
సవరణ బిల్లు ఆమోదం పొందే వరకు వివాహ వయసు 18 ఏళ్లే.
సాక్షిహైదరాబాద్: బాల్య వివాహాల నిషేధ సవరణ బిల్లు–2021 ఆమోదం పొందే వరకు ఆడపిల్లల వివాహ వయస్సు 18 సంవత్సరాలు మాత్రమే అమలులో ఉంటుందని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ మహ్మద్ సలీమ్ అన్నారు. హైదరాబాద్ హజ్‌హౌస్‌లో వక్ఫ్ ఖాజీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం బాల్య వివాహాల నిషేధ సవరణ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టినా... ఇంకా ఆమోదం పొందలేదని, బిల్లు ఆమోదం పొందిన నాటి నుంచి రెండేళ్ల తర్వాత అమల్లోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు.
బాలికల వివాహ వయస్సు 21 ఏళ్లకు పెంచడంతో ఆందోళనకు గురైన కొందరు తల్లిదండ్రులు హడావుడిగా ఆడపిల్లల పెళ్లిళ్లు చేస్తున్నారన్నారు. పార్లమెంటులో బిల్లును ఆమోదించవద్దని అందరూ అభ్యర్ధిస్తున్నారని, దీనిపై ఆందోళన చెందవద్దని సూచించారు. సమావేశంలో ఖాజీలు మహ్మద్ యూసుఫుద్దీన్,సయ్యద్ షా నూరుల్ అస్ఫియా,సయ్యద్ లతీఫ్ అలీ, సయ్యద్ అఫ్జల్ హుస్సేన్, సయ్యద్ నూరుల్లా ఫరూఖ్ తదితరులు పాల్గొన్నారు.