Child Marriage Prevention Act
-
సవరణ బిల్లు ఆమోదం పొందే వరకు వివాహ వయసు 18 ఏళ్లే.
సాక్షిహైదరాబాద్: బాల్య వివాహాల నిషేధ సవరణ బిల్లు–2021 ఆమోదం పొందే వరకు ఆడపిల్లల వివాహ వయస్సు 18 సంవత్సరాలు మాత్రమే అమలులో ఉంటుందని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ మహ్మద్ సలీమ్ అన్నారు. హైదరాబాద్ హజ్‌హౌస్‌లో వక్ఫ్ ఖాజీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం బాల్య వివాహాల నిషేధ సవరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశ పెట్టినా... ఇంకా ఆమోదం పొందలేదని, బిల్లు ఆమోదం పొందిన నాటి నుంచి రెండేళ్ల తర్వాత అమల్లోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. బాలికల వివాహ వయస్సు 21 ఏళ్లకు పెంచడంతో ఆందోళనకు గురైన కొందరు తల్లిదండ్రులు హడావుడిగా ఆడపిల్లల పెళ్లిళ్లు చేస్తున్నారన్నారు. పార్లమెంటులో బిల్లును ఆమోదించవద్దని అందరూ అభ్యర్ధిస్తున్నారని, దీనిపై ఆందోళన చెందవద్దని సూచించారు. సమావేశంలో ఖాజీలు మహ్మద్ యూసుఫుద్దీన్,సయ్యద్ షా నూరుల్ అస్ఫియా,సయ్యద్ లతీఫ్ అలీ, సయ్యద్ అఫ్జల్ హుస్సేన్, సయ్యద్ నూరుల్లా ఫరూఖ్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళా మేలుకో.. రక్షణ చట్టాలు తెలుసుకో
సాక్షి, అమరావతి : జీవితాంతం తోడుగా ఉంటానని ప్రమాణం చేసి.. అదనపు కట్నం కోసం వేధించే భర్త. కార్యాలయాల్లో ఇబ్బందులు.. కాలేజీలో ప్రేమ పేరిట విసిగించే జులాయిలు.. ఇలా అడుగుకో మగాడు మహిళలపై రకరకాల వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ ఆకృత్యాలకు అడ్డుకట్ట వేయడానికి ఎన్నో చట్టాలు, మరెన్నో సెక్షన్లు ఉన్నాయి. వాటి గురించి మహిళల్లో చైతన్యం లేకపోవడమే వారి పాలిట శాపంగా మారింది. వారికి ఉపయోగపడే చట్టాలపై మహిళలు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. గృహహింస రక్షణచట్టం.. మహిళను శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా హింసించడం వంటివి గృహ హింస చట్టం కిందకు వస్తాయి. ఈ చట్టం ప్రకారం బాధితురాలు, ప్రతివాది భార్యాభర్తలు మాత్రమే కానవసరం లేదు. పుట్టుక ద్వారా, పెళ్లి ద్వారా, దత్తత ద్వారా కలిసి ఉంటున్న వారైనా ఒకే ఇంట్లో ఉంటూ, గతంలో కలసి నివసించిన స్త్రీ, పురుషులు ఈ చట్టం పరిధిలోకి వస్తారు. బాధితురాలి తరఫున ఎవరైనా రక్షణ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు. రక్షణ అధికారి జరిపిన విచారణను నివేదిక రూపంలో మేజిస్ట్రేట్ కోర్టుకు అందించాలి. వరకట్న నిషేధ చట్టం కట్నం ఇవ్వడాన్ని, తీసుకోవడాన్ని నిషేధించారు. చట్ట ప్రకారం కట్నం ఇవ్వడం, తీసుకోవడం, కట్నం తీసుకోవడంలో దోహదపడడాన్ని కూడా శిక్షార్హులుగా పరిగణిస్తారు. ఐదేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష, రూ.15 వేల వరకు జరిమానా విధించడానికి అవకాశం ఉంది. సెక్షన్–4 కింద ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా కానీ కట్నం అడిగితే శిక్షాకాలం ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు జైలు, రూ.10 వేల వరకు జరిమానా విధించవచ్చు. సెక్షన్–5 ప్రకారం కట్నం ఇచ్చి పుచ్చుకోవడానికి ఏమైనా ఒప్పందాలు చేసుకుంటే అవి చెల్లవు. సెక్షన్–7 ప్రకారం నేరం జరిగిన ఏడాదిలోపు గుర్తించినా, వారిపై చర్యలు తీసుకోవచ్చు. సెక్షన్–8 (ఏ) ప్రకారం వరకట్న నిషేధ చట్టం అమలుకు ప్రభుత్వం అధికారులను నియమించాలి. నిర్భయ చట్టం మహిళల రక్షణ కోసం కఠినమైన చట్టాన్ని తీసుకు రావాలని ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. మహిళలపై జరుగుతున్న దాడులు లైంగిక దాడులు, వేధింపులు, కిడ్నాప్, హింస ఈ చట్టం కిందకు వస్తాయి. నిర్బంధ వివాహ నమోదు చట్టం–2002 రాష్ట్రంలో జరిగే ప్రతి వివాహం కూడా కుల, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ చట్టం కింద వివాహ నమోదు అధికారులను రాష్ట్ర వ్యాప్తంగా నియమించారు. వ్యభిచార నిరోధక చట్టం : మహిళలను వ్యభిచార కూపంలోకి లాగకుండా చట్టం రక్షణ కల్పిస్తుంది. మహిళలపై అసభ్య ప్రదర్శన నిరోధక చట్టం యాక్ట్ 1986 ప్రకారం మహిళలను కించపరిచే విధంగా బొమ్మలు, రాతలు, నగ్న చిత్రాలు తదితరాలు ఈ చట్టం ద్వారా నిరోధించారు. సతీ నిరోధక చట్టం భర్త మరణిస్తే అతని భౌతికకాయంతో పాటు భార్యను బలవంతంగా చితిపై దహనం చేసే అనాగరిక చర్య నుంచి మహిళలకు ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది. సెక్షన్ –100 ఆత్మ రక్షణ కోసం ఒక వ్యక్తిపై దాడి చేస్తే తప్పులేదు. ఆ సమయంలో సదరు వ్యక్తి చనిపోయినా వారికి శిక్షపడదు. వివాహ రద్దు చట్టం.. తన వివాహాన్ని రద్దు చేసుకునే హక్కును ముస్లిం మహిళలకు ఈ చట్టం ద్వారా కల్పించారు. విడాకులు పొందిన ముస్లిం మహిళల రక్షణ చట్టం భర్త నుంచి విడాకులు పొందిన ముస్లిం మహిళల హక్కులను కాపాడేందుకు ఈ చట్టం చేశారు. కుటుంబ న్యాయస్థానాల చట్టం కుటుంబ తగాదాలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక న్యాయస్థానాలను ఈ చట్టం కింద ఏర్పాటు చేశారు. హిందూ పౌరసత్వ చట్టం ఈ చట్టాన్ని 2005లో సవరించారు. ఈ చట్ట ప్రకారం మహిళలకు తన తండ్రి ఆస్తిలో పురుషుడితో సమాన హక్కు ఉంది. మాతృత్వ ప్రయోజనాల చట్టం పనిచేసే మహిళలకు ప్రసూతి ముందు, ప్రసూతి అనంతరం కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు కల్పించాలని ఈ చట్టం నిర్ధేశిస్తుంది. లీగల్ సర్వీస్ అథారిటీ చట్టం ఈ చట్ట ప్రకారం ప్రభుత్వం మహిళలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తుంది. బాల్య వివాహ నిరోధక చట్టం ఈ చట్టం ప్రకారం బాల్య వివాహాలను పూర్తిగా నిషేధించారు. మగ పిల్లలకు 21 ఏళ్లలోపు, ఆడ పిల్లలకు 18 ఏళ్లలోపు జరిగే ఏ వివాహమైన బాల్య వివాహమే. 21 ఏళ్లు దాటిన యువకుడు చిన్న వయస్సులోని ఆడపిల్లలను పెళ్లి చేసుకుంటే అతడికి రెండేళ్ల జైలు శిక్ష లేదా, రూ.లక్ష జరిమానా విధిస్తారు. జిల్లా ప్రధాన న్యాయాధికారి ఈ చట్టం పరిధిలో కేసులను విచారించవచ్చు. బాల్య వివాహాన్ని ఎవరైనా జరిపిస్తున్నట్లు సమాచారం అందితే వెంటనే ఆ వివాహాన్ని నిరోధిస్తూ నిషేధాజ్ఞలు జారీ చేసే అధికారం న్యాయాధికారికి ఉంటుంది. ఏదైనా సందర్భంలో ఎవరి దృష్టికి రాకుండా బాల్య వివాహం జరిగితే ఆ వివాహాన్ని ఈ చట్టంతో రద్దు చేసుకోవచ్చు. ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతున్నట్లు తెలిస్తే బాలల సహాయ హెల్ప్‌లైన్‌కి తెలియజేయవచ్చు. లింగ ఎంపిక నిషేధ చట్టం ఈ చట్టం ప్రకారం స్త్రీల పట్ల వివక్షత నివారించడానికి లింగ ఎంపిక, భ్రూణహత్యలను నిషేధించారు. తల్లీబిడ్డ ఆరోగ్యానికి ఏదైనా హాని కలిగే పరిస్థితుల్లో జన్యుసంబంధిత వ్యాధులకు మాత్రమే తల్లి అంగీకారంతోనే గర్భస్రావం చేయించుకునే అవకాశం ఉంది. స్కాన్ సెంటర్లు, డాక్టర్లు వీటి వినియోగంపై ప్రభుత్వం అజమాయిషీ, నియంత్రణను జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్‌కు కల్పించింది. అక్రమంగా స్కాన్ చేసి లింగ నిర్ధారణ వెల్లడి చేయడం చట్టరీత్యా నేరంగా పరిగణించి కఠినమైన చర్యలు విధిస్తారు. సమాన వేతన చట్టం స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలి. లింగ విక్ష ఆధారంగా స్త్రీలకు వేతనాలు తగ్గించరాదు. -
మీరు చెబితే.. మేం వినాలా!
సాక్షి, శ్రీకాకుళం రూరల్ : చిన్నారి పెళ్లికూతుళ్లు రోజురోజుకూ అధికమవుతున్నారు. చైల్డ్‌లైన్ సిబ్బంది, అధికారులు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నా ఫలితం లేకపోతోంది. వారు వెళ్లిన తర్వాత గుట్టుచప్పుడు కాకుండా బాల్య వివాహాలు జరిపించేస్తున్నారు. చిన్న వయసులోనే పెళ్లి జరగడం, బిడ్డలకు జన్మనివ్వడంతో చాలామంది అమ్మాయిలు 16 నుంచి 20 ఏళ్ల వయసులోపే కాన్సుల సమయంలో మృత్యువాత పడుతున్నారు.ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతున్నట్లు సమాచారం అందితే వెంటనే ఉన్నతాధికారులు ఆయా గ్రామాలకు వెళ్తున్నారు. తల్లిదండ్రుల సమక్షంలో బాలికతో మాట్లాడి చిన్న వయసులో పెళ్లి జరిగితే కలిగే అనర్ధాలను వివరిస్తున్నారు. అయినా తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు. గ్రామపెద్ద, వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి సమక్షంలో కౌన్సెలింగ్ చేసినప్పటికీ రాజకీయ నాయకులతో చెప్పించి చూసీచూడనట్లు వదిలేయండిని చెప్పడంతో అధికారులు ఏమిచేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు ముహూర్తబలం చేదాటిపోకూడదని దొంగచాటుగా గుడిలోనో, వేరేచోటనో గుట్టుచప్పుడు కాకుండా మూడుముళ్లు వేయించేస్తున్నారు. కానరాని మార్పు.. తక్కువ వయసులోనే వివాహం కావడం, ఏడాదిలోనే కాన్పులు రావడంతో బాలికలు యుక్త వయస్సులోనే మృతి చెందిన సంఘటనలు కోకొల్లలు. ఈ విషయంలో అధికారులు, వైద్యులు ఎన్ని హెచ్చరికలు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. చట్ట ప్రకారం అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు నిండితేనే వివాహం జరిపించాల్సి ఉంది. ప్రస్తుతం గ్రామీణ ప్రాం తాల్లో ఎక్కువ శాతం మంది ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. అమ్మాయి పెళ్లి చేస్తే ఓ బాధ్యత తీరిపోతుందంటూ తల్లిదండ్రులు సంబంధాల కోసం వెతకడం, అబ్బాయి తరఫు వారు కూడా వయసును పెద్దగా పరిగణనలోకి తీసుకోకపోవడం వల్లే బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. బాల్య వివాహాలు నేరమంటూ చైల్డ్‌లైన్ సిబ్బంది, ఐసీడీస్ సిబ్బంది గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నా, యువతీ యువకుల తల్లిదండ్రుల కౌన్సిలింగ్ ఇస్తున్నా ఏ మాత్రం ప్రయోజనం ఉండటం లేదు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్.. రెండు రోజులు క్రితం చైల్డ్‌లైన్ సిబ్బందికి వచ్చిన ఫిర్యాదు మేరకు మండలంలోని తండేవలస గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికకు ఈ నెల 23న వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న చైల్డ్‌లైన్ సిబ్బంది బాలిక తల్లిదండ్రులకు గురువారం కౌన్సిలింగ్ ఇచ్చారు. పెళ్లికి బాలిక వయసు సరిపోదంటూ, వివాహం చేయకూడదని ఇరువర్గాల కుటుంబ సభ్యులను హెచ్చరించారు. ఇదిఇలావుండగా గడిచిన కొన్ని రోజులు క్రితమే ఈ అమ్మాయికి ప్రధానం కుడా జరిగిపోయింది. ఈ వివాహాంకు సంబందించి అధికారులు ఏమేరకు చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. -
‘డబ్బు చెల్లించలేకపోతే.. పెళ్లి జరిపించండి’
హైదరాబాద్ : బాల్య వివాహాల నిరోధానికి ఎన్ని చట్టాలు చేసినా సమాజంలో మార్పు మాత్రం రావడం లేదు. రోజుకు ఎంతో మంది చిన్నారుల బాల్యం వివాహమనే బంధీఖానాలో చిక్కుకుంటూనే ఉంది. ఇటువంటి దురాచారాలు మారుమూల పల్లెల్లోనే కాదు.. హైద్రాబాద్ వంటి మెట్రోపాలిటన్ నగరాలలోనూ జరుగుతున్నాయి. తల్లిదండ్రులు ఇంటి అద్దె కట్టలేని స్థితిలో ఉన్న కారణంగా వివాహానికి సిద్ధమైందో 15 ఏళ్ల బాలిక. వివరాల్లోకి వెళితే.. ఒడిషా రాష్ట్రంలోని బాలాసోర్ జిల్లాకు చెందిన ఊర్మిళ, శ్రీకాంత్ దంపతులు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి సంతానం. అయితే బతుకుదెరువు కోసం శ్రీకాంత్ కుటుంబం నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి కాటేదాన్ ఏరియాలో నివసిస్తోంది. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే శ్రీకాంత్ కుటుంబానికి.. పొరుగున ఉన్న చెన్నయ్య గుప్త అనే వ్యక్తి ఇంటిని అద్దెకివ్వడంతో పాటు డబ్బు సాయం చేశారు. అయితే శ్రీకాంత్ కుటుంబం ఈ డబ్బును తిరిగి ఇవ్వలేకపోయింది. దీంతో చెన్నయ్య గుప్త.. దివ్యాంగుడైన తన 38 ఏళ్ల కుమారుడు రమేశ్ గుప్తాకు శ్రీకాంత్ పెద్ద కూతురు(15)ను ఇచ్చి వివాహం చేయాల్సిందిగా బలవంతపెట్టాడు. ఇందుకు అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించడంతో.. బుధవారం సాయంత్రం గుడిలో పెళ్లి జరిపించాలని నిర్ణయించారు. సమాచారం అందుకున్న పోలీసులు, శిశు సంక్షేమ అధికారులు గుడికి చేరుకుని బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. బాలికను గర్ల్స్ హోంకి తరలించారు. ఆమె ఇష్టప్రకారమే.. బాలిక తల్లి ఊర్మిళ మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు వచ్చిన నాటి నుంచి రమేశ్ కుటుంబం తమకు అన్ని విధాల సాయపడిందని తెలిపింది. ఆ కుటుంబానికి రుణపడి ఉన్నాం కాబట్టి రమేశ్‌కు తమ కూతురినిచ్చి వివాహం చేస్తామని మాట ఇచ్చామని పేర్కొంది. మా అమ్మాయి తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు.. ఆమె అంగీకారంతోనే పెళ్లి నిర్ణయించామని చెప్పింది. డబ్బు చెల్లించాలని ఒత్తిడి చేసి.. దివ్యాంగుడైన తమ కుమారుడిని చూసుకోవడానికే చెన్నయ్య గుప్త ఈ పెళ్లి నిశ్చయించారని మైలర్‌దేవ్‌పల్లి ఎస్సై జగదీశ్వర్ తెలిపారు. డబ్బు చెల్లించలేని పక్షంలో బాలికతో తమ కుమారుడి వివాహం జరిపించాలంటూ ఆమె తల్లిదండ్రులను ఒత్తిడి చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు బాల్య వివాహ నిషేధ చట్టం కింద వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
‘సుప్రీం’ తీర్పు అభినందనీయం
ప్రభుత్వాలుండేది కేవలం ప్రజాకర్షక పథకాలతో అందరినీ రంజింపజేయడానికి మాత్రమే కాదు... సమాజం ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలపైనా శ్రద్ధ పెట్టి వాటి పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేయడానికి కూడా. కొత్త సమస్యలైనా, అప్పటికే ఉనికిలో ఉండి కొత్తగా పరిష్కారం కోరుతున్న సమస్యలైనా–పాలకులు వాటిని పట్టించుకోవడం అవసరం. కానీ జటిలమని భావించిన సమస్యల జోలికి పోయేందుకు మన పాలకులు జంకుతున్నారు. పర్యవసానంగా అలాంటివి ఏళ్ల తరబడి అపరిష్కృతంగా మిగిలిపోతున్నాయి. చివరకు న్యాయస్థానాలే జోక్యం చేసుకుని సరిదిద్దవలసి వస్తున్నది. అత్యాచార నేరాన్ని నిర్వచించే భారత శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 375పై సుప్రీంకోర్టు బుధవారం వెలువరించిన తీర్పు ఈ కోవలోనిదే. ఆ సెక్షన్ ఎలాంటి చర్యలు అత్యాచారం కిందికొస్తాయో చెప్పడంతో పాటు అందుకు కొన్ని మినహాయింపుల్ని కూడా పేర్కొంది. భార్య వయస్సు 15 ఏళ్లలోపు కాని పక్షంలో ఆమె అంగీకారం లేకుండా భర్త సంభోగంలో పాల్గొనడం అత్యాచారంగా పరిగణించరాదన్నది అందులో ఉన్న 6వ మినహాయింపు సారాంశం. మైనర్ భార్యతో సంసారం చేయడం అత్యాచారంగానే పరిగణించాలని సుప్రీంకోర్టు చెప్పడంతోపాటు ఐపీసీలోని మినహాయింపు హక్కుల ఉల్లంఘన కిందికొస్తుందని స్పష్టం చేసింది. మన ఐపీసీ అమల్లోకొచ్చింది 155 ఏళ్లక్రితం...అంటే 1862లో. అప్పటి బ్రిటిష్ వలస పాలకులు తీసుకొచ్చిన ఆ శిక్షాస్మృతిలోనూ, ఇతర చట్టాల్లోనూ ఎన్నో అప సవ్యతలున్నాయి. అసమానతలున్నాయి. కానీ విషాదమేమంటే... స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు కావస్తున్నా వాటిల్లో చాలా భాగం ఈనాటికీ కొనసాగుతున్నాయి. అసలు ‘మైనర్’ అనే పదానికే వేర్వేరు చట్టాలు వేర్వేరు నిర్వచనాలిస్తున్నాయి. బాల్య వివాహాల నిషేధ చట్టం, హిందూ వివాహ చట్టం, షరియత్, విడాకుల చట్టం, బాల కార్మిక చట్టం, బాల నేరస్తుల చట్టం, అత్యాచారాన్ని నిర్వచించే ఐపీసీ సెక్షన్ 375 తదితరాలు మైనర్‌ను వేర్వేరుగా నిర్వచిస్తున్నాయి. దీన్ని ఆరేళ్లక్రితం జాతీయ మహిళా కమిషన్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చి అన్ని చట్టాల్లోనూ మైనర్ అన్న పదానికి ఒకే రకమైన నిర్వచనం ఉండేలా చూడాలని కోరినప్పుడు ఆనాటి అడిషనల్ సొలిసిటర్ జనరల్ అది అసాధ్యమని వాదించారు. వేర్వేరు చట్టాలకు వేర్వేరు సామాజిక లక్ష్యాలుంటాయని, అన్నిటిలోనూ ఒకే నిర్వచనం ఉండటం కుదరదని చెప్పారు. ఒక చట్టం ఆడపిల్లలకు వివాహం చేయదగ్గ వయసును 18 ఏళ్లుగా నిర్ణయిస్తుంటే... మరో చట్టం భార్య వయసు 15 ఏళ్లలోపు కాని పక్షంలో ఆమె అంగీకారం లేకుండా సంభోగంలో పాల్గొనడం అత్యాచారం కాదని ఎలా చెబు తుంది? సంభోగానికి అంగీకారం తెల్పడానికి అర్హమైన వయసు మన దేశంలో ఎప్పుడూ ఒకేలా లేదు. 1892లో అందుకు కనీస వయసు పదేళ్లనుంచి 12 ఏళ్లకు పెంచితే, ఆ తర్వాత 1949లో దాన్ని 15 ఏళ్లకు పెంచారు. 1982లో అది పదహా రేళ్లయింది. 2013లో దాన్ని 18 ఏళ్లకు పెంచారు. ఇలా ఎప్పటికప్పుడు మార్పులు చేయడానికి కారణం మహిళా సంఘాలు, ప్రజాస్వామికవాదుల ఒత్తిళ్లే. ఒకపక్క తామే ఇన్ని మార్పులు చేస్తూ సెక్షన్ 375లోని మినహాయింపు జోలికెళ్లకపోవడం మన పాలకుల నిర్లక్ష్య ధోరణికి ఆనవాలు. లైంగిక నేరాల నుంచి పిల్లల్ని రక్షించ డానికుద్దేశించిన 2012నాటి పోస్కో చట్టం 18 ఏళ్లలోపు ఆడపిల్లను బాలికగా భావి స్తుంటే సెక్షన్ 375 మాత్రం పెళ్లయినట్టయితే ఆమె బాలిక కాదంటున్నది. నాలు గేళ్లక్రితం నిర్భయ చట్టానికి సంబంధించిన బిల్లును రూపొందించిన జస్టిస్ జేఎస్ వర్మ కమిషన్ దీన్ని గమనించింది. సవరించాలని సూచించింది. అయినా ఆనాటి యూపీఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ సెక్షన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగినప్పుడు కేంద్రం తీసుకున్న వైఖరి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా బాల్యవివాహాలు మన దేశంలో వాస్తవమని... ఆ వివాహ వ్యవస్థను పరిరక్షించాల్సిన అవసరం ఉన్నదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. లేనట్టయితే వివాహమైన పిల్లల భవిష్యత్తు నాశన మవుతుందని చెప్పింది. దేశంలో 2 కోట్ల 30 లక్షలమంది బాలికా వధువులున్నా రని, సెక్షన్ 375కున్న మినహాయింపును సవరిస్తే ఆ వధువుల భర్తలంతా వేధిం పులకు గురికావలసి వస్తుందని వాదించింది. మన దేశంలో చట్టాల అమలు తీరు ఎంత పేలవంగా ఉంటున్నదో ఈ వాదనే చెబుతుంది. ప్రతి ఏటా అక్షయ తృతీయ రోజు దేశవ్యాప్తంగా వేలాది బాల్యవివాహాలు జరుగుతున్నాయి. వీటిని ఆపడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చురుగ్గా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కోరు తున్నది. జనాభాలో సగంగా ఉన్న ఆడవాళ్లపై వివిధ రూపాల్లో అమలవుతున్న వివక్షను అంతమొందించడంపై దృష్టి పెట్టాల్సిన తరుణంలో చట్టపరంగా ఉన్న వివక్షను తొలగించడానికే ప్రభుత్వాలు సిద్ధం కాకపోవడం విచారకరం. నిజానికి సుప్రీం కోర్టు ఇప్పుడు తీర్పు వెలువరించిన అంశంపై రెండేళ్లక్రితమే డీఎంకే సభ్యురాలు కనిమొళి ప్రశ్నించారు. దీన్ని సవరించే ఆలోచన చేస్తున్నారా అని ఆమె అడిగి నప్పుడు అప్పటి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అది సాధ్యంకాదని జవాబి చ్చారు. సెక్షన్ 375 మొత్తంగా వైవాహిక జీవితంలో మహిళలపై జరిగే అత్యాచారాల (మారిటల్ రేప్)కు అనుమతిస్తున్నది. అందుకు సంబంధించి దాఖలైన పిటిషన్ వేరే ధర్మాసనం ముందు విచారణలో ఉంది. మైనర్ బాలిక శారీరక నిర్మాణం గర్భధారణకు అనువుగా లేకపోయినా కేవలం భర్త అన్న ఒకే ఒక అధి కారంతో ఆమెతో సంసారానికి సిద్ధపడటం ఎంత రాక్షసమో, అందుకు అనుమతిస్తున్న చట్టం ఎంత అనాగరికమో ప్రభుత్వాలకు ఇన్ని దశాబ్దాలుగా తెలియకపోవడం, పైగా దాన్ని సమర్ధించుకోవడం ఎంత దారుణం! ఇలాంటి నిర్లిప్త ధోరణులే బాల్య వివాహాలకు లైసెన్స్నిస్తున్నాయి. పర్యవసానంగా చిన్న వయసులోనే అమ్మలై ఎందరో బాలికలు జీవితాంతం అనారోగ్యం పాలవుతున్నారు. మానవ హక్కులను కాలరాసే ఇలాంటి పరిస్థితులను అంతం చేయకుండా నాగరికుల మని చెప్పుకునే హక్కు మనకుంటుందా? -
అంతా ‘ఆయన’ ఇష్టమేనా... ఇంకెన్నాళ్లు?
పద్దెనిమిదేళ్లు నిండితేనే... ‘సమ్మతి’ చెప్పే మానసిక పరిపక్వత వస్తుంది. దాని పర్యవసానాలేమిటో అర్థం చేసుకోగలరు. ఇతర చట్టాలు కూడా (జువైనల్ జస్టిస్ చట్టం–2000, బాల్యవివాహ నిషేధ చట్టం –2006, పోస్కో చట్టం–2012) 18 ఏళ్లు నిండని అమ్మాయిలను బాలికలుగానే పరిగణిస్తున్నాయి. కాబట్టి 15–18 ఏళ్ల వయసులో ఉన్న భార్యతో సంభోగం కూడా నేరంగానే పరిగణించాలి. వీరితో శారీరకంగా కలవడం నేరం కాదని భారత శిక్ష్మాస్మృతిలోని 375 ఆర్టికల్ 2 కింద ఇస్తున్న మినహాయింపును రద్దు చేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం బుధవారం కీలకతీర్పు వెలువరించింది. దీంతో ‘మారిటల్ రేప్’ను కూడా నేరంగా పరిగణించాలనే దీర్ఘకాలిక డిమాండ్ మళ్లీ చర్చనీయాంశం కానుంది. ఈ నేపథ్యంలో మారిటల్ రేప్‌పై భారత్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయి. అంతర్జాతీయం పరిస్థితి(సాక్షి) ఏమిటనేది చూద్దాం... మారిటల్ రేప్ స్త్రీ సమ్మతి లేకుండా ఎవరు బలప్రయోగం ద్వారా ఆమెను లొంగదీసుకున్నా, బలాత్కారం చేసినా అది రేప్ కిందకే వస్తుంది. నేరం చేసినట్లే. భార్యాభర్తలు అయినప్పటికి అర్ధాంగికి ఇష్టం లేకుండా ఆమెతో బలవంతంగా సంభోగం జరిపితే దాన్ని ‘మారిటల్ రేప్’గా పేర్కొంటారు. చాలా పాశ్చాత్యదేశాల్లో దీన్ని రేప్‌గానే పరిగణిస్తారు. శిక్షార్హమైన నేరం. భారత్‌లో మినహాయింపు పదిహేనేళ్ల వయసు పైబడిన సొంత భార్యతో ఆమె సమ్మతి లేకుండా సంభోగంలో పాల్గొన్నా అది నేరం కాదు... భారత శిక్ష్మాస్మృతిలోని ఆర్టికల్ 375లో మినహాయింపునిచ్చారు. సుప్రీంకోర్టు బుధవారం దీన్ని సవరించి... 18 లోపు భార్యతో లైంగిక సంబంధం పెట్టుకుంటే అది నేరమని తేల్చింది. ‘చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్యను బలవంతంగా అనుభవిస్తే భర్తను దోషి అనడానికి లేదు. ఎందుకంటే పెళ్లికి అంగీకరించడం ద్వారా ఆమె తనకు తాను భర్తకు సమర్పించుకుంది. దీని నుంచి ఆమె వెనక్కి మళ్లడానికి వీల్లేదు’ అని చీఫ్ జస్టిస్ సర్ మాథ్యూ హేల్ 1736లో ప్రచురితమైన తన పుస్తకంలో రాశారు. ఆయన అభిప్రాయం బ్రిటన్‌లో చట్టమైంది. ఆంగ్లేయుల పాలనలో ఉన్న చాలాదేశాల్లానే(సాక్షి) మనం కూడా బ్రిటిష్ వారి ‘కామన్ లా’ నుంచి దీన్ని స్వీకరించాం. మహిళల వాదన భార్య వద్దంటున్నా, ఆమె శారీరక, మానసిక పరిస్థితి బాగాలేకున్నా భర్త బలవంతంగా కోరిక తీర్చుకోవడాన్ని ‘రేప్’గానే చూడాలి. ఎందుకంటే ఇక్కడ ఆమె సమ్మతి లేదు. భార్యపై భర్తకు సర్వహక్కులుంటాయనేది పితృస్వామ్య ఆధిపత్య ధోరణి భావజాలం. ఆడది వస్తువు కాదు. ఆమెకూ మనోభావాలుంటాయి. భర్త పిలవగానే పక్క మీదకు రావాల్సిందేనా? ఆమె ఇష్టానిష్టాలతో, ఆసక్తితో సంబంధం లేదా? దాంపత్య బంధంలో అంతా భర్త ఇష్టమేనా? స్త్రీల పట్ల వివక్ష చూపుతోంది చట్టం. ఏ శారీరక సంబంధానికైనా పరస్పర సమ్మతి అనేది మాతృక. పెళ్లయిన జంటలకూ ఇదే వర్తిస్తుంది. వివాహిత అయినంత మాత్రాన స్త్రీకి తన శరీరంపై హక్కు ఉండదా? అవివాహిత స్త్రీని ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా అనుభవిస్తే(సాక్షి) అది నేరం అవుతుంది. రేప్ కిందకు వస్తుంది. వివాహిత స్త్రీ విషయంలో మాత్రం ఆమె భర్తకు మినహాయింపు ఉంటుందా? ఆమె సమ్మతితో పనిలేదా? అంటే వివాహిత, అవివాహిత స్త్రీల మధ్య వివక్ష చూపుతున్నట్లేగా? అందరికీ సమాన రక్షణ కల్పించే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్–14కు మారిటల్ రేప్ మినహాయింపు విరుద్ధం. అలాగే లింగపరంగా ఎలాంటి బేధం చూపకూడదనే ఆర్టికల్–15ను, గౌరవంగా బతికే హక్కును కల్పిస్తున్న ఆర్టికల్–21ను కూడా ఈ మినహాయింపు ఉల్లంఘిస్తోంది. పైగా వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని ఇటీవలే సుప్రీంకోర్టు చారిత్రక తీర్పును ఇచ్చింది. ఏకాంతాన్ని కోరుకోవడం కూడా వ్యక్తిగత స్వేచ్ఛను కోరుకోవడం (ఆర్టికల్–21) కిందకు వస్తుంది. కాబట్టి భర్త బలవంతంగా సంభోగం చేస్తే... బాధిత మహిళకు ఆర్టికల్– 21 కల్పించిన హక్కులను కూడా ఉల్లఘించినట్లే. భారతీయ మహిళల్లో మారిటల్ రేప్ బాధితులు చాలా ఎక్కువ. సాంఘిక కట్టుబాట్ల మూలంగా వీరు మౌనంగా దీన్ని భరిస్తున్నారు. వీరికి రక్షణ కల్పించాలంటే మినహాయింపును ఎత్తివేయాల్సిందే. – మహిళా సంఘాలు, హక్కుల కార్యకర్తల వాదన మినహాయింపు తీసేయండి ‘‘పెళ్లయితే భార్యపై భర్తకు సర్వహక్కులు దఖలు పడతాయనే, ఆమె అతని ఆస్తి అవుతుందనే కాలం చెల్లిన భావజాలం నుంచి పుట్టుకొచ్చిందే ఈ మారిటల్ రేప్ మినహాయింపు. రేప్ లేదా లైంగిక దాడి జరిగినపుడు... వారిద్దరు భార్యాభర్తలని లేదా చాలాకాలంగా ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఉందని చెప్పి నిందితుడు సమర్థించుకోజాలడు. లైంగిక దాడి భావోద్రేక చర్య కాదు... అవతలి వ్యక్తిపై బలప్రదర్శన. లొంగి ఉండాలని చెప్పడం. ఫిర్యాదుదారు, నిందితుడి మధ్య సంబంధం ఏమిటనేది అప్రస్తుతం. సంభోగానికి ఆమె సమ్మతి ఉందా? లేదా? అనేదే ముఖ్యం. కాబట్టి మారిటల్ రేప్‌కు మినహాయింపును ఎత్తివేయాలి’’ – 2012లో నిర్భయ ఉదంతం అనంతరం క్రిమినల్ చట్టాలను సమీక్షించేందుకు నియమించిన జస్టిస్ జే.ఎస్.వర్మ త్రిసభ్య కమిటీ చేసిన సిఫారసు. కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆమోదించలేదు. మన దగ్గర సాధ్యం కాదు... భిన్న సంస్కృతులు, ఆచార వ్యవహారాలు, మతవిశ్వాసాలకు నెలవైన భారత్ లాంటి దేశంలో భర్త జరిపే లైంగిక దాడిని నేరంగా చేయడం సాధ్యం కాదు. మహిళల్లో ఆర్థిక స్వావలంభన తక్కువ. అక్షరాస్యత, పేదరికం తదితర సాంఘిక అసమానతలను కూడా దృష్టిలో పెట్టుకొని చూసినపుడు భారత్‌లో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. పెళ్లిని పవిత్ర బంధంగా చూస్తాం. ఒక వివాహిత మహిళ భర్త తనను బలాత్కారం చేశాడని చెప్పొచ్చు. ఇతరులకు అది బలాత్కారం అనిపించకపోవచ్చు. దీన్ని నేరంగా చేయాలనే అంశాన్ని పరిశీలించే ముందు అసలు ‘మారిటల్ రేప్’ అంటే ఏమిటనేది విస్పష్టంగా నిర్వచించాల్సిన అవసరం ఉంది. మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణిస్తే... భారత్‌లో వివాహ వ్యవస్థ(సాక్షి) విచ్ఛన్నతకు దారి తీస్తుంది. మారిటల్ రేప్‌ను నేరం చేస్తే... 489ఏ (గృహ హింస నిరోధక చట్టం) లాగే ఇది కూడా దుర్వినియోగమయ్యే అవకాశాలు ఉంటాయి. భర్తలను వేధించడానికి భార్యలు దీన్నో సాధనంగా వాడే ఆస్కారం ఉంటుంది. – ఆగష్టులో ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో కేంద్ర ప్రభుత్వం. (యూపీఎ, ఎన్డీయే... ఏ కూటమి అధికారంలో ఉన్నా... మారిటల్ రేప్ విషయంలో కేంద్ర ప్రభుత్వాలు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నాయి. పార్లమెంటులో కూడా మారిటల్ రేప్‌ను నేరం చేయడం సాధ్యం కాదని తేల్చిచెప్పాయి. అయితే సుప్రీంకోర్టు మాత్రం చట్టాన్ని మార్చే అధికారం పార్లమెంటుదేనని, దీనిపై పాలకుల దృష్టి పెట్టాలని అంటోంది.) చాలా దేశాల్లో నేరం... ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల్లో మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణిస్తున్నారు. యూరోప్‌లో 22 దేశాల్లో, ఉభయ అమెరికా ఖండాల్లో 22 దేశాల్లో, ఆఫ్రికాలో 11 దేశాల్లో, ఆసియా, ఆస్ట్రేలియాల్లో కలిపి... 15 దేశాల్లో మారిటల్ రేప్ శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తున్నారు. భర్త బలాత్కారాన్ని నేరంగా పరిగణించిన తొలిదేశం పోలండ్. 1932లో పోలండ్ ఈమేరకు చట్టం చేసింది అమెరికాలో 1970లో మొదలై 1993 దాకా మొత్తం 50 రాష్ట్రాలూ దీన్ని నేరం చేశాయి. మహిలపై హింసకు వ్యతిరేకంగా యూరోపియన్ యూనియన్ పార్లమెంటు చేసిన తీర్మానం... మారిటల్ రేప్‌ను నేరంగా చేయాలని(సాక్షి) పిలుపునిచ్చింది. దాంతో ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం తదితర దేశాలు మినహాయింపును ఎత్తివేశాయి. 1991లో బ్రిటన్ ఈ పనిచేసింది. మన పొరుగునున్న చిన్నదేశం నేపాల్ 2002లోనే మారిటల్ రేప్‌ను నేరంగా ప్రకటించింది. రాజ్యాంగంలోని సమాన రక్షణ, వ్యక్తిగత గోప్యత హక్కులను ఈ మినహాయింపు ఉల్లంఘిస్తోందని సుప్రీంకోర్టు తేల్చడంలో నేపాల్ ప్రభుత్వం చట్టాలను మార్చింది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
బాల్యానికి మూడు ముళ్లు
సర్, నాకు ఇష్టం లేకపోయినా పెళ్లి జరిపిస్తున్నారు. ఎట్లయినా సరే పెళ్లి ఆపించండి...నేను చదువుకుంటానని మా అమ్మా..నాన్నలకు చెప్పినా ఫలితం లేకుండాపోయింది. అందుకే మీకు ఫోన్ చేసినా.. అంటూ ఫిబ్రవరి 11న నర్వ మండలంలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలిక ఎస్పీకి ఫోన్ చేసింది. దీంతో పోలీసులు ఆ గ్రామానికి చేరుకుని బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి పెళ్లి ఆపించారు. ‘‘నేను చదువుకుంటా. చిన్న వయస్సులోనే పెళ్లి చేసి బరువు బాధ్యతలు నాపై పెట్టవద్దు.’’ అంటూ బిజినేపల్లికి చెందిన బాలిక (15) ఫిబ్రవరి 27న స్థానిక పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు, ఐసీడీఎస్ సిబ్బంది బాలిక తల్లిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో పెళ్లి ఆగిపోయింది. జిల్లాలో పెరిగిపోతున్న బాల్య వివాహాలు ♦ 10నెలల్లో 88 వివాహాలను అడ్డుకున్న అధికారులు ♦ తెలియకుండా జరుగుతున్నవి వందల సంఖ్యలో ♦ పేదరికం, అవగాహన లేమి, కుటుంబ పరిస్థితులే కారణం ♦ నారాయణపేట, మక్తల్, నాగర్‌కర్నూల్, అచ్చంపేటలో అధికం ♦ చిన్నవయస్సులో పెళ్లితో అనేక అనర్థాలంటున్న డాక్టర్లు ♦ బాల్య వివాహాల నిరోధక చట్టం 2006 ప్రకారం రెండేళ్ల జైలు ♦ నాలుగేళ్లలో 338 వివాహాలను అడ్డుకున్న అధికారులు ఇలా ధైర్యంగా బాలికలు బయటికి వచ్చి ఫిర్యాదు చేసి బాల్య వివాహాలు నిలిచిపోయిన ఘటనలు కొన్నే.. కానీ మారుమూల గ్రామాల్లో వివాహాలు ఎవరికీ సమాచారం లేకపోతుండడంతో జరిగిపోతున్నాయి. ఇటు పేదరికం..అటు ఇంటి పరిస్థితులు.. 14ఏళ్లు కూడా దాటని పుత్తడిబొమ్మలను పెళ్లిపీటల వైపు అడుగేసేలా చేస్తున్నాయి. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను తల్లిదండ్రులకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం మహిళలు ఓ వైపు అన్ని రంగాల్లో దూసుకెళ్తూ తమదైన ముద్ర వేస్తుంటే.. మరోవైపు వెనుకబడిన ప్రాంతాల్లో ప్రగతికి దూరంగా అక్షర ఫలాలు నోచుకోకుండా మూఢనమ్మకాల్లో మగ్గిపోతున్నారు. తల్లిదండ్రుల్లో అవగాహన లేమి.. ఆడపిల్లలను బాధ్యతగా కాకుండా బరువుగా భావిస్తుండటంతో జిల్లాలో బాల్యవివాహాలు అధికంగా జరుగుతున్నాయి. దీంతో చిట్టి తల్లుల భవిత మూడు ‘ముళ్ల’లో బందీ అవుతోంది. - మహబూబ్‌నగర్ క్రైం ఎంత నాగరికత మారినా గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు రావడం లేదు. పేదరికానికి తోడు ఆడ పిల్లలకు త్వరగా పెళ్లి చేసి బరువును తగ్గించుకోవాలనే ఆలోచిస్తున్నారు. 14ఏళ్లు కూడా దాటని పుత్తడి బొమ్మలను పెళ్లిపీటల వైపు అడుగులు వేయిస్తున్నారు. ఆడ పిల్లలకు 18ఏళ్లు వచ్చేవరకు ఆగకుండా వివాహాలు చేస్తూ వారి జీవితాన్ని అగమ్యగోచరంగా తయారుచేస్తున్నారు. జిల్లాలో ఇటీవల బాల్యవివాహాలు అడ్డుకున్న సంఘటనలు చాలా జరిగాయి. ముఖ్యంగా మద్దూరు మండలం రేనివట్లలో ఐదు, చింతలదిన్నెలో ఏడు, గోపాల్పేట మండల ఎదులలో ఆరు, రేవల్లిలో మూడు, పెబ్బేరు మండలం కంచిరావుపల్లిలో మూడు, దామరగిద్ద మండలం బాపన్‌పల్లిలో మూడు, గట్టులో రెండు, తెలకపల్లిలో రెండు బాల్యవివాహాలను అడ్డుకున్నారు. రూ.లక్ష జరిమానా.. రెండేళ్ల జైలు బాల్య వివాహాల నిరోధక చట్టం 2006 ప్రకారం ఈ వివాహాలు చేయడం అత్యంత నేరం. ఇలా చేస్తే రెండేళ్ల కారాగార శిక్ష విధిస్తారు. లేదా లక్ష రూపాయల జరిమానాతో పాటు శిక్ష విధించే అవకాశం ఉంది. నాలుగేళ్లుగా జిల్లాలో దాదాపు 338 బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. 2012-2014 మధ్య కాలంలో 250వివాహాలను అడ్డుకున్నారు. గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 88 బాల్యవివాహాలను అడ్డుకుని, ఆ చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. కొన్ని నియోజకవర్గాల్లో 14ఏళ్లు సైతం నిండని చిన్నారులకు పెళ్లి చేసేస్తున్నారు. జిల్లాలో నారాయణపేట, కొడంగల్, మక్తల్, అచ్చంపేట, గద్వాల, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాల్లో అత్యధికంగా బాల్యవివాహాలు జరుగుతున్నాయి. జోగిని వ్యవస్థ.. జిల్లాలో అమాయక ఆడపిల్లలను జోగినీలుగా మారుస్తూ వాళ్ల హక్కును కాలరాస్తున్నారు. జోగిని అంటే ఒక ఆడపిల్లను దేవుడి పేరుతో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తాళి కట్టి ఆ గ్రామంలో వదిలిపెడతారు. ఇలాంటి వాళ్లను గ్రామంలో ఎవరైనా లైంగికంగా వాడుకోవచ్చు అనేది ఆ గ్రామ మూఢనమ్మకం. జిల్లాలో జోగినీలుగా మారిన ఆడపిల్లలు 1200మంది ఉన్నారు. ముఖ్యంగా నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాలలో జోగిని వ్యవస్థ అధికంగా ఉంది. జోగినీలుగా మారిన ఆడపిల్లలను ఎవరైన వ్యక్తులు ముందుకు వచ్చి ఆదర్శ వివాహాలు చేస్తుకున్న వారికి సైతం ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేదు. ముఖ్యంగా జోగినీలుగా మారిన మహిళలకు పుట్టిన పిల్లల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పోలీసుల శాఖ నుంచి శూన్యం.. జిల్లాలో బాల్య వివాహాలపై పోలీస్ శాఖ నుంచి చేయాల్సిన కౌన్సెలింగ్, ఇతర చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం లేదు. చాలా సందర్భాల్లో గ్రామల్లో బాల్యవివాహాలు జరుగుతున్నాయని సమాచారం వచ్చినా కూడా పోలీస్ శాఖ నుంచి సకాలంలో స్పందన రావడం లేదు. వచ్చే సమస్యలు.. తెలిసి తెలియని వయసులో పెళ్లి చేసుకుంటే పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. గర్భసంచి ఎదుగుదల ఉండకపోవడం, మాతా శిశు మరణాలు సంభవించడం, రక్తహీనత అధికం కావడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. పుట్టింటి వాతావరణం నుంచి అత్తింటి వాతావరణంలో ఇమడలేక కుటుంబ సమస్యలతో సతమతమవుతుంటారు. మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో కలతలు, బలవన్మరణాలు పెరిగే ఆస్కారముంటుంది. పునరావాసం ఇలా.. బాల్యవివాహాలను అడ్డుకున్న సమయంలో సదరు బాలికలకు రక్షణ కల్పించేలా వారిని అందుబాటులో ఉన్న కస్తూర్బా పాఠశాలల్లో చేర్పించడం, చదువుపరంగా వసతి గృహాల్లో, వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాల్లో చేర్పించడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. బాలికల వయసు ఆధారంగా బాలసదనం, శిశుగృహాల్లో చేర్పించడం చేసి వారికి ఇష్టమైన భవిష్యత్‌లో ఆత్మస్థైర్యంతో మనుగడ సాగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక బృందాల ఏర్పాటు స్వేచ్ఛగా విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన వయసులో పెళ్లి పేరుతో నిర్బంధం విధించడాన్ని నేరంగా పరిగణించి బాల్య వివాహాలను నిషేధించిన ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు రూపొందించింది. అయినా అది సరిగా అమలుకు నోచుకోకపోవడంతో, దీనిని గుర్తించి స్త్రీ శిశు అభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రెండేళ్ల కిందట సమగ్ర బాలల పరిరక్షణ పథకాన్ని(ఐసీపీఎస్) రూపొందించింది. ఇదీ ఐసీడీఎస్‌కు అనుసంధానంగా పని చేస్తోంది. దేశవ్యాప్తంగా ప్రత్యేక బృందాలను ఈ పథకం కింద నియమించింది. ఈ బృందాలు ప్రజలతో మమేకమై ఎన్జీఓల సహకారంతోగ్రామాల్లో బాల్య వివాహాల పట్ల అవగాహన కల్పిస్తుంది. అవగాహనతో పాటు చర్యలు.. జిల్లాలో పోలీస్ శాఖ నుంచి బాల్య వివాహాలు జరగకుండా అవసరమైన నిఘా ఏర్పాటు చేశాం. బాల్యవివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే, సంబంధిత పరిధిలో ఉన్న పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులతో పాటు పిల్లలకు కూడా ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఏర్పాటు చేస్తాం. ఎక్కడా బాల్య వివాహాలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం. - డీవీ శ్రీనివాసరావు, ఏఎస్పీ ఆరోగ్య సమస్యలెన్నో.. అమ్మాయిలకు చిన్నతనంలోనే పెళ్లి చేస్తే ఆరోగ్యపరంగా అనేక సమస్యలు వస్తాయి. వివాహంపై ఏమాత్రం వారికి అవగాహన ఉండదు. చిన్న వయసులో భర్తతో కలవడం వల్ల ఆరోగ్యపరంగాా సమస్యలు వస్తాయి. 14నుంచి 18ఏళ్ల లోపు గర్భం దాల్చితే పిండం సక్రమంగా ఎదుగుదల ఉండదు. చాలా మందికి శిశువులు పురిట్లో చనిపోవడం, విటమిన్ లోపంతో పాటు బరువు తక్కువగా పుట్టడం జరుగుతాయి. ముఖ్యంగా బాల్య వివాహాలు చేసుకున్న అమ్మాయిలకు దినాలు కాకముందే పిల్లలు పుట్టడం, రక్తం తక్కువ ఉండటం వల్ల శిశువులు మృతి చెందుతారు. - డాక్టర్ మీనాక్షి, సీనియర్ గైనకాలజిస్టు, ఆస్పత్రి డీసీహెచ్ఓ అవగాహన కల్పిస్తున్నాం జిల్లాలో కొన్ని నియోజకవ ర్గాల్లో బాల్యవివాహాలు అధికంగా జరుగుతున్నాయి. వాటిపై దృష్టి సారిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ అవగాహన కల్పిస్తున్నాం. శాఖాపరంగా మాకు వచ్చిన సమాచారంతో ఆయా తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి మాట్లాడి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. అమ్మాయిలు చదువుకుంటామంటే రాష్ట్ర సదనం, ప్రభుత్వ హస్టళ్లలో వసతి ఏర్పాటు చేస్తున్నాం. - జ్యోత్స్న, ఐసీడీఎస్ పీడీ