ఈ వంతెన పొలాలకు నీళ్లిస్తుంది!
వందేళ్ల బ్రిడ్జికి కొత్త బాధ్యతలు..
- సాగునీటి ప్రాజెక్టుగా మారనున్న టేకుమట్ల బ్రిడ్జి
- నిజాం హయాంలో నిర్మితమైన వంతెన..
- హైదరాబాద్–విజయవాడ హైవేపై మూసీనది మీద నిర్మాణం
- ఇప్పటికీ చెక్కుచెదరని పటుత్వం
- చెక్‌డ్యాంగా మార్చాలని రోడ్లు భవనాల శాఖ ప్రతిపాదన
- 1.5 టీఎంసీ సామర్థ్యం.. 10 వేల ఎకరాలకు సాగునీరందించే వీలు
సాక్షి, హైదరాబాద్: అదో వంతెన.. వయసు 107 ఏళ్లు. ఇటీవలే అది ‘విశ్రాంతి’లోకి వెళ్లింది. శతాబ్దం పాటు వాహనాలను నది దాటించి అలసిపోవటంతో దాని స్థానంలో ప్రభుత్వం మరో భారీ వంతెన నిర్మించింది. కానీ తనలో పటుత్వం ఏమాత్రం తగ్గలేదన్న ట్లు ఇప్పటికీ రాచఠీవీ ఒలకబోస్తూ సగర్వంగా నిలిచిన ఈ కట్టడం మరో బాధ్యతను తన భుజాలపై వేసుకోనుంది. నది నీటిని నిల్వ చేసి రైతుల మోములో చిరునవ్వు చిందించే బాధ్యత నిర్వర్తించబోతోంది.
బ్రిడ్జి నుంచి చెక్‌డ్యాంగా..
హైదరాబాద్– విజయవాడ హైవేపై వెళ్లేవారికి సూర్యాపేట సమీపంలోని టేకుమట్ల వద్ద మూసీ నదిపై కళాత్మకంగా ఉండే వంతెన సుపరిచితమే. పేరుకు వంతెన అయినా దాని నిర్మాణ కౌశలం మాత్రం ఇట్టే కట్టిపడేస్తుంది. ఆర్చి ఆకారంలో ఉండే నీటి తూములు, దానికి పేర్చిన రాళ్లు, వంతెన పైన రోడ్డుకు వాడిన రాతి దిమ్మెలు.. ఓ అద్భుత నిర్మాణంగా కనిపిస్తుంది. వందేళ్ల వయసు పైబడటం, విజయవాడ హైవే విస్తరణలో భాగంగా దాని స్థానంలో ఇటీవలే ప్రభుత్వం కొత్త వంతెన నిర్మించింది. ఈ కొత్త బ్రిడ్జిపై వెళ్తూ పాత వంతెన కళాత్మకతను కనులారా వీక్షించే భాగ్యం వాహనదారులకు కలుగుతోంది.
ఇటీవల రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్లు ఈ బ్రిడ్జి పటుత్వాన్ని పరిశీలించి ఇప్పటికీ పటిష్టంగానే ఉందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వాగులపై నిర్మించే వంతెనలను చెక్‌డ్యాం నమూనాలో నిర్మించాలని రోడ్లు భవనాల శాఖ నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 120 వరకు వంతెనలను చెక్‌డ్యాం నమూనాలో నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 324 మీటర్ల పొడవుతో మూసీ నదిపై టేకుమట్ల వద్ద ఉన్న ఈ వంతెనను నీరు నిల్వచేసే ప్రాజెక్టుగా మార్చాలన్న ఆలోచన అధికారుల్లో కలిగింది. దీంతో వారు ప్రతిపాదనలు సిద్ధం చేసి నీటి పారుదల శాఖ ఆమోదానికి పంపారు.
ఒకటి, ఒకటిన్నర టీఎంసీ సామర్థ్యం..
మూసీనదిపై సోలిపేట వద్ద నిర్మించిన ఆనకట్ట ద్వారా సాగునీరందిస్తున్నారు. ఇప్పుడు టేకుమట్ల రోడ్డు వంతెనను చెక్‌డ్యాంలోకి మారిస్తే దిగువ ప్రాంతాల్లోని రైతులకు సాగునీరందించే అవకాశం ఉంటుంది. దాదాపు 324 మీటర్ల పొడవున్న ఈ వంతెనకు నదీగర్భంలో దాదాపు మూడు నుంచి నాలుగు మీటర్ల ఎత్తుతో మత్తిడి గోడను నిర్మిస్తే ఒకటి నుంచి ఒకటిన్నర టీఎంసీల సామర్థ్యంలో నీరు నిలుస్తుందని అంచనా. ఈ నీరు దాదాపు పదివేల ఎకరాలకు ఉపయోగపడనుంది. ఇంతటి నిల్వ సామర్థ్యంతో కొత్త చెక్‌డ్యాం నిర్మించాలంటే దాదాపు రూ.30 కోట్లకు పైగా వ్యయం అవుతుంది. కానీ ఈ పాత వంతెనను డ్యాంగా మార్చాలంటే కేవలం రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్లు అవుతుందని అధికారులు చెబుతున్నారు.
పర్యాటకానికీ ఊతం: తుమ్మల
ఈ పాత వంతెనను చెక్‌డ్యాం నమూనాలోకి మారిస్తే సాగుతో పాటు పర్యాటకానికి కూడా ఎంతో దోహదం చేస్తుంది. కళాత్మకంగా ఉన్న వంతెన ప్రాంతాన్ని ఆకర్షణీయంగా మారిస్తే పర్యాటకులు వస్తారు. పర్యాటక కేంద్రంగా మారుతుంది. శనివారం దీనిపై మంత్రి జగదీశ్‌రెడ్డితో చర్చించా. ఆయన కూడా సానుకూలం వ్యక్తం చేశారు. మరో నాలుగైదు రోజుల్లో నీటిపారుదల శాఖ నుంచి అనుమతి వచ్చే అవకాశముంది.