‘పాలమూరు’లో పనుల విభజన! | 'Palamur' division in the works! | Sakshi
Sakshi News home page

‘పాలమూరు’లో పనుల విభజన!

Published Mon, Dec 14 2015 1:38 AM | Last Updated on Sun, Sep 3 2017 1:57 PM

‘పాలమూరు’లో పనుల విభజన!

‘పాలమూరు’లో పనుల విభజన!

♦ సివిల్, ఈ అండ్ ఎం పనులను వేరుచేసే యోచన
♦ ప్రాజెక్టు నిర్మాణంలో వేగం పెంచేందుకే...
♦ రూ. 4,596 కోట్లతో సివిల్, రూ.6,258 కోట్లతో
♦ ఈ అండ్ ఎం పనుల అంచనాలు సిద్ధం
♦ రూ. 500 కోట్ల నుంచి రూ. వెయ్యి కోట్లకో ప్యాకేజీగా నిర్ణయం?
♦ ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం
 
 సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసేందుకు పనుల విభజన చేయాలని నీటిపారుదలశాఖ భావిస్తోంది. ఇప్పటివరకు ప్రాజెక్టుల్లో ఒకే పనిగా ఉన్న సివిల్, ఎలక్ట్రో మెకానికల్ (ఈ అండ్ ఎం) పనులను విభజించడం ద్వారా సాంకేతికంగా, నిర్వహణ, పనులపరంగా ఇబ్బందులను అధిగమించవచ్చని అంచనా వేస్తోంది. ఇప్పటికే వేర్వేరుగా తయారైన అంచనాల మాదిరిగానే పనులను అదే రీతిన అప్పగించే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ప్రాజెక్టు పనులను వీలైనన్ని ఎక్కువ ప్యాకేజీలుగా విభజించి పనులు అప్పగించాలని యోచిస్తోంది.

 అంచనాలన్నీ సిద్ధం..
 మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 62 మండలాల్లో ఉన్న 1,131 గ్రామాల పరిధిలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం రూ. 35,200 కోట్లతో పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చేపట్టడం తెలిసిందే. ప్రాజెక్టు నిర్మాణానికి 20,884.86 ఎకరాల మేర భూసేకరణ అవసరంకాగా ఇందులో 4,795 మంది రైతులు 12,101 ఎకరాల భూమి ఇచ్చేందుకు అంగీకరించారు. మరో 4,927.22 ఎకరాలకు అధికారులు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు. మిగతా భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోంది.

ప్రాజెక్టులో భాగంగా ఐదు రిజర్వాయర్లను నార్లాపూర్ 8.1 టీఎంసీలు, ఏదుల 6.5 టీఎంసీలు, వట్టెం 16.6 టీఎంసీలు , కరివెన 19.15 టీఎంసీలు, ఉద్దండాపూర్ 9.2 టీఎంసీల సామర్ధ్యాలతో నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇందుకోసం మొత్తంగా రూ. 9,644 కోట్లతో అంచనాలను సైతం సిద్ధం చేసింది. ఇందులో వట్టెం రిజర్వాయర్‌కు గరిష్టంగా రూ. 3,780 కోట్లు కానుండగా కరివెనకు రూ. 2,490 కోట్లు, ఉద్దండాపూర్‌కు రూ. 2,115 కోట్లు, నార్లాపూర్ రూ. 801 కోట్లు, ఏదులకు రూ. 458 కోట్లను అధికారులు అంచనా వ్యయంగా లెక్కించారు. రిజర్వాయర్‌ల అంచనాల సమయంలోనే పంప్‌హౌజ్‌ల నిర్మాణానికి అవసరమయ్యే మోటార్లు, విద్యుత్ లెక్కలనూ అధికారులు తేల్చారు. మొత్తంగా 34 మోటార్లు అవసరమవుతాయని గుర్తించి ఇందుకు 4,705 మెగావాట్లను విద్యుత్ అవసరాలుగా లెక్కించారు. పంపింగ్ స్టేషన్ల వద్ద చేయాల్సిన సివిల్, ఎలక్ట్రో మెకానికల్ పనుల విలువ అంచ నాలను అధికారులు వేర్వేరుగా సిద్ధం చేశారు. రూ. 4,596 కోట్లతో సివిల్ పనులు, రూ. 6,258 కోట్లతో ఈఅండ్‌ఎం పనులను విభజించారు.

 విభజిస్తేనే మేలు..
 మొత్తంగా 10,854 కోట్లతో గుర్తించిన సివిల్, ఈ అండ్ ఎం పనులను విభ జించాలని అధికారుల స్థాయిలో నిర్ణయం జరిగింది. గతంలో ఈ తరహా విధానం లేకపోవడంతో ఏఎంఆర్‌పీ, కల్వకుర్తి వంటి ప్రాజెక్టుల నిర్మాణంలో అనేక ఇబ్బందులు తలెత్తాయి. సివిల్ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లలో కొందరికి ఈ అండ్ ఎం పనుల్లో నైపుణ్యం లేకపోవడం, మరికొందరు ఒకే ప్రాజెక్టు పరిధిలో వేర్వేరు దేశాల మోటార్లను వినియోగించడంతో నిర్వహణ, మరమ్మతుల్లో ఇబ్బందులు ఎదురయ్యాయి.

ప్రభుత్వం బిల్లులు చెల్లించడంలో ఆలస్యమైన పక్షంలో మోటార్ల బిగింపు సైతం జాప్యం కావడం వంటి సమస్యలూ ఉత్పన్నమయ్యాయి. దీనికితోడు సివిల్ కాంట్రాక్టర్లకు ఈ అండ్ ఎం పనులు అప్పగిస్తే నీటిపారుదలశాఖ నుంచి సాంకేతిక అనుమతులు పొందడంలో జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే...సివిల్, ఈ అండ్‌ఎంకు నియమ నిబంధనలు వేర్వేరుగా ఉంటాయి. దీనివల్ల ఈ రెండు పనులను ఏకకాలంలో చేయడం సాధ్యంకాదు. అదే జరిగితే  పనులు ఆలస్యమై అంచనాలు అమాంతం పెరిగే అవకాశాలుంటాయి. ఇది ప్రాజెక్టు మొత్తం వ్యయాన్ని, ప్రాజెక్టు పూర్తి లక్ష్యాన్ని ప్రభావితం చేసే ప్రమాదం ఉంది.

ఈ నేపథ్యంలో పనుల విభజన చేయాలన్నది అధికారుల భావనగా ఉంది. దీనిపై ఇప్పటికే ఇంజనీర్లు అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. వేర్వేరు దేశాలకు చెందిన మోటార్లను బిగించడంకన్నా స్వదేశీ (బీహెచ్‌ఈఎల్ తయారు చేసినవి) ఈఅండ్‌ఎం మోటార్లను వినియోగిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని, దీనివల్ల విదేశీ పన్నుల భారం తగ్గుతుందని వారు స్పష్టం చేస్తున్నారు. దీనిపై ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
 
 వీలైనన్ని ఎక్కువ ప్యాకేజీలు
 రూ. 35 వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు పనులను వీలైనన్ని ఎక్కువ ప్యాకేజీలుగా విడగొట్టాలని అధికారులు సూచిస్తున్నారు. ఒక్కో పనిని కనిష్టంగా రూ. 500 కోట్ల నుంచి రూ. 1,000 కోట్లుగా విభజించి పనులు అప్పగించాలని...అప్పుడే పనులు త్వరితగతిన పూర్తవుతాయని చెబుతున్నారు. అయితే దీనిపై ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం జరగాల్సి ఉంది. నిర్ణయం జరిగిన వెంటనే జనవరిలో టెండర్లు పిలిచే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement