ఈసారీ పాత పద్దే!
⇒ వచ్చే బడ్జెట్‌లో రూ.25వేల కోట్లకే పరిమితం కానున్న సాగునీటి కేటాయింపులు
⇒ సీలింగ్ ఇచ్చిన ఆర్థిక శాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు ఈసారి కూడా గత ఏడాది మాదిరే భారీ బడ్జెట్ కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టుల పనుల్లో ప్రస్తుత పురోగతి, వాటి ప్రాధాన్యత లను పరిగణనలోకి తీసుకుంటూ రూ.25 వేల కోట్ల బడ్జెట్‌ను సర్దుబాటు చేయాలనే భావనకు వచ్చినట్టు తెలిసింది. నీటిపారుదల శాఖ గతంలో పంపిన బడ్జెట్ ప్రతిపాదనలను పరిశీలించిన ఆర్థికశాఖ రూ.25 వేల కోట్లకు సీలింగ్ ఇచ్చింది. ఈ వివరాలను నీటి పారుదల శాఖకు పంపింది. కొత్త బడ్జెట్‌లో ప్రాజెక్టుల పనుల కోసం రూ.23,675.74 కోట్లు కేటాయించనుండగా, మిగతా 1324.26 కోట్లను శాఖ నిర్వహణ ఖర్చులకు కేటాయించే ప్రతిపాదనలకు సమ్మతం తెలిపినట్లు పేర్కొంది.
ముందు అనుకున్నది రూ.30 వేల కోట్లు: సాగు నీటి ప్రాజెక్టులకు గత ఏడాది రూ.25 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం, వాటిని మరింత వేగిరం చేసేందుకు వీలుగా అదనంగా మరో రూ.5వేల కోట్లు కలిపి మొత్తంగా రూ.30 వేల కోట్లు కేటాయిస్తామని ప్రకటించింది. దీనికి అనుగుణంగానే ఈ ఏడాది జనవరిలో నీటి పారుదల శాఖ రూ.31,300 కోట్లతో ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపింది. చాలా ప్రాజెక్టుల పరిధిలో నెలకొన్న భూసేకరణ, సహాయ పునరావాస, అటవీ, పర్యావరణ సమస్యలు, గత ఏడాది పనుల పురోగతిని దృష్టిలో పెట్టుకొని తిరిగి ప్రతిపాదనలు కోరగా, దాన్ని అధ్యయనం చేసిన నీటి పారుదల శాఖ తిరిగి రూ.26,700 కోట్లకు సవరణలు చేసి ఆర్థిక శాఖకు పంపింది. దీనిపై ప్రాజెక్టుల వారీగా సమీక్ష జరిపిన అనంతరం రూ.25వేల కోట్ల బడ్జెట్‌కే సీలింగ్ ఇచ్చింది.
ఇందులో రూ.23,675.74కోట్లు ప్రాజెక్టుల పనులకు కేటాయించాలని నిర్ణయించగా, అందులో రాష్ట్ర ప్రణాళిక కింద రూ.22,553 కోట్లు కేటాయించనుం డగా, కేంద్ర పథకాల కింద రూ.1122.73 కోట్ల మేర వస్తాయని అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సాగునీటి సత్వర ప్రాయోజిత కార్య క్రమం(ఏఐబీపీ) కింద రూ.259.31 కోట్లు, సమర్థ నీటి వాడక కార్యక్రమం(ఈఏపీ) కింద రూ.618.64కోట్లు,, గ్రామీణ మౌలిక వసతుల అభివధ్ధి నిధి(ఆర్‌ఐడీఎఫ్) కింద రూ.244.78 కోట్ల బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని పేర్కొంది.
కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.7,376 కోట్లు..
ఇక ప్రాజెక్టుల వారీగా చూస్తే అంతా ఊహిస్తున్నట్లే కాళేశ్వరం ప్రాజెక్టుకు గరిష్టంగా రూ.7,376 కోట్ల ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ ఓకే చెప్పింది. ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పనులు వేగం గా జరుగుతుండటం, మల్లన్నసాగర్, కొండపో చమ్మ సాగర్ సహా మరో మూడు రిజర్వాయర్‌లకు సంబంధించిన పనులు మరికొద్ది రోజుల్లోనే ఆరంభించే అవకాశాల దృష్ట్యానే భారీ బడ్జెట్ కేటాయింపులకు ఆర్థిక శాఖ ఓకే చేసినట్లుగా తెలుస్తోంది. ఇక పాలమూరు ప్రాజెక్టుకు గత ఏడాది రూ.7,500 కోట్లుకేటాయించినా, ఖర్చు రూ.వెయ్యి కోట్లు కూడా దాటలేదు.
అలాంటి పరిస్థితులకు అవకాశం ఇవ్వకుండా ఈ ఏడాది బడ్జెట్లో రూ.3,953 కోట్లు కేటాయించేలా ప్రతి పాదించింది. ఇక ప్రధాన ప్రాజెక్టుల్లో కల్వకుర్తికి రూ.770 కోట్లు, నెట్టెంపాడుకు రూ.225కోట్లు, కంతనపల్లికి రూ.500 కోట్లు, సీతారామ ఎత్తిపోతలకు రూ. వెయ్యికోట్ల మేర ప్రతిపాదించారు. కాగా 2016–17 ఆర్థిక సంవత్సరంలో నీటిపారుదల శాఖకు రూ.25 వేల కోట్ల బడ్జెట్ కేటాయించగా, అందులో ఇంత వరకు కేవలం రూ.10,400 కోట్ల మేర మాత్రమే ఆ శాఖ ఖర్చు చేయగలిగింది. మరో రూ.3వేల కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని కలుపుకుంటే మొత్తంగా రూ.13,400 కోట్ల మేర ఖర్చు చేసినట్లేనని నీటి పారుదల వర్గాలు అంటున్నాయి. ఈ నెల మరో రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేయగలిగినా అది రూ.15వేల కోట్లను దాటేలా లేదు.