బాల్య వివాహ నిషేధ చట్టంపై సుప్రీంకోర్టు స్పష్టీకరణ
వ్యక్తిగత చట్టాలు అడ్డుకావని వ్యాఖ్య
న్యూఢిల్లీ: బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు పేర్కొంది. దాని అమలులో వ్యక్తిగత వివాహ చట్టాలతో పాటు మరే ఇతర చట్టాలూ అడ్డంకి కాజాలవని స్పష్టం చేసింది. వాటిలో ఏది ముందనే ప్రశ్న తలెత్తే సందర్భంలో బాల్య వివాహాల నిషేధ చట్టమే అమలవుతుందని పేర్కొంది. సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జె.బి.పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు 141 పేజీల తీర్పు వెలువరించింది.
బాల్య వివాహాల కట్టడికి మరింత సమర్థమైన విధానాలను అమలు చేయాలంటూ దాఖలైన పిల్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. ‘‘బాల్య వివాహాలు ఒక సామాజిక రుగ్మత. బాలలకు, ముఖ్యంగా బాలికలకు ఆరోగ్యం, విద్య, ఉపాధితో పాటు జీవించే అవకాశాలనే ప్రశ్నార్థకం చేస్తుంది. కానీ భారత్‌లో బాల్య వివాహాలు ఇంకా ప్రబలంగా ఉండటం దురదృష్టకరం’’ అంటూ ఆవేదన వెలిబుచ్చింది.
వాటి కట్టడికి జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా బాల్య వివాహాల నిషేధ అధికారులను నియమించాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. చట్టం అమలు తీరుతెన్నులపై మహిళా, శిశు సంక్షేమ, హోం శాఖలు మూడు నెలలకు ఓసారి సమీక్ష జరపాలని సూచించింది. బాల్య వివాహాలు తప్పని, వాటికి కఠిన శిక్షలు తప్పవని విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. ‘‘వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లు, ఎస్పీలపై ఉంటుంది. ఇందుకోసం పోలీసు శాఖలో జువనైల్ విభాగాన్ని ఏర్పాటు చేయాలి’’ అని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment