చేతులే నేస్తాలుగా... | Women Auto Driver Sita Devi To Hit Delhi Streets | Sakshi
Sakshi News home page

చేతులే నేస్తాలుగా...

Published Sat, Apr 22 2023 3:51 AM | Last Updated on Sat, Apr 22 2023 3:51 AM

Women Auto driver Sita Devi to hit Delhi streets - Sakshi

ఆటో నడుపుతున్న సీతాదేవి

కష్టమంటే ఏంటో తెలియని చిన్నతనం. ఊహ తెలియకముందే పెళ్లి పేరుతో జీవనం. ఆదుకోని అయినవారు. అయినా చేతులున్నాయి కదా! అంటూ కొత్త జీవనం వైపుగా అడుగులు వేసి నేడు అందరితో శభాషని అనిపించుకుంటోంది ఆటోడ్రైవర్‌ సీతాదేవి. రోడ్లు ఊడ్చే పని నుంచి ఆ ఢిల్లీ రోడ్ల మీదే ఆటో నడుపుతూ, ముగ్గురు పిల్లలను చదివిస్తున్న సీతాదేవి ‘ఎన్నో ఒడిదుడుకుల జీవితం. కానీ, సొంత చేతులనే నమ్ముకున్నాను’ అని చెబుతోంది.

‘‘నేను మా అమ్మనాన్నలకు కొడుకుల కంటే తక్కువేమీ కాదని నిరూపించుకున్నాను. కొన్నేళ్ల క్రితం కష్టం వచ్చిందని పుట్టింటికి వెళితే, ఆదరించలేదు. అలాగని వారి మీద కోపం తెచ్చుకోలేదు. మా అమ్మనాన్నలది బీహార్‌. అక్కడే ఎనిమిదో తరగతి చదువుతుండగానే పెళ్లి చేశారు. ఆ వయసులో నాకెలాంటి తెలివితేటలు లేవు. నా భర్తతో కలిసి ఢిల్లీ వెళ్లిపోయాను. కానీ, ఆయన ఉద్యోగం గుజరాత్‌లో. పెళ్లయ్యాక ఐదేళ్లయినా పిల్లలు పుట్టలేదని అత్తింటిలో వేధింపులు.

నన్ను వదిలేయమని నా భర్తతో బంధువులంతా చెప్పారు. ఆ యేడాదే గర్భవతిని అని తెలియడంతో నా పట్ల మా అత్తింటివాళ్ల ప్రవర్తనలో మార్పు వచ్చింది. కానీ, నా భర్త ఉద్యోగం పోవడంతో కుటుంబపరిస్థితి పూర్తిగా క్షీణించింది. అప్పుల్లో కూరుకుపోయారు. ఎనిమిది నెలల గర్భవతిని. పూట గడవని పరిస్థితి. ఉన్న వస్తువులన్నీ అమ్ముకోవాల్సి వచ్చింది. పుట్టింటికి వెళితే గడపతొక్కనివ్వలేదు. తిరిగి ఢిల్లీ వెళ్లిపోయాను. తినడానికి ఏమీ లేని పరిస్థితి. మూడు రోజులు మంచినీళ్లు తాగి పడుకున్నాను.

తెలిసినవారి ద్వారా రోడ్లు ఊడ్చే పని దొరికింది. దీంతో మరో చిన్న ఇంటికి మారిపోయాం. పురిటిబిడ్డను తీసుకునే పనికి వెళ్లేదాన్ని. ఆ సమయంలో మా అన్న రావడంతో కొద్దిగా వస్తువులు కొన్నాను. వచ్చే కొద్దిపాటి ఆదాయంతో పిల్లలకు పూట గడుస్తుంది కానీ, మున్ముందు రోజులెలా గడవాలా... అని ఆలోచించేదాన్ని. నాలుగు ఇళ్లలో వంటపని చేయడం ప్రారంభించాను. ఆదాయం బాగానే ఉండటంతో స్వీపర్‌ పని వదిలేశాను.

► పగలు వంటలు
నాకు వండడం తెలుసు. కానీ, వెరైటీ  వంటలు చేయడం రాదు. వంటల పుస్తకాలు కొని, చదివి వెరైటీ వంటలు నేర్చుకొని, ఇళ్లలో చేయడం మొదలుపెట్టాను. అలా నెలకు 10 నుంచి 12 వేల రూపాయల వరకు వచ్చేవి. ఈ సంపాదనతో నా ముగ్గురు పిల్లల పోషణ బాగానే చూసుకోగలిగాను.

► రాత్రిళ్లు ప్లాస్టిక్‌ సంచులు
ప్రయత్నం లేకుండా మన తలరాతలో ఏది రాస్తే అది జరుగుతుందనుకోవడం తప్పు. పగలు వంటలతో పాటు రాత్రి ఇంటి వద్దే ప్లాస్టిక్‌ బ్యాగులు కుట్టేదాన్ని. పదకొండువందల రూపాయలతో పాత మెషిన్‌ కొని, బ్యాగులు కుట్టేదాన్ని. మెటీరియల్‌ ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చి, వేరేవాళ్లకు కూడా పని ఇవ్వడం మొదలుపెట్టాను. అలా పదివేల ప్టాస్టిక్‌ సంచులు కుట్టించి ఇస్తే, సంచికి ఇరవై ఐదు పైసలు వచ్చేవి. ఈ సంపాదనతో బీహార్‌లో ఇల్లు కట్టుకున్నాను.

► బిజీ బిజీ
చేతుల నిండా పనులు. నా రోజులు డబ్బుతో నిండిపోవడం మొదలయ్యాయి. వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకున్న అత్తమామల రుణం తీర్చేశాం. మా అమ్మనాన్నల లక్షన్నర అప్పు కూడా తీర్చి కొడుకుల కంటే నేనేమీ తక్కువ కాదని నిరూపించుకున్నాను. నాకు ముగ్గురు కొడుకులున్నారు. ఇద్దరు కాలేజీలో, ఒకరు పదోతరగతి చదువుతున్నారు. నా సంపాదనతోనే పిల్లలను చదివిస్తున్నాను.

► డ్రైవింగ్‌లో శిక్షణ
దాదాపు పదేళ్ల క్రితం గృహహింసపై మా ప్రాంతంలో అవగాహనా కార్యక్రమం జరుగుతోంది. అప్పుడు ఓ లాయర్‌ మాట్లాడుతూ ‘‘మహిళలు గృహహింసను ఎందుకు అనుభవించాలి, భర్తపై ఆధారపడకుండా మహిళలు తమ కాళ్లపై తాము నిలబడగలరు అని వివరించారు. ఆ సమయంలోనే అమ్మాయిలు డ్రైవింగ్‌లో శిక్షణ తీసుకోవచ్చు అని చెప్పారు. దీంతో ఆ ఫౌండేషన్‌ వాళ్లు ఇచ్చిన ఆరు నెలల డ్రైవింగ్‌ శిక్షణ తీసుకున్నాను. అదే సంవత్సరం నేను ప్రొఫెషనల్‌గా డ్రైవింగ్‌ ప్రారంభించాను. అయితే, పిల్లల్ని చూసుకోవడం ఇబ్బందిగా ఉందని కొంతకాలం తర్వాత డ్రైవింగ్‌ మానేశాను. ఎనిమిదేళ్ల తర్వాత ఈ–ఆటో నడిపే అవకాశం వచ్చింది. కల్కాజీ మెట్రోలో ఈ–ఆటో ప్రారంభించినప్పుడు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాను. ఇప్పుడు నెలకు 15 వేల రూపాయలు వస్తాయి. ఉదయం 10 గంటలకు ఈ–ఆటోతో మెట్రో పార్కింగ్‌ నుంచి బయల్దేరుతాను. సాయంత్రం 5 వరకు నడుపుతున్నాను.

పని చిన్నదనీ, పెద్దదనీ అనుకోవద్దు. అలాగే, మన చుట్టూ ఉన్న జనం ఏం మాట్లాడుతారో కూడా పట్టించుకోవద్దు. పూర్తి విశ్వాసంతో పని చేస్తే చాలు. కొంతమందికి మనం నచ్చకపోవచ్చు. అందుకు చింతిస్తూ కూర్చోకుండా, పనిని చేస్తూనే ఉండాలి. ఒకరోజున విజయం కచ్చితంగా వస్తుంది’అని చెబుతున్న సీతాదేవి కృషి ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిదాయకమని చెప్పాలి.

పని చిన్నదనీ, పెద్దదనీ అనుకోవద్దు. అలాగే, మన చుట్టూ ఉన్న జనం ఏం మాట్లాడుతారో కూడా పట్టించుకోవద్దు. పూర్తి విశ్వాసంతో పని చేస్తే చాలు. ఒకరోజున విజయం కచ్చితంగా వస్తుంది.
– సీతాదేవి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement