biotech industry
-
కొత్త బయోటెక్ సీసాలో పాత సారా
వాతావరణ మార్పులు; ఘన, ద్రవ వ్యర్థాల సమర్థ నిర్వహణ; వ్యవసాయ ఉత్పాదకతల పెంపు, మెరుగైన ఇంధన వ్యవస్థ, ఆరోగ్య సౌకర్యాలు... బయోటెక్నాలజీ సమర్థ వినియోగంతో భారత్ అధిగమించగల సవాళ్లల్లో ఇవి కొన్ని మాత్రమే. బోలెడన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకూ బయో టెక్నాలజీ ఎంతో సాయం చేయగలదు. ఇదే విషయాన్ని గత నెల 31న విడుదల చేసిన ‘బయోటెక్నాలజీ ఫర్ ఎకానమీ, ఎన్విరాన్ మెంట్, ఎంప్లాయ్మెంట్ (బయో ఈ3)’ విధానం ద్వారా కేంద్రం కూడా లక్షించింది. ఈ విధానంలోని అతిపెద్ద లోపం ఏమిటంటే... ఇవన్నీ ఎప్పటిలోగా సాధిస్తామన్నది స్పష్టం చేయకపోవడం. ఎందుకంటే ఇవన్నీ 2021లో ‘నేషనల్ బయోటెక్నాలజీ అభివృద్ధి వ్యూహం’ పేరుతో విడుదల చేసిన పత్రంలో ఉన్నవే!‘బయో ఈ3’ విధానం ప్రధాన లక్ష్యం– వైవిధ్యభరితమైన కార్యకలాపాల ద్వారా పర్యావరణ, వాతావరణ మార్పుల ప్రభావాన్ని పరిరక్షిస్తూనే, సుస్థిరా భివృద్ధి వంటి అంతర్జాతీయ సమస్యలను దీటుగా ఎదుర్కొనేందుకు బయో మాన్యుఫాక్చరింగ్ పరిష్కారాలు వెతకడం! సృజనాత్మక ఆలోచనలను టెక్నాలజీలుగా వేగంగా పరివర్తించాలని కూడా సంకల్పం చెప్పుకొన్నారు. ఇప్పటివరకూ వేర్వేరుగా జరుగుతున్న కార్యకలాపాలన్నింటినీ బయోమాన్యుఫాక్చరింగ్ అనే ఒక ఛత్రం కిందకు తీసుకు రావాలనీ, సుస్థిరమైన అభివృద్ధి పథాన్ని నిర్మించాలనీ కూడా విధాన పత్రంలో పేర్కొన్నారు. ఈ విధానాన్ని ప్రతిపాదించే క్రమంలో కేంద్ర ‘బయోటెక్నాలజీ విభాగం’ (డీబీటీ) కార్యదర్శి రాజేశ్ గోఖలే జీవశాస్త్ర పారిశ్రామికీ కరణకు నాంది పలుకుతున్నట్లు ప్రకటించారు. ఈ రంగంలో భారత్‌ను అగ్రగామిగా నిలుపుతామన్నారు. ఈ విధానంలోని వాపును కాస్తా పక్కకు పెడితే – బయోటెక్నాలజీ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడం, డిజిటలైజేషన్ , కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను ఇందుకు వాడటం కీలకాంశా లుగా తోస్తాయి. ఇదే వాస్తవమని అనుకుంటే ఇందులో కొత్తదనమేమీ లేదు. ఎందుకంటే 2021లో ఇదే డీబీటీ ‘నేషనల్ బయోటెక్నాలజీ అభివృద్ధి వ్యూహం (2021–25)’ పేరుతో ఒక పత్రాన్ని విడుదల చేసింది. అందులోనూ కచ్చితంగా ఇవే విషయాలను ప్రస్తావించారు. కాకపోతే అప్పుడు ఆర్థికాంశాలు, కాలక్రమం, లక్ష్య సాధనకు మార్గాల వంటివి స్పష్టంగా నిర్వచించారు. బయోటెక్నాలజీ ఆధారంగా విజ్ఞాన, సృజనాత్మకతలతో నడిచే ఓ జీవార్థిక వ్యవస్థను అభివృద్ధి చేయాలన్నది 2021లో డీబీటీ పెట్టుకున్న లక్ష్యం. 2025 నాటికల్లా భారత్‌ను అంతర్జాతీయ బయో మాన్యు ఫాక్చరింగ్ హబ్‌గా రూపుదిద్దాలని అనుకున్నారు. బయో ఫౌండ్రీల వంటి వాటికి తగిన మౌలిక సదుపాయాలు కల్పించడం, నైపుణ్యం కలిగిన సిబ్బంది, కార్మికులను తయారు చేయడం, అందరికీ అందు బాటులో ఉండే వస్తువులను తయారు చేయగల పరిశ్రమలకు ప్రోత్సా హకాలు అందించడం ద్వారా లక్ష్యాన్ని సాధించాలని అప్పట్లో తీర్మానించారు. వాతావరణ మార్పులు, ఆహార భద్రత, పర్యావరణ అను కూల ఇంధనాలు, వ్యర్థాల సమర్థ నిర్వహణ వంటివి 2021లో గుర్తించిన ప్రాధాన్యతాంశాలు. తాజా జాబితాలోనూ ఇవే అంశాలను పునరుద్ఘాటించారు. కానీ డీబీటీ తెలివిగా పాత విధానం, వ్యూహాలను అస్సలు ప్రస్తావించకపోవడం గమనార్హం. అప్పడు నిర్దేశించుకున్న లక్ష్యాలను ఎందుకు సాధించలేకపోయారన్న ప్రశ్న నుంచి తప్పించు కునేందుకు అన్నమాట! 2021 విధానానికి అనుగుణంగా తీసుకున్న చర్య ఏదైనా ఉందీ అంటే... అది తాజా బడ్జెట్లో బయో ఫౌండ్రీల ప్రోత్సాహానికి ఒక పథకాన్ని ప్రకటించడం మాత్రమే. బయోటెక్నాలజీ ఏయే రంగాల్లో ఉపయోగపడగలదో చెప్పాల్సిన పని లేదు. టీకాల తయారీ మొదలుకొని కొత్త రకాల వంగడాల సృష్టి వరకూ చాలా విధాలుగా సహాయకారి కాగలదని గత నాలుగు దశా బ్దాల్లో నిరూపణ అయ్యింది. దేశ విధాన రూపకర్తలు దీని సామర్థ్యాన్ని ముందుగానే గుర్తించారు. 1986 లోనే బయోటెక్నాలజీ రంగానికి ఊతమిచ్చేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. తొలినాళ్లలో ఇది దేశవ్యాప్తంగా పరిశోధన, విద్య అవకాశాలను పెంచడం వల్ల ఈ రోజు అంతర్జాతీయ స్థాయిలో కీలక స్థానానికి చేరుకోగలిగింది. అయితే బయోటెక్నాలజీ ఆధారిత పరిశ్రమ వృద్ధి కొంచెం నెమ్మదిగానే జరిగిందని చెప్పాలి. వెంచర్ క్యాపిటలిస్టుల లేమి, తగిన వాతావరణం లేకపోవడం ఇందుకు కారణాలు. అయినప్పటికీ పరి శ్రమ అందుబాటులోకి తెచ్చిన ఉత్పత్తులేవీ డీబీటీ కార్యక్రమాల కారణంగా వచ్చినవి కాకపోవడం గమనార్హం. భారతీయ బయోటెక్ పరిశ్రమకు ఇష్టమైన ప్రతినిధిగా చూపే ‘బయోకాన్’... డీబీటీ ఏర్పాటు కంటే మునుపటిది. శాంత బయోటెక్, భారత్ బయోటెక్ వంటి కంపెనీలు కూడా టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు వంటి ఇంకో ప్రభుత్వ విభాగపు రిస్క్ ఫైనాన్సింగ్ ద్వారా ఏర్పాటు చేసినవే. 2000లలో కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బయో టెక్నాలజీ రంగం కోసం ప్రత్యేక విధానాలను ప్రకటించడమే కాకుండా పరిశ్రమలకు ప్రోత్సాహకాలూ అందించాయి. హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీ, ఐకేపీ నాలెడ్జ్ పార్క్‌ల విజయం ఈ విధానాల ఫలమే. 2012లో మాత్రమే డీబీటీ పారిశ్రామిక ప్రోత్సాహం కోసం ప్రత్యేక వాణిజ్య విభాగాన్ని ఏర్పాటు చేసింది. దీన్నే ‘ద బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్’... క్లుప్తంగా బైరాక్ అని పిలుస్తారు. ప్రభుత్వం గతానుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలు, మన సామర్థ్యాల ఆధారంగా బయోటెక్నాలజీ రంగంలో పరిశ్రమలను ప్రోత్సహించాల్సి ఉంటుంది. కానీ తాజా విధానంలో జీనోమ్ వ్యాలీ, ఐకేపీ నాలెడ్జ్ పార్క్ వంటి విజయవంతమైన నమూనాల ప్రస్తావనే లేదు. కాకపోతే ఇదే భావనను ‘మూలాంకుర్ బయో ఎనేబ్లర్ హబ్’ అన్న కొత్త పేరుతో అందించింది. విధాన పత్రం ప్రకారం ఈ హబ్స్ ఆవిష్కరణలు, ట్రాన్స్లేషనల్ రీసెర్చ్‌లను సమన్వయ పరుస్తాయి. పైలట్ స్కేల్, వాణిజ్య పూర్వ పరిశోధనలకు సహకారం అందిస్తాయి. ఇప్పటికే దేశంలో ఉన్న టెక్నాలజీ క్లస్టర్లు చేస్తున్నది కూడా ఇదే. కేంద్రం సర్వరోగ నివారిణిగా ప్రచారం చేస్తున్న ఈ కొత్త విధానం నియంత్రణ వంటి అంశాలను పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. మౌలిక పరిశోధనలకు తగినన్ని ప్రభుత్వ నిధులను అందుబాటులో ఉంచడం, సాంకేతిక పరిజ్ఞానం, మానవ వనరుల అభివృద్ధి విషయాల్లోనూ ప్రభుత్వం నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నదీ విస్మరించింది. బయో మాన్యుఫాక్చరింగ్‌కు నియంత్రణ వ్యవస్థ కీలకం. ఎందుకంటే జన్యు మార్పిడి చేసిన సూక్ష్మజీవులు, ఇతర జీవజాలాన్ని వాడతారు కాబట్టి. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించిన నిబంధనలు చెల్లాచెదురుగా ఉండటమే కాదు, పారదర్శకంగానూ లేవు. ఓ భారీ బయోటెక్ ఆధారిత వ్యవస్థను ఏర్పాటు చేయాలని అనుకున్నప్పుడు అంతకంటే ముందే స్వతంత్ర, చురుకైన చట్టపరమైన నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం అవసరం. ఐటీ విప్లవం మాదిరిగానే బయోటెక్నాలజీ ఆధారంగా సరికొత్త పారిశ్రామిక విప్లవాన్ని తీసుకొస్తామని డీబీటీ కార్యదర్శి వ్యాఖ్యానించారు. సమాచార రంగంలో వచ్చిన మార్పులే ఐటీ విప్లవానికి నాంది అనీ, ఏదో విధానాన్ని రూపొందించి విడుదల చేయడం వల్ల మాత్రమే ఇది రాలేదనీ ఆయన గుర్తించాలి. డిజిటల్ టెలిఫోన్ ఎక్స్చేజ్ను సొంతంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం గట్టిగా సంకల్పించడం, పెట్టుబడులు పెట్టడం, డెడ్లైన్లను విధించడం వల్లనే దేశంలో ఈ రోజు ఐటీ రంగం ఈ స్థాయిలో ఉంది. అలాగే ప్రభుత్వం స్వయంగా సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ పథకాన్ని ప్రవేశపెట్టడం వల్ల ఈ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందింది. ప్రభుత్వం కేవలం ప్రకటనలు చేయడం కాకుండా నిర్ణయాత్మకంగా వ్యవహరించడం కీలకం.విధానాలు అనేవి బాధ్యతాయుతమైన పాలనకు మార్గదర్శక పత్రాల్లా ఉండాలి. ఉన్నతాశయాలు, దార్శనికతతో ఉండటం తప్పు కాదు. కానీ, లక్ష్యాలేమిటి? వాటి సాధనకు ఉన్న కాలపరిమితి, సవా ళ్లపై అవగాహన అవసరం. కాలపరీక్షకు తట్టుకున్న పాత విధానాన్ని కాకుండా కొత్త మార్గాన్ని అనుసరించాలని డీబీటీ ప్రయత్నించింది. శాస్త్రీయ విభాగం అయినందుకైనా తార్కికమైన, ఆధారాల కేంద్రిత విధానాన్ని రూపొందించి ఉంటే బాగుండేది. ‘ఆర్థిక వ్యవస్థ’, ‘ఉపాధి కల్పన’ రెండూ శీర్షికలోనే ఉన్నా ఈ విధానం ప్రాథమ్యాలు అస్పష్టం, సందేహాస్పదం. వాక్చాతుర్యం తప్ప ఏమీలేదు.దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ వ్యవహారాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
రైతులకు మేలు చేసేలా..పురుగులకు కుటుంబ నియంత్రణ!
వ్యవస్థాపకుడు డాక్టర్ విజయ భాస్కర్ రెడ్డి పంట పొలాల్లో, పండ్ల తోటల్లో పురుగుల నియంత్రణకు పురుగుమందులు/కషాయాలు చల్లటం కన్నా.. అసలు ఆయా ప్రత్యేక జాతి పురుగుల సంతతినే పెరగకుండా అరికట్టగలిగితే రైతులకు శ్రమ, ఖర్చు తగ్గటంతో పాటు, పర్యావరణానికి, ప్రజారోగ్యానికి కూడా మేలు జరుగుతుందంటున్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు. వివిధ శాస్త్రవిభాగాల్లో పరిశోధనలు పూర్తిచేసిన శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే వినూత్నమైన ఫెరమోన్ ఆధారిత అప్లికేషన్లు, ఆవిష్కరణలను వెలువరించారు. కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి అగ్రికల్చర్ గ్రాండ్ ఛాలెంజ్ పురస్కారాన్ని అందుకున్న ఈ సాంకేతికతను రైతులకు అందుబాటులోకి తేవడానికి శాస్త్రవేత్తలు హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో ఎటిజిసి బయోటెక్ అనే కంపెనీని నెలకొల్పారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఇటీవల నిర్వహించిన ‘ఎట్‌హోమ్ రిసెప్షన్ ’లో ఈ సంస్థ సహ–వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి, హెచ్‌సియూ పూర్వ విద్యార్థి డాక్టర్ విజయ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన అందించిన వివరాల ప్రకారం ఈ వినూత్న సాంకేతికత వివరాలను పరిశీలిద్దాం.. పురుగుల సంతతిని అరికట్టే వ్యూహం ఆడ రెక్కల పురుగు సంతానోత్పత్తి దశలో మగ రెక్కల పురుగును ఆకర్షించడానికి ప్రత్యేకమైన వాసనతో కూడిన హార్మోన్ వంటి రసాయనాన్ని గాలిలోకి విడుదల చేస్తుంది. మగ పురుగు ఆ ఫెరమోన్ వాసనను బట్టి ఆడ పురుగు ఉన్న చోటుకు వెళ్లి కలుస్తుంది. ఈ కలయిక సజావుగా జరిగితే ఆడ పురుగు గుడ్లు పెడుతుంది. ఆ విధంగా పురుగుల సంతతి పంట పొలంలో స్వల్ప కాలంలోనే పదులు వందలుగా, వందలు వేలుగా పెరిగిపోయి పంటను ఆశించి దిగుబడిని నష్ట పరచటం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే, ఆడ–మగ రెక్కల పురుగుల కలయికే జరగకుండా చూడటం ద్వారా సంతతి పెరుగుదలను అరికట్టడం ఇక్కడ వ్యూహం. ఈ వ్యూహాన్ని అమలుపరచడానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పరిశోధన శాస్త్రవేత్తలు రూపొందించిన వినూత్న పద్ధతి ఏమిటంటే.. కృత్రిమ ఫెరమోన్తో కూడిన ప్రత్యేక పేస్ట్‌ను రూపొందించటం. ఈ పేస్ట్‌ను పంట పొలంలో మొక్కలకు అక్కడక్కడా అంటిస్తే.. ఆ వాసనకు మగ రెక్కల పురుగు ఆడ పురుగు ఉందనుకొని మొక్కపై ఉన్న పేస్ట్ దగ్గరకు వస్తుంది. తీరా లేకపోయే సరికి తికమకకు గురవుతుంది. ఆడ రెక్కల పురుగులను కలిసే ప్రయత్నంలో నూటికి 90 సార్లు విఫలమవుతుంది. దాంతో ఆ పురుగు సంతానోత్పత్తి ఆ మేరకు పరిమితమవుతుంది. ఈ టెక్నిక్‌ను ఉపయోగించి పురుగు తొలి దశలోనే పేస్ట్‌ను పొలంలో అక్కడక్కడా మొక్కలకు పూస్తే చాలు. పురుగుల్ని నిర్మూలించకుండానే వాటి సంఖ్యను చాలా వరకు అదుపులోకి తేవటం ద్వారా పంట దిగుబడికి పెద్దగా నష్టం జరగకుండా చూసుకోవచ్చు. ఇది సరిగ్గా చేస్తే ఆ పురుగు నిర్మూలనకు రైతులు పురుగుమందు కొట్టే శ్రమ, ఖర్చు, కాలుష్యం ఉండదు. అయితే, పురుగుల తీవ్రతను తెలుసుకునేందుకు లింగాకర్షక బుట్టలు చాలా కాలంగా రైతులు వాడుతున్నారు. ఫెరమోన్ ఎర వాసనతో వచ్చి లింగాకర్షక బుట్టల్లో పడే మగ రెక్కల పురుగుల సంఖ్యను, పొలంలో అప్పుడు ఆ పురుగు తీవ్రతను గుర్తించి, పురుగు మందులు/కషాయాలు చల్లటం వంటి నియంత్రణ చర్యలను రైతులు చేపడుతున్నారు. ఈ లోగా పురుగుల సంతతి పెరిగిపోతోంది. అయితే, ఈ కొత్త పద్ధతి ద్వారా ఈ పురుగుల సంతతి పెరగకుండా ముందు నుంచే వాటి కలయికను నివారించవచ్చు. పురుగు ఉధృతిని ఎర ఉపయోగించి గమనించవచ్చు. పత్తిలో గులాబీ పురుగుకు చెక్ గులాబీ రంగు పురుగు వలన పత్తి రైతులు సగటున ఎకరానికి 6–7 క్వింటాళ్ల పత్తిని నష్టపోతున్నారు. పురుగులను సమర్థవంతంగా అరికట్టడానికి ఫెరొమోన్ పర్యవేక్షణ మాత్రమే సరిపోదు. ఇప్పుడు పర్యవేక్షణే కాకుండా ఫెరొమోన్ ఆధారిత నియంత్రణ విధానం అందుబాటులోకి వచ్చింది. ఇది ఎరను ఉపయోగించకుండా ఫెరొమోన్ పేస్ట్ ద్వారా పురుగులను అరికట్టే సరికొత్త పద్ధతని డాక్టర్ విజయభాస్కర్‌రెడ్డి ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. ప్రస్తుతం బీటీ పత్తి పొలాల్లో విజృంభిస్తున్న గులాబీ లద్దె పురుగును అరికట్టేందుకు ప్రత్యేకమైన పేస్ట్‌ను తమ కంపెనీ రూపొందించిందన్నారు. పేటెంట్ కలిగిన ఈ టెక్నాలజీకి కేంద్ర ప్రభుత్వ అనుమతులు పొందిన తర్వాత రైతులకు అందుబాటులోకి తెచ్చిందన్నారు. పత్తి పంటలో 3 సార్లు.. ఎకరం పత్తి చేనులో అన్ని మొక్కలకూ పేస్ట్‌ను పెట్టక్కర లేదు. 400 మొక్కల (పొలంలో 7–8% మొక్కల)కు ఈ పేస్ట్‌ను బఠాణీ గింజంత అంటించాలి. మొక్క పై నుంచి 10–15 సెం.మీ. కిందికి, కాండం నుంచి కొమ్మ చీలే దగ్గర పెట్టాలి. ఒక సాలులో 4 మీటర్లకు ఒక మొక్కకు పెడితే చాలు. ఒక సాలులో మొక్కలకు పెట్టి, రెండు సాళ్లు వదిలేసి మూడో సాలుకు పెడితే సరిపోతుంది. ఎకరం మొత్తానికి 125 గ్రాముల పేస్ట్ సరిపోతుందని డా. రెడ్డి వివరించారు. ఒక్కో మొక్క కాండంపై 250 నుంచి 300 మిల్లీ గ్రాముల మేరకు పెట్టాలి. పత్తి పంట కాలంలో మొత్తం 3 సార్లు పేస్ట్ పెట్టాలి. విత్తనాలు వేసిన తర్వాత (పువ్వు/ గూడ ఏర్పడటానికి ముందు) ఇంచుమించుగా 30–35 రోజులకు మొదటిసారి, విత్తిన 60–65 రోజుల తర్వాత రెండోసారి, విత్తిన 90–95 రోజుల తర్వాత మూడవ సారి పెట్టాలి. తుది పంట కోసే వరకు ప్రతి 30–35 రోజుల వ్యవధిలో ఉపయోగించాలి. ఇలా చేస్తే పంట ఖర్చు తగ్గి, దిగుబడి, నాణ్యత పెరుగుతుంది. ఎకరానికి పేస్ట్ ఖర్చు మూడు సార్లకు రూ. 4 వేలు అయినప్పటికీ, రైతు రూ. 30 వేల వరకు అధికాదాయం పొందగలుగుతారని ఆయన అన్నారు. మిత్రపురుగులు సురక్షితం ఈ సాంకేతికతలో పురుగుమందులు /హానికరమైన రసాయనాలు లేనందున పర్యావరణానికి హాని కలిగించదని డా. విజయభాస్కర్‌రెడ్డి వివరించారు. నేల, గాలి, నీరు పురుగు మందుల అవశేషాలతో కలుషితం కావు. మిత్ర పురుగులకు, పరాన్న జీవులు వంటి సహజ శత్రువులకు సురక్షితంగా ఉంటాయి. తేనెటీగలు నశించవు. సహజ పరాగ సంపర్కం బాగుంటుంది. రైతుకు, కూలీలకు సురక్షితమైనది. మొక్కకు హాని కలిగించదు. పత్తి నాణ్యత, రంగు మెరుగ్గా ఉంటుంది. మంచి ధరను పొందే అవకాశం కలుగుతుంది అన్నారాయన. దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రయోగాల్లో 90% పైగా పత్తిలో గులాబీ పురుగును ఈ పేస్ట్ నియంత్రిస్తున్నట్లు నిరూపితమైందని ఆయన తెలిపారు. (ఇతర వివరాలకు.. టోల్‌ఫ్రీ నంబర్ 1800 121 2842) త్వరలో వంగకు కత్తెర పురుగుకు కూడా.. ప్రస్తుతానికి పత్తిలో గులాబీ పురుగును నియంత్రించేందుకు పేస్ట్‌ను రైతులకు అందుబాటులోకి తెచ్చాం. వంగ తోటల్లో కాయ/కాండం తొలిచే పురుగుల నియంత్రణకు ప్రత్యేక పేస్ట్‌ను కేంద్ర ప్రభుత్వ అనుమతుల తర్వాత 2–3 నెలల్లో విడుదల చేయబోతున్నాం. ఇది అందుబాటులోకి వస్తే వంగ రైతులకు పురుగు మందుల ఖర్చు, శ్రమ గణనీయంగా తగ్గుతుంది. అంతేకాక వినియోగదారులు పురుగుమందు అవశేషాలు లేని వంకాయలను తినటం సాధ్యమవుతుంది. ఇప్పటికే పండ్లు/కూరగాయ తోటల్లో నష్టం చేస్తున్న పండు ఈగను ఆకర్షించి చంపే జెల్ ల్యూర్ అందుబాటులో ఉంది. శ్రీ కొండా లక్షణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, ఉద్యాన శాఖ దీనిపై అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. మొక్కజొన్న సహా అనేక పంటలకు నష్టం చేస్తున్న కత్తెర పురుగు నియంత్రణకు వినూత్న పద్ధతి త్వరలోనే అందుబాటులోకి రానుంది. వీటి తయారీలో ఎలాంటి జన్యుమార్పిడి సాంకేతికతను వాడటం లేదు. రైతులు ఈ సాంకేతిక పద్ధతిని పురుగు ఉదృతి పెరిగినాక కాకుండా ముందు జాగ్రత్తగా వినియోగించాల్సి ఉంటుంది. ఒక ప్రాంతంలో రైతులు కలసి వాడితే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయి. – డా. విజయ భాస్కర్ రెడ్డి, ఎటిజిసి బయోటెక్ సహ–వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి, జీనోమ్ వ్యాలీ, హైదరాబాద్. (చదవండి: -
80 బిలియన్ డాలర్లకు ‘బయో–ఎకానమీ’
న్యూఢిల్లీ: దేశాన్ని వృద్ధి బాటలో నడిపే క్రమంలో ప్రతీ రంగానికి తోడ్పాటు అందించాలని తమ ప్రభుత్వం విశ్వసిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గతంలో కొన్ని రంగాలకు మాత్రమే ప్రాధాన్యం లభించేదని, తమ ప్రభుత్వ హయాంలో అన్ని పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే గత ఎనిమిదేళ్లలో భారత ’బయో–ఎకానమీ’ ఎనిమిది రెట్లు పెరిగిందని, 10 బిలియన్ డాలర్ల నుంచి 80 బిలియన్ డాలర్లకు చేరిందని ప్రధాని పేర్కొన్నారు. బయోటెక్ వ్యవస్థలో టాప్ 10 దేశాల్లో భారత్ కూడా ఒకటిగా నిలిచే రోజు ఎంతో దూరం లేదన్నారు. బయోటెక్ స్టార్టప్ ఎక్స్పోను గురువారం ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. గడిచిన ఎనిమిదేళ్లలో దేశీయంగా అంకుర సంస్థల సంఖ్య వందల స్థాయి నుంచి 60 పైగా పరిశ్రమల్లో 70,000 పైచిలుకు చేరిందని మోదీ చెప్పారు. కొన్ని రంగాల ఎగుమతులు రికార్డు స్థాయికి చేరాయని పేర్కొన్నారు. ’బయోటెక్ స్టార్టప్స్ ఆవిష్కరణలు: స్వావలంబన భారత్ సాధన దిశగా’ అంశంపై ఈ ఎక్స్పో సదస్సు రెండు రోజుల పాటు (జూన్ 9, 10) జరుగుతుంది. ఔత్సాహిక వ్యాపారవేత్తలు, ఇన్వెస్టర్లు, పరిశ్రమ దిగ్గజాలు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, తయారీదారులు మొదలైన వారం తా కలిసేందుకు ఇది వేదికగా నిలవగలదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
బీఎస్ బజాజ్ కన్నుమూత
హైదరాబాద్: బయోటెక్ రంగ ప్రముఖుడు డాక్టర్ బీఎస్ బజాజ్ (93) మంగళవారం కన్నుమూశారు. ఆయన ఫెడరేషన్ ఆఫ్ ఆసియా బయోటెక్ అసోసియేషన్స్ (ఎఫ్ఏబీఏ) వ్యవస్థాపక కార్యదర్శిగా పనిచేశారు. అలాగే హైదరాబాద్‌లో జీనోమ్ వ్యాలీ ఏర్పాటుకు, 2019లో జరిగిన బయో–ఆసియా సదస్సుకు ఆయన తీవ్రంగా కృషి చేశా రు. 1999లో హైదరాబాద్ లో బయోటెక్నాలజీ స్థాపనకు బజాజ్ ఒక ప్రమోటర్‌గా పనిచేశారు. రాష్ట్రం లో ఆయన రూపొందించిన బయోటెక్ పరిశ్రమ పాలసీ ద్వారా జీనోమ్ వ్యాలీ ఏర్పాటుకు, దాని పెరుగుదలకు దోహదపడింది. బయో రంగంలో మందులు, వ్యాక్సిన్ల తయారీలో ఆయన చాలా మంది శాస్త్రవేత్తలకు మార్గనిర్దేశం చేశారు. బజాజ్ మృతిపట్ల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. బయోటెక్నాలజీ రంగంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు. -
అహ్మద్ పటేల్‌పై ఈడీ ప్రశ్నల వర్షం
న్యూఢిల్లీ: సందేశార సోదరుల మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్(70)ను సుమారు 8 గంటలపాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. శనివారం ముగ్గురు అధికారులతో కూడిన ఈడీ బృందం ఢిల్లీలోని అహ్మద్ పటేల్ ఇంట్లో ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద ఆయన స్టేట్మెంట్ను నమోదు చేసింది. విచారణకు హాజరు కావాలంటూ అహ్మద్ పటేల్‌కు ఇటీవలే రెండుసార్లు సమన్లు జారీ చేసినప్పటికీ ఆయన అంగీకరించలేదు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విచారణకు రాలేనని తేల్చిచెప్పారు. దీంతో ఈడీ బృందం నేరుగా అహ్మద్ పటేల్ ఇంటికి వెళ్లింది. వడోదరకు చెందిన ఫార్మా కంపెనీ స్టెర్లింగ్ బయోటెక్ ప్రమోటర్లు నితిన్ సందేశార, చేతన్ సందేశార, దీప్తి సందేశర బ్యాంకు నుంచి రూ.14,500 కోట్ల రుణం తీసుకొని తిరిగి చెల్లించకుండా చేతులెత్తేశారు. వారంతా పరారయ్యారు. ఈ వ్యవహారంతో అహ్మద్ పటేల్‌కు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈడీ ఆయనను ప్రశ్నించింది. స్టెర్లింగ్ బయోటెక్ ప్రమోటర్లతో ఉన్న సంబంధాలపై ఆరా తీసింది. 30న మరోసారి ఈడీ ప్రశ్నించనున్నట్లు సమాచారం. -
రిజర్వ్ అటవీప్రాంతంలో బయోటెక్ పరిశ్రమ!
భూవివరాల సేకరణలో అధికారులు 810 ఎకరాల గుర్తింపు వ్యవసాయాధారిత పరిశ్రమల ఏర్పాటుపై ఊహాగానాలు తిరువూరు : దీర్ఘకాలంగా నిరుపయోగంగా ఉన్న తిరువూరు ప్రాంతంలోని రిజర్వు అటవీభూమిలో వ్యవసాయాధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. వారం రోజులుగా రెవెన్యూ అధికారులు నిరుపయోగంగా ఉన్న అటవీ భూముల వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు. చిట్టేల, ఆంజనేయపురం, కాకర్ల గ్రామాల పరిధిలో 810 ఎకరాలను భవిష్యత్ అవసరాలకు వినియోగించే అవకాశం ఉందని ప్రాథమిక నివేదిక సిద్ధం చేశారు. త్వరలో అటవీ, రెవెన్యూ అధికారులు సంయుక్త పరిశీలన జరి పిన అనంతరం ఈ భూమిని ఇతర అవసరాలకు వినియోగించేందుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. బయోటెక్ పరిశ్రమ ఏర్పాటుకు అనుకూలం తిరువూరు సమీపంలోని కాకర్ల-లక్ష్మీపురం గ్రామాల నడుమ సుమారు వెయ్యి ఎకరాల రిజర్వు అటవీభూమి ఉంది. అటవీశాఖ ఈ భూమిని పూర్తిస్థాయిలో మొక్కల పెంపకానికి వినియోగించకపోవడంతో నిరుపయోగంగా ఉంది. 1975లో ఈ భూమిని పశువీర్యగణాభివృద్ధి కేంద్రానికి కేటాయిస్తూ కేంద్రప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. అప్పటి తిరువూరు సమితి అధ్యక్షుడు దివంగత కొల్లి పావన వీరరాఘవరావు ఈ కేంద్రాన్ని సాధించడానికి విశేష కృషి చేశారు. అన్ని అనుమతులు వచ్చిన తర్వాత నీటికొరతను సాకుగా చూపి పశువీర్యగణాభివృద్ధి కేంద్రాన్ని గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తదుపరి వ్యవసాయాధారిత పరిశ్రమలను నెలకొల్పడానికి పలువురు పార్లమెంటు సభ్యులు చేసిన ప్రతిపాదనలను కేంద్రప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. మామిడి పరిశోధన కేంద్రాన్ని ఈ రిజర్వు అటవీభూమిలో ఏర్పాటు చేయాలని 1989లో తొలుత రాష్ట్రప్రభుత్వం భావించినప్పటికీ తదుపరి నూజివీడులో ప్రారంభించారు. మళ్లీ ఆశలు రాష్ట్ర విభజన అనంతరం ప్రభుత్వ భూముల వివరాలను సేకరించాలని నిర్ణయించడంతో వినియోగించని భూముల పరిశీలనలో అధికారులు నిమగ్నమయ్యారు. గ్రామాలవారీగా ఉన్న భూముల వివరాలను రికార్డు ప్రకారం పరిశీలించిన అనంతరం వాటిలో ఎక్కడెక్కడ ఆక్రమణలు జరిగాయో, వేటిని ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారో అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. తిరువూరు ప్రాంతంలో వ్యవసాయాధారిత పరిశ్రమలను నెలకొల్పితే రైతులకు, నిరుద్యోగులకు ప్రయోజనకరంగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు. ప్రభుత్వాదేశాల మేరకు ఖాళీభూముల వివరాలను సేకరించి పంపుతున్నామని తిరువూరు తహశీల్దారు బాలకృష్ణారెడ్డి ‘సాక్షి’కు తెలిపారు.