న్యూఢిల్లీ: ఆధార్ పథకం, దాని అమలుకు రూపొందించిన చట్టం రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. సీజేఐ జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ముందు మొత్తం 31 పిటిషన్లు దాఖలు కాగా.. వాటిలో హైకోర్టు మాజీ జడ్జి కేఎస్ పుట్టుస్వామి దాఖలు చేసిన పిటిషనూ ఉంది. ఈ పిటిషన్లపై నాలుగున్నర నెలల వ్యవధిలో మొత్తం 38 రోజులు ధర్మాసనం వాదనల్ని ఆలకించింది. 1973లో చారిత్రాత్మక కేశవానంద భారతీ కేసు అనంతరం ఎక్కువ రోజులు విచారించిన కేసు ఇదే.
ధర్మాసనం ముందు పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గోపాల సుబ్రమణియమ్ వాదిస్తూ.. ‘సేవలు అందించేందుకు ఆధార్ చట్టం మాధ్యమం కాదు. ఇది కేవలం ఒక గుర్తింపు మాత్రమే. ఆధార్ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం గౌరవం, స్వేచ్ఛకు భద్రత లేదు. ధ్రువీకరణ అనేది ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. ధ్రువీకరణలో విఫలమైతే సేవల్ని నిరాకరించవచ్చని చట్టంలో పేర్కొన్నారు’ అని వాదించారు. ఆధార్ సమాచారాన్ని పొందేందుకు ప్రైవేటు వ్యక్తులకు అనుమతిచ్చారని, ఈ చట్టానికి ఎలాంటి భద్రతా లేదన్నారు.
ఆధార్ వంటి చట్టానికి నియంత్రణ అవసరమని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. మనీ లాండరింగ్ నియంత్రణ చట్టం ప్రకారం ఆధార్ కేవలం బ్యాంకులకు మాత్రమే పరిమితం కాదని.. మ్యూచువల్ ఫండ్లు, బీమా పాలసీలు, క్రెడిట్ కార్డులు, ఇతర అంశాలకు అవసరమని మరో సీనియర్ న్యాయవాది అర్వింద్ దతర్ ఆందోళన వెలిబుచ్చారు. ఈ కేసులో కక్షిదారుల పక్షాన సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, పి.చిదంబరం, శ్యామ్ దివాన్, కేవీ విశ్వనాథ్, ఆనంద్ గ్రోవర్, సజన్ పూవయ్యలు వాదనలు వినిపించారు.
రామన్ మెగసెసె అవార్డు గ్రహీత శాంతా సిన్హా, సామాజిక కార్యకర్తలు అరుణా రాయ్, నిఖిల్ డే, నచికెత్ ఉడుప తదితరులు ఆధార్‌ను వ్యతిరేకిస్తూ పిటిషన్లను దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వం, ఆధార్ అధీకృత సంస్థ(యూఐడీఏఐ), మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలు, ఆర్బీఐలు ఆధార్‌కు అనుకూలంగా వాదనలు వినిపించగా.. వారి తరఫున అటార్నీ జనరల్ వేణుగోపాల్, అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్, లాయర్లు రాకేశ్ ద్వివేది, జయంత్ భూషణ్‌లు వాదించారు.
Comments
Please login to add a commentAdd a comment