మారిటల్ రేప్‌కు మినహాయింపుపై సుప్రీంకోర్టు స్పష్ఠికరణ
న్యూఢిల్లీ: మారిటల్ రేప్ నుంచి భర్తలకు రక్షణ కల్పిస్తున్న ఐపీసీ, భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని మినహాయింపు నిబంధనల రాజ్యాంగబద్ధతను తేలుస్తామని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. భార్య సమ్మతి లేకుండా ఆమెతో భర్త బలవంతంగా సంభోగం జరపడాన్ని మారిటల్ రేప్‌గా పరిగణిస్తారు. పాశ్చాత్య దేశాల్లో ఇది క్రిమినల్ నేరం. భారత్‌లో చట్టాలు దీనికి మినయింపునిస్తున్నాయి. మారిటల్ రేప్ నేరం కాదని భర్తలకు రక్షణ కల్పిస్తున్నాయి.
భార్య 18 ఏళ్ల లోపు మైనర్ కాకుంటే మారిటల్ రేప్ నేరం కాదని పేర్కొంటున్నాయి. దీన్ని పలువురు సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిపిన సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వ అఫిడవిట్‌పై పిటిషనర్ల ప్రతిస్పందన కోరింది. మారిటల్ రేప్‌ను నేరంగా చేస్తే దాంపత్య బంధంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని, వివాహ వ్యవస్థ ఒడిదుడుకులకు లోనవుతుందని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. ఇదే విషయాన్ని తాజా అఫిడవిట్‌లో సుప్రీంకోర్టు ముందుంచింది.
‘ఇది రాజ్యాంగబద్ధతకు సంబంధించిన అంశం. ఈ అంశంలో రెండు గత తీర్పులున్నాయి. మినహాయింపును ఇస్తున్న నిబంధనల రాజ్యాంగబద్ధతను తేల్చడమే ముఖ్యం’ అని సీజేఐ చంద్రచూడ్ విచారణ సందర్భంగా అన్నారు. భార్య వయసు 18 ఏళ్ల లోపు కానంతవరకు భర్త ఆమెను బలవంతంగా అనుభవించినా అది నేరం కాదు.. అని బీఎన్‌ఎస్‌లో సెక్షన్ 63 (రేప్) మినహాయింపు–2 చెబుతోంది. రాజ్యాంగ విరుద్ధమైన ఈ నిబంధనను కొట్టివేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కరుణా నంది కోరారు.
‘మారిటల్ రేప్‌కు మినయింపు నిబంధన.. ఆర్టికల్ 14 (సమానత్వపు హక్కు), ఆర్టికల్ 19, ఆరి్టకల్ 21 (జీవించే హక్కు, వ్యక్తి స్వేచ్ఛ)కు భంగకరమని మీరు అంటున్నారు. 18 ఏళ్లు పైబడిన భార్యతో భర్త బలవంతంగా లైంగిక చర్యకు పాల్పడ్డా అది రేప్ కాదని మినహాయింపును ఇచి్చనపుడు పార్లమెంటు భావించింది. భర్తలకు రక్షణ కల్పిస్తున్న మినహాయింపును కొట్టివేస్తే అప్పుడా లైంగిక చర్య రేప్ నిర్వచనం కిందకు వస్తుంది. అలాంటపుడు దీన్ని ప్రత్యేక నేరంగా చూడాలా? మినహాయింపు చట్టబద్ధతను తేల్చాలా? అనే సమస్య కోర్టులకు ఉత్పన్నమవుతుంది’అని ధర్మాసనం పేర్కొంది.
‘భర్త డిమాండ్ చేస్తాడు. భార్య నిరాకరిస్తుంది. ఈ సందర్భంలో భర్త ఆమెను నిర్భందిస్తే అది చట్టవిరుద్ధమవుతుంది. ఆమెను గాయపరిస్తే నేరపూరిత బెదిరింపు అవుతుంది. చివరికి భార్య లొంగిపోతే అప్పుడా సంభోగం నేరం కాదు. మిగతావన్నీ నేరాలైనపుడు చివరికి ఎందుకు కాదనేగా మీ ప్రశ్న’ అని జస్టిస్ పారి్థవాలా అన్నారు. ‘కాదంటే కాదనే అర్థం. ఒక మహిళ వద్దు అదంటే వద్దనే అర్థం. వైవాహిక బంధంలో బలవంతంగా సంభోగం జరిపినా అది రేప్ అవుతుంది. కేసు నమోదు చేయాల్సిందే’ అని పిటిషనర్ తరఫున వాదించిన కోలిన్ గొంజాల్వెజ్ అన్నారు. వాదనల తర్వాత కేసు ఈనెల 22వ తేదీకి వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment