వ్యవస్థాపకుడు డాక్టర్ విజయ భాస్కర్ రెడ్డి పంట పొలాల్లో, పండ్ల తోటల్లో పురుగుల నియంత్రణకు పురుగుమందులు/కషాయాలు చల్లటం కన్నా.. అసలు ఆయా ప్రత్యేక జాతి పురుగుల సంతతినే పెరగకుండా అరికట్టగలిగితే రైతులకు శ్రమ, ఖర్చు తగ్గటంతో పాటు, పర్యావరణానికి, ప్రజారోగ్యానికి కూడా మేలు జరుగుతుందంటున్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు. వివిధ శాస్త్రవిభాగాల్లో పరిశోధనలు పూర్తిచేసిన శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే వినూత్నమైన ఫెరమోన్ ఆధారిత అప్లికేషన్లు, ఆవిష్కరణలను వెలువరించారు.
కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి అగ్రికల్చర్ గ్రాండ్ ఛాలెంజ్ పురస్కారాన్ని అందుకున్న ఈ సాంకేతికతను రైతులకు అందుబాటులోకి తేవడానికి శాస్త్రవేత్తలు హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో ఎటిజిసి బయోటెక్ అనే కంపెనీని నెలకొల్పారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఇటీవల నిర్వహించిన ‘ఎట్‌హోమ్ రిసెప్షన్ ’లో ఈ సంస్థ సహ–వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి, హెచ్‌సియూ పూర్వ విద్యార్థి డాక్టర్ విజయ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన అందించిన వివరాల ప్రకారం ఈ వినూత్న సాంకేతికత వివరాలను పరిశీలిద్దాం..
పురుగుల సంతతిని అరికట్టే వ్యూహం
ఆడ రెక్కల పురుగు సంతానోత్పత్తి దశలో మగ రెక్కల పురుగును ఆకర్షించడానికి ప్రత్యేకమైన వాసనతో కూడిన హార్మోన్ వంటి రసాయనాన్ని గాలిలోకి విడుదల చేస్తుంది. మగ పురుగు ఆ ఫెరమోన్ వాసనను బట్టి ఆడ పురుగు ఉన్న చోటుకు వెళ్లి కలుస్తుంది. ఈ కలయిక సజావుగా జరిగితే ఆడ పురుగు గుడ్లు పెడుతుంది. ఆ విధంగా పురుగుల సంతతి పంట పొలంలో స్వల్ప కాలంలోనే పదులు వందలుగా, వందలు వేలుగా పెరిగిపోయి పంటను ఆశించి దిగుబడిని నష్ట పరచటం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే, ఆడ–మగ రెక్కల పురుగుల కలయికే జరగకుండా చూడటం ద్వారా సంతతి పెరుగుదలను అరికట్టడం ఇక్కడ వ్యూహం.
ఈ వ్యూహాన్ని అమలుపరచడానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పరిశోధన శాస్త్రవేత్తలు రూపొందించిన వినూత్న పద్ధతి ఏమిటంటే.. కృత్రిమ ఫెరమోన్‌తో కూడిన ప్రత్యేక పేస్ట్‌ను రూపొందించటం. ఈ పేస్ట్‌ను పంట పొలంలో మొక్కలకు అక్కడక్కడా అంటిస్తే.. ఆ వాసనకు మగ రెక్కల పురుగు ఆడ పురుగు ఉందనుకొని మొక్కపై ఉన్న పేస్ట్ దగ్గరకు వస్తుంది. తీరా లేకపోయే సరికి తికమకకు గురవుతుంది. ఆడ రెక్కల పురుగులను కలిసే ప్రయత్నంలో నూటికి 90 సార్లు విఫలమవుతుంది. దాంతో ఆ పురుగు సంతానోత్పత్తి ఆ మేరకు పరిమితమవుతుంది. ఈ టెక్నిక్‌ను ఉపయోగించి పురుగు తొలి దశలోనే పేస్ట్‌ను పొలంలో అక్కడక్కడా మొక్కలకు పూస్తే చాలు. పురుగుల్ని నిర్మూలించకుండానే వాటి సంఖ్యను చాలా వరకు అదుపులోకి తేవటం ద్వారా పంట దిగుబడికి పెద్దగా నష్టం జరగకుండా చూసుకోవచ్చు. ఇది సరిగ్గా చేస్తే ఆ పురుగు నిర్మూలనకు రైతులు పురుగుమందు కొట్టే శ్రమ, ఖర్చు, కాలుష్యం ఉండదు.
అయితే, పురుగుల తీవ్రతను తెలుసుకునేందుకు లింగాకర్షక బుట్టలు చాలా కాలంగా రైతులు వాడుతున్నారు. ఫెరమోన్ ఎర వాసనతో వచ్చి లింగాకర్షక బుట్టల్లో పడే మగ రెక్కల పురుగుల సంఖ్యను, పొలంలో అప్పుడు ఆ పురుగు తీవ్రతను గుర్తించి, పురుగు మందులు/కషాయాలు చల్లటం వంటి నియంత్రణ చర్యలను రైతులు చేపడుతున్నారు. ఈ లోగా పురుగుల సంతతి పెరిగిపోతోంది. అయితే, ఈ కొత్త పద్ధతి ద్వారా ఈ పురుగుల సంతతి పెరగకుండా ముందు నుంచే వాటి కలయికను నివారించవచ్చు. పురుగు ఉధృతిని ఎర ఉపయోగించి గమనించవచ్చు.
పత్తిలో గులాబీ పురుగుకు చెక్
గులాబీ రంగు పురుగు వలన పత్తి రైతులు సగటున ఎకరానికి 6–7 క్వింటాళ్ల పత్తిని నష్టపోతున్నారు. పురుగులను సమర్థవంతంగా అరికట్టడానికి ఫెరొమోన్ పర్యవేక్షణ మాత్రమే సరిపోదు. ఇప్పుడు పర్యవేక్షణే కాకుండా ఫెరొమోన్ ఆధారిత నియంత్రణ విధానం అందుబాటులోకి వచ్చింది. ఇది ఎరను ఉపయోగించకుండా ఫెరొమోన్ పేస్ట్ ద్వారా పురుగులను అరికట్టే సరికొత్త పద్ధతని డాక్టర్ విజయభాస్కర్‌రెడ్డి ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. ప్రస్తుతం బీటీ పత్తి పొలాల్లో విజృంభిస్తున్న గులాబీ లద్దె పురుగును అరికట్టేందుకు ప్రత్యేకమైన పేస్ట్‌ను తమ కంపెనీ రూపొందించిందన్నారు. పేటెంట్ కలిగిన ఈ టెక్నాలజీకి కేంద్ర ప్రభుత్వ అనుమతులు పొందిన తర్వాత రైతులకు అందుబాటులోకి తెచ్చిందన్నారు.
పత్తి పంటలో 3 సార్లు..
ఎకరం పత్తి చేనులో అన్ని మొక్కలకూ పేస్ట్‌ను పెట్టక్కర లేదు. 400 మొక్కల (పొలంలో 7–8% మొక్కల)కు ఈ పేస్ట్‌ను బఠాణీ గింజంత అంటించాలి. మొక్క పై నుంచి 10–15 సెం.మీ. కిందికి, కాండం నుంచి కొమ్మ చీలే దగ్గర పెట్టాలి. ఒక సాలులో 4 మీటర్లకు ఒక మొక్కకు పెడితే చాలు. ఒక సాలులో మొక్కలకు పెట్టి, రెండు సాళ్లు వదిలేసి మూడో సాలుకు పెడితే సరిపోతుంది. ఎకరం మొత్తానికి 125 గ్రాముల పేస్ట్ సరిపోతుందని డా. రెడ్డి వివరించారు.
ఒక్కో మొక్క కాండంపై 250 నుంచి 300 మిల్లీ గ్రాముల మేరకు పెట్టాలి. పత్తి పంట కాలంలో మొత్తం 3 సార్లు పేస్ట్ పెట్టాలి. విత్తనాలు వేసిన తర్వాత (పువ్వు/ గూడ ఏర్పడటానికి ముందు) ఇంచుమించుగా 30–35 రోజులకు మొదటిసారి, విత్తిన 60–65 రోజుల తర్వాత రెండోసారి, విత్తిన 90–95 రోజుల తర్వాత మూడవ సారి పెట్టాలి. తుది పంట కోసే వరకు ప్రతి 30–35 రోజుల వ్యవధిలో ఉపయోగించాలి. ఇలా చేస్తే పంట ఖర్చు తగ్గి, దిగుబడి, నాణ్యత పెరుగుతుంది. ఎకరానికి పేస్ట్ ఖర్చు మూడు సార్లకు రూ. 4 వేలు అయినప్పటికీ, రైతు రూ. 30 వేల వరకు అధికాదాయం పొందగలుగుతారని ఆయన అన్నారు.
మిత్రపురుగులు సురక్షితం
ఈ సాంకేతికతలో పురుగుమందులు /హానికరమైన రసాయనాలు లేనందున పర్యావరణానికి హాని కలిగించదని డా. విజయభాస్కర్‌రెడ్డి వివరించారు. నేల, గాలి, నీరు పురుగు మందుల అవశేషాలతో కలుషితం కావు. మిత్ర పురుగులకు, పరాన్న జీవులు వంటి సహజ శత్రువులకు సురక్షితంగా ఉంటాయి. తేనెటీగలు నశించవు. సహజ పరాగ సంపర్కం బాగుంటుంది. రైతుకు, కూలీలకు సురక్షితమైనది. మొక్కకు హాని కలిగించదు. పత్తి నాణ్యత, రంగు మెరుగ్గా ఉంటుంది. మంచి ధరను పొందే అవకాశం కలుగుతుంది అన్నారాయన. దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రయోగాల్లో 90% పైగా పత్తిలో గులాబీ పురుగును ఈ పేస్ట్ నియంత్రిస్తున్నట్లు నిరూపితమైందని ఆయన తెలిపారు. (ఇతర వివరాలకు.. టోల్‌ఫ్రీ నంబర్ 1800 121 2842)
త్వరలో వంగకు కత్తెర పురుగుకు కూడా..
ప్రస్తుతానికి పత్తిలో గులాబీ పురుగును నియంత్రించేందుకు పేస్ట్‌ను రైతులకు అందుబాటులోకి తెచ్చాం. వంగ తోటల్లో కాయ/కాండం తొలిచే పురుగుల నియంత్రణకు ప్రత్యేక పేస్ట్‌ను కేంద్ర ప్రభుత్వ అనుమతుల తర్వాత 2–3 నెలల్లో విడుదల చేయబోతున్నాం. ఇది అందుబాటులోకి వస్తే వంగ రైతులకు పురుగు మందుల ఖర్చు, శ్రమ గణనీయంగా తగ్గుతుంది. అంతేకాక వినియోగదారులు పురుగుమందు అవశేషాలు లేని వంకాయలను తినటం సాధ్యమవుతుంది. ఇప్పటికే పండ్లు/కూరగాయ తోటల్లో నష్టం చేస్తున్న పండు ఈగను ఆకర్షించి చంపే జెల్ ల్యూర్ అందుబాటులో ఉంది.
శ్రీ కొండా లక్షణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, ఉద్యాన శాఖ దీనిపై అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. మొక్కజొన్న సహా అనేక పంటలకు నష్టం చేస్తున్న కత్తెర పురుగు నియంత్రణకు వినూత్న పద్ధతి త్వరలోనే అందుబాటులోకి రానుంది. వీటి తయారీలో ఎలాంటి జన్యుమార్పిడి సాంకేతికతను వాడటం లేదు. రైతులు ఈ సాంకేతిక పద్ధతిని పురుగు ఉదృతి పెరిగినాక కాకుండా ముందు జాగ్రత్తగా వినియోగించాల్సి ఉంటుంది. ఒక ప్రాంతంలో రైతులు కలసి వాడితే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయి.
– డా. విజయ భాస్కర్ రెడ్డి, ఎటిజిసి బయోటెక్ సహ–వ్యవస్థాపకుడు,
ముఖ్య కార్యనిర్వహణాధికారి, జీనోమ్ వ్యాలీ, హైదరాబాద్.
(చదవండి:
Comments
Please login to add a commentAdd a comment