పులిచింతలపై నిర్లక్ష్యం.. రైతు జీవితాలతో చెలగాటం
ఇదేం తీరు చంద్రబాబూ.. వైఎస్ జగన్ ప్రశ్న
♦ తెలంగాణకు రూ. 120 కోట్ల పునరావాస బకాయిలు చెల్లిస్తే పులిచింతలలో 45 టీఎంసీలూ నిల్వ చేయొచ్చు.. ప్రకాశం బ్యారేజీ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వవచ్చు..
♦ కానీ కమీషన్ల కోసం వందల కోట్లతో పట్టిసీమ చేపడతావ్.. పులిచింతల పూర్తయితే వైఎస్సార్‌కు పేరొస్తుందనే నీ భయం
♦ కృష్ణా జిల్లాలో దెబ్బతిన్న మినుము పంటలను పరిశీలించిన ప్రతిపక్ష నేత
సాక్షి, అమరావతి బ్యూరో : ‘‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలోనే పులిచింతల ప్రాజెక్టు పూర్తి చేశారు. తెలంగాణాకు ఆర్‌ఆర్ ప్యాకేజీ కింద పెండింగ్‌లో ఉన్నరూ.120 కోట్లు చెల్లిస్తే ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం మేరకు 45 టీఎంసీలు నిల్వ చేసుకోవచ్చు. అప్పుడు పులిచింతల ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజీకి అక్కడి నుంచి డెల్టాకు నీరు అందించవచ్చు. అలా చేస్తే ఆ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కాటన్ దొర మాదిరిగా డెల్టా ప్రజల గుండెల్లో ఉండిపోతారని చంద్రబాబు భయపడుతున్నారు. అందుకే తెలంగాణ ఎన్ని లేఖలు రాసినా రూ.120 కోట్లు ఇవ్వడం లేదు. దిక్కుమాలిన ఆలోచనలు చేస్తూ రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.
అసలు ఈ చంద్రబాబుకు బుద్ధీజ్ఞానం ఉందా’’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘పచ్చని పంటలతో సస్యశ్యామలంగా ఉండాల్సిన కృష్ణా డెల్టా బంజరు భూములను తలపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తాను రాజధానిలోనే ఉంటున్నానని డబ్బాలు కొట్టుకుంటారు. ఇరిగేషన్ మంత్రీ ఈ జిల్లాలోనే ఉన్నారు. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత రెండేళ్లుగా కృష్ణా డెల్టాకు సరిగా నీళ్లు ఇవ్వడమే లేదు. పంటలు చచ్చిపోతున్నాయని రైతులు మొరపెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. రాజధానిలో మూడునాలుగు పంటలు పండే 54వేల ఎకరాలను బలవంతంగా తీసుకుంటారు.
డెల్టాలోనేమో పంటలకు సాగు నీరే ఇవ్వరు. ఈ ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటమాడుతోంది’ అని తీవ్రంగా వైఎస్ జగన్ తీవ్రంగా విమర్శించారు. కృష్ణా జిల్లాలో పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పర్యటించారు. గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలంలోని బొమ్ములూరు, పెరికీడు, దంటగుంట్ల, కాకులపాడు, ఆరుగొలను, కానుమోలు తదితర గ్రామాల్లో పర్యటించి దెబ్బతిన్న మినుము పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనేమన్నారంటే....
డెల్టాకు వైరస్ బాబు పుణ్యమే..
‘కృష్ణా డెల్టాలో ఉండి మాట్లాడుతున్నా. ఏలూరు కాలువ కిందకు వచ్చే ఈ ప్రాంతమంతా సస్యశ్యామలంగా ఉండాల్సింది. ఇప్పుడు బంజరు భూమి మాదిరిగా కనిపిస్తోంది. బాబు అధికారంలోకి వచ్చిన తరువాత రెండేళ్లుగా కృష్ణా డెల్టాకు సరిగా నీళ్లు ఇవ్వడం లేదు. ఏలూరు డిస్ట్రిబ్యూటరీ కాలువ నుంచి నీళ్లు రావడం లేదు. రైతులు వరి పంట వేయలేకపోతున్నారు. నీళ్లు వస్తాయో రావో తెలీదు. వరి వేయాలో వద్దో తెలీదు. నీరు లేక నారుమళ్లు ఎండిపోతున్నాయి. రెండేళ్లుగా ఖరీఫ్‌లో వరి వేయనే లేదు. నీళ్లు తక్కువగా ఉన్నాసరిపోతుంది కదా అని రబీలో మినుము పంట వేశారు. వైరస్ సోకి ఆ మినుము పంట కూడా పోయింది. మెట్ట ప్రాంతంలో వచ్చే వైరస్ అది. డెల్టా ప్రాంతంలో కూడా ఇపుడు వైరస్ వచ్చింది.చంద్రబాబు ప్రభుత్వం నీళ్లు ఇవ్వకపోవడంతోనే డెల్టా ప్రాంతంలో కూడా వచ్చింది. మొత్తం పంట పోయింది. మూడుసార్లు మినుము వేసినప్పటికీ పంట దక్కలేదు.
ధరపడిపోతున్నా పట్టించుకోని బాబు
కృష్ణా డెల్టాలో మొట్టమొదట వచ్చే ఊరు కానుమోలు. ఇక్కడే 3 వేల ఎకరాల్లో కేవలం 300 ఎకరాల్లోనే పంట వేశారు. అదీ బోరు బావుల కింద ఉన్న భూములు. మిగిలిన్న భూమంతా బీడుగానే ఉండిపోయింది. బొమ్ములూరు ఎత్తిపోతల పథకం కింద 18 వేల ఎకరాలు ఉన్నాయి. మూడునాలుగు పంటలు పండే ఈ 18 వేల ఎకరాలకు గాను వెయ్యి ఎకరాల్లోనే పంటలు వేశారు. మిగిలిన భూమంతా బీడుగానే ఉండిపోయింది. కాకులపాడులో పూర్తిగా 3 వేల ఎకరాల్లో మినుము పంట నాశనమైంది. మరోవైపు మినుము ధర పడిపోయింది. గత ఏడాది క్వింటా ధర రూ.12వేలు పలికింది. ఇప్పుడేమో క్వింటా రూ.6 వేలకు పడిపోయింది. దీంతో రైతులు పూర్తిగా నష్టపోయారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడమే లేదు.
ఒక్క అధికారీ రాడు.. సర్వే జరగదు..
పంటలు దెబ్బతిన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. గ్రామాల్లోకి అధికారులు రాలేదు. నష్టపోయిన పంటలు సర్వే చేయలేదు. ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. పరిహారం ఊసే ఎత్తడం లేదు. అక్కడక్కడ సర్వే కోసం ఎవరో వచ్చినా వాళ్లకు కావల్సిన వాళ్ల పేర్లు రాసుకుని వెళ్లిపోయారు. నిజంగా నష్టపోయిన రైతుల గురించి పట్టించుకోనే లేదు. ఎకరాకు రూ.25వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతులు పూర్తిగా నష్టపోయారు. పంటను కాపాడుకునేందుకు ఎక్కువసార్లు పురుగుల మందు కొట్టారు. కానీ పంట దక్కలేదు. రైతుకు ఇంత నష్టం జరుగుతున్నా ప్రభుత్వానికి మాత్రం ఇంతవరకు పట్టించుకోనే లేదు. రైతులకు మేమున్నాం అని ప్రభుత్వం భరోసా ఇవ్వనే లేదు. వందమంది రైతులుంటే ఒకరికో ఇద్దరికో ఇన్సూరెన్సు రాస్తున్నారు. రెండేళ్ల నుంచీ ఇదే పరిస్థితి.
పులిచింతలపై బాబు కపటనాటకాలు..
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పులిచింతల ప్రాజెక్టు పూర్తి చేశారు. ఆ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 45 టీఎంసీలు. కానీ ప్రస్తుతం 22 టీఎంసీలే నిల్వ చేయగలుగుతున్నాం. ఆర్‌ఆర్ ప్యాకేజీ కింద పెండింగ్‌లో ఉన్న రూ.120 కోట్లు తెలంగాణాకు చెల్లిస్తే పూర్తి సామర్థ్యం మేర 45 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చును. అప్పుడు పులిచింతల ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజీకి, అక్కడి నుంచి ఏలూరు కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు సాగునీరు అందించవచ్చును. ఆర్‌ఆర్ ప్యాకేజీ కింద ఆ నిధులు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం పదే పదే లేఖలు రాసింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడమే లేదు.
ఎందుకంటే పులిచింతల ప్రాజెక్టు పూర్తి అయితే దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి మంచిపేరు వస్తుంది. కాటన్ దొర మాదిరిగా వైఎస్ డెల్టా రైతుల గుండెల్లో ఉంండిపోతారు అని చంద్రబాబు భయపడుతున్నారు. ఆ మహానేతకు మంచిపేరు రాకుండా చేయాలనే దిక్కుమాలిన ఆలోచనలు చేస్తున్నారు. రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. దాంతో పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుతం 22టీఎంసీలే నిల్వ చేయగలుగుతున్నారు. డెల్టాకు సరిపడా నీళ్లు ఇవ్వలేకపోతున్నారు. ఏదైనా అంటే పట్టిసీమ పట్టిసీమ అని చంద్రబాబు, నీటిపారుదల శాఖ మంత్రి పదే పదే చెబుతున్నారు. ఈ ఏడాది పట్టిసీమ నుంచి 45 టీఎంసీలు ఎత్తిపోశామని చెబుతున్నారు.
మరి పట్టిసీమ నీళ్లు ఎక్కడికి వెళ్లాయో తెలీడమే లేదు. ప్రకాశం బ్యారేజీ నుంచి ఈ ఏడాది ఇప్పటికీ 55 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి విడిచిపెట్టారు. ఇక ఆ పట్టిసీమ వల్ల ఉపయోగమేమిటి? కృష్ణ, గోదావరి రెండింటికీ ఒకేసారి వరదలు వస్తాయని మేం ఎప్పటి నుంచో చెబుతున్నాం. నిల్వ సదుపాయం లేకుండా కమీషన్ల కోసం తెచ్చిన వృథా ప్రాజెక్టు అది. నిల్వ సదుపాయం ఉన్నా నిర్లక్ష్యం వహిస్తున్న ప్రాజెక్టు పులిచింతల.. ఈ రెండింటినీ పరిశీలిస్తే చాలు చంద్రబాబు రైతులకు ఎంత అన్యాయం చేస్తున్నాడో తెలుసుకోవడానికి’’ అని జగన్ పేర్కొన్నారు. కాగా, హనుమాన్ జంక్షన్‌లో జరిగిన కార్యక్రమంలో జాతిపిత మహాత్మా గాంధీకి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు.
ఇక్కడే విమానం ఎక్కుతాడు.. రైతులను పట్టించుకోడు..
చంద్రబాబు ఇదే గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచే వెళ్తుంటారు. కానీ ఏనాడూ గన్నవరం నియోజకవర్గంలో ఎండిపోయిన పంటలు ఎలా ఉన్నాయో చూసిన పాపాన పోలేదు. ఇరిగేషన్ మంత్రిదీ ఇదే జిల్లా. ఆయన కూడా ఇదే గన్నవరం ఎయిర్‌పోర్టుకు నుంచే వెళ్తుంటారు. ఆయనా ఒక్కసారి కూడా నియోజకవర్గంలో పంటల గురించి, రైతుల గురించి పట్టించుకోనే లేదు. పంటలు పోయి రైతులు ఆగచాట్లు పడుతున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవ డమే లేదు. చంద్రబాబుకు బుద్ధీజ్ఞానం ఉందా? నేను వచ్చి వెళ్లిన తరువాత అయినా చంద్రబాబుకు కాస్తో కూస్తో బుద్ధి రావాలని కోరుకుంటున్నా. ఆ బుద్ధిలేని మనిషికి జ్ఞానోదయం కలగాలి. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేవరకు వదిలేది లేదు. రైతులకు పూర్తి న్యాయం జరిగే వరకు నేను, మా పార్టీ అండగా ఉంటాం.’’