- భూవివరాల సేకరణలో అధికారులు
- 810 ఎకరాల గుర్తింపు
- వ్యవసాయాధారిత పరిశ్రమల ఏర్పాటుపై ఊహాగానాలు
తిరువూరు : దీర్ఘకాలంగా నిరుపయోగంగా ఉన్న తిరువూరు ప్రాంతంలోని రిజర్వు అటవీభూమిలో వ్యవసాయాధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. వారం రోజులుగా రెవెన్యూ అధికారులు నిరుపయోగంగా ఉన్న అటవీ భూముల వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు. చిట్టేల, ఆంజనేయపురం, కాకర్ల గ్రామాల పరిధిలో 810 ఎకరాలను భవిష్యత్ అవసరాలకు వినియోగించే అవకాశం ఉందని ప్రాథమిక నివేదిక సిద్ధం చేశారు. త్వరలో అటవీ, రెవెన్యూ అధికారులు సంయుక్త పరిశీలన జరి పిన అనంతరం ఈ భూమిని ఇతర అవసరాలకు వినియోగించేందుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
బయోటెక్ పరిశ్రమ ఏర్పాటుకు అనుకూలం
తిరువూరు సమీపంలోని కాకర్ల-లక్ష్మీపురం గ్రామాల నడుమ సుమారు వెయ్యి ఎకరాల రిజర్వు అటవీభూమి ఉంది. అటవీశాఖ ఈ భూమిని పూర్తిస్థాయిలో మొక్కల పెంపకానికి వినియోగించకపోవడంతో నిరుపయోగంగా ఉంది. 1975లో ఈ భూమిని పశువీర్యగణాభివృద్ధి కేంద్రానికి కేటాయిస్తూ కేంద్రప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. అప్పటి తిరువూరు సమితి అధ్యక్షుడు దివంగత కొల్లి పావన వీరరాఘవరావు ఈ కేంద్రాన్ని సాధించడానికి విశేష కృషి చేశారు.
అన్ని అనుమతులు వచ్చిన తర్వాత నీటికొరతను సాకుగా చూపి పశువీర్యగణాభివృద్ధి కేంద్రాన్ని గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తదుపరి వ్యవసాయాధారిత పరిశ్రమలను నెలకొల్పడానికి పలువురు పార్లమెంటు సభ్యులు చేసిన ప్రతిపాదనలను కేంద్రప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. మామిడి పరిశోధన కేంద్రాన్ని ఈ రిజర్వు అటవీభూమిలో ఏర్పాటు చేయాలని 1989లో తొలుత రాష్ట్రప్రభుత్వం భావించినప్పటికీ తదుపరి నూజివీడులో ప్రారంభించారు.
మళ్లీ ఆశలు
రాష్ట్ర విభజన అనంతరం ప్రభుత్వ భూముల వివరాలను సేకరించాలని నిర్ణయించడంతో వినియోగించని భూముల పరిశీలనలో అధికారులు నిమగ్నమయ్యారు. గ్రామాలవారీగా ఉన్న భూముల వివరాలను రికార్డు ప్రకారం పరిశీలించిన అనంతరం వాటిలో ఎక్కడెక్కడ ఆక్రమణలు జరిగాయో, వేటిని ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారో అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
తిరువూరు ప్రాంతంలో వ్యవసాయాధారిత పరిశ్రమలను నెలకొల్పితే రైతులకు, నిరుద్యోగులకు ప్రయోజనకరంగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు. ప్రభుత్వాదేశాల మేరకు ఖాళీభూముల వివరాలను సేకరించి పంపుతున్నామని తిరువూరు తహశీల్దారు బాలకృష్ణారెడ్డి ‘సాక్షి’కు తెలిపారు.