న్యూఢిల్లీ: వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించడం సర్వోన్నత న్యాయస్థానం పరిధిలో లేదని కేంద్రం అభిప్రాయం వ్యక్తం చేసింది. వైవాహిక అత్యాచారం అనేది చట్టపరమైనదాని కంటే సమాజానికి సంబంధించిన సమస్య అని, ఇది సమాజంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని కేంద్రం పేర్కొంది. దీనికి చట్టంలో వేరే విధమైన శిక్షలు ఉన్నాయని తెలిపింది.
ఈ మేరకు వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కేంద్రం గురువారం కౌంటర్ దాఖలు చేసింది. ఈ అంశానికి సంబంధించి అన్ని పక్షాలతో సంప్రదింపులు లేకుండా, అన్ని రాష్ట్రాల అభిప్రాయాలనుపరిగణలోకి తీసుకోకుండా సరైన నిర్ణయానికి రాలేమని తెలిపింది.
అయితే ప్రతీ వివాహం మహిళ సమ్మతితో జరగడం లేదని విషయాన్ని కేంద్రం అంగీకరించింది. ఒకవేళ ఏదైనా ఉల్లంఘనలకు పాల్పడితే వారు చట్టపరంగా శిక్షలు ఎదుర్కొవాల్సి ఉంటుందని తెలిపింది. కానీ వివాహంలో జరిగే ఇలాంటి ఉల్లంఘన పరిణామాలు, బయట జరిగే ఉల్లంఘనలకు తేడా ఉంటుందని పేర్కొంది.
వివాహంలో తమ జీవిత భాగస్వామి నుంచి శారీరక సంబంధాన్ని కోరుకోవడం సహజం కానీ.. తన భార్య ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెను లైంగిక సంబంధానికి ఒత్తిడి చేసే హక్కు భర్తకు లేదు. అలాంటి చర్యకు పాల్పడిన వ్యక్తిపై అత్యాచార నిరోధక చట్టాల కింద శిక్ష విధించడం మితిమీరినది(అవసరమైన దానికంటే ఎక్కువ). వివాహంలో మహిళ సమ్మతిని రక్షించేందుకు పార్లమెంట్ ఇప్పటికే చర్యలు తీసుకుంది. ఇందులో వివాహితలపై క్రూరత్వానికి పాల్పడే వారిని శిక్షించే చట్టాలు ఉన్నాయి’ అని కేంద్రం పేర్కొంది.
కాగా భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 375లోని 2వ మినహాయింపున సవాల్ చేస్తూ గతంలో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. సెక్షన్ 375లోని రెండో మినహాయింపు 18 ఏళ్లు లేదా అంతకంటే పైబడిన భార్యతో భర్త శారీరక సంబంధంలో పాల్గొనడాన్ని అనుమతిస్తుంది. దీనికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు విభజన తీర్పు వెల్లడించింది. జస్టిస్ రాజీవ్ శక్ధేర్ ఈ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించగా, జస్టిస్ సి హరిశంకర్ దీనిని సమర్థించారు. అయితే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తాజాగా దీనిపై విచారణ చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment