
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ బిల్లు.. చట్ట రూపం దాల్చింది. ఇవాళ్టి నుంచే(ఏప్రిల్ 8వ తేదీ) అమల్లోకి వచ్చినట్లు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గత శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. మరోవైపు..
సుప్రీంకోర్టులో వక్ఫ్ బిల్లును సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తమ వాదనలు వినాలంటూ కేంద్రం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో 15, 16వ తేదీల్లో దేశ సర్వోన్నత న్యాయస్థానంలో జరగబోయే విచారణపై ఉత్కంఠ నెలకొంది. వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ సుమారు 16 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటితో పాటు కేంద్రం వేసిన కేవియట్‌ను కలిపి విచారించాలని చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం నిర్ణయించింది.
సిస్టమ్ ప్రకారమే వెళదాం.. తొందరెందుకు?
ఇదిలా ఉంటే.. వక్ఫ్ సవరణ బిల్లును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టడానికి నిరాకరించింది. జమైత్ ఉలేమా హై హింద్ ప్రెసిడెంట్ మౌలానా అర్షద్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. ఈ సవరణ బిల్లుపై దాఖలైన పిటిషన్లను త్వరగా విచారించాలని ఆయన కోరారు. అయితే ఈ విజ్ఞప్తిపై చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
‘ఎందుకు త్వరగా అని మెన్షన్ చేస్తున్నారు. మనకో సిస్టం ఉంది కదా. వాటిని తప్పకుండా సమీక్షిస్తాం. అవసరమైన వాటిని సూచిస్తాం’ అని చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా పేర్కొన్నారు. దీంతో వచ్చే మంగళ, బుధవారాల్లో విచారణ జరపనున్నట్లు పేర్కొంది.