపివేయడం తగదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అన్నారు. సుప్రీం న్యాయమూర్తిగా వచ్చిన సిఫార్సును పునఃసమీక్షించాలని తిప్పి పంపడం కేంద్రం హక్కుల్లో భాగమేనని ఆయన స్పష్టం చేశారు. న్యాయవాదుల ప్రతిపాదన అర్థరహితం, ఊహాతీతమని వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ పేరును కేంద్రం ఖరారు చేసేవరకూ ఇందూ మల్హోత్రా సుప్రీం న్యాయమూర్తిగా ప్రమాణం చేయరాదన్న సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ ప్రతిపాదన పట్ల ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలో జస్టిస్ ఏఎం కన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన సుప్రీం బెంచ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్రం ఇందూ మల్హోత్రా, జోసెఫ్‌ల పేర్లను రెండింటినీ సుప్రీం న్యాయమూర్తులుగా ఖరారు చేయడం లేదా తిప్పిపంపడం చేయాలని రెండింటినీ వేర్వేరుగా చూడటం సరైంది కాదన్న ఇందిరా జైసింగ్ వాదనను కోర్టు తోసిపుచ్చింది. తాము న్యాయమూర్తుల నియామకాలపై కేంద్రం ఆదేశాలను నిలిపివేయాలని కోరడం లేదని, జడ్జీలను ప్రభుత్వం ఎంచుకునే విధానాన్నే ప్రశ్నిస్తున్నామని ఇందిరా జైసింగ్ పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతపై ఆందోళన నెలకొందని అన్నారు.సుప్రీం న్యాయమూర్తిగా జస్టిస్ కేఎం జోసెఫ్ పేరును పునఃసమీక్షించాలని కేంద్రం సుప్రీం కోర్టు కొలీజియంను కోరడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. -
అది ప్రతీకార పిటిషన్..
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అభిశంసనకు విపక్షాలు ఇచ్చిన నోటీసుపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. కాంగ్రెస్ సహా విపక్షాలు అభిశంసనను రాజకీయ పరికరంగా వాడుకుంటున్నాయని ఆరోపిస్తూ అది ప్రతీకార పిటిషన్ అని అభివర్ణించారు. ఇది ప్రమాదకర ధోరణి అని హెచ్చరించారు. ఒక న్యాయమూర్తిని ఒత్తిడికి గురిచేసి ఇతర న్యాయమూర్తులకు ఎలాంటి సంకేతాలు పంపుతారని ప్రశ్నించారు. జస్టిస్ బీహెచ్ లోయా మరణంపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన వెనువెంటనే ఈ తీర్మానం ప్రవేశపెట్టడాన్ని గుర్తించాలని జైట్లీ అన్నారు. న్యాయమూర్తిని అభిశంసించాలన్న విపక్షాల వ్యూహం న్యాయవ్యవస్థ స్వతంత్రతకు పెనుముప్పని ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు సీజేఐ పనితీరుపై గతంలో న్యాయమూర్తులు బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేసిన క్రమంలోనే అభిశంసన తీర్మానం ముందుకొచ్చిందని కాంగ్రెస్ స్పష్టం చేసింది. న్యాయమూర్తుల మధ్య విభేదాలపైనా జైట్లీ స్పందిస్తూ న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఇది పెనుసవాల్ విసురుతుందని వ్యాఖ్యానించారు. -
సీజేఐ అభిశంసనపై కాంగ్రెస్‌లో విభేదాలు..?
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అభిశంసనపై కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జస్టిస్ మిశ్రా అభిశంసన కోరుతూ శుక్రవారం ఉపరాష్ట్రపతికి సమర్పించిన విపక్ష ఎంపీల సంతకాలతో కూడిన నోటీసులో తాను సంతకం చేయలేదని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ చేసిన ప్రకటన ఇవే సంకేతాలను పంపుతోంది. సీజేఐ అభిశంసనను కోరుతూ ఏడు విపక్ష పార్టీలకు చెందిన 64 మంది ఎంపీలు ఉపరాష్ట్రపతికి నోటీసులు ఇచ్చారు. సీబీఐ జడ్జి జస్టిస్ బీహెచ్ లోయా మృతిపై విచారణ జరిపించాలన్న పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో విపక్షాలు మిశ్రా అభిశంసనకు నోటీసు ఇవ్వడం గమనార్హం. తీర్పును కొందరు సమ్మతించడం లేదనే కారణంతో అభిశంసన చేపట్టడం తీవ్రమైన చర్యగా సల్మాన్ ఖుర్షీద్ స్పష్టం చేశారు. తాను ఈ నోటీసుపై సంతకం చేయలేదని ఆయన చెప్పారు. సంక్లిష్ట అంశాలను ఎదుర్కోవడంలో సుప్రీం కోర్టు సర్వసన్నద్ధంగా ఉందని సల్మాన్ ఖుర్షీద్ పేర్కొన్నారు. జస్టిస్ లోయా కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అంగీకరించాలని, దాన్ని గౌరవించాలని వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం ఈ నోటీసుపై సంతకం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ సహా ఏడు విపక్ష పార్టీలు ఈ నోటీసుపై సంతకాలు చేశాయని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ వెల్లడించారు. -
ఏప్రిల్ 27న సీజేఐపై పిల్ విచారణ
న్యూఢిల్లీ: కేసుల కేటాయింపులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుసరిస్తున్న రోస్టర్ విధానాన్ని సవాలు చేస్తూ న్యాయ శాఖ మాజీ మంత్రి శాంతి భూషణ్ దాఖలు చేసిన పిల్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. శుక్రవారం పిల్‌ను ధర్మాసనం స్వీకరిస్తూ.. ఏప్రిల్ 27న విచారణ ప్రారంభిస్తామని తెలిపింది. ఈ పిల్ విచారణలో అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, అదనపు సొలిసిటర్ జనరల్(ఏసీజే) తుషార్ మెహతాలు సాయం చేయాలని జస్టిస్ ఏకే సిక్రీ,, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం కోరింది. కేసుల కేటాయింపు బాధ్యతను సుప్రీంకోర్టులో ఐదుగురు అత్యంత సీనియర్ న్యాయమూర్తులతో కూడిన కొలీజియంకు అప్పగించాలన్న ఆలోచనతో ఏకీభవించడం లేదని ధర్మాసనం పేర్కొంది. కేసుల కేటాయింపులో సీజేఐ తీరును నిరసిస్తూ ఈ ఏడాది జనవరి 12న సుప్రీంలో అత్యంత సీనియర్ న్యాయమూర్తులైన జస్టిస్ జే.చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ జోసెఫ్ కురియన్ల ప్రెస్ కాన్ఫరెన్స్ అంశాన్ని ప్రస్తావించేందుకు శాంతి భూషణ్ తరఫు న్యాయవాదులు ప్రయత్నించగా ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘మేం ఆ విషయంలోకి వెళ్లడం లేదు. కొన్ని స్పష్టమైన కారణాల నేపథ్యంలో ఆ విషయంపై మాకు ఎలాంటి ఆసక్తిలేదు. వాటిని ప్రస్తావించవద్దు’ అని స్పష్టం చేసింది. ‘కేసుల కేటాయింపు బాధ్యతను కొలీజియంకు అప్పగిస్తే.. ఆ పని కోసమే రోజూ లేక వారానికి రెండు మూడు సార్లు సమావేశం కావాల్సి ఉంటుంది. అది ఆచరణ సాధ్యమైన పరిష్కారం కాదు’ అని సుప్రీం పేర్కొంది. సీజేఐ మాస్టర్ ఆఫ్ రోస్టర్ అన్న విషయాన్ని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసిందని బెంచ్ తెలిపింది. సీజేఐ సమానుల్లో ప్రథముడని, కేసుల కేటాయింపు, అలాగే కేసుల విచారణకు బెంచ్‌ల ఏర్పాటులో ఆయనకు ప్రత్యేకాధికారాలు ఉన్నాయని ఏప్రిల్ 11న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించింది. పిల్లో ముఖ్య ప్రశ్నల్ని లేవనెత్తాం శాంతి భూషణ్ తరఫున న్యాయవాది దుష్యంత్ దవే వాదిస్తూ.. సీజేఐ అధికారాలకు సంబంధించిన నిబంధనల్ని పిల్లో లేవనెత్తారని, నియమాలకు విరుద్ధంగా సుప్రీంలో జరుగుతున్న వ్యవహారాల్ని అది ప్రశ్నిస్తోందన్నారు. నియమాలకు విరుద్ధంగా సీజేఐ తన అధికారాల్ని వినియోగిస్తున్నారని, తన నియమావళికి సుప్రీంకోర్టు రిజిస్ట్రీ కట్టుబడి ఉండాలని అన్నారు. -
కొలీజియం’ను ప్రశ్నించిన మంత్రి
న్యూఢిల్లీ: కర్ణాటకలోని జిల్లా జడ్జి పి.కృష్ణభట్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై సరైన రీతిలో దర్యాప్తు జరగలేదని, విశాఖ కేసులో సుప్రీంకోర్టు పొందుపరిచిన నిబంధనల మేరకు ఆ ఫిర్యాదును విచారించలేదని పేర్కొంటూ సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ మిశ్రాకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లేఖ రాశారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై జరుగుతున్న నిష్పాక్షిక విచారణలో ఆ జడ్జి నిర్దోషిగా తేలేవరకూ హైకోర్టు జడ్జిగా నియమించాలన్న సిఫార్సుల్ని సుప్రీంకోర్టు కొలీజియం నిలుపుదల చేయలేదా? అని లేఖలో ప్రశ్నించారు. జడ్జి కృష్ణభట్పై జూనియర్ న్యాయాధికారి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల్ని కర్ణాటక హైకోర్టు తప్పుగా తేల్చిందని.. అయితే కర్ణాటక హైకోర్టు సీజే మళ్లీ విచారణ జరపడాన్ని సుప్రీంకోర్టులో సీనియర్ జడ్జి జస్టిస్ చలమేశ్వర్ ఇటీవల ప్రశ్నించడం తెల్సిందే. లేఖలో న్యాయ శాఖ మంత్రి ప్రసాద్ స్పందిస్తూ.. ‘న్యాయవ్యవస్థ సిఫార్సుల్ని కార్యనిర్వాహక వ్యవస్థ అడ్డుకుంటోందన్న ఆరోపణల్లో వాస్తవం లేదు. జడ్జిపై జూనియర్ మహిళా న్యాయాధికారి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై సంక్షిప్త విచారణ పలు తీవ్ర సందేహాల్ని రేకెత్తించింది. హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో జాగ్రత్తగా విచారణ చేయించడాన్ని కూడా సరైన, తగిన, తిరుగులేని దర్యాప్తుగా పరిగణించాలి’ అని ప్రసాద్ పేర్కొన్నారు. -
‘బోఫోర్స్’ కేసులో సీజేఐని తప్పించండి
న్యూఢిల్లీ: బోఫోర్స్ కుంభకోణం ముడుపుల కేసు విచారణ నుంచి సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రాను తప్పించాలని బుధవారం సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. బోఫోర్స్ కుంభకోణంలో రూ.64 కోట్ల మేర ముడుపుల కేసులో సీజేఐ పక్షపాతంతో, ఏకపక్షం గా వ్యవహరించే అవకాశముందని బీజేపీ నేత, న్యాయవాది అజయ్ అగర్వాల్ తాజా పిటిషన్లో ఆరోపించారు. బోఫోర్స్ కేసుతో ఎలాంటి సంబంధం లేని కపిల్ సిబల్‌ను జనవరి 16న జరిగిన విచారణలో జోక్యం చేసుకోవడానికి సీజేఐ అనుమతించడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. సిబల్ జోక్యాన్ని తాను వ్యతిరేకించినా సీజేఐ పట్టించుకోలేదని ఆరోపించారు. అంతేకాకుండా బోఫోర్స్ కేసులో ఫిర్యాదుదారైన తనకు తగిన సాక్ష్యాలు తెచ్చే అర్హత, సామర్థ్యం లేవన్న సిబల్ వాదనతో సీజేఐ ఏకీభవించా రన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి పోటీచేసిన అజయ్.. అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతిలో ఓటమి పాలయ్యారు. -
అయినా..అదే బెంచ్
సాక్షి, న్యూఢిల్లీ : కీలక కేసులను ఎంపిక చేసిన బెంచ్‌లకే కేటాయిస్తున్నారని భారత ప్రధాన న్యాయమూర్తిని నలుగురు సీనియర్ న్యాయమూర్తులు బహిరంగంగా ప్రశ్నించిన నేపథ్యంలో సోమవారం ప్రకటించిన ఐదుగురు జడ్జీల బెంచ్‌లో తక్కువ సీనియారిటీ ఉన్నవారిని సైతం కొనసాగించారు. తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నా ప్రధాన న్యాయమూర్తి జస్టిక్ దీపక్ మిశ్రా సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ జే చలమేశ్వర్, రంజన్ గగోయ్, ఎంబీ లోకూర్, కురియన్ జోసెఫ్‌లకు బెంచ్‌లో చోటు కల్పించలేదు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ ఏ కే సిక్రీ, జస్టిస్ ఏఎం కన్విల్కార్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్లున్నారు. ఈ బెంచ్ బుధవారం నుంచి కీలక కేసుల విచారణను ప్రారంభిస్తుంది. ఆధార్ చట్టం చెల్లుబాటు, గే సెక్స్, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం వంటి ముఖ్యమైన కేసుల విచారణను చేపడుతుంది. 2017 అక్టోబర్ 10 నుంచి ఇదే ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాల మధ్య అధికారాల వివాదం, కారుణ్య మరణాల వంటి కీలక కేసులను విచారించింది. సుప్రీం కోర్టు పనితీరు సజావుగా లేదని, కీలక కేసులను ఎంపిక చేసిన బెంచ్‌లకే కేటాయిస్తున్నారని నలుగురు సుప్రీం సీనియర్ న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపిన విషయం తెలిసిందే. జస్టిస్ లోయా మృతికి సంబంధించి దాఖలైన పిటిషన్ల లిస్టింగ్‌పైనా వారు ప్రశ్నలు లేవనెత్తారు. మరోవైపు రెబెల్ న్యాయమూర్తుల ఆరోపణల నేపథ్యంలోనూ ప్రధాన న్యాయమూర్తి రాజ్యాంగ ధర్మాసనంలో సీనియర్ న్యాయమూర్తులెవరికీ చోటు కల్పించకపోవడం గమనార్హం. -
వాయిదాలు మానుకోండి
లాయర్లకు సీజేఐ జస్టిస్ మిశ్రా హితవు సాక్షి, చెన్నై: కేసుల వాయిదా, సాగదీయడం వంటి వ్యాధులతో ఏ న్యాయవాది బాధపడకూడదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అన్నారు. మద్రాసు హైకోర్టు వారసత్వ భవంతి 125వ వార్షికోత్సవంలో శనివారం ఆయన ప్రసంగిస్తూ..సమయపాలన న్యాయ నియమావళి లక్షణమని పేర్కొన్నారు. ‘సమయపాలన తప్పనిసరి బాధ్యతగా ధర్మాసనంలోని సభ్యులు, న్యాయవాదులు అర్థం చేసుకోవాలి. న్యాయవాది కేసు వాయిదా, సాగదీయడం చేస్తుంటే.. న్యాయమూర్తి సరైన సమయానికి ధర్మాసనంపైకి రావడం లేదు. వారిద్దరు న్యాయ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నారు’ అని జస్టిస్ మిశ్రా అన్నారు. ఒకవేళ న్యాయమూర్తి వాయిదాకు మొగ్గు చూపితే.. కేసుతో తాను సిద్ధమని.. విచారణ కొనసాగించాలని మర్యాదపూర్వకంగా న్యాయవాది చెప్పాలని జస్టిస్ మిశ్రా సూచించారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారంపై న్యాయవాదులు, న్యాయమూర్తులు దృష్టి పెట్టాలని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పిలుపునిచ్చారు. పదేళ్లకు పైగా సాగుతున్న పెండింగ్ కేసుల్ని పరిష్కరించేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా 1894 నాటి అతి పెద్ద లైట్ హౌస్‌ను జస్టిస్ మిశ్రా ప్రారంభించారు. ఈ లైట్హౌస్కు ఇటీవలే మరమ్మతులు చేసి పునరుద్ధరించారు. కార్యక్రమంలో తమిళనాడు సీఎం పళనిస్వామి, రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి షణ్ముగం, మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ, సీనియర్ న్యాయవాది భానుమతి, జడ్జీలు, లాయర్లు పాల్గొన్నారు