సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో బాల్య వివాహాల కట్టడికి ప్రభుత్వం మరింత కఠిన చర్యలు చేపట్టింది. గతంతో పోలి్చతే రాష్ట్రంలో బాల్య వివాహాల రేటు తగ్గినప్పటికీ ప్రజలు, ప్రభుత్వ శాఖల సమన్వయంతో వాటిని మరింతగా కట్టడి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర అన్ని జిల్లాల అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు.
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, మిషన్ వాత్సల్య, బాల్య వివాహ నిరోధక చట్టం–2006, ఏపీ నియమాలు–2012ను అనుసరించి బాల్య వివాహాల నివారణ కోసం వరుడు, వధువు, వారి తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రం తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మెమోలో పేర్కొన్న అంశాలు ఇవి..
►బాల్య వివాహాల దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. బాల్య వివాహ నిరోధక, పోక్సో చట్టాల ప్రకారం విధించే శిక్షలపై ప్రజలకు తెలియజేయాలి.
►మైనర్ బాలికను వివాహం చేసుకుని, ఆమెతో సంసారం చేస్తే బాల్య వివాహ చట్టం–2006, పోక్సో చట్టం–2012 (సవరణ చట్టం–2019) ప్రకారం శిక్ష తప్పదు.
►మైనర్ బాలికను వివాహం చేసుకున్న వరుడికి బాల్య వివాహ నిషేధ చట్టం–2006లోని సెక్షన్ 9 ప్రకారం రెండేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా, లేదా రెండూ కలిపి విధించవచ్చు.
►బాల్య వివాహంతో 18 ఏళ్లలోపు బాలికతో సంసారం చేస్తే అత్యాచారం కేసుగా నమోదు చేసి పోక్సో సవరణ చట్టం–2019 సెక్షన్ 4(జీ) ప్రకారం పదేళ్లకు తక్కువ కాకుండా జైలు శిక్ష, జరిమానా, జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది.
►16 ఏళ్ల లోపు బాలికను వివాహం చేసుకుని సంసారం చేస్తే అత్యాచారం కేసులో పోక్సో సవరణ చట్టం–2019 సెక్షన్ 4(జీజీ) ప్రకారం ఇరవై సంవత్సరాలకంటే తక్కువ కాకుండా జైలు శిక్ష, జరిమానా, జీవిత ఖైదు విధిస్తారు.
► బాల్య వివాహాలు నిర్వహించిన వరుడు, వధువు తల్లిదండ్రులకు, వారి బంధువులకు శిక్ష తప్పుదు. వారికి రెండేళ్లు జైలు, రూ.లక్ష జరిమానా విధిస్తారు. వీరికి పోక్సో చట్టం–2012 సెక్షన్ 17 ప్రకారం కూడా శిక్ష పడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment