garden
-
మొక్కలు చీడపీడల్లేకుండా, పచ్చగా ఉండాలంటే, ఇవిగో చిట్కాలు!
పచ్చదనం అంటే.. ఎక్కడో పార్క్లకో, అడవులకో వెళ్లాల్సిన అవసరం లేదు. మన పెరట్లో నాలుగు మందార, గులాబీ,చేమంతి మొక్కలో ఉంటే సరిపోతుంది. ఇంటి ముందు గుబురుగా పెరిగిన తులసి మొక్క చాలు మనసు ప్రశాంతంగా ఉండటానికి. చిన్న చిన్న మొక్కలతో ఇల్లు అందంగా కనిపించడమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి.అయితే మనకున్నచిన్న బాల్కనీలో, పెరట్లో మొక్కల్ని పెంచడం అంత ఈజీ కాదు సాధారణంగా మొక్కలను ఇష్టపడేవారు బయటి నుంచి మొక్కలు తెచ్చి తమ తోటల్లో లేదా ఇళ్లలోని కుండీల్లో నాటుతారు. మొక్కలకు సరైన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, వాడిపోతూ ఉంటాయి. ఉన్నట్టుండి ఎండిపోతాయి. సరైనపోషణతో కీటకాల బెడద లేకుండాపచ్చగా ఎదగాలంటే ఏం చేయాలి?మొక్కలు జాగ్రత్తగా పరిశీలించకపోయినా,పోషణ అందకపోయినా, నీళ్లు ఎక్కువైనా చని పోతాయి. పురుగులు కీటకాలు మొక్కలను మాత్రమే కాకుండా కుండలోని మట్టిని కూడా దెబ్బతీస్తాయి. జాగ్రత్తలు, చిట్కాలుదెబ్బతిన్న, చనిపోయిన ఆకులని ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి. దీని వల్ల చెట్లు చక్కగా పెరుగుతుంది. కాబట్టి, వీటిని కత్తెరతో కత్తిరించడం మంచిది.మొక్కలకి నీళ్ళతో పాటు సరైన కాంతి అవసరం. మరీ ఎండలో కాకుండా సమానమైన ఎండ తగిలేలా చూసుకోవాలి. అలా అని చీకటికూడా మంచిది కాదు. కాస్తంత వెలుతురు కావాలి.మొక్కలకి ఇంట్లోనే తయారు చేసుకున్న అనేక ఎరువులు ఇస్తూ ఉండాలి. పుల్లటి మజ్జిగ ద్రావణం, బనానా పీల్ ఫెర్టిలైజర్, పంచగవ్య, ఎండిన పశువుల ఎరువు, వేపనూనె, వేపగింజలు, ఆకుల కషాయం లాంటివి మొక్క, కుండా సైజును బట్టి ఇవ్వాలి.పుల్ల మజ్జిగ ద్రావణంగ్లాసు పుల్లటి మజ్జిగలో ఐదు గ్లాసులు నీళ్లుపోసి కలపాలి. ఈ నీటిని స్ప్రే బాటిల్లో పోసి మొక్కలపై చల్లాలి. ఉదయం సాయంత్రం ఒకసారి ఈ నీటిని మొక్కలు పోయడం వల్ల చీడపీడలు పోయి మొక్కలు చక్కగా పెరుగుతాయి.పచ్చి బఠానీతో పచ్చగా... పచ్చి బఠాణి మనకు ఎంత మేలు చేస్తుందో తెలిసిందే. అయితే బఠాణి పిక్కలు తీసి తొక్కలను పారేస్తుంటాము. కానీ ఈ తొక్కలు మొక్కలకు చక్కని పోషకాలు అందిస్తాయి. అందుకే తొక్కలను మిక్సీజార్‌లో వేసి పేస్టులా చేయాలి. ఈ పేస్టులో కాసిని నీళ్లు ΄ పోసి వడగట్టాలి. ఈ నీటిని గార్డెన్‌లోని మొక్కలకు పోషకాలు ఈ నీరు మంచి బలవర్థకమైన టానిక్‌లా పనిచేసి మొక్కలు చక్కగా పెరిగేందుకు దోహదపడతాయి.తెగుళ్లు, నివారణమొక్కలు సాధారణంగా పురుగులు,తెగుళ్లు నుంచి ఎప్పటికప్పుడు వాటిని కాపాడుకోవాలి. తెల్ల నల్లి, గొంగళి లాంటి వాటిని చేతితో తీసేయవచ్చు. పసుపు, ఉప్పు, ఇంగువ నీళ్లు చల్లినా ఫలితం ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో కనీసం రెండు రోజులకు ఒకసారైనా మొక్కల్ని పరికించి చూడాలి. లేదంటే గొంగళిపురుగులు, ఆకుతొలిచే పురుగులు ఆకుల్ని పూర్తిగా తినేస్తాయి. మట్టిలో తేమ కారణంగా, కొన్నిసార్లు చిన్న నత్తలు లేదా పాకే పురుగులు మొక్కలను పూర్తిగా నాశనం చేస్తాయి. వీటికి పొడి గుడ్డు పెంకు పొడి బాగా ఉపయోగపడుతుంది. గుడ్డు పెంకులను పూర్తిగా శుభ్రం చేసి, పొడి చేసి మట్టిలో కలపాలి.పువ్వులపై మైనంలాగా కనిపించే తెల్లటి మీలీ బగ్స్ (మందార, గులాబీ మొక్కలపై) వాటిని వదిలించుకోవడానికి, ఒక లీటరు నీటిలో చిటికెడు బేకింగ్ సోడా, 1 టీస్పూన్ షాంపూ, 2-3 చుక్కల వేపనూనె కలిపి మొక్కలపై చల్లుకోవాలి. టొమాటో, బెండకాయ, బీన్స్, ఓక్రా మొదలైన కొన్ని కూరగాయలపై కూడా ముందుగానే చల్లుకోవాలి. దాల్చిన చెక్క పొడికూడా బాగా పనిచేస్తుంది.ఇదీ చదవండి: వంటిట్లోని స్క్రబ్బర్, స్పాంజ్లతో ముప్పు : టాయిలెట్ కమోడ్‌కు మించి బ్యాక్టీరియా -
ఈ 'ట్రే గార్డెన్' ని ఎప్పుడైనా చూశారా?
చిన్న చిన్న ఎడ్లబండ్లు వాటిలో గ్రామీణ మహిళల బొమ్మలు, చెక్క కుర్చీలు వాటి ముందు చిట్టి చిట్టి బొమ్మలు, హంసలు, పక్షులు, గూళ్లు, గుడిసెలు.. ఇలా ముచ్చటైన వస్తువుల కూర్పుతో ట్రే గార్డెన్‌ను ఎవరికి వారు తయారు చేసుకోవచ్చు. ఇంట్లో చిన్నపాటి స్థలంలో కూడా వీటిని అందంగా అలంకరించవచ్చు.ఈ విషయాన్ని తన కళతో నిరూపిస్తోంది హర్యానాలోని ఫరీదాబాద్ వాసి యాభై ఐదేళ్ల శారదా గోదారా. తోటలు, పార్కులను పోలిన మినియేచర్ ట్రే గార్డెన్స్‌ను రూపొందిస్తోందామె. నడివయసులో ఒంటరితనం పోగొట్టుకోవడానికి చేసిన ఆలోచన ఆమెను ఇలా అందమైన లోకంలో విహరించేలా చేసింది. తన ఇంటిలో వెయ్యి మొక్కలతో మినీ జంగిల్‌ను క్రియేట్ చేసింది.‘మా ఇంటి బయట, మెట్లు, బాల్కనీలు, పెరడు వరకు రకరకాల అందమైన మొక్కలతో నింపేశా. ఆ తర్వాత చిన్న ట్రే గార్డెన్ల తయారీని మొదలుపెట్టాను. అభిరుచి ఉంటే చాలు ఒంటరితనానికి ఎదర్కోవడానికి, ఇంటిని అందంగా అలంకరించడానికి ఇదొక మంచి మార్గం. ఒక గంటలోపు ఒక మినీ ట్రే గార్డెన్‌ను రూపొందించుకోవచ్చు. రంగు రంగుల గులకరాళ్లు, చిట్టి పొట్టి మొక్కలు, చిన్న చిన్న మెట్లు, గుడిసెలు.. ఇతర అలంకరణ వస్తువులతో తయారైన ఈ మినీ ట్రే గార్డెన్లను చూస్తుంటే ఎంతో ఆనందంగా కలుగుతుంది’ అని తన గార్డెన్ పెంపకం విషయాలను ఆనందంగా చెబుతుందామె.ట్రే గార్డెన్‌ని మీరూ ఇలా సృష్టించుకోవచ్చు...ముందుగా గార్డెన్ థీమ్‌ను దృష్టిలో ఉంచుకొని, కాగితం మీద స్కెచ్ వేసుకోవాలి. పరిమాణం, ఆకారం, మట్టి, ఇతర అలంకార వస్తువులను బట్టి తగిన సిరామిక్ ట్రేని ఎంచుకోవాలి.గార్డెన్‌కు బేస్‌ను సృష్టించడానికి పాటింగ్ మిక్స్‌తో ట్రేని నింపాలి. సారవంతమైన మట్టిలో 15 శాతం ఆవుపేడ, 15 శాతం కోకోపిట్ కలపాలి.వీటిలో స్నేక్‌ప్లాంట్, స్పైడర్ వంటి చిన్న చిన్న మరుగుజ్జు మొక్కలను నాటాలి. పైనుంచి మట్టిని గట్టిగా నొక్కి, నీళ్లు పోయాలి. తర్వాత రంగు రంగుల గులకరాళ్లు, గంటలు, బొమ్మలు వంటి అలంకరణ వస్తువులతో ట్రే తోటను అలంకరించాలి. స్ప్రే బాటిల్‌ను ఉపయోగించి ట్రేలోని మొక్కలకు నీళ్లు పోయాలి.ఫంగల్ దాడుల నుంచి మొక్కలను కాపాడుకోవడానికి అరటి, వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయ తొక్కలు.. వంటి వంటగది వ్యర్థాలను ఉపయోగించి చేసే ద్రవ కంపోస్ట్‌ను పిచికారీ చేసుకోవచ్చు..ఇవి చదవండి: ఫోటోగ్రాఫర్..! -
తెరుచుకోనున్న తులిప్ గార్డెన్.. 17 లక్షల పూలతో కనువిందు!
జమ్మూకశ్మీర్‌లోని ప్రపంచ ప్రఖ్యాత తులిప్ గార్డెన్ మార్చి 23 నుంచి పర్యాటకుల కోసం తెరుచుకోనుంది. ఈసారి 17 లక్షల తులిప్ పూలు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయని గార్డెన్ అధికారులు తెలిపారు. మార్చి 19 నుండి 20 రోజుల పాటు తులిప్ ఫెస్టివల్ జరగనుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దాల్ సరస్సు ఒడ్డున ఉన్న ఈ తులిప్ గార్డెన్ ప్రకృతి ప్రియులను ఎంతగానో ఆకట్టుకోనుంది. ఫ్లోరికల్చర్ అధికారి జావేద్ మసూద్ మాట్లాడుతూ మార్చి 23న ఈ గార్డెన్‌ను ప్రారంభించనున్నారని, ఇక్కడి పూలు అందరినీ తప్పక ఆకట్టుకుంటాయని అన్నారు. తులిప్ గార్డెన్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఉద్యానవనమని, కశ్మీర్ లోయలో పర్యాటక రంగానికి ఇది ఊతమిస్తున్నదని అన్నారు. ఈసారి జరిగే తులిప్ ఫెస్టివల్లో ఐదు కొత్త రకాల పూలను పరిచయం చేస్తున్నామన్నారు. ఈ ఏడాది 17 లక్షల తులిప్ పూలను చూడవచ్చన్నారు. కాగా ఈ గార్డెన్‌ను సిద్ధం చేయడానికి దాదాపు ఆరు నెలలు పడుతుందని, ఇందుకోసం విస్తృతమైన ప్రణాళిక ఉంటుందన్నారు. ఈ ఏడాది పర్యాటకుల సంఖ్యపై మరింతగా పెరిగే అవకాశం ఉన్నదని గార్డెన్ అధికారులు తెలిపారు. -
పాతాళవనం కాదు! అదొక 'నేలమాళిగలో ఉద్యానవనం..!'
'మన జీవితంలో మనం ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలు చూసుంటాం. ఎన్నో అద్భుతాలను చూసుంటాం. అవి మనకు ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చి ఉంటాయి. కానీ ఇలాంటి పాతాళవనాన్ని కాదు కాదు, ఉద్యానవనాన్ని మీరెప్పుడైనా చూశారా! చూడాలంటే.. పాతాళంలోకి దిగాల్సిందే.., దిగాలంటే.. అమెరికాకు వెళ్లాల్సిందే..! ఆశ్చర్యం, అద్భుతం రెండూ కలిస్తేనే ఈ వనం. మరి అదేంటో కాస్త ముందే తెలుసుకుందామా..!' ఈ పాతాళవనం అమెరికాలో ఉంది. కాలిఫోర్నియాలోని ఫ్రెస్నోలో ఉన్న ఈ ఉద్యానవనం వెనుక కొంత చరిత్ర ఉంది. ఇటలీలోని సిసిలీ నుంచి అమెరికాకు వలస వచ్చిన బాల్డసరె ఫారెస్టీరె ఫ్రెస్నోలో 1904లో పది ఎకరాల భూమి కొన్నాడు. ఇక్కడి మట్టి నిమ్మ, నారింజ వంటి పండ్లతోటల పెంపకానికి అనుకూలంగా లేకపోవడమే కాదు, ఇక్కడి వాతావరణం కూడా వేసవిలో విపరీతమైన వేడిగా ఉండేది. వేసవి తాపాన్ని తట్టుకునే విశ్రాంతి మందిరం కోసం బాల్డసరె ఈ భూమిలో ఇరవైమూడు అడుగుల లోతున నేలమాళిగను తవ్వించాడు. నేలమాళిగలోనే గదులు గదులుగా నిర్మాణం చేపట్టి, లోపలకు గాలి వెలుతురు సోకేలా తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. చుట్టూ తవ్వకాన్ని విస్తరించి, చిన్న చిన్న మొక్కలతో ఉద్యానవనాన్ని పెంచాడు. గాలి వెలుతురు ధారాళంగా ఉండటంతో ఈ నేలమాళిగలో మొక్కలు ఏపుగా పెరిగాయి. బాల్డసరె 1946లో మరణించాడు. అమెరికా ప్రభుత్వం 1977లో దీనిని చారిత్రక ప్రదేశంగా గుర్తించింది. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా నేలమాళిగలో పెరిగిన ఈ ఉద్యానవనం నేటికీ పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఇవి చదవండి: చిపి చిపీ చాపా... డుబిడుబిడు -
మొక్కల సంరక్షణకు నెయ్యి ఉపయోగిస్తారని తెలుసా!
మాములుగా శరీరానికి తగు మోతాదులో నెయ్యి అవసరం. శరీరానికి కావాల్సిన మంచి కొలస్ట్రాల్ నెయ్యి అని కూడా నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఇది జ్ఞాపకశక్తిని, జీర్ణశక్తిని పెంచడమే గాక రోగనిరోధక శక్తిని మెరుగ్గా ఉంచుతుంది. అలాంటి నెయ్యి మొక్కల సంరక్షణ కోసం వినియోగిస్తారని విన్నారా?. ఈ నెయ్యి వల్ల మొక్కల కుండీల్లో నేల సారవంతమై మొక్క ఆరోగ్యంగా పెరిగేలా చేయడమే కాకుండా పురుగు, పుట్ర వంటివి దరిచేరనివ్వదని చెబుతున్నారు అగ్రికల్చర్ పరిశోధకులు. ఇంతకీ మొక్కలకు నెయ్యి వల్ల కలిగే ప్రయోజనాలేంటి? ఎలా వినియోగించాలి వంటివి తెలుసుకుందామా!. ►నెయ్యిలో కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నందున , దానిని పెరుగుతున్న నేలలో వేయడం వల్ల సేంద్రీయ కూర్పు పెరుగుతుంది . దీన్ని మెక్క పెరుగుతున్న భాగంలో వేసి ఆ తర్వాత నీళ్లు పోసి వృద్ధి చెందేలా చూడాలి. ► అఫిడ్స్ స్లగ్‌లు కాండం, ఆకులపై దాడి చేయకుండా ఈ నెయ్యి రక్షిస్తుంది. దాని కుండే మృదు స్వభావానికి అవి దాడి చేయడం కష్టమవుతుంది. అలాగే ఇబ్బందికరమైన తెగుళ్ల నుంచి రక్షించుకోవడానికి నెయ్యి గొప్ప ప్రత్యామ్నాయం. ► దూదిపై 3-4 చుక్కల కరిగించిన నెయ్యి వేసి, తెగులు సోకిన మొక్క కాండం,ఆకులను తుడిస్తే..అఫిడ్స్, స్లగ్స్ పైకి రావు. నెయ్యిలోని కొవ్వులు నేలకు ఉపయోగపడే సూక్ష్మజీవులకు ఆహార వనరును అందిస్తాయి. మొక్క పెరుగుతున్న నేలలో సేంద్రీయ పదార్థం సమృద్ధిగా ఉండేలా చేస్తుంది. దీంతో మొక్క బాగా పెరగడమే గాక పచ్చగా పెరగడానికి సహాయపడుతుంది. ►ఇలా ప్రతి రెండు నుంచి మూడు నెలలకు చొప్పున రెండు నుంచి మూడు టీస్పూన్ల నెయ్యిని వేస్తే చాలు మంచి ఫలితాలు ఉంటాయి. ►రబ్బరు మొక్క వంటి పెద్ద ఆకులు కలిగిన మొక్కలకు నెయ్యితో మంచి ప్రయోజనం ఉంటుంది. తడిగా ఉన్న కాటన్ వస్త్రాన్ని ఉపయోగించి వాటి ఆకులను శుభ్రం చేయండి. పూర్తయిన తర్వాత, ఒక దూదీలో 4 నుంచి 5 చుక్కల కరిగించిన నెయ్యి వేసి, ఆకులను తుడవండి. ఇది ఆకులను మెరిసేలా చేయడమే కాకుండా కొవ్వు పొరను కూడా జోడిస్తుంది. గమనిక: నెయ్యి అప్లై చేసిన తర్వాత ఎక్కువ ధూళిని ఆకర్షిస్తుంది కాబట్టి 3-4 రోజుల తర్వాత మళ్లీ ఆకులను తుడవడం మంచిది. ప్రత్యక్ష సూర్యకాంతికి గురయ్యే మొక్కలపై దీనిని ఉపయోగించవద్దు. (చదవండి: స్టవ్ వెలిగించకుండానే.. పండంటి వంటలు..) -
మిగిలిపోయిన అన్నం, కూరల్ని మొక్కలకు పడేయండి
అన్నం, కూరలు మిగిలిపోతే పడేస్తుంటారు. అయితే ఆ పడేసేదేదో మొక్కల దగ్గర పడేస్తే వాటికి కావాల్సిన పోషకాలు అంది, అవి ఏపుగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ►మిగిలిపోయిన పప్పులో నీళ్లు కలిపి పలుచగా చేయాలి. ఈ పప్పు నీళ్లను మొక్కలకు పోయాలి. మజ్జిగ మరీ పుల్లగా అయితే తాగలేము. ఈ పుల్లటి మజ్జిగను బకెట్ నీళ్లల్లో పోసి కలపాలి. ఈ నీటిని మొక్కలకు పోయాలి. ► మిగిలిపోయిన అన్నాన్ని మెత్తగా గ్రైండ్ చేసి నీటిలో కలపాలి. ఈ నీటిని మొక్కలకు పోయాలి. బియ్యం, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు కడిగిన నీటిని సింక్‌లో పోయకుండా మొక్కలకు పోస్తే మంచిది. ► ఉల్లిపాయ తొక్కలు, అరటి తొక్కలను పడేయకుండా నీటిలో నానబెట్టాలి. పదిగంటల తరువాత ఈ నీటిని మొక్కలకు పోయాలి. ఈ నీటి నుంచి నైట్రోజన్, పొటాషియం, ఫాస్పరస్‌లు మొక్కలకు పుష్కలంగా అందుతాయి. చూశారుగా... మిగిలిపోయినవి మొక్కలకు ఎంత మేలు చేస్తున్నాయో. ఇంకెందుకు ఆలస్యం మీ గార్డెన్ మరింత పచ్చగా కళకళలాడించేందుకు ప్రయత్నించండి. -
అగ్గిపుల్లతో ఇలా చేస్తే..మొక్కలు పూలతో కళకళలాడతాయి!
గార్డెన్లో ఎంతో ఇష్టంగా మొక్కలు పెంచుతుంటాము. సమయానికి నీళ్లుపోసి, మొక్కల ఎదుగుదలకోసం ప్రత్యేక శ్రద్ధ వహించినప్పటికీ కొన్ని మొక్కలు బలహీనంగా, వాడిపోయినట్టుగా ఉంటాయి. ఇలాంటి మొక్కలను పూలతో చక్కగా కళకళలాడేలా చేయాలంటే పాదులో అగ్గిపుల్లలు గుచ్చాలి. అవును అగ్గిపుల్లలే... అగ్గిపుల్లతో ఏం చేయాలంటే.. అగ్గిపుల్లలను యాంటీమోనీ సల్ఫైడ్, పొటాషియం, సల్ఫర్, మెగ్నీషియం, క్లోరేట్ రసాయనాలతో తయారు చేస్తారు. ఈ రసాయనాలు మొక్కలకు క్రిమిసంహారాలుగా పనిచేస్తాయి. అంతేగాక ఇవి వేర్లకు బలాన్ని ఇస్తాయి. సల్ఫర్, మెగ్నీషియం, క్లోరేట్లు మొక్కలు వేళ్లనుంచి చక్కగా పెరిగేందుకు దోహద పడతాయి. ముందుగా కుండిలోని మొక్క చుట్టూ కొన్ని నీళ్లుపోయాలి. ఇప్పుడు పది అగ్గిపుల్లలను రసాయనం ఉన్నవైపు మట్టిలోకి గుచ్చాలి. పుల్ల పుల్లకు కొద్దిగా దూరం ఉండేలా .. అగ్గిపుల్ల పూర్తిగా మట్టిలోకి చొచ్చుకుపోయేలా గుచ్చాలి. ఇలా నెలకు ఒక్కసారి మాత్రమే పుల్లలను గుచ్చాలి. గుచ్చిన పుల్లలను పదిహేను రోజుల తరువాత తీసేయాలి. ఇలా చేయడం వల్ల మొక్కల పెరుగుదలకు కావాల్సిన పోషకాలు అగ్గపుల్లల నుంచి అంది, మొక్క బలంగా పెరిగి పూలూ, పండ్లను చక్కగా ఇస్తుంది. (చదవండి: విద్యా బాలన్ కళ్ల అందం సీక్రేట్ ఇదే! అది పెట్టకుండా గడప కూడా..) -
మొక్కలు పెంచాలనుకుంటే చాలు.. అపార్ట్మెంట్లో కూడా పెంచొచ్చు!
పట్టణాల్లోని చిన్న అపార్ట్‌మెంట్‌వాసుల నోటి నుంచి తరచుగా వినిపించే మాట ‘మొక్కలు అంటే మాకు చాలా ఇష్టం. కాని స్థలం ఎక్కడిది?’ ‘స్థలం పెద్దగా అక్కర్లేదు. పెంచాలనే సంకల్పం ఉంటే చాలు’ అంటుంది బిహార్‌కు చెందిన కమల్‌సింగ్. ఉద్యోగ నిమిత్తం బెంగళూరులో ఉంటున్న కమల్‌సింగ్ తన చిన్న అపార్ట్మెంట్ బాల్కనీలో రకరకాల మొక్కలు పెంచుతుంది. ‘వంటగది వ్యర్థాలతో కంపోస్ట్‌ను ఎలా తయారుచేయాలి?’ అనే విషయం నుంచి ఏ మొక్కలను ఎలా పెంచాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వరకు... ఎన్నో విషయాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తోంది. ఆమె ఇన్స్టాగ్రామ్ పేజీ ‘అర్బన్ హోమ్ వైబ్స్’కు ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు. ‘స్టార్ట్ వేర్ యూ ఆర్ విత్ వాటెవర్ యూ హ్యావ్’ అంటున్న కమల్‌సింగ్ స్ఫూర్తితో ఎంతో మంది పట్టణ వాసులు తమ బాల్కనీలో మొక్కల పెంపకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి ‘మేము సైతం’ అంటున్నారు. (చదవండి: వెరైటీగా బనానా ఆమ్లెట్ ట్రై చేయండిలా!) -
చెన్నైలో ఆటో డ్రైవర్ సృజన.. అతని ఆటోనే ఓ మినీ గార్డెన్
అవడానికి అది ఓ చిన్న ఆటో మాత్రమే. కానీ అందులో ఏకంగా ఒక మినీ గార్డెన్‌నే సృష్టించాడతను. చెన్నైకి చెందిన కుబేందిరన్ అనే ఆటో డ్రైవర్ మది నుంచి పుట్టుకొచి్చన ఈ సృజనాత్మక ఆలోచన నెటిజన్ల మది దోచుకుంటోంది. ఇంటర్నెట్ నిండా అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది... కుబేందిరన్. చెన్నైలోని దాదాపు లక్ష మంది ఆటో డ్రైవర్లలో ఒకడు. కానీ పర్యావరణం మీది ప్రేమ అతన్ని మిగతా వారికంటే ఎంతో ప్రత్యేకంగా నిలిపింది. దేశమంతటా అతని పేరు మారుమోగేలా చేసింది. రకరకాల మీనియేచర్ మొక్కలు తదితరాలతో ఆటోను కదిలే తోటగా తీర్చిదిద్దాడు. ముందు, వెనక సీట్ల మధ్య, వెనక వైపు, సీలింగ్ మీద మాత్రమే గాక సీలింగ్ లోపలి వైపు కూడా పచ్చని మొక్కలతో నింపి ఆకట్టుకుంటున్నాడు. ఆ ఆహ్లాదాన్ని అనుభవిస్తూ ప్రయాణికులు మైమరచిపోతున్నారు. అందుకే ఇప్పుడు కుబేందిరన్ ఆటోను చెన్నైవాసులు ప్రయాణించే పార్కుగా అభివరి్ణస్తూ మురిసిపోతున్నారు. అందులో ప్రయాణించిన వాళ్లు ’గ్రీన్ ఆటో’, ’మూవింగ్ పార్క్’, ఇంకా రకరకాలుగా ప్రశంసిస్తున్నారు. ఇంత చక్కని ఆలోచన చేసినందుకు అతన్ని ఎంతగానో మెచ్చుకుంటున్నారు కూడా. మరెన్నో విశేషాలు: ఇది మాత్రమే కాదు, ఆటో ఎక్కే వారు చదువుకోవడం కోసం ఎన్నెన్నో స్ఫూర్తిదాయక పుస్తకాలు కూడా అందుబాటులో ఉంచాడు కుబేందిరన్. అంతేగాక వారికి స్వచ్ఛమైన చల్లని మంచినీరు కూడా ఇస్తాడు. వీటికి తోడు చక్కని సూక్తులు, నినాదాలతో కూడిన బ్యానర్లు కూడా ఆటో నిండా కనువిందు చేస్తుంటాయి. వాటిని తరచూ మారుస్తూ మరింత ఆకట్టుకుంటాడతను. రోడ్డు భద్రత గురించి కూడా అందరికీ వీలైనంత వరకూ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు. తనవంతు సామాజిక బాధ్యతను పరిపూర్ణంగా నెరవేరుస్తూ శెభాష్ అనిపించుకుంటున్నాడు. ఆటోపై రూఫ్ గార్డెన్ కొన్నాళ్ల క్రితం ఢిల్లీకి చెందిన మహేంద్ర కుమార్ అనే ఆటో డ్రైవర్ కూడా ఇలాగే తన ఆటో రూఫ్ టాప్ మీద గార్డెన్ పెంచి వార్తల్లో నిలిచాడు. ఈ గార్డెన్ 2020 నుంచీ అందరినీ అలరిస్తోంది. కుమార్‌తో పాటు అతని ఆటో ఎక్కేవాళ్లు కూడా మండే ఢిల్లీ ఎండల్లో కూడా చక్కని చల్లదనం అనుభవిస్తూ ప్రయాణిస్తూ ఉంటారు. అతన్నీ, అతని ఆటో రూఫ్ టాప్నూ అంతా ఎప్పుడు చూసినా ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ ఉంటారు! – నేషనల్ డెస్క్, సాక్షి -
"ట్రావెలింగ్ పార్క్" డ్రైవర్ క్రియేటివిటీకి..నెటిజన్లు ఫిదా!
కొద్ది దూరంలోని గమ్యస్థానాలకు చేరడానికి వినియోగించే ఆటోల గురించి తెలిసిందే. అలాగే ఇటీవల కాలంలో ప్రయాణీకులను అట్రాక్ట్ చేసేలా ఆటోలను డెకరేట్ చేస్తున్నారు కూడా. అయితే ఈ డ్రైవర్ మాత్రం మరింత విభిన్నంగా ఆలోచించి మరీ వైరైటీగా తీర్చిద్దిదాడు. అతడి ఆటోని చూస్తే.. ఆశ్చర్యపోవడం ఖాయం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో..ఆ ఆటో మొత్తం గ్రీన్‌గా ఓ పార్క్ మాదిరి కనిపిస్తుంది. చూడగానే ఇది ఆటోనేనా అనిపిస్తుంది. ఆటోలో మొక్కలను ఏర్పాటు చేసిన సందర్భాలు చూశాం. ఇది మాత్రం అంతకు మించి అన్నట్లు ఉంది. ఏకంగా మొత్తం గ్రీనరీనే..ఏకంగా ఆటోలోని పైనంతా పూల మొక్కలు అలిమేసి ఉన్నాయి. ఇక సైడ్స్ పూలకుండీలు ఇవేగాక తాగునీరు, మోటివేషనల్ బుక్స్, మోటివేషనల్ ప్టోసర్లతో ఎంతో అట్రాక్టివ్‌గా మంత్రముగ్దుల్ని చేస్తోంది. ఆటోలో మిని గార్డెన్‌నే ఏర్పాటు చేశాడు ఆ డ్రైవర్. అతడి క్రియేటివిటీని ప్రశంసిస్తూ..అది జంగిల్ ఆటో అని ఒకరు, గ్రీన్ ఆటో మరొకరూ, కాదు కాదు ట్రావెలింగ్ పార్క్ అని ఇంకొకరు కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by thoughts♡ (@depthoughtsz._) (చదవండి: ఆ పురాతన గోడ ధర వింటే..కళ్లు బైర్లు కమ్మడం ఖాయం!) -
రైతులకు మేలు చేసేలా..పురుగులకు కుటుంబ నియంత్రణ!
వ్యవస్థాపకుడు డాక్టర్ విజయ భాస్కర్ రెడ్డి పంట పొలాల్లో, పండ్ల తోటల్లో పురుగుల నియంత్రణకు పురుగుమందులు/కషాయాలు చల్లటం కన్నా.. అసలు ఆయా ప్రత్యేక జాతి పురుగుల సంతతినే పెరగకుండా అరికట్టగలిగితే రైతులకు శ్రమ, ఖర్చు తగ్గటంతో పాటు, పర్యావరణానికి, ప్రజారోగ్యానికి కూడా మేలు జరుగుతుందంటున్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు. వివిధ శాస్త్రవిభాగాల్లో పరిశోధనలు పూర్తిచేసిన శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే వినూత్నమైన ఫెరమోన్ ఆధారిత అప్లికేషన్లు, ఆవిష్కరణలను వెలువరించారు. కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి అగ్రికల్చర్ గ్రాండ్ ఛాలెంజ్ పురస్కారాన్ని అందుకున్న ఈ సాంకేతికతను రైతులకు అందుబాటులోకి తేవడానికి శాస్త్రవేత్తలు హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో ఎటిజిసి బయోటెక్ అనే కంపెనీని నెలకొల్పారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఇటీవల నిర్వహించిన ‘ఎట్‌హోమ్ రిసెప్షన్ ’లో ఈ సంస్థ సహ–వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి, హెచ్‌సియూ పూర్వ విద్యార్థి డాక్టర్ విజయ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన అందించిన వివరాల ప్రకారం ఈ వినూత్న సాంకేతికత వివరాలను పరిశీలిద్దాం.. పురుగుల సంతతిని అరికట్టే వ్యూహం ఆడ రెక్కల పురుగు సంతానోత్పత్తి దశలో మగ రెక్కల పురుగును ఆకర్షించడానికి ప్రత్యేకమైన వాసనతో కూడిన హార్మోన్ వంటి రసాయనాన్ని గాలిలోకి విడుదల చేస్తుంది. మగ పురుగు ఆ ఫెరమోన్ వాసనను బట్టి ఆడ పురుగు ఉన్న చోటుకు వెళ్లి కలుస్తుంది. ఈ కలయిక సజావుగా జరిగితే ఆడ పురుగు గుడ్లు పెడుతుంది. ఆ విధంగా పురుగుల సంతతి పంట పొలంలో స్వల్ప కాలంలోనే పదులు వందలుగా, వందలు వేలుగా పెరిగిపోయి పంటను ఆశించి దిగుబడిని నష్ట పరచటం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే, ఆడ–మగ రెక్కల పురుగుల కలయికే జరగకుండా చూడటం ద్వారా సంతతి పెరుగుదలను అరికట్టడం ఇక్కడ వ్యూహం. ఈ వ్యూహాన్ని అమలుపరచడానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పరిశోధన శాస్త్రవేత్తలు రూపొందించిన వినూత్న పద్ధతి ఏమిటంటే.. కృత్రిమ ఫెరమోన్తో కూడిన ప్రత్యేక పేస్ట్‌ను రూపొందించటం. ఈ పేస్ట్‌ను పంట పొలంలో మొక్కలకు అక్కడక్కడా అంటిస్తే.. ఆ వాసనకు మగ రెక్కల పురుగు ఆడ పురుగు ఉందనుకొని మొక్కపై ఉన్న పేస్ట్ దగ్గరకు వస్తుంది. తీరా లేకపోయే సరికి తికమకకు గురవుతుంది. ఆడ రెక్కల పురుగులను కలిసే ప్రయత్నంలో నూటికి 90 సార్లు విఫలమవుతుంది. దాంతో ఆ పురుగు సంతానోత్పత్తి ఆ మేరకు పరిమితమవుతుంది. ఈ టెక్నిక్‌ను ఉపయోగించి పురుగు తొలి దశలోనే పేస్ట్‌ను పొలంలో అక్కడక్కడా మొక్కలకు పూస్తే చాలు. పురుగుల్ని నిర్మూలించకుండానే వాటి సంఖ్యను చాలా వరకు అదుపులోకి తేవటం ద్వారా పంట దిగుబడికి పెద్దగా నష్టం జరగకుండా చూసుకోవచ్చు. ఇది సరిగ్గా చేస్తే ఆ పురుగు నిర్మూలనకు రైతులు పురుగుమందు కొట్టే శ్రమ, ఖర్చు, కాలుష్యం ఉండదు. అయితే, పురుగుల తీవ్రతను తెలుసుకునేందుకు లింగాకర్షక బుట్టలు చాలా కాలంగా రైతులు వాడుతున్నారు. ఫెరమోన్ ఎర వాసనతో వచ్చి లింగాకర్షక బుట్టల్లో పడే మగ రెక్కల పురుగుల సంఖ్యను, పొలంలో అప్పుడు ఆ పురుగు తీవ్రతను గుర్తించి, పురుగు మందులు/కషాయాలు చల్లటం వంటి నియంత్రణ చర్యలను రైతులు చేపడుతున్నారు. ఈ లోగా పురుగుల సంతతి పెరిగిపోతోంది. అయితే, ఈ కొత్త పద్ధతి ద్వారా ఈ పురుగుల సంతతి పెరగకుండా ముందు నుంచే వాటి కలయికను నివారించవచ్చు. పురుగు ఉధృతిని ఎర ఉపయోగించి గమనించవచ్చు. పత్తిలో గులాబీ పురుగుకు చెక్ గులాబీ రంగు పురుగు వలన పత్తి రైతులు సగటున ఎకరానికి 6–7 క్వింటాళ్ల పత్తిని నష్టపోతున్నారు. పురుగులను సమర్థవంతంగా అరికట్టడానికి ఫెరొమోన్ పర్యవేక్షణ మాత్రమే సరిపోదు. ఇప్పుడు పర్యవేక్షణే కాకుండా ఫెరొమోన్ ఆధారిత నియంత్రణ విధానం అందుబాటులోకి వచ్చింది. ఇది ఎరను ఉపయోగించకుండా ఫెరొమోన్ పేస్ట్ ద్వారా పురుగులను అరికట్టే సరికొత్త పద్ధతని డాక్టర్ విజయభాస్కర్‌రెడ్డి ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. ప్రస్తుతం బీటీ పత్తి పొలాల్లో విజృంభిస్తున్న గులాబీ లద్దె పురుగును అరికట్టేందుకు ప్రత్యేకమైన పేస్ట్‌ను తమ కంపెనీ రూపొందించిందన్నారు. పేటెంట్ కలిగిన ఈ టెక్నాలజీకి కేంద్ర ప్రభుత్వ అనుమతులు పొందిన తర్వాత రైతులకు అందుబాటులోకి తెచ్చిందన్నారు. పత్తి పంటలో 3 సార్లు.. ఎకరం పత్తి చేనులో అన్ని మొక్కలకూ పేస్ట్‌ను పెట్టక్కర లేదు. 400 మొక్కల (పొలంలో 7–8% మొక్కల)కు ఈ పేస్ట్‌ను బఠాణీ గింజంత అంటించాలి. మొక్క పై నుంచి 10–15 సెం.మీ. కిందికి, కాండం నుంచి కొమ్మ చీలే దగ్గర పెట్టాలి. ఒక సాలులో 4 మీటర్లకు ఒక మొక్కకు పెడితే చాలు. ఒక సాలులో మొక్కలకు పెట్టి, రెండు సాళ్లు వదిలేసి మూడో సాలుకు పెడితే సరిపోతుంది. ఎకరం మొత్తానికి 125 గ్రాముల పేస్ట్ సరిపోతుందని డా. రెడ్డి వివరించారు. ఒక్కో మొక్క కాండంపై 250 నుంచి 300 మిల్లీ గ్రాముల మేరకు పెట్టాలి. పత్తి పంట కాలంలో మొత్తం 3 సార్లు పేస్ట్ పెట్టాలి. విత్తనాలు వేసిన తర్వాత (పువ్వు/ గూడ ఏర్పడటానికి ముందు) ఇంచుమించుగా 30–35 రోజులకు మొదటిసారి, విత్తిన 60–65 రోజుల తర్వాత రెండోసారి, విత్తిన 90–95 రోజుల తర్వాత మూడవ సారి పెట్టాలి. తుది పంట కోసే వరకు ప్రతి 30–35 రోజుల వ్యవధిలో ఉపయోగించాలి. ఇలా చేస్తే పంట ఖర్చు తగ్గి, దిగుబడి, నాణ్యత పెరుగుతుంది. ఎకరానికి పేస్ట్ ఖర్చు మూడు సార్లకు రూ. 4 వేలు అయినప్పటికీ, రైతు రూ. 30 వేల వరకు అధికాదాయం పొందగలుగుతారని ఆయన అన్నారు. మిత్రపురుగులు సురక్షితం ఈ సాంకేతికతలో పురుగుమందులు /హానికరమైన రసాయనాలు లేనందున పర్యావరణానికి హాని కలిగించదని డా. విజయభాస్కర్‌రెడ్డి వివరించారు. నేల, గాలి, నీరు పురుగు మందుల అవశేషాలతో కలుషితం కావు. మిత్ర పురుగులకు, పరాన్న జీవులు వంటి సహజ శత్రువులకు సురక్షితంగా ఉంటాయి. తేనెటీగలు నశించవు. సహజ పరాగ సంపర్కం బాగుంటుంది. రైతుకు, కూలీలకు సురక్షితమైనది. మొక్కకు హాని కలిగించదు. పత్తి నాణ్యత, రంగు మెరుగ్గా ఉంటుంది. మంచి ధరను పొందే అవకాశం కలుగుతుంది అన్నారాయన. దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రయోగాల్లో 90% పైగా పత్తిలో గులాబీ పురుగును ఈ పేస్ట్ నియంత్రిస్తున్నట్లు నిరూపితమైందని ఆయన తెలిపారు. (ఇతర వివరాలకు.. టోల్‌ఫ్రీ నంబర్ 1800 121 2842) త్వరలో వంగకు కత్తెర పురుగుకు కూడా.. ప్రస్తుతానికి పత్తిలో గులాబీ పురుగును నియంత్రించేందుకు పేస్ట్‌ను రైతులకు అందుబాటులోకి తెచ్చాం. వంగ తోటల్లో కాయ/కాండం తొలిచే పురుగుల నియంత్రణకు ప్రత్యేక పేస్ట్‌ను కేంద్ర ప్రభుత్వ అనుమతుల తర్వాత 2–3 నెలల్లో విడుదల చేయబోతున్నాం. ఇది అందుబాటులోకి వస్తే వంగ రైతులకు పురుగు మందుల ఖర్చు, శ్రమ గణనీయంగా తగ్గుతుంది. అంతేకాక వినియోగదారులు పురుగుమందు అవశేషాలు లేని వంకాయలను తినటం సాధ్యమవుతుంది. ఇప్పటికే పండ్లు/కూరగాయ తోటల్లో నష్టం చేస్తున్న పండు ఈగను ఆకర్షించి చంపే జెల్ ల్యూర్ అందుబాటులో ఉంది. శ్రీ కొండా లక్షణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, ఉద్యాన శాఖ దీనిపై అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. మొక్కజొన్న సహా అనేక పంటలకు నష్టం చేస్తున్న కత్తెర పురుగు నియంత్రణకు వినూత్న పద్ధతి త్వరలోనే అందుబాటులోకి రానుంది. వీటి తయారీలో ఎలాంటి జన్యుమార్పిడి సాంకేతికతను వాడటం లేదు. రైతులు ఈ సాంకేతిక పద్ధతిని పురుగు ఉదృతి పెరిగినాక కాకుండా ముందు జాగ్రత్తగా వినియోగించాల్సి ఉంటుంది. ఒక ప్రాంతంలో రైతులు కలసి వాడితే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయి. – డా. విజయ భాస్కర్ రెడ్డి, ఎటిజిసి బయోటెక్ సహ–వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి, జీనోమ్ వ్యాలీ, హైదరాబాద్. (చదవండి: -
సంస్కారవంతమైన నగరం!
మెక్సికో దేశపు రాజధాని మెక్సికో నగరం. కిక్కిరిసిన కాంక్రీట్ జంగిల్. అధిక జనసాంద్రత. మెట్రోపాలిటన్ ప్రాంత జనాభా 2.3 కోట్లు. సుదీర్ఘ చరిత్ర కలిగిన పురాతన నగరం. వలస పాలనకు ముందు ఇది అజ్టెక్ సామ్రాజ్యపు రాజధాని. నగరం చుట్టూతా లోతు తక్కువ మంచినీటి సరస్సులు, చిత్తడి నేలలు ఉన్నాయి. వీటి మధ్యలో మానవ నిర్మిత ద్వీపాలలో అనాదిగా సంప్రదాయ వ్యవసాయం జరుగుతోంది. ఈ వ్యవసాయక ద్వీప క్షేత్రాలను ‘చినాంపాస్’ అని పిలుస్తారు. వీటిని 2014లో మెక్సికో మెట్రోపాలిటన్ నగర పరిధిలోకి చేర్చారు. నగరం మొత్తం భూభాగంలో సుమారు 27.7%లో వ్యవసాయం విస్తరించింది. ఇందులో 99% విస్తీర్ణం చినాంపాస్లే ఆక్రమిస్తాయి. 5.10 లక్షల టన్నుల ఆహారోత్పత్తులను రైతులు పండిస్తున్నారు. నగరం లోపల జనావాసాల మధ్య ఇంటిపంటలు, కమ్యూనిటీ గార్డెన్లు, గ్రీన్ హౌస్‌లు, హైడ్రోపోనిక్ వ్యవస్థలు, మిద్దె తోటలు, నిలువు తోట(వర్టికల్ గార్డెన్స్)లు సాగవుతున్నాయి. వీటిలో నగరవాసులు 24.7 టన్నుల కూరగాయలు, పండ్లను ఏటా ఉత్పత్తి చేస్తున్నట్లు గత ఏడాది జరిగిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ, ఈస్ట్ చైనా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గ్వాటెమాలా స్కూల్ ఆఫ్ సోషల్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నిపుణులు ఉమ్మడిగా గత ఏడాది 75 అర్బన్ గార్డెన్లపై విస్తృత అధ్యయనం చేశారు. అర్బన్ గార్డెన్లలో పండించిన సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు ప్రజల ఆహారాన్ని మెరుగుపరచి ఆహార భద్రతను పెంపొందించాయి. ఆరోగ్యాన్ని మెరుగుపరచాయి. కొందరు అర్బన్ రైతులకు ఈ పంటల అమ్మకాలే జీవనాధారంగా మారాయి. ఔషధ, సుగంధ మూలికలు మెక్సికో ప్రజల సంప్రదాయ వైద్యంలో, ఆహార సంస్కృతిలో అంతర్భాగం. ఇప్పటి ఇంటిపంటల్లోనూ వీటికి పెద్ద పీట ఉందని అధ్యయనవేత్తలు తెలిపారు. సేంద్రియ ఇంటిపంటల సాగును వ్యాప్తిలోకి తేవటంలో ఇతర దేశాల్లో మాదిరిగానే మెక్సికో నగరంలో కూడా దశాబ్దాలుగా అనేక స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలు ముందంజలో ఉన్నాయి. ఈ కోవలోకి చెందినదే ‘కల్టివా సియుడాడ్’ కూడా. ఈ స్పానిష్ మాటలకు అర్థం ‘సంస్కారవంతమైన నగరం’. పేరుకు తగ్గట్టుగానే ఇది పనిచేస్తోంది. సేంద్రియ ఇంటిపంటలు, సామూహిక ఇంటిపంటల సంస్కృతిని వ్యాపింపజేయడానికి కృషి చేస్తోంది. ఆకాశ హర్మ్యాల నడుమ 1,650 చదరపు మీటర్ల స్థలంలో కల్టివా సియుడాడ్ కమ్యూనిటీ కిచెన్ గార్డెన్ పచ్చగా అలరారుతోంది. పట్టణ వ్యవసాయాన్ని విద్య, ఉత్పత్తి/ఉత్పాదక, చికిత్సా సాధనంగా ఉపయోగించడం దీని లక్ష్యం. సృజనాత్మకత ఉట్టిపడే ఎతైన మడుల్లో ఆకుకూరలు, కూరగాయలతో పాటు 135 జాతుల పండ్లు, ఇతర చెట్లతో ఈ ఆహారపు అడవి నిర్మితమైంది. పండించిన ఉత్తత్తుల్లో.. తోట పనిలో సాయపడిన వాలంటీర్లకు 30% ఇచ్చారు. 28% పొరుగువారికి తక్కువ ధరకే అమ్మారు. 34% రెస్టారెంట్లకు అమ్మారు. పేదలకు ఆహారాన్నందించే కమ్యూనిటీ సూప్ కిచెన్లకు కూడా కొంత భాగాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ విధంగా స్వీయ సహాయక ఉద్యాన తోటల పెంపకం ద్వారా మెక్సికో ‘సంస్కారవంతమైన నగరం’గా రూపుదాల్చింది! సామాజిక పరివర్తన సాధనం అర్బన్ అగ్రికల్చర్ ప్రభావశీలమైన సామాజిక పరివర్తన సాధనం. ఆహార సార్వభౌమాధికారం, ఆహార భద్రతల సాధనకు.. అలాగే వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికీ ఇదొక వ్యూహం. 12 ఏళ్లుగా మా కమ్యూనిటీ కిచెన్ గార్డెనింగ్ అనుభవం చెబుతోంది ఇదే. వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా మార్చి సారవంతమైన మట్టిని ఉత్పత్తి చేయడానికి, పోషకాల సాంద్రత కలిగిన కూరగాయలను పండించడం.. పంటలు, జంతువులు, పక్షుల జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం, ఉష్ణోగ్రతలను తగ్గించడంతో పాటు అంతస్తులకు అతీతంగా భుజం భుజం కలిపి పనిచేసేందుకు నగరవాసులకు సేంద్రియ ఇంటిపంటలు ఉపయోగపడుతున్నాయి. – గాబ్రిలా వర్గాస్ రొమెరో, ‘కల్టి సియుడాడ్’ డైరెక్టర్, మెక్సికో నగరం -
జాడలేని జిల్లేడు.. కానరాని తంగేడు
సాక్షి, హైదరాబాద్: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనేది నానుడి. నాగజెముడు..తంగేడు..కుంకుడు.. జిల్లేడు..ఉమ్మెత్త.. తిప్పతీగ..మునగ.. కరివేపాకు..వేప.. ఇవి కూడా మనిషికెంతో మేలు చేస్తాయి. ఇప్పుడంటే ఆధునిక వైద్యం అంతటా అందుబాటులోకి వచ్చింది కానీ ఒకప్పుడు ప్రతి ఇంటి పెరట్లో ఉండే ఇలాంటి మొక్కలు, చెట్లపైనే ఆధారపడి పల్లె ప్రజలు ప్రాణాలు కాపాడుకునేవారు. ప్రాణం మీదకొచ్చే జబ్బైతే తప్ప ఓ మోస్తరు అనారోగ్యం నుంచి బయటపడేందుకు ఆకు పసర్లే ఉపయోగించేవారు. వాటి మీదే ఆధారపడి జీవించేవారంటే అతిశయోక్తి కాదు. రెండు, మూడు దశాబ్దాల క్రితం వరకు పెరట్లో ఈ తరహా ఔషధ గుణాలున్న మొక్కలు, చెట్లు కన్పించేవి. ఇప్పుడు పల్లెల్లో కూడా జీవనశైలి మారిపోయింది. సంప్రదాయంగా వైద్యానికి వాడే పెరటి మొక్కల పెంపకం 80 శాతం పడిపోయింది. ఏ ఇంటి పెరట్లో అయినా ఇలాంటి మొక్క ఒకటి కన్పిస్తే అది నిజంగా వింతే. పెరటి వైద్యం అంటే ఏమిటో కూడా నేటి యువతరానికి తెలియని దుస్థితి ఏర్పడింది. ముఖ్యంగా నాగజెముడు, తంగేడు, జిల్లేడు, కుంకుడు, ఉమ్మెత్త లాంటివి ఎక్కడో తప్ప కన్పించకుండా పోయాయి. అయితే కోవిడ్ తదనంతర కాలంలో మొక్కలపై కాస్త మక్కువ పెరిగింది. కుండీల్లోనైనా ఇతర మొక్కలతో పాటు ఒకటో రెండో ఔషధ మొక్కలు పెంచాలనే ఆరాటం మొదలైంది. ఈ మక్కువ విస్తరించాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. మాయమైన మన పెరటి మొక్కల గురించి పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు. ‘ఊపిరిపోసే’ నాగజెముడు పెరట్లో ముఖ్యంగా పొలాల వెంట ముళ్ళ పొదల్లా ఉండే నాగజెముడు ఇప్పుడు మచ్చుకైనా కన్పించడం లేదు. పల్లె జనం ఆధునిక వైద్యానికి అలవాటు పడి దీని ప్రాధాన్యతను గుర్తించడం లేదు. నిజానికి ఈ తరానికి ఈ మొక్క ఎలా ఉంటుందో కూడా తెలియదు. నాగజెముడు పూలను ఆస్తమా తగ్గించేందుకు, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులకు వాడతారు. చర్మ వ్యాధులకు ఉమ్మెత్త ఉమ్మెత్త పరిస్థితి కాస్త నయం. ముళ్ళ కాయలతో పెరట్లో కన్పించే దీన్ని ప్రజలింకా పూర్తిగా మరిచిపోలేదు. ఇప్పటికీ అక్కడక్కడా గ్రామాల్లో కన్పిస్తోంది. కానీ ఈ మొక్కను కార్పొరేట్ ఆయుర్వేద వైద్యం విస్తృతంగా అభివృద్ధి చేస్తోంది. ఔషధ రూపంలో ప్రతి ఊరూ వెళ్ళిన ఈ మొక్క.. పెరట్లో ఉన్నా పల్లె జనం దీని విలువ తెలుసుకోవడం లేదు. ఉమ్మెత్త ఆకులు, కాయలను చర్మవ్యాధులకు బాగా వాడతారు. దీర్ఘకాల చర్మ వ్యాధులను సైతం తగ్గించే గుణం దీని సొంతం. ఇంత మంచి గుణాలున్న మొక్క మరో ఆరేళ్ళ తర్వాత పల్లెల్లో కన్పించదని వృక్ష శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చక్కెర స్థాయి తగ్గించే తంగేడు తంగేడు తాతల కాలం నుంచి తెలిసిన మొక్క. చిన్న చిన్న పసుపు వన్నె పూలు దీని ప్రత్యేకత. బ్రష్‌లు, పేస్టులు లేని రోజుల్లో వేపతో పాటు తంగేడు పుల్లలతో కూడా పళ్లు తోముకునేవారు. మధుమేహం వ్యాధికి దీన్ని మించిన మందులే లేవని పరిశోధనల్లో తేలింది. బతుకమ్మ పండుగొచ్చి తంగేడును కాస్త బతికించింది కానీ.. లేకపోతే ఈ చెట్టూ మనకు కన్పించనంత దూరంగా వెళ్ళేది. ఆయుర్వేద వనమూలికల్లో తంగేడు కీలక పాత్ర పోషిస్తోంది. దీన్ని మళ్ళీ పల్లె దరికి చేర్చాల్సిన అవసరం ఉందని అంటున్నారు. షాంపూలు రాకముందు కుంకుడే.. కుంకుడు కాయ.. ఇప్పుడు సూపర్ మార్కెట్లో అందమైన ప్యాకెట్‌గా కన్పించే వస్తువైంది. కానీ ఒకప్పుడు ప్రతి ఊళ్ళో విరివిగా ఈ చెట్లు ఉండేవి. షాంపూలు రాకముందు వరకు కుంకుడు రాజసానికి ఏ మాత్రం దెబ్బ తగల్లేదు. కుంకుడు రసం వాడినంత వరకు కేశాల వన్నె తగ్గలేదు. మంచి ఔషధ గుణాలున్న చెట్టును కార్పొరేట్ కంపెనీలు ఆయుర్వేదం పేరుతో అభివృద్ధి చేస్తున్నాయి. పల్లెల్లో ఎవరికీ పట్టని కుంకుడు క్రమంగా పల్లె వాకిటి నుంచి కార్పొరేట్ ఫామ్‌లకు వెళ్తోంది. పొలాలకు ‘రక్షణ కంచె’ మంగళగిరి కంచె.. ఈ మొక్క గురించి చాలామందికి తెలియదు. సుమారు ఇరవై ఏళ్ళ క్రితం వరకు చాలా పల్లెల్లో ఇంటి పెరట్లో, పొలం గట్టుపై కన్పించిన మొక్క ఇది. కార్బన్–డై–ఆక్సైడ్‌ను నియంత్రించడంలో దీనికో ప్రత్యేకత ఉంది. పంట పొలాల్లో మొక్కలకు హాని చేసే క్రిమి కీటకాలను అదుపు చేస్తుంది. చిన్న మొక్క వేస్తే చాలు పొలం చుట్టూ రక్షణ కవచంలా అల్లుకుపోయే ఈ మొక్క... ఇనుప కంచెల ఆవిర్భావంతో కనుమరుగైంది. ఈ మొక్కపై విస్తృత పరిశోధనలు జరిగి దీని ప్రాధాన్యత విశ్వవ్యాప్తమైనా.. మన దగ్గర ఎవరికీ తెలియనంతగా కనుమరుగైపోయింది. ఇతర దేశాల్లో మాత్రం ఈ మొక్క పెంపకాన్ని బాగా ప్రోత్సహిస్తున్నారు. కాల గర్భంలో ఎన్నో.. విరిగిన ఎముకలు కట్టుకోవడానికి వాడే నల్లేరు.. కఫంతో ఊపిరి ఆగిపోయే పరిస్థితి నుంచి కాపాడే కరక్కాయ.. ప్రాణం పోయేలా అన్పించే తలనొప్పిని తగ్గించే సొంఠి.. కురుపు ఏదైనా ఆకుతోనే నయం చేసే జిల్లేడు.. చర్మవ్యాధుల పనిబట్టే మారేడు.. సర్వ రోగ నివారిణి తులసి..ఇలాంటివెన్నో మనకు కన్పించకుండా పోతున్నాయి. ఇవీ నిజాలు.. ►వృక్ష శాస్త్రవేత్తలు ఇప్పటివరకు 3.5 లక్షల మొక్క జాతులను గుర్తించారు. ఇందులో 2.78 లక్షల మొక్కలపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరిగాయి. వాటి ఔషధ గుణాలు గుర్తించారు. ఇప్పటికే 1.26 లక్షల మొక్క జాతులను వివిధ రూపాల్లో వాడుకుంటున్నారు. ►30 ఏళ్ళ క్రితం గ్రామీణ ప్రాంతాల్లో 2 లక్షల మొక్క జాతులు ఉన్నాయి. ఇవి ఇప్పుడు 80 వేల లోపే ఉన్నాయి. ►పెరటి వైద్యం 30 ఏళ్ళ క్రితం వరకూ 92 శాతం ఉండేది. ఏదో ఒక మొక్కతో వ్యాధిని నయం చేసుకునే వాళ్ళు. ఇప్పుడు కేవలం 12 శాతమే పెరటి వైద్యాన్ని నమ్ముతున్నారు. అయితే కరోనా వచ్చిన తర్వాత ఇది 21 శాతానికి పెరిగింది. ►పల్లెల్లో పెరటి వైద్యంగా వాడిన మొక్కల్లో 20 జాతులు ప్రస్తుతం ఆయుర్వేద ముందుల రూపంలో విస్తృతంగా అందుబాటులోకి వస్తున్నాయి. కొన్ని కార్పొరేట్ కంపెనీలు దాదాపు రూ.2 వేల కోట్లతో వీటిని పెంచుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మన దేశంలోని 82 రకాల ఔషధ మొక్కల ను వాణిజ్యపరంగా అభివృద్ధి చేస్తున్నారు. -
‘సోలో స్టవ్ టవర్’..చలి భయమే అక్కర్లేదు
‘సోలో స్టవ్ టవర్’.. ఇది ఔట్‌డోర్ హీటర్. చలికాలంలో ఆరుబయట పిక్నిక్లు వంటివి జరుపుకోవాలంటే, వణికించే చలికి జంకుతారు చాలామంది. ‘సోలో స్టవ్ టవర్’ వెంట ఉంటే ఆరుబయట చలి భయమే అక్కర్లేదు. ఎక్కడికైనా దీనిని తేలికగా తీసుకుపోవచ్చు. ఆరుబయట పిక్నిక్ పార్టీలు చేసుకునే చోట దీనిని వెలిగించుకుంటే చాలు, నిమిషాల్లోనే పరిసరాలను వెచ్చబరుస్తుంది. దీనిని వెలిగించిన మూడు నిమిషాల్లోనే పదడుగుల వ్యాసార్ధం పరిధిలోని పరిసరాలను వెచ్చబరుస్తుంది. దీనిలోకి ఇంధనంగా కలప పొట్టుతో తయారైన ‘వుడెన్ పెల్లెట్స్’ వాడాల్సి ఉంటుంది. అమెరికన్ కంపెనీ ‘సోలో స్టవ్’ ఈ టవర్ హీటర్‌ను ఇటీవల మార్కెట్లోకి తెచ్చింది. దీని ధర 1000 డాలర్లు (రూ.82 వేలు) మాత్రమే! -
Miniature Garden: టీ కప్పులో వనాలు పెంచండిలా!
వేసవి అనగానే పచ్చదనంతో నిండిన చల్లదనాన్ని ఆస్వాదించాలనుకుంటాం. అపార్ట్మెంట్ సంస్కృతి వచ్చాక అందుకు తగినట్టు ఇండోర్ ప్లాంట్స్కి ఎక్కువ ప్రాముఖ్యం పెరిగింది. ఒకే విధంగా ఉండే ప్లాంట్స్ కళను కొంచెం భిన్నంగా మార్చాలనుకునేవారికి కప్పులో మొక్కల పెంపకం బెస్ట్ ఐడియా అవుతుంది. ఇంటి అలంకరణలో కొత్తదనం నింపుతుంది. వినడానికి కొంచెం విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. టీ కప్పుతో ఇంటి అలంకరణ మినియేచర్ గార్డెన్గానూ అలరారుతోందిప్పుడు. రీ సైక్లింగ్ కప్స్: రకరకాల డిజైన్లలోని పింగాణీ కప్పులు చూడగానే ఆకట్టుకుంటాయి. వాడి వాడి కొన్ని డిజైన్స్ కళ మారుతాయి. మరికొన్ని కప్పులు విరిగిపోతాయి. అప్పుడు వీటిని పడేయకుండా గ్లూతో అతికించి, మట్టి పోసి, మొక్కలను పెట్టొచ్చు. తక్కువ ఎండ తగిలే చోట ఈ కప్పు ప్లాంట్‌ను సెట్ చేస్తే చూడటానికి ఆకర్షణీయంగానూ ఉంటుంది. గది అలంకరణలో కొత్త మార్పూ చోటుచేసుకుంటుంది. ఫ్రేమ్ కప్ ప్లాంట్: రీస్లైకింగ్ కప్స్‌ని ఒక ఫ్రేమ్‌కి సెట్ చేసి గోడకు హ్యాంగ్ చేయొచ్చు. లేదంటే ఆ కప్పుల్లో చిన్న చిన్న మొక్కలను అలంకరించి, అప్పుడప్పుడు నీళ్లు స్ప్రే చేస్తే.. పచ్చదనంతో నిండిన వాల్ మనసును ఆహ్లాదపరుస్తుంది. మినియేచర్ గార్డెన్: పెద్ద పెద్ద వనాల్ని ఇలా చిన్న చిన్నకప్పుల్లో సృష్టించడమే మినియేచర్ గార్డెన్. ఈ క్రియేషన్ కోసం ఆర్ట్ లవర్స్ ప్రత్యేక క్లాసులు కూడా తీసుకుంటుంటారు. టేబుల్ డెకొరేషన్ కప్స్: డైనింగ్ టేబుల్ని అందంగా అలంకరించడానికి çపువ్వులతో నిండిన ఫ్లవర్‌వేజ్‌ని ఉంచుతారు. కొత్త ట్రెండ్.. కప్ ప్లాంట్‌ని టేబుల్ అలంకరణకు వాడచ్చు. డైనింగ్ టేబుల్‌పైనే కాదు సెంటర్ టేబుల్స్, రీడింగ్ టేబుల్స్‌పై కూడా టీ కప్–సాసర్ ప్లాంట్స్ చూడముచ్చటగా ఉంటాయి. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్: టీ కప్పుల్లో మొక్కలను పెంచేంత ఓపికలేని వారు ఆర్టిఫీషియల్ లేదా కాగితం పూల తయారీతోనూ అలంకరించవచ్చు. పర్యావరణహితంగా ఆలోచించేవారు నిరుపయోగంగా ఉన్న ప్లాస్టిక్ వస్తువులకు రీసైక్లింగ్ పద్ధతిలో కొత్త మెరుగులు దిద్దవచ్చు. ఇది పిల్లలకు వేసవి క్లాస్‌గానూ ఉపయోగపడుతుంది. Upma Bonda Recipe In Telugu: ఉప్మా మిగిలిపోయిందా.. ఇలా రుచికరమైన బోండాలు చేసుకోండి! -
పెరటింట..ప్రకృతి తోట
సాక్షి ప్రతినిధి, కడప: ప్రకృతి వ్యవసాయంలో వ్యవసాయ పంటలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం ఇటు కూరగాయల పంటలకు అంతే ప్రాధాన్యం ఇస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఒక సెంటు నుంచి ఐదు సెంట్ల ఖాళీ జాగాల్లో కిచెన్ గార్డెన్స్, ఇంటి ఆవరణలో న్యూట్రి గార్డెన్స్, ఇంటిపైన టెర్రస్ గార్డెన్స్ పేరుతో పలు రకాల కూరగాయల పంటలను ప్రోత్సహిస్తోంది. దీనిపై ప్రజలకు విస్తృత ప్రచారం కల్పిస్తోంది. ఇందుకోసం నాణ్యమైన విత్తనాలను సరఫరా చేస్తోంది. ప్రకృతి వ్యవసాయంలో పెరటి తోటలు హైబ్రీడ్ విత్తనాలు, రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకానికి స్వస్తి పలికి ప్రభుత్వ సూచనలతో ప్రకృతి వ్యవసాయంవైపు మొగ్గుచూపుతున్న రైతులు అదే సమయంలో ఈ విధానంలో కూరగాయల పంటల సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. రైతులే కాకుండా భూములు లేని ప్రజలు సైతం తమ ఇళ్ల వద్దనే కొద్దిపాటి స్థలంలో ప్రకృతి వ్యవసాయంలో కూరగాయల సాగుకు సిద్ధమవుతున్నారు. జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు విభాగం సలహాలు, సూచనలతో ఈ తరహా వ్యవసాయానికి వేలాది మంది ఇప్పటికే ›శ్రీకారం చుట్టారు. కొందరు పంట పొలాల్లోనే ఇతర పంటలతోపాటు కూరగాయలు పండిస్తుండగా చాలామంది ఇళ్ల వద్దనే కూరగాయలు సాగు చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ విభాగం గణాంకాల ప్రకారం జిల్లాలో ఇప్పటివరకు 75,452 కిచెన్ గార్డెన్స్ ఏర్పాటయ్యాయి. ఇందులో భూమి లేని పేదలు 24,399 మంది తమ ఇళ్ల వద్దనే ఉన్న ఖాళీ స్థలంలో నేచురల్ ఫార్మింగ్ ద్వారా పలు రకాల పంటలు సాగు చేస్తున్నారు. ఇక నూట్రిగార్డెన్స్ 274 ఉండగా, 186 టెర్రస్ గార్డెన్స్ ఉన్నాయి. ఇవన్నీ కేవలం పకృతి వ్యవసాయం పద్ధతిలో సాగు చేస్తున్న ప్లాంట్లు కావడం గమనార్హం. వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలోని బద్వేలు, కమలాపురం, పులివెందుల, మైదుకూరు, రాయ చోటి, రైల్వేకోడూరు, రాజంపేట నియోజకవర్గాలతోపాటు పలు నియోజకవర్గాల్లో గ్రామగ్రామాన నేచురల్ ఫార్మింగ్ కిచెన్ గార్డెన్స్‌ను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగ ప్రాజెక్టు కృషి చేస్తోంది. ఈ విభా గం పరిధిలోని మాస్టర్ ట్రైనర్స్, ఇంటర్నల్ కమ్యూనిటీ సోర్స్ పర్సన్స్, నేచురల్ ఫార్మింగ్ అసోసియేట్స్ తదితర విభాగాల్లో పనిచేస్తున్న వారు గ్రామాల్లోని గ్రామ సంఘాల ద్వారా అక్కడి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కిచెన్ గార్డెన్స్, న్యూట్రి గార్డెన్స్, టెర్రస్ గార్డెన్స్‌లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే గార్డెన్స్ ఏర్పాటు చేసిన వారు 15–30 రకాల కూరగాయలు, ఆకుకూరలు, క్యారెట్, బంగాళాదుంప, ఉల్లిపాయలు తదితర వాటిని ఈ తరహా వ్యవసాయం ద్వారా సాగు చేస్తున్నారు. ప్రత్యేకంగా పురుగు మందులు ఇక పంటలకు సోకిన తెగుళ్లను నివారించేందుకు నీళ్లలో వేపాకు పిండి, పేడ, కుంకుడు కాయల పొడి తదితర వాటిని కలిపి వడగట్టి దోమపోటుతోపాటు ఇతర తెగుళ్లకు పిచికారీ చేస్తున్నారు. రసాయనిక ఎరువులు,పురుగు మందులు లేకుండా.. రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా కిచెన్గార్డెన్స్ను నిర్వహిస్తున్నారు.పోషకాహారం ఎరువు స్థానంలో ఘన జీవామృతం పేరుతో పేడ, పప్పుదినుసులు పిండి, నల్లబెల్లం, పుట్టమట్టి, ఆవు లేదా ఇతర పశువుల మూత్రం కలిపి ఘన జీవామృతాన్ని, ఇదే వస్తువులను నీటిలో కలిపి జీవామృతం పేరుతో డ్రిప్ లేదా స్ప్రింకర్ల ద్వారా ఎరువుగా పంటకు అందజేస్తున్నారు. ఆరోగ్యమే ప్రధానం ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిన నాణ్యమైన కూరగాయలు, ఆకుకూరలు తినడం వల్ల విటమిన్స్, మినరల్స్ అధికంగా పొందే అవకాశం ఉంటుంది. తద్వారా అనారోగ్యం దరిచేరకుండా ఉంటుంది. రసాయనిక ఎరువులు, పురుగు మందులు లేని కలుషిత రహిత ఆహారం తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని గార్డెన్స్ ఏర్పాటు చేసిన వారు పేర్కొంటున్నారు. కిచెన్ గార్డెన్స్‌లో పండించిన ఉత్పత్తులను అమ్ముకుంటూ ఇంటి ఖర్చులను పూడ్చుకుంటున్నట్లు పలువురు పేర్కొంటుండడం గమనార్హం. విటమిన్స్, మినరల్స్ లభ్యమవుతాయి ప్రకృతి వ్యవసాయం ద్వారా ప్రతి ఒక్కరూ కూరగాయల పంటలు పండించేలా చూస్తున్నాం. ఇంటిపైన ఖాళీ స్థలంలోనూ టెర్రస్ గార్డెన్స్ పేరుతో కూరగాయలు సాగు చేయిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే కూరగాయలు తినడం వల్ల విటమిన్స్, మినరల్స్ లభ్యమవుతాయి. తద్వారా ఆరోగ్యం బాగుంటుంది. అందుకే అందరినీ ప్రోత్సహిస్తున్నాం. – సంధ్య, మాస్టర్ ట్రైనర్, హెల్త్, న్యూట్రిషియన్, కడప ప్రకృతి వ్యవసాయంతోనే కూరగాయలు పండిస్తున్నాం మా ఇంటి వద్ద ఐదు సెంట్ల ఖాళీ స్థలంలో అన్ని రకాల కూరగాయలు, క్యారెట్, ఇతర వాటిని కూడా పండిస్తున్నాం. తోట పెట్టి నాలుగు నెలలైంది. మేము ఆరోగ్యకరమైన కూరగాయ లు తినడమే కాకుండా మిగిలిన వాటిని అమ్ముతున్నాం. రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా ఎరువులు, జీవామృతం తదితర వాటితో కూరగాయలు పండిస్తున్నాం. –సునీత, సింగరాయపల్లె, కలసపాడు మండలం పెద్ద ఎత్తున పెరటి తోటల పెంపకం జిల్లాలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పెద్ద ఎత్తున పెరటి తోటల పెంపకాన్ని చేపట్టారు. ఇప్పటివరకు 75 వేలకు పైగా కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు చేశాం. రైతులతోపాటు ఇళ్ల వద్ద తోటల పెంపకానికి మొగ్గుచూపే ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. నాణ్యమైన విత్తనాలు అందిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయ విధానంలో కూరగాయలు, పండించుకుని తినడం వల్ల ఆరోగ్యానికి ఉపయోగకరం. – రామకృష్ణరాజు, డీపీఎం,ప్రకృతి వ్యవసాయం,కడప -
ఉద్యానకేంద్రంగా అన్నమయ్య జిల్లా
అన్నమయ్య జిల్లాలో విస్తారంగా పండ్లతోటలు సాగవుతున్నాయి. మామిడి,చీనీ, అరటి,టమాట,బొప్పొయి, కర్బూజ సాగుపై రైతులు మక్కువ చూపుతున్నారు. పండ్లతోటల పెంపకానికి ఉపాధినిధులు తోడ్పాటు అందిస్తున్నాయి. ఉద్యానకేంద్రంగా జిల్లా విరాజిల్లనుంది. బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లా పండ్లతోటలకు కేరాఫ్‌గా మారనుంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఉద్యానపంటల సాగుతో ప్రత్యేక గుర్తింపు కూడా దక్కించుకోనుంది. రాష్ట్రంలోని అన్నిజిల్లాల్లో ఉద్యానవన పంటల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. ఇందులో జిల్లాకు రెండో స్థానం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా లెక్కల ప్రకారం జిల్లాలో 75,731 హెక్టార్లలో ఉద్యానవన పంటలు సాగులో ఉన్నాయి. ఇందులో మామిడి, టమాట ఒకటి, రెండుస్థానాల్లో ఉండగా అన్ని ఉద్యాన పంటల సాగు సమాహారంగా జిల్లాకు గుర్తింపు వచ్చింది. తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు నియోజక వర్గాల్లో టమాట సాగు ప్రథమస్థానంలో ఉంది. మామిడి జిల్లా అంతటా విస్తరించింది. అరటి, పసుపు, బత్తాయి, నిమ్మ తోటలు రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరులో సాగులో ఉన్నాయి. మొత్తమ్మీద అన్ని రకాల పంటలు జిల్లాలో సాగవుతున్నాయి. టమాట కేరాఫ్ తంబళ్లపల్లె టమాట సాగులో తంబళ్లపల్లె నియోజకవర్గానిదే అగ్రస్థానం. దశాబ్దాలుగా దీనిపైనే రైతులు ఆధారపడ్డారు. ప్రత్యామ్నయ పంటలవైపు వెళ్లడం లేదు. తంబళ్లపల్లె తర్వాత మదనపల్లె, పీలేరు నియోజకవర్గాల్లో టమాట సాగువుతోంది. ఉద్యానవన పంటల్లో ఈ మూడు నియోజకవర్గాల్లో టమాటనే అధికం. రాయచోటి, చిన్నమండెం, గాలివీడు ప్రాంతాల్లో కొద్దిపాటి కనిపిస్తుంది. జిల్లాలో మిగిలిన ప్రాంతాల్లో టమాట సాగు కనిపించదు. ఈ ప్రాంతాల్లో కట్టెలతో టమాటను సాగు చేస్తారు. దిగుబడి ఎలా ఉన్నా వీటి ధరలు నిలకడగా ఎప్పుడూ ఉండవు. అయినప్పటికీ రైతులు దీని సాగును వదలరు. ఇదే పంటతో కోట్లకు పడగలెత్తిన రైతులు లేకపోలేదు. తర్వాత మామిడితోటల పెంపకం ఉంది. పండ్లతోటలకు అందే ఉపాధి సహయం మామిడికి రూ.1,02,756, జీడిమామిడికి రూ.94,019, బత్తాయికి రూ.1,05,521, అసిడ్లైమ్కి రూ.1,41,515, నాటుజామకి రూ.1,41,784, తైవాన్జామకి రూ.2,30,023, సపోటకి రూ.88,255, కొబ్బరికి రూ.88,821, సీతాఫలంకి రూ.1,70,603, దానిమ్మకి రూ.2,48,845, నేరేడుకి రూ.18,124, చింతకి రూ.89,120, ఆపిల్బేర్కి రూ.1,06,962, డ్రాగన్ప్రూట్కి రూ.1,79,626, గులాబీకి రూ.1,92,500, మల్లెకి రూ.1,09,672, మునగకు రూ.1,01,541లు ప్రభుత్వం పూర్తి రాయితీగా అందిస్తోంది. ఈ పండ్లతోటలకు మంజూరైన ఉపాధి నిధుల రాయితీ సొమ్మును పంటల సాగునుబట్టి రెండు, మూడేళ్లపాటు అందించడం జరుగుతుంది. పోలాల్లో గుంతలు తవ్వి, మొక్కలు నాటి, సంరక్షణ, పంటల దిగుబడి వచ్చే వరకు రాయితీని విడతల వారీగా అందిస్తారు. ఇది పండ్ల రైతాంగానికి ఎంతో ప్రయోజనకరం. అరటికి కేరాఫ్ ఇవే జిల్లాలో అత్యధికంగా సాగయ్యే మూడో పంట అరటి. రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె, పుల్లంపేట, చిట్వేలి, రాజంపేటలో మాత్రమే ఈ పంట సాగు చేస్తున్నారు. బొప్పాయిని పెనగలూరు కలుపుకొని పై ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. ఈ పంటల సాగులో 95శాతం వాటా ఈ ప్రాంతాలదే. పసుపు అక్కడక్కడ సాగవుతోంది. మామిడితోటల పెంపకం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ జరుగుతోంది. రెండోస్థానంలో జిల్లా పండ్లతోటల పెంపకంలో అన్నమయ్య జిల్లా రెండోస్థానంలో ఉండనుంది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో సాగులోని ఉద్యానవన పంటల సాగు వివరాలను సేకరిస్తున్నారు. అనంతపురంజిల్లా మొదటిస్థానంలో ఉండే అవకాశం కనిపిస్తోంది. జిల్లాకు రెండవ స్థానం దక్కితే పండ్లతోటలకు నిలయంగా మారినట్టే. దీనికి ప్రభుత్వ ప్రోత్సాహం అధికంగా ఉంటుంది. –రవీంద్రనాధ్‌రెడ్డి, జిల్లా ఉద్యానవన అధికారి, రాయచోటి ఐదెకరాలలోపు భూమి కలిగిన రైతులకు రాయితీ పండ్లతోటల పెంపకం కోసం ఉపాధి రాయితీని ప్రభుత్వం వర్తింపజేస్తోంది. ఒక మొక్కకు నీరుపోసినందుకు రూ.17, సంరక్షణకు రూ.10 చొప్పున నెలకు రూ.27 చెల్లిస్తాం. జాబ్‌కార్డు, ఐదెకరాలోపు భూమి కలిగిన ప్రతి రైతు రాయితీ పొందడానికి అర్హులు. రైతులు సద్వినియోగం చేసుకొని పండ్లతోటల పెంపకంతో ఆదాయం పొందాలి. ఈ పంటలసాగుతో కొన్నేళ్లపాటు ఆదాయం పొందవచ్చు. –ఎస్.మధుబాబు, డ్వామా ఏపీడీ, ములకలచెరువు -
రిక్షాలో మినీ గార్డెన్...ఫోటోలు వైరల్
Man Converts Rickshaw Into Mini Garden: పర్యావరణ కాలుష్యం నుంచి రక్షించుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సైతం ముందుకు వచ్చి రకరకాలుగా విన్నూతన పద్ధతుల్లో మొక్కలు పెంచే కార్యక్రమాలను చేపట్టారు. అంతేకాకుండా స్థలం లేకపోయిన ప్రజలు మొక్కలు ఎలా పెంచుకోవచ్చు వంటివి చెప్పి మరీ పంచేలా ప్రోత్సహిస్తున్నారు. ప్రజలు కూడా మిద్దే తోటని, వాల్ గార్డినింగ్ అని తమకు తోచిన రీతిలో మొక్కలను పెంచేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే వాటన్నింటిని కాలదన్నేలా ఇక్కడొక వ్యక్తి విన్నూతన రీతిలో మొక్కలను పెంచి ఔరా అనిపించుకున్నాడు. వివరాల్లోకెళ్తే...ఇక్కడొక వ్యక్తి తన రిక్షానే మినీగార్డెన్‌గా మార్చేశాడు. రిక్షాని చక్కని పూల మెక్కలు, పచ్చదనంతో నింపేశాడు. అంతేకాదు రిక్షాలో చిన్న చిన్న పూలకుండీలను కూడా ఏర్పాటు చేశాడు. ఈ మేరకు ఆ వ్యక్తి రిక్షాకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అవి కాస్త యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోల్‌హీమ్‌ని తెగ ఆకర్షించాయి. ఆయన ట్విట్టర్లో ...ఈ భారతీయుడు ఎండలో కూడా చల్లగా ఉండేందుకు తన రిక్షా మీద గడ్డిని పెంచాడు. నిజంగా చాలా బాగుంది!. ఈ వేసవి వేడి తట్టుకునేందుకు ఇలా పచ్చటి మొక్కలతో రిక్షాని ఏర్పాటు చేసుకున్నాడు కాబోలు. అని అన్నారు. అంతేకాదు నెటిజన్లు కూడా ఆ రిక్షా డ్రైవర్ సృజనాత్మకతను మెచ్చుకోవడమే కాకుండా కస్టమర్లను ఆకర్షించేందకు ఇది చాల చక్కటి మార్గం అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. This Indian 🇮🇳 man grew grass on his rickshaw to stay cool even in the heat. Pretty cool indeed! pic.twitter.com/YnjLdh2rX2 — Erik Solheim (@ErikSolheim) April 4, 2022 (చదవండి: అమ్మాయి పుట్టిందని తండ్రి సంతోషం.. హెలికాప్టర్లో స్వాగతం) -
మనుషులే కాదు శునకం కూడా దెయ్యం అవుతుందా?
Dog Playing With Ghost Dog in Australia: నిజంగా దెయ్యాలు ఉన్నాయంటే ఎవరు కచ్చితంగా చెప్పలేరు. ఒకవేళ ఎవరైన తమ అనుభవాలు గురించి ప్రస్తావిస్తే అదంతా ఒట్టి బూటకం అని, అది కేవలం భయం కారణంగా వారికి అలా జరిగిందంటూ చాలామంది కొట్టిపారేస్తారే తప్ప ఎవరు నమ్మరు. పైగా వారిని పిచ్చివాళ్లగా చూస్తారు. నిజానికి ఈ ఆధునిక టెక్నాలజీ కారణంగా కొన్ని వీడియోల్లో రికార్డు అయ్యి ఉన్న ఆధారాలను చూస్తే గానీ ఎవ్వరూ అంత తేలికగా నమ్మరు. అచ్చం అలాంటి దెయ్యం వీడియోని చూసి ఇక్కడొక యజమాని షాక్‌కి గురవుతాడు. (చదవండి: టీ పొడి వ్యాపారం చేద్దామనుకోవడమే వారిపాలిట శాపమైంది.. అదిరిపోయే ట్విస్ట్!!..) అసలు విషయంలోకెళ్లితే....ఆస్ట్రేలియాలోని డిమార్కో అనే వ్యక్తి పెరటి తోటలో తన పెంపుడు కుక్కపిల్ల మరో కుక్కతో ఆడుతున్నట్లు సీసీపుటేజ్‌లో చూశానని చెబుతున్నాడు. పైగా మెల్బోర్న్కు చెందిన డిమార్కో, తన పెరటి తోట పూర్తిగా కంచెతో లాక్ చేసి ఉంటుందని. ఏ జంతువు లోపలకి వచ్చే ఆస్కారమే ఉండదని గట్టిగా చెబుతున్నాడు. అంతేకాదు ఆ సీసీపుటేజ్‌లో పారదర్శకంగా కనిపిస్తున ఒక దెయ్యం కుక్కతో తన పెంపుడు కుక్క ఆడుతున్నట్లు కనిపించదని తను చాలా భయభ్రాంతులకు గురయ్యానని చెప్పాడు. పైగా తన కుక్క వద్దకు పరుగెత్తుకుని వెళ్లి చూసినప్పుడు అదొక్కటే ఉందని అన్నాడు. ఆ సమయంలో తన కుక్క ఒక్కత్తే పెరట్లో ఉన్నట్లు తాను చూశానని అంతేకాక ఆ వీడియోలో ఒక నిమిషం వ్యవధిలోనే ఆ దెయ్యం కుక్క అదృశ్యంగా వచ్చి తన పెంపుడు కుక్కతో ఆడుతోందని చెబుతున్నాడు. (చదవండి: వింత వ్యాధి... రోజుకు 70 సార్లు వాంతులు... కానీ అంతలోనే!) -
అదొక అందమైన తోట.. ముచ్చటపడి ఏది ముట్టుకున్నా ప్రాణాలకు ముప్పే..
సువిశాలమైన ఉద్యానవనాల్లో విహరించడం ఒక అద్భుతమైన అనుభూతి. తోటల్లో తిరుగుతూ ఉంటే, ప్రకృతికి దగ్గరగా సంచరిస్తున్నట్లుంటుంది. తోటల్లోని మొక్కలకు పూచే పువ్వులను చూస్తే పూజ కోసమో, సరదాగా తలలో తురుముకోవడం కోసమో కోయాలనిపిస్తుంది. తోటల్లోని చెట్లకు కాసే కాయలను, పండే పండ్లను కోసుకు తినాలనిపిస్తుంది. ప్రభుత్వాల అధీనంలో ఉండే కొన్ని తోటల్లో పూలు, పండ్లు కోయడంపై ఆంక్షలుంటాయి. ముచ్చటగా పెంచుకునే ప్రైవేటు తోటల్లో అలాంటి ఆంక్షలేమీ ఉండవు. మనసుకు నచ్చిన మొక్కలను పెంచుకోవచ్చు. వాటికి పూసిన పూలు, కాసిన కాయలు యథేచ్ఛగా కోసుకోవచ్చు. కానీ, బ్రిటన్‌లోని ఆ తోటలో పూలు, కాయలు కోసుకోవడం సంగతి అటుంచితే, అక్కడి మొక్కలను తాకినా ప్రమాదమే! తాకితే శిక్షలు ఏవైనా పడతాయని కాదు గానీ, అవి అత్యంత విషపూరితమైనవి. ప్రపంచంలోని అత్యంత అరుదైన, విషపూరితమైన వృక్షజాతులన్నీ ఈ తోటలో కనిపిస్తాయి. ఈ తోట బ్రిటన్‌లో నార్త్అంబర్లాండ్లోని ఆన్విక్ కేసిల్‌లో ఉంది. ఈ తోటకు ఏర్పాటు చేసిన నల్లని ఇనుప ప్రవేశ ద్వారంపైన ప్రమాద సంకేతాలుగా పుర్రె, ఎముకల గుర్తులు కనిపిస్తాయి. తోట లోపల కూడా ఇలాంటి ప్రమాద సంకేతాలు దాదాపు అడుగడుగునా కనిపిస్తాయి. నిపుణులైన గైడ్ల పర్యవేక్షణలో మాత్రమే సందర్శకులు దీని లోపలకు వెళ్లవలసి ఉంటుంది. నిపుణుల పర్యవేక్షణ లేకుండా యథేచ్ఛగా వెళితే, లేనిపోని అనర్థాలు తప్పకపోవచ్చు. ఈ తోటలోని మొక్కలు, పొదలు, చెట్లు, వాటికి పూసే రంగు రంగుల పూలు, కాయలు, పండ్లు కళ్లను కట్టిపడేస్తాయి. అలాగని, వాటిని తాకడానికి ప్రయత్నించినా, మొక్కలకు పూసే పూలను కోయకుండానే, వాటిని వాసన చూసేందుకు ప్రయత్నించినా ఎలాంటి ప్రమాదం వాటిల్లుతుందో ఊహించడం కష్టం. గైడ్ల సూచనల మేరకు సురక్షితమైన దూరంలో నిలుచుని వీటిని చూడటమే అన్నివిధాలా క్షేమం. నార్త్అంబర్లాండ్ డ్యూషెస్ జేన్ పెర్సీ 2005లో ఈ తోటను ఏర్పాటు చేశారు. ఈ ప్రదేశంలో పదకొండో శతాబ్దినాటి కేసిల్ శిథిలావస్థకు చేరుకోవడంతో దానిని పునరుద్ధరించి, ప్రపంచంలోని అరుదైన విషపు మొక్కలను ఏరికోరి తీసుకొచ్చి ఈ తోటను పెంచారు. ఇందులోని విషపు మొక్కలు కొన్ని ఔషధాల తయారీకి ఉపయోగపడతాయి. అందుకే ‘మీ ప్రాణాలు తీసేసే మొక్కలే మీ ప్రాణాలను కాపాడతాయి’ అంటారు పెర్సీ. ఈ తోటలో బెల్లడోనా, పాయిజన్ ఐవీ, హెన్బేన్, జెయింట్ హాగ్వీడ్ సహా వందలాది విషపు మొక్కలు ఉన్నాయి. వీటిలో కొన్నింటి పూల వాసన చూస్తే కళ్లు బైర్లు కమ్మడం, వాంతులవడం వంటి లక్షణాలు మొదలవుతాయి. కొన్ని మొక్కలను తాకితే చాలు ఒళ్లంతా దద్దుర్లు రేగి, చర్మం మంట పెడుతుంది. కొన్నింటి కాయలు, పళ్లు తింటే మైకం కమ్ముకు రావడమే కాకుండా, ప్రాణాంతక పరిస్థితులు సైతం ఎదురవుతాయి. ఈ తోటలోని మొక్కలు ప్రకృతిలోని జీవవైవిధ్యానికి అద్దంపడతాయి. చదవండి: ఆరుగురు కూతుళ్లు అందరూ డాక్టర్లు -
తోటలో పనిలో ఉండగా.. విమానంలోంచి, యాక్!!
మానవ వ్యర్థాలు ఈ మాట వింటేనే జనం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. మరి అలాంటిది ఆకాశం నుంచి కుప్పలు, కుప్పలుగా వచ్చి మీద పడితే .. భయంకరంగా ఉంటుంది కదా. బ్రిటన్‌లో ఒక వ్యక్తికి ఇలాంటి ఘోరమైన అనుభవం ఎదురైంది. గార్డెన్లో పనిచేసుకుంటున్న మనిషి అటుగా వెళ్తున విమానం నుంచి మానవ వ్యర్థాలు గుమ్మరించిన వ్యవహారం కలకలం రేపింది. (TV Channel : షాకింగ్ వెదర్ రిపోర్ట్‌లో.. ఆ క్లిప్పింగ్) తోటలో హాయిగా పనిచేసుకుంటున్న తరుణంలో విమానంలో నుంచి జారవిడిచిన వ్యర్థాలు ఒక్కసారిగా వచ్చి పడ్డాయి. అలాగే అతని గార్డెన్లో ఉన్న పలు మొక్కలు, పైకప్పులపై కూడా పడ్డాయి. దీంతో వ్యర్థాలు పడిన వెంటనే అతడు గార్డెన్ నుంచి దూరంగా పారిపోవాల్సి వచ్చింది. 2021 ఏడాది జూలైలో ఇంగ్లండ్‌లోని విండ్సర్ సమీపంలో హీత్రూ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. కారెన్ డావిస్ జోక్యం ద్వారా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రూట్ ట్రాకింగ్ యాప్ ద్వారా ఆ విమానం ఎటు వెళ్లిందో బాధితుడు కనిపెట్టడం విశేషం. మరోవైపు ఆ విమానం పేరును బయటపెట్టడానికి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా బాధితుడు విముఖత వ్యక్తం చేయడం గమనార్హం. (kidney transplantation: సంచలనం) విండ్సర్ అండ్ మేడెన్ హెడ్‌కి చెందిన ది రాయల్ బోరో ఏవియేషన్ ఫోరమ్‌తో కారెన్ డావిస్ ఈ భయంకరమైన అనుభవాలను షేర్ చేశారు. విమానంలో నుంచి పడిన వ్యర్థాలు మొత్తం తోటంతా చాలా అసహ్యకరమైన రీతిలో పడ్డాయని వివరించారు. ఇలాంటి అనుభవం మరెవ్వరికీ రాకూడదని ఆమె వ్యాఖ్యానించారు. అయితే విమానంలోంచి జారవిడిచే మానవ వ్యర్థాలకు సంబంధించి ప్రతి ఏడాది ఇలాంటి ఘటనలు నమోదవుతూ ఉంటాయన్నారు. సాధారణంగా విమానాల నుంచి వదిలినపుడు ఎత్తైన ప్రదేశాల్లోని ఉష్ణోగ్రతకు తక్షణమే గట్ట కట్టి, కింత పడతాయని డావిస్ చెప్పారు. కానీ తాజా ఘటనలో మాత్రం దీనికి భిన్నంగా జరగడం అరుదైనదని చెప్పారు. కాగా సాధారణంగా విమానాల్లో టాయిలెట్స్ వ్యర్థాలను ప్రత్యేక ట్యాంకుల్లో స్టోర్ చేసి విమానం ల్యాండ్ అయిన తర్వాత వాటిని తొలగిస్తారు. ఆధునిక విమానాలలో వాక్యూమ్ టాయిలెట్లు సాధారణంగా విమానాలతో పోలిస్తే చాలా సురక్షితమైనవి భావిస్తారు. -
పండంటి పొదరిల్లు.. ఎంత బాగుందో!
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): మనకు కావాల్సిన పళ్లు, కూరగాయలను మనం మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం. కానీ అవన్నీ మన ఇంటి వద్దే పండించుకుంటే.. ఆ ఆనందమే వేరు కదా. ఓ మాజీ సైనికుడు అదే చేస్తున్నాడు. డాబా పైనే రకరకాల పండ్లను పండిస్తూ తన ఇంటినే ఓ పండ్ల తోటల వనంగా మార్చేశాడు. ఆ మొక్కలకు వర్మీ కంపోస్ట్ ఎరువునే వినియోగిస్తూ పర్యావరణాన్ని, ప్రజారోగ్యాన్ని కాపాడటంలోనూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆన్లైన్ నుంచి మొక్కల కొనుగోలు విశాఖ జిల్లా కొత్తపాలెం దుర్గానగర్‌కు చెందిన పూజారి శ్రీనివాసరావు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. 2017లో రిటైర్డ్ అయిన ఆయన ప్రస్తుతం ఆర్సీసీవీఎల్లో విజిలెన్స్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. ఆయనకు మొక్కల పెంపకంపై మక్కువ. మరీ ముఖ్యంగా పండ్ల తోటలు పెంచడం అంటే చాలా ఇష్టం. ముందుగా 2018 నుంచి ఇంటి చుట్టూ పూల మొక్కల పెంపకాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఆన్లైన్ నుంచి మొక్కలు తెప్పించి మేడపై పెంచడం మొదలెట్టారు. ఇప్పుడు ఆ ఇల్లు పలు రకాల పండ్ల మొక్కలకు కేరాఫ్‌గా మారిపోయింది. ఫైనాపిల్, డ్రాగన్ ఫ్రూట్, తీపి బత్తాయి, ద్రాక్ష, మిరియాలు, లిచి, మామిడి, దొండ, అరటి చెట్లు, తైవాన్ జామ తదితర మొక్కలతో పాటు, బోన్సాయ్ మొక్కలనూ పెంచుతున్నారు. ఇంట్లోనే వర్మీ కంపోస్ట్ తయారీ.. పాడైపోయిన ప్లాస్టిక్ బకెట్లను మొక్కల పెంపకానికి అనువుగా తీర్చిదిద్దడం విశేషం. మొక్కలకు వర్మీ కంపోస్టునే ఎరువుగా వినియోగిస్తున్నారు. పొడి వ్యర్థాలను మాత్రమే జీవీఎంసీ సిబ్బందికి ఇచ్చేసి తడి వ్యర్థాల సాయంతో ఇంట్లోనే వర్మీ కంపోస్టును తయారు చేసుకుంటున్నారు. ఇప్పుడు శ్రీనివాసరావు ఇల్లు పచ్చదనంతో కళకళలాడిపోతోంది. ఎంతో ఆనందంగా ఉంది.. మా ఇంటి మేడపైనే పండ్ల మొక్కలు పెంచడం ఎంతో ఆనందంగా ఉంది. ఇంటిల్లిపాదీ తినగా మిగిలిన పండ్లను స్నేహితులు, బంధువులకు ఇస్తుంటాను. తెలంగాణకు చెందిన ఓ స్నేహితుడి వద్ద వర్మీ కంపోస్ట్ ఎరువు తయారు చేయడం నేర్చుకుని మరీ మొక్కలకు వినియోగిస్తున్నాను. – పూజారి శ్రీనివాసరావు, కొత్తపాలెం దుర్గానగర్, విశాఖ జిల్లా -
వక్క తోటలో ఆరు అడుగుల కొండచిలువ
శివమొగ్గ: శివమొగ్గ నగరంలోని ఎన్టీ రోడ్డు ఆస్పత్రి సమీపంలో ఉన్న ఓ వక్క తోటలో భారీ కొండ చిలువ కనిపించింది. మంగళవారం ఉదయం తోటకు వెళ్లిన యజమానికి కొండచిలువ కనిపించడంతో ఆయన వెంటనే స్నేక్ క్యాచర్ కిరణ్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన దానిని పట్టుకుని సమీపంలోని అడవిలో వదిలిపెట్టారు. కొండ చిలువ ఆరు అడుగులకు పైగా ఉందని తెలిపారు. కొండచిలువ హల్చల్ వంగర: ఎం.సీతారాంపురం గ్రామంలో మంగళవారం కొండచిలువ హల్చల్ చేసింది. పాఠశాల సమీపంలో ఉన్న చెరువును ఆనుకొని పొదల్లో చిలువను గుర్తించిన స్థానికులు.. సమీపంలో పశువులు మేతకు రావడంతో ఆందోళన చెందారు. దీంతో దానిని హతమర్చారు. -
వైరల్ ఎవరికి కనపడకుండా బీర్లను ఎక్కడ దాచాడో తెలుసా..
సాధారణ వ్యక్తులతో పోలిస్తే మందుబాబుల తెలివి మాములుగా ఉండదు. ఎప్పుడూ రాని ఆలోచనలు చుక్క దిగితే ఉప్పెనల తన్నుకస్తుంటాయి. ఏ పని చేసినా చేయకున్నా.. టైమ్‌కు నోట్లోకి మందు పడాల్సిందే. లేదంటే ఉక్కిరిబిక్కిరవుతుంటారు. అసలే ఇప్పుడు కరోనా ముంచుకొస్తుంది. ఒకవేళ లాక్డౌన్ పెడితే మాత్రం మందుబాబుల కష్టాలు అంతా ఇంతా కాదు. అందుకే ముందు జాగ్రత్తగా ఇప్పుడే మందు బాటిళ్లను కొని తెచ్చుకుని ఫుల్‌గా స్టాక్ పెట్టుకుంటున్నారు. కరోనాను కూడా లెక్క చేయకుండా, భౌతిక దూరం పాటించకుండా కలబడి మరీ మందును సాధిస్తున్నారు. కష్టపడి లిక్కర్, బీర్లు తెచ్చుకోవడం ఒక సవాల్ అయితే వాటిని ఇంట్లో కుటుంబికులకు, స్నేహితులకు తెలియకుండా దాయడం మరో పెద్ద టాస్క్. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తికి కత్తిలాంటి ఆలోచన వచ్చింది. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ముందే తెలుసేమో.. తన బుర్రకు టెక్నాలజీతో పదును పెట్టి .. బీర్లు దాచేందుకు ఓ అద్భుతాన్ని ఆవిష్కరించాడు. పూల కుండీల అడుగున కనీసం పాతిక బీర్లు పట్టేలా కంపార్ట్మెంట్ తయారు చేశాడు. బయటకు చూసేందుకు అది పూల కుండీలాగే కనిపిస్తుంది. కానీ, చిన్న బటన్ నొక్కితే.. పూల కుండీ పైకి లేచి.. దాని అడుగున ఉన్న మందు బాటిళ్ల కంపార్ట్మెంట్ పైకి వస్తుంది. ఎంతైనా వీడి తెలివిని ప్రశంసించాల్సిందే. చదవండి: మహిళ పాడు పని.. యాక్ థూ అంటున్న జనాలు -
ఇంటిపంటల మాస్టారు!
పంటలు పండించే తీరు ఆసాంతమూ రసాయనాల మయం అయిపోయిన తర్వాత ఆహారం కూడా రసాయనాల అవశేషాలతో అనారోగ్యకరంగా మారిపోయింది. ఈ ముప్పు నుంచి మానవాళి తప్పించుకోవాలంటే.. పంటల ఉత్పత్తిదారులైన రైతుల అలవాటు మారాలి, వారితోపాటు సహ ఉత్పత్తిదారులైన వినియోగదారులూ మారాలి. రసాయనాల మకిలి లేని మంచి ఆహారాన్ని ఇష్టపడే ప్రజలు ఎవరైనా ముందు చేయాల్సింది వారి ఇంటిపైన, ముందు, వెనుక ఉన్న కొద్ది పాటి స్థలంలోనైనా సేంద్రియ ఇంటిపంటలు పండించుకోవడానికి తక్షణం శ్రీకారం చుట్టటమే. ఈ చైతన్యాన్ని అందిపుచ్చుకోవటంలో, జనబాహుళ్యంలో ప్రచారంలోకి తేవటంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం. ఈ బాధ్యతను గుర్తెరిగి ఏడాది కాలంలో సేంద్రియ ఇంటిపంటలు సాగు చేస్తున్నారు బొర్రా ప్రదీప్. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం మంతెన జెడ్పీ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. పెనమలూరు మండలం పోరంకి గ్రామంలోని సాలిపేట శ్రీవెంకటేశ్వర గార్డెన్స్‌లో 4 సెంట్ల స్థలంలో ఇల్లు కట్టుకున్నారు. ఉన్న కొద్ది పాటి స్థలాన్ని సద్వినియోగం చేసుకుని ఏడాది కాలంగా మిద్దె తోటలను పెంచుతున్నారు ప్రదీప్. ఎర్రమట్టి, నల్లమట్టి, బాగా చివికిన పశువుల ఎరువు, ఇసుక, కొబ్బరి పీచు తగు పాళ్లలో కలిపిన మిశ్రమం ప్లాస్టిక్ డబ్బాలు, బక్కెట్లతో ధర్మోకోల్ బాక్సుల్లో వేసి మొక్కలు నాటారు. డబ్బాలు, బక్కెట్ల కింద ఇనుప స్టాండ్లను అమర్చి శ్లాబు సంరక్షణకు చర్య తీసుకున్నారు. వివిధ రకాల వంగ, టమోట, బెండ, తీగ బచ్చలి, తోటకూర, పాలకూర, గోంగూర, చిక్కుడు, బీర, కాకర, దోస, పొట్ల మొక్కలను పెంచుతున్నారు. మామిడి, తీపి నారింజ, గులాబి, జామ, నల్ల ద్రాక్ష, తెల్ల ద్రాక్ష, ప్యాషన్ ఫ్రూట్, బ్లూ బెర్రీ, అంజూర, స్ట్రాబెర్రీ, జామ, యాపిల్ బెర్, స్టార్‌ఫ్రూట్, నిమ్మ, ఆల్ సస్పైసిస్, మెక్సికన్ అవకాడో వంటి అరుదైన మొక్కలను సేకరించి వాటిని మిద్దెపై పెంచుతున్నారు. సహజసిద్ధమైన పద్ధతిలో పండ్లు, కూరగాయలు పండిస్తూ ఆరోగ్యదాయక ఆహారాన్ని ఇంటిల్లపాది భుజిస్తున్నారు. ఈ విషయాలను సామాజిక మాథ్యమాల్లో ప్రచారం సాగిస్తున్నారు. టెర్రస్ గార్డెన్ ఫ్రెండ్స్ పేరిట వాట్సాప్ గ్రూప్‌ను నిర్వహిస్తున్నారు. – ఈడా శివప్రసాద్, సాక్షి, కంకిపాడు ఆహ్లాదం.. ఆరోగ్యం.. సుమారు సంవత్సర కాలంగా సేంద్రియ ఇంటిపంటలు సాగు చేస్తున్నాను. ప్రతి రోజూ మొక్కలను సంరక్షిస్తూ వాటితో గడపటం వల్ల ఆహ్లాదంతో పాటు రుచికరమైన కూరగాయలు, పండ్లు ఇంటి అవసరాలకు సమకూర్చుకోవచ్చు. పిల్లలకు కూడా సేంద్రియ పంటల ప్రాధాన్యం తెలిస్తే.. తామూ పండిస్తారు. వాటిని పండించే రైతులపై గౌరవమూ పెరుగుతుంది. – బొర్రా ప్రదీప్ (80749 73382), తెలుగు ఉపాధ్యాయుడు