Child Marriage Prohibition Act
-
తూచా తప్పకుండా అమలవాల్సిందే
న్యూఢిల్లీ: బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు పేర్కొంది. దాని అమలులో వ్యక్తిగత వివాహ చట్టాలతో పాటు మరే ఇతర చట్టాలూ అడ్డంకి కాజాలవని స్పష్టం చేసింది. వాటిలో ఏది ముందనే ప్రశ్న తలెత్తే సందర్భంలో బాల్య వివాహాల నిషేధ చట్టమే అమలవుతుందని పేర్కొంది. సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జె.బి.పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు 141 పేజీల తీర్పు వెలువరించింది. బాల్య వివాహాల కట్టడికి మరింత సమర్థమైన విధానాలను అమలు చేయాలంటూ దాఖలైన పిల్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. ‘‘బాల్య వివాహాలు ఒక సామాజిక రుగ్మత. బాలలకు, ముఖ్యంగా బాలికలకు ఆరోగ్యం, విద్య, ఉపాధితో పాటు జీవించే అవకాశాలనే ప్రశ్నార్థకం చేస్తుంది. కానీ భారత్‌లో బాల్య వివాహాలు ఇంకా ప్రబలంగా ఉండటం దురదృష్టకరం’’ అంటూ ఆవేదన వెలిబుచ్చింది. వాటి కట్టడికి జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా బాల్య వివాహాల నిషేధ అధికారులను నియమించాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. చట్టం అమలు తీరుతెన్నులపై మహిళా, శిశు సంక్షేమ, హోం శాఖలు మూడు నెలలకు ఓసారి సమీక్ష జరపాలని సూచించింది. బాల్య వివాహాలు తప్పని, వాటికి కఠిన శిక్షలు తప్పవని విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. ‘‘వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లు, ఎస్పీలపై ఉంటుంది. ఇందుకోసం పోలీసు శాఖలో జువనైల్ విభాగాన్ని ఏర్పాటు చేయాలి’’ అని పేర్కొంది. -
బాల్య వివాహాల కట్టడికి కఠిన చర్యలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో బాల్య వివాహాల కట్టడికి ప్రభుత్వం మరింత కఠిన చర్యలు చేపట్టింది. గతంతో పోలి్చతే రాష్ట్రంలో బాల్య వివాహాల రేటు తగ్గినప్పటికీ ప్రజలు, ప్రభుత్వ శాఖల సమన్వయంతో వాటిని మరింతగా కట్టడి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర అన్ని జిల్లాల అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, మిషన్ వాత్సల్య, బాల్య వివాహ నిరోధక చట్టం–2006, ఏపీ నియమాలు–2012ను అనుసరించి బాల్య వివాహాల నివారణ కోసం వరుడు, వధువు, వారి తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రం తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మెమోలో పేర్కొన్న అంశాలు ఇవి.. ►బాల్య వివాహాల దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. బాల్య వివాహ నిరోధక, పోక్సో చట్టాల ప్రకారం విధించే శిక్షలపై ప్రజలకు తెలియజేయాలి. ►మైనర్ బాలికను వివాహం చేసుకుని, ఆమెతో సంసారం చేస్తే బాల్య వివాహ చట్టం–2006, పోక్సో చట్టం–2012 (సవరణ చట్టం–2019) ప్రకారం శిక్ష తప్పదు. ►మైనర్ బాలికను వివాహం చేసుకున్న వరుడికి బాల్య వివాహ నిషేధ చట్టం–2006లోని సెక్షన్ 9 ప్రకారం రెండేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా, లేదా రెండూ కలిపి విధించవచ్చు. ►బాల్య వివాహంతో 18 ఏళ్లలోపు బాలికతో సంసారం చేస్తే అత్యాచారం కేసుగా నమోదు చేసి పోక్సో సవరణ చట్టం–2019 సెక్షన్ 4(జీ) ప్రకారం పదేళ్లకు తక్కువ కాకుండా జైలు శిక్ష, జరిమానా, జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది. ►16 ఏళ్ల లోపు బాలికను వివాహం చేసుకుని సంసారం చేస్తే అత్యాచారం కేసులో పోక్సో సవరణ చట్టం–2019 సెక్షన్ 4(జీజీ) ప్రకారం ఇరవై సంవత్సరాలకంటే తక్కువ కాకుండా జైలు శిక్ష, జరిమానా, జీవిత ఖైదు విధిస్తారు. ► బాల్య వివాహాలు నిర్వహించిన వరుడు, వధువు తల్లిదండ్రులకు, వారి బంధువులకు శిక్ష తప్పుదు. వారికి రెండేళ్లు జైలు, రూ.లక్ష జరిమానా విధిస్తారు. వీరికి పోక్సో చట్టం–2012 సెక్షన్ 17 ప్రకారం కూడా శిక్ష పడుతుంది. -
సవరణ బిల్లు ఆమోదం పొందే వరకు వివాహ వయసు 18 ఏళ్లే.
సాక్షిహైదరాబాద్: బాల్య వివాహాల నిషేధ సవరణ బిల్లు–2021 ఆమోదం పొందే వరకు ఆడపిల్లల వివాహ వయస్సు 18 సంవత్సరాలు మాత్రమే అమలులో ఉంటుందని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ మహ్మద్ సలీమ్ అన్నారు. హైదరాబాద్ హజ్‌హౌస్‌లో వక్ఫ్ ఖాజీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం బాల్య వివాహాల నిషేధ సవరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశ పెట్టినా... ఇంకా ఆమోదం పొందలేదని, బిల్లు ఆమోదం పొందిన నాటి నుంచి రెండేళ్ల తర్వాత అమల్లోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. బాలికల వివాహ వయస్సు 21 ఏళ్లకు పెంచడంతో ఆందోళనకు గురైన కొందరు తల్లిదండ్రులు హడావుడిగా ఆడపిల్లల పెళ్లిళ్లు చేస్తున్నారన్నారు. పార్లమెంటులో బిల్లును ఆమోదించవద్దని అందరూ అభ్యర్ధిస్తున్నారని, దీనిపై ఆందోళన చెందవద్దని సూచించారు. సమావేశంలో ఖాజీలు మహ్మద్ యూసుఫుద్దీన్,సయ్యద్ షా నూరుల్ అస్ఫియా,సయ్యద్ లతీఫ్ అలీ, సయ్యద్ అఫ్జల్ హుస్సేన్, సయ్యద్ నూరుల్లా ఫరూఖ్ తదితరులు పాల్గొన్నారు. -
చట్టాలున్నాయి... సమానత్వమే లేదు!
అసమానం గోవాలో హిందూ మతానికి వర్తించే ఒక చట్టం ఉంది. ముప్పై ఏళ్లు వచ్చాక కూడా తన భార్య మగ పిల్లవాడిని కనకపోతే ఆ భర్త ఇంకో పెళ్లి చేసుకోవచ్చు! పురుషాధిక్య సమాజంలోని పక్షపాత చట్టాలకు ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. ఐక్యరాజ్య సమితి ఇటీవలే ఇలాంటి చట్టాల జాబితాతో ఒక నివేదిక విడుదల చేసింది. ఇవన్నీ కూడా మహిళపై పురుషుని ఆధిక్యాన్ని, అధికారాన్ని సమర్థించేవిగా ఉండడం విశేషం. హిందూ వారసత్వ చట్టం: పెళ్లి, విడాకులు, వారసత్వం, పిల్లల సంరక్షణకు సంబంధించి భారతదేశంలో ఒక్కో మతానికి ఒక్కోరకమైన చట్టం ఉంది. హిందువుల విషయానికి వస్తే, ఒక మహిళ కనుక వీలునామా రాయకుండా చనిపోతే... భర్తగానీ, పిల్లలు గానీ లేనప్పుడు ఆమె ఆస్తి ఆమె అత్తమామలకు సంక్రమిస్తుంది! పార్శీల వారసత్వ చట్టం: పార్శీ చట్టం ప్రకారం పార్శీలు ఇతర మతస్థులను వివాహం ఆడడం నిషిద్ధం. ఒకవేళ వివాహం చేసుకున్నప్పటికీ పార్శీ మతస్థురాలు కాని భార్యకు, లేదా వితంతువుకు భర్త ఆస్తి సంక్రమించదు. అలాగే పార్శీ మహిళకు పార్శీ మతస్థుడు కాని భర్త వల్ల కలిగిన సంతానాన్ని పార్శీల వారసత్వ చట్టం పార్శీలుగా పరిగణించదు. బాల్య వివాహాల నిషేధ చట్టం: ఈ చట్టం ప్రకారం బాల్య వివాహాలు నిషిద్ధమే కానీ, అలా జరిగిన పెళ్లి చట్ట విరుద్ధమా కాదా అన్నది చట్టంలో నిర్దిష్టంగా లేదు. బహుశా ఇందుకే ఈ దేశంలో నేటికీ బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయని సమితి వ్యాఖ్యానించింది. సమ్మతి వయసు: బాల్య వివాహాలు చట్ట విరుద్ధం కాకపోవడంతో భర్త తన మైనరు భార్యతో కలవడం చట్ట సమ్మతమే అవుతోంది! పెపైచ్చు దాంపత్య అత్యాచారం మన దేశంలో నేరం కూడా కాదు. విడిపోయాక అత్యాచారం: విడిపోయిన భార్యపై అత్యాచారం చేస్తే పడే శిక్ష, మూమూలు అత్యాచారంలో పడే శిక్ష కన్నా తక్కువ! అంటే మొదటి కేసులో 2 నుంచి 7 ఏళ్ల వరకు మాత్రమే శిక్ష పడే అవకాశం ఉంటే, రెండో కేసులో ఏడేళ్ల శిక్ష లేదా జీవితఖైదు పడొచ్చు. వివాహ వయఃపరిమితి: చట్ట ప్రకారం అబ్బాయి పెళ్లి వయసు 21 ఏళ్ళు, అమ్మాయి పెళ్లి వయసు 18 ఏళ్ళు. భార్య ఎప్పుడూ భర్త కన్నా వయసులో చిన్నదిగానే ఉండాలన్న పురుషాధిక్య సమాజపు పోకడకు అద్దం పట్టే నిబంధన ఇది. హిందూ మైనారిటీ, గార్డియన్షిప్ యాక్టు: ఈ చట్టం ప్రకారం భర్తకు సమానంగా భార్య.. పిల్లల సంరక్షకురాలు కాదు! ఐదేళ్ల లోపు పిల్లలకు తల్లి సంరక్షకురాలే అయినప్పటికీ మొత్తంగా తండ్రిని మాత్రమే పిల్లల సహజ సిద్ధమైన సంరక్షకుడిగా చట్టం గుర్తిస్తోంది. సమాజంలో స్త్రీ ద్వితీయశ్రేణి పౌరురాలిగానే మిగిలిపోయిందనీ, చట్ట పరంగా అమెకు మేలు కన్నా కీడే ఎక్కువగా జరుగుతోందని చెప్పడానికి ఇవి కొన్ని అంశాలు మాత్రమే. దేశంలోని పౌరులందరికీ మతాతీతంగా ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని బి.జె.పి చాలాకాలంగా అంటోంది. ఇప్పుడు ఆ పార్టీనే అధికారంలో ఉంది కాబట్టి అలాంటి ప్రయత్నం ఏదైనా జరిగితే వివాహిత హక్కులకు భరోసా ఉంటుంది.