పాలమూరు-రంగారెడ్డిలో అదనపు బ్యారేజీ!
♦ ఐదు కాక ఆరు నిర్మించాలని యోచన
♦ కొత్తగా ఉద్దండాపూర్, కేపీ లక్ష్మీదేవునిపల్లి మధ్య అంతారం వద్ద 20 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణానికి స్థలం గుర్తింపు
♦ అంతారం బ్యారేజీతో తాండూర్, పరిగి, వికారాబాద్‌లలో 2 లక్షల ఎకరాలకు నీరు
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో ఇప్పటికే నిర్ణయించిన ఐదు రిజర్వాయర్లకు తోడు మరో బ్యారేజీ నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. రంగారెడ్డి జిల్లాలో సుమారు 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే లక్ష్యంతో ఉద్దండాపూర్, కేపీ లక్ష్మీదేవుని పల్లి బ్యారేజీల మధ్య అంతారం వద్ద 20 టీఎంసీల సామర్థ్యంతో దీన్ని నిర్మించాలని భావిస్తోంది. కొత్త బ్యారేజీ అవకాశాలపై పరిశీలన జరుపుతున్న దృష్ట్యానే ప్రస్తుతం ప్రాజెక్టు అంచనాలన్నీ సిద్ధమైనా.. రంగారెడ్డి జిల్లాలోని కేపీ లక్ష్మీదేవుని పల్లి బ్యారేజీ, ఇతర కాల్వల పనులను ప్రభుత్వం సిద్ధం చేయలేదని తెలుస్తోంది.
మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే ఉద్దేశంతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును రూ.35,200 కోట్లతో చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులో మొత్తంగా నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండాపూర్, కేపీ లక్ష్మీదేవుని పల్లి వద్ద బ్యారేజీలను ప్రతిపాదించారు. ఇందులో ఇప్పటికే కేపీ లక్ష్మీదేవునిపల్లి మినహా అన్ని బ్యారేజీల సర్వే, అంచనాలు సిద్ధమయ్యాయి. రిజర్వాయర్ల అంచనాల సమయంలోనే పంప్‌హౌజ్‌ల నిర్మాణానికి అవసరమయ్యే మోటార్లు, విద్యుత్ లెక్కలను అధికారులు తేల్చారు. ఈ పనుల ప్యాకేజీలపై స్పష్టత వచ్చిన వెంటనే టెండర్లు పిలవాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇదే సమయంలో ఉద్దండాపూర్ నుంచి కేపీ లక్ష్మీదేవుని పల్లి మధ్య దూరం సుమారు 40 కి.మీ. ఉండటం, ఇందులో 35 కి.మీ. ఓపెన్ కెనాల్‌తో పాటు మరో 5 కి.మీ. మేర టన్నెల్ నిర్మించాల్సి ఉంటుందని అధికారులు ఇది వరకే నిర్ణయించారు. అయితే ఇది చాలా వ్యయప్రయాసలతో కూడుకున్నట్లు గుర్తించారు. కెనాల్, టన్నెల్ పరిధిలోని భూములన్నీ రంగారెడ్డి జిల్లాలో అత్యంత ఖరీదైనవి కావడంతో దీనికి ప్రత్యామ్నాయాలను వెతికిన నీటి పారుదల శాఖ.. అంతారం వద్ద మరో బ్యారేజీని నిర్మించాలన్న అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఉద్దండాపూర్ నుంచి 100 మీటర్ల లిఫ్టుతో అంతారానికి నీటిని తరలించడం అత్యంత సులభమని అధికారులు తేల్చారు.
ఇక్కడ 20 టీఎంసీల నీటిని నిల్వ చేసే అనువైన ప్రదేశం ఉన్నట్లు గుర్తించి సర్వే పనులు సైతం పూర్తి చేశారు. అంతారం బ్యారేజీని చేపడితే కేపీ లక్ష్మీదేవుని పల్లి కింద ఉన్న మొత్తం ఆయకట్టు 3.5 లక్షల ఎకరాల్లోని 2 లక్షల ఎకరాలకు ఈ బ్యారేజీ ద్వారానే నీటిని అందించే వెసులుబాటు ఉంటుంది. పరిగి, తాండూర్‌లోని మొత్తం ఆయకట్టు, వికారాబాద్‌లోని కొంత ఆయకట్టుకు అంతారం ద్వారానే నీటిని అందించడం సులువని అంటున్నారు. ఈ మార్పుల వల్లనే రంగారెడ్డి జిల్లాలోని పనులపై ఇంకా అంచనాలు సిద్ధం చేయలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.