అవడానికి అది ఓ చిన్న ఆటో మాత్రమే. కానీ అందులో ఏకంగా ఒక మినీ గార్డెన్‌నే సృష్టించాడతను. చెన్నైకి చెందిన కుబేందిరన్ అనే ఆటో డ్రైవర్ మది నుంచి పుట్టుకొచి్చన ఈ సృజనాత్మక ఆలోచన నెటిజన్ల మది దోచుకుంటోంది. ఇంటర్నెట్ నిండా అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది...
కుబేందిరన్. చెన్నైలోని దాదాపు లక్ష మంది ఆటో డ్రైవర్లలో ఒకడు. కానీ పర్యావరణం మీది ప్రేమ అతన్ని మిగతా వారికంటే ఎంతో ప్రత్యేకంగా నిలిపింది. దేశమంతటా అతని పేరు మారుమోగేలా చేసింది. రకరకాల మీనియేచర్ మొక్కలు తదితరాలతో ఆటోను కదిలే తోటగా తీర్చిదిద్దాడు. ముందు, వెనక సీట్ల మధ్య, వెనక వైపు, సీలింగ్ మీద మాత్రమే గాక సీలింగ్ లోపలి వైపు కూడా పచ్చని మొక్కలతో నింపి ఆకట్టుకుంటున్నాడు.
ఆ ఆహ్లాదాన్ని అనుభవిస్తూ ప్రయాణికులు మైమరచిపోతున్నారు. అందుకే ఇప్పుడు కుబేందిరన్ ఆటోను చెన్నైవాసులు ప్రయాణించే పార్కుగా అభివరి్ణస్తూ మురిసిపోతున్నారు. అందులో ప్రయాణించిన వాళ్లు ’గ్రీన్ ఆటో’, ’మూవింగ్ పార్క్’, ఇంకా రకరకాలుగా ప్రశంసిస్తున్నారు. ఇంత చక్కని ఆలోచన చేసినందుకు అతన్ని ఎంతగానో మెచ్చుకుంటున్నారు కూడా.
మరెన్నో విశేషాలు: ఇది మాత్రమే కాదు, ఆటో ఎక్కే వారు చదువుకోవడం కోసం ఎన్నెన్నో స్ఫూర్తిదాయక పుస్తకాలు కూడా అందుబాటులో ఉంచాడు కుబేందిరన్. అంతేగాక వారికి స్వచ్ఛమైన చల్లని మంచినీరు కూడా ఇస్తాడు. వీటికి తోడు చక్కని సూక్తులు, నినాదాలతో కూడిన బ్యానర్లు కూడా ఆటో నిండా కనువిందు చేస్తుంటాయి. వాటిని తరచూ మారుస్తూ మరింత ఆకట్టుకుంటాడతను. రోడ్డు భద్రత గురించి కూడా అందరికీ వీలైనంత వరకూ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు. తనవంతు సామాజిక బాధ్యతను పరిపూర్ణంగా నెరవేరుస్తూ శెభాష్ అనిపించుకుంటున్నాడు.
ఆటోపై రూఫ్ గార్డెన్
కొన్నాళ్ల క్రితం ఢిల్లీకి చెందిన మహేంద్ర కుమార్ అనే ఆటో డ్రైవర్ కూడా ఇలాగే తన ఆటో రూఫ్ టాప్ మీద గార్డెన్ పెంచి వార్తల్లో నిలిచాడు. ఈ గార్డెన్ 2020 నుంచీ అందరినీ అలరిస్తోంది. కుమార్‌తో పాటు అతని ఆటో ఎక్కేవాళ్లు కూడా మండే ఢిల్లీ ఎండల్లో కూడా చక్కని చల్లదనం అనుభవిస్తూ ప్రయాణిస్తూ ఉంటారు. అతన్నీ, అతని ఆటో రూఫ్ టాప్‌నూ అంతా ఎప్పుడు చూసినా ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ ఉంటారు!
– నేషనల్ డెస్క్, సాక్షి
Comments
Please login to add a commentAdd a comment