ప్రభుత్వాలుండేది కేవలం ప్రజాకర్షక పథకాలతో అందరినీ రంజింపజేయడానికి మాత్రమే కాదు... సమాజం ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలపైనా శ్రద్ధ పెట్టి వాటి పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేయడానికి కూడా. కొత్త సమస్యలైనా, అప్పటికే ఉనికిలో ఉండి కొత్తగా పరిష్కారం కోరుతున్న సమస్యలైనా–పాలకులు వాటిని పట్టించుకోవడం అవసరం. కానీ జటిలమని భావించిన సమస్యల జోలికి పోయేందుకు మన పాలకులు జంకుతున్నారు. పర్యవసానంగా అలాంటివి ఏళ్ల తరబడి అపరిష్కృతంగా మిగిలిపోతున్నాయి. చివరకు న్యాయస్థానాలే జోక్యం చేసుకుని సరిదిద్దవలసి వస్తున్నది. అత్యాచార నేరాన్ని నిర్వచించే భారత శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 375పై సుప్రీంకోర్టు బుధవారం వెలువరించిన తీర్పు ఈ కోవలోనిదే. ఆ సెక్షన్ ఎలాంటి చర్యలు అత్యాచారం కిందికొస్తాయో చెప్పడంతో పాటు అందుకు కొన్ని మినహాయింపుల్ని కూడా పేర్కొంది. భార్య వయస్సు 15 ఏళ్లలోపు కాని పక్షంలో ఆమె అంగీకారం లేకుండా భర్త సంభోగంలో పాల్గొనడం అత్యాచారంగా పరిగణించరాదన్నది అందులో ఉన్న 6వ మినహాయింపు సారాంశం. మైనర్ భార్యతో సంసారం చేయడం అత్యాచారంగానే పరిగణించాలని సుప్రీంకోర్టు చెప్పడంతోపాటు ఐపీసీలోని మినహాయింపు హక్కుల ఉల్లంఘన కిందికొస్తుందని స్పష్టం చేసింది.
మన ఐపీసీ అమల్లోకొచ్చింది 155 ఏళ్లక్రితం...అంటే 1862లో. అప్పటి బ్రిటిష్ వలస పాలకులు తీసుకొచ్చిన ఆ శిక్షాస్మృతిలోనూ, ఇతర చట్టాల్లోనూ ఎన్నో అప సవ్యతలున్నాయి. అసమానతలున్నాయి. కానీ విషాదమేమంటే... స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు కావస్తున్నా వాటిల్లో చాలా భాగం ఈనాటికీ కొనసాగుతున్నాయి. అసలు ‘మైనర్’ అనే పదానికే వేర్వేరు చట్టాలు వేర్వేరు నిర్వచనాలిస్తున్నాయి. బాల్య వివాహాల నిషేధ చట్టం, హిందూ వివాహ చట్టం, షరియత్, విడాకుల చట్టం, బాల కార్మిక చట్టం, బాల నేరస్తుల చట్టం, అత్యాచారాన్ని నిర్వచించే ఐపీసీ సెక్షన్ 375 తదితరాలు మైనర్‌ను వేర్వేరుగా నిర్వచిస్తున్నాయి. దీన్ని ఆరేళ్లక్రితం జాతీయ మహిళా కమిషన్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చి అన్ని చట్టాల్లోనూ మైనర్ అన్న పదానికి ఒకే రకమైన నిర్వచనం ఉండేలా చూడాలని కోరినప్పుడు ఆనాటి అడిషనల్ సొలిసిటర్ జనరల్ అది అసాధ్యమని వాదించారు. వేర్వేరు చట్టాలకు వేర్వేరు సామాజిక లక్ష్యాలుంటాయని, అన్నిటిలోనూ ఒకే నిర్వచనం ఉండటం కుదరదని చెప్పారు.
ఒక చట్టం ఆడపిల్లలకు వివాహం చేయదగ్గ వయసును 18 ఏళ్లుగా నిర్ణయిస్తుంటే... మరో చట్టం భార్య వయసు 15 ఏళ్లలోపు కాని పక్షంలో ఆమె అంగీకారం లేకుండా సంభోగంలో పాల్గొనడం అత్యాచారం కాదని ఎలా చెబు తుంది? సంభోగానికి అంగీకారం తెల్పడానికి అర్హమైన వయసు మన దేశంలో ఎప్పుడూ ఒకేలా లేదు. 1892లో అందుకు కనీస వయసు పదేళ్లనుంచి 12 ఏళ్లకు పెంచితే, ఆ తర్వాత 1949లో దాన్ని 15 ఏళ్లకు పెంచారు. 1982లో అది పదహా రేళ్లయింది. 2013లో దాన్ని 18 ఏళ్లకు పెంచారు. ఇలా ఎప్పటికప్పుడు మార్పులు చేయడానికి కారణం మహిళా సంఘాలు, ప్రజాస్వామికవాదుల ఒత్తిళ్లే. ఒకపక్క తామే ఇన్ని మార్పులు చేస్తూ సెక్షన్ 375లోని మినహాయింపు జోలికెళ్లకపోవడం మన పాలకుల నిర్లక్ష్య ధోరణికి ఆనవాలు. లైంగిక నేరాల నుంచి పిల్లల్ని రక్షించ డానికుద్దేశించిన 2012నాటి పోస్కో చట్టం 18 ఏళ్లలోపు ఆడపిల్లను బాలికగా భావి స్తుంటే సెక్షన్ 375 మాత్రం పెళ్లయినట్టయితే ఆమె బాలిక కాదంటున్నది. నాలు గేళ్లక్రితం నిర్భయ చట్టానికి సంబంధించిన బిల్లును రూపొందించిన జస్టిస్ జేఎస్ వర్మ కమిషన్ దీన్ని గమనించింది. సవరించాలని సూచించింది. అయినా ఆనాటి యూపీఏ ప్రభుత్వం పట్టించుకోలేదు.
ఈ సెక్షన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగినప్పుడు కేంద్రం తీసుకున్న వైఖరి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా బాల్యవివాహాలు మన దేశంలో వాస్తవమని... ఆ వివాహ వ్యవస్థను పరిరక్షించాల్సిన అవసరం ఉన్నదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. లేనట్టయితే వివాహమైన పిల్లల భవిష్యత్తు నాశన మవుతుందని చెప్పింది. దేశంలో 2 కోట్ల 30 లక్షలమంది బాలికా వధువులున్నా రని, సెక్షన్ 375కున్న మినహాయింపును సవరిస్తే ఆ వధువుల భర్తలంతా వేధిం పులకు గురికావలసి వస్తుందని వాదించింది. మన దేశంలో చట్టాల అమలు తీరు ఎంత పేలవంగా ఉంటున్నదో ఈ వాదనే చెబుతుంది. ప్రతి ఏటా అక్షయ తృతీయ రోజు దేశవ్యాప్తంగా వేలాది బాల్యవివాహాలు జరుగుతున్నాయి. వీటిని ఆపడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చురుగ్గా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కోరు తున్నది.
జనాభాలో సగంగా ఉన్న ఆడవాళ్లపై వివిధ రూపాల్లో అమలవుతున్న వివక్షను అంతమొందించడంపై దృష్టి పెట్టాల్సిన తరుణంలో చట్టపరంగా ఉన్న వివక్షను తొలగించడానికే ప్రభుత్వాలు సిద్ధం కాకపోవడం విచారకరం. నిజానికి సుప్రీం కోర్టు ఇప్పుడు తీర్పు వెలువరించిన అంశంపై రెండేళ్లక్రితమే డీఎంకే సభ్యురాలు కనిమొళి ప్రశ్నించారు. దీన్ని సవరించే ఆలోచన చేస్తున్నారా అని ఆమె అడిగి నప్పుడు అప్పటి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అది సాధ్యంకాదని జవాబి చ్చారు. సెక్షన్ 375 మొత్తంగా వైవాహిక జీవితంలో మహిళలపై జరిగే అత్యాచారాల (మారిటల్ రేప్)కు అనుమతిస్తున్నది. అందుకు సంబంధించి దాఖలైన పిటిషన్ వేరే ధర్మాసనం ముందు విచారణలో ఉంది. మైనర్ బాలిక శారీరక నిర్మాణం గర్భధారణకు అనువుగా లేకపోయినా కేవలం భర్త అన్న ఒకే ఒక అధి కారంతో ఆమెతో సంసారానికి సిద్ధపడటం ఎంత రాక్షసమో, అందుకు అనుమతిస్తున్న చట్టం ఎంత అనాగరికమో ప్రభుత్వాలకు ఇన్ని దశాబ్దాలుగా తెలియకపోవడం, పైగా దాన్ని సమర్ధించుకోవడం ఎంత దారుణం! ఇలాంటి నిర్లిప్త ధోరణులే బాల్య వివాహాలకు లైసెన్స్‌నిస్తున్నాయి. పర్యవసానంగా చిన్న వయసులోనే అమ్మలై ఎందరో బాలికలు జీవితాంతం అనారోగ్యం పాలవుతున్నారు. మానవ హక్కులను కాలరాసే ఇలాంటి పరిస్థితులను అంతం చేయకుండా నాగరికుల మని చెప్పుకునే హక్కు మనకుంటుందా?
Comments
Please login to add a commentAdd a comment