హైదరాబాద్ : బాల్య వివాహాల నిరోధానికి ఎన్ని చట్టాలు చేసినా సమాజంలో మార్పు మాత్రం రావడం లేదు. రోజుకు ఎంతో మంది చిన్నారుల బాల్యం వివాహమనే బంధీఖానాలో చిక్కుకుంటూనే ఉంది. ఇటువంటి దురాచారాలు మారుమూల పల్లెల్లోనే కాదు.. హైద్రాబాద్ వంటి మెట్రోపాలిటన్ నగరాలలోనూ జరుగుతున్నాయి. తల్లిదండ్రులు ఇంటి అద్దె కట్టలేని స్థితిలో ఉన్న కారణంగా వివాహానికి సిద్ధమైందో 15 ఏళ్ల బాలిక. వివరాల్లోకి వెళితే.. ఒడిషా రాష్ట్రంలోని బాలాసోర్ జిల్లాకు చెందిన ఊర్మిళ, శ్రీకాంత్ దంపతులు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి సంతానం. అయితే బతుకుదెరువు కోసం శ్రీకాంత్ కుటుంబం నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి కాటేదాన్ ఏరియాలో నివసిస్తోంది.
కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే శ్రీకాంత్ కుటుంబానికి.. పొరుగున ఉన్న చెన్నయ్య గుప్త అనే వ్యక్తి ఇంటిని అద్దెకివ్వడంతో పాటు డబ్బు సాయం చేశారు. అయితే శ్రీకాంత్ కుటుంబం ఈ డబ్బును తిరిగి ఇవ్వలేకపోయింది. దీంతో చెన్నయ్య గుప్త.. దివ్యాంగుడైన తన 38 ఏళ్ల కుమారుడు రమేశ్ గుప్తాకు శ్రీకాంత్ పెద్ద కూతురు(15)ను ఇచ్చి వివాహం చేయాల్సిందిగా బలవంతపెట్టాడు. ఇందుకు అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించడంతో.. బుధవారం సాయంత్రం గుడిలో పెళ్లి జరిపించాలని నిర్ణయించారు. సమాచారం అందుకున్న పోలీసులు, శిశు సంక్షేమ అధికారులు గుడికి చేరుకుని బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. బాలికను గర్ల్స్ హోంకి తరలించారు.
ఆమె ఇష్టప్రకారమే..
బాలిక తల్లి ఊర్మిళ మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు వచ్చిన నాటి నుంచి రమేశ్ కుటుంబం తమకు అన్ని విధాల సాయపడిందని తెలిపింది. ఆ కుటుంబానికి రుణపడి ఉన్నాం కాబట్టి రమేశ్‌కు తమ కూతురినిచ్చి వివాహం చేస్తామని మాట ఇచ్చామని పేర్కొంది. మా అమ్మాయి తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు.. ఆమె అంగీకారంతోనే పెళ్లి నిర్ణయించామని చెప్పింది.
డబ్బు చెల్లించాలని ఒత్తిడి చేసి..
దివ్యాంగుడైన తమ కుమారుడిని చూసుకోవడానికే చెన్నయ్య గుప్త ఈ పెళ్లి నిశ్చయించారని మైలర్‌దేవ్‌పల్లి ఎస్సై జగదీశ్వర్ తెలిపారు. డబ్బు చెల్లించలేని పక్షంలో బాలికతో తమ కుమారుడి వివాహం జరిపించాలంటూ ఆమె తల్లిదండ్రులను ఒత్తిడి చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు బాల్య వివాహ నిషేధ చట్టం కింద వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment