జీవో 111ను ఎత్తేయాలా... వద్దా!
- కుదరని ఏకాభిప్రాయం
- తొలిసారి భేటీ అయిన సాధికారత కమిటీ
సాక్షి, హైదరాబాద్: జంట జలాశయాల పరిరక్షణకు ఉద్దేశించిన జీవో 111ను పునస్సమీక్షించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోర్టు సాధికారత కమిటీ మంగళవారం తొలి సారి భేటీ అయింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ సూచనల మేరకు మంగళవారం సచివాల యంలో ఇరిగేషన్ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్. కె.జోషి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశం ఎలాంటి నిర్ణయానికీ రాకుండా ముగిసింది. జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం. దానకిశోర్, కమిటీ సభ్యులు కౌశిక్‌రెడ్డి, నరేంద్రనాథ్‌రెడ్డి, రాజ్‌కుమార్ ఠాగూర్, డాక్టర్ వీరన్న, ప్రొఫెసర్ జయరామ్, కార్తీక్‌రెడ్డి, ఎన్‌జీఆర్‌ఐ, టెరీ సంస్థల నిపుణులు పాల్గొన్నారు.
త్వరలో మరోసారి సమావేశం...
సమావేశంలో కమిటీ సభ్యుడు కార్తీక్‌రెడ్డి మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా 84 గ్రామాల ప్రజలు పడుతున్న అవస్థలకు జీవో 111ను ఎత్తి వేయడం ద్వారా చరమగీతం పాడాలని కమి టీని కోరారు. ఈ జీవో నుంచి పూర్తి మినహా యింపునిచ్చిన పక్షంలో ఆయా గ్రామాల ప్రజ లకు పలు ఆర్థిక, వాణిజ్య ప్రయోజనాలు చేకూ రుతాయన్నారు. కృష్ణా, గోదావరి, మంజీరా, సింగూరు జలాశయాల నుంచి గ్రేటర్ హైదరా బాద్‌కు నిత్యం 500 మిలియన్ గ్యాలన్ల తాగు నీటిని సేకరిస్తున్నందున నగర తాగునీటి అవసరాలకు జంట జలాశయాలపై ఆధారపడాల్సిన ఆవశ్యకత లేదన్నారు.
మరో సభ్యుడు నరేంద్ర నాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ జీవో వల్ల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు దెబ్బతిం టున్నాయన్నారు. ఈ అంశంపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని డాక్టర్ వీరన్న, ప్రొ. జయరామ్ చెప్పారు. జంట జలా శయాల పరిరక్షణకు ఇచ్చిన జీవో 111కు ఎలాంటి మార్పు, చేర్పులు చేయరాదని మరో సభ్యుడు రాజ్‌కుమార్‌ఠాగూర్ అభిప్రాయ పడ్డారు. సమావేశంలో ఏకాభిప్రాయం రానందున మరోసారి సమావేశం కావాలని కమిటీ నిర్ణయించినట్లు సమాచారం.
జీవో నేపథ్యమిదీ: హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ల మనుగడకు ప్రమాదం ఏర్పడ కుండా... రాజేంద్రనగర్, చేవెళ్ల, శంషాబాద్, మొయినాబాద్, శంకర్‌పల్లి, షాబాద్ మండలా ల్లోని 84 గ్రామాల పరిధిని జీవసంరక్షణ మండలిగా పరిగణిస్తూ 1996లో ప్రభుత్వం జీవో 111ను జారీ చేసింది. ఈ జీవో కారణంగా తమ ప్రాంతాలు ఎలాంటి అభివృద్ధికీ నోచుకో వడంలేదని 84 గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. ఈ నేపథ్యంలో మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయు డు కౌశిక్‌రెడ్డి జీవో 111ను పునస్సమీక్షించాలని కోరుతూ హైకోర్టుతో పాటు చెన్నైలోని జాతీయ హరిత ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. జీవ సంరక్షణ మండలి పరిధి నిర్ధారణలో శాస్త్రీయత లేదని, దిగువ ప్రాంతాలను సైతం ఆంక్షల పరిధిలో చేర్చడం సహేతుకం కాదన్నారు. పిటిషనర్ అభ్యర్థన మేరకు జీవో సవరణ, జలాశయాల పరిరక్షణపై సమగ్ర అధ్యయనం చేసేందుకు సాధికారత కమిటీ ఏర్పాటు చేయా లని హరిత ట్రిబ్యునల్ ఆదేశించింది.